రోమా 1:1-17
రోమా 1:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అపొస్తలునిగా ఉండడానికి పిలువబడి దేవుని సువార్త కోసం ప్రత్యేకపరచబడిన పౌలు అనే నేను క్రీస్తు యేసు దాసుడను. ఈ సువార్త ఏమంటే దేవుడు తన కుమారుని గురించి పరిశుద్ధ లేఖనాల్లో ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశారు. ఆయన కుమారుని విషయానికి వస్తే, శరీరానుసారంగా ఆయన దావీదు సంతానానికి చెందినవారు. ఆయన పునరుత్థానం ద్వారా పరిశుద్ధమైన ఆత్మను బట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారునిగా అధికారంతో నిరూపించబడ్డారు. సమస్త ప్రజలందరిని ఆయన నామం కోసం విశ్వాసం నుండి వచ్చే విధేయతలోకి పిలువడానికి ఆయన ద్వారా మేము కృపను అపొస్తలత్వాన్ని పొందాము. యేసు క్రీస్తుకు చెందినవారిగా ఉండడానికి పిలువబడిన ఆ ప్రజలతో పాటు మీరు కూడా ఉన్నారు. రోమాలో ఉన్న దేవునిచే ప్రేమించబడుతున్న వారికి ఆయన పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి పిలువబడిన వారందరికి పౌలు వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. మీ విశ్వాసం గురించి లోకమంతా చాటించబడుతూ ఉంది అందరి కోసం యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను నిరంతరం నా ప్రార్థనలలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను అనడానికి, తన కుమారుని గురించిన సువార్తను ప్రకటిస్తూ నా ఆత్మలో నేను సేవిస్తున్న ఆ దేవుడే సాక్షి. దేవుని చిత్తమైతే నేను మీ దగ్గరకు రావడానికి కనీసం ఇప్పటికైనా నాకు అవకాశం రావాలని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని బలపరచడానికి, ఆధ్యాత్మిక వరం ఏదైనా మీకు అందించడానికి మిమ్మల్ని చూడాలని నేను ఆరాటపడుతున్నాను. తద్వారా, మీరు నేను పరస్పరం ఒకరి విశ్వాసం ద్వారా ఒకరం ప్రోత్సాహించబడతాము. సహోదరీ సహోదరులారా, యూదేతరుల మధ్యలో నేను ఫలం పొందినట్లు మీ మధ్యలో కూడా ఫలం పొందాలని మీ దగ్గరకు రావడానికి చాలాసార్లు ప్రయత్నించాను గాని ఇప్పటివరకు నాకు ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఇది మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు. గ్రీసు దేశస్థులు, గ్రీసు దేశస్థులు కాని వారు, జ్ఞానులు అజ్ఞానుల పట్ల నేను బాధ్యత కలిగి ఉన్నాను. అందువల్ల, రోమాలో ఉన్న మీకు కూడా సువార్తను ప్రకటించాలని నేను చాలా ఆసక్తితో ఉన్నాను. సువార్త గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే నమ్మిన ప్రతివారికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు రక్షణ కలుగజేయడానికి సువార్త దేవుని శక్తి. “నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు” అని వ్రాయబడి ఉన్న ప్రకారం, విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా సువార్తలో దేవుని నీతి వెల్లడి చేయబడింది.
రోమా 1:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు క్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా పిలుపు పొందినవాడు, దేవుని సువార్త కోసం ప్రభువు ప్రత్యేకించుకున్న పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అంటే పవిత్రులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికి శుభాలు చెబుతూ రాస్తున్నది. మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక. దేవుడు తన కుమారుడు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు గురించిన ఆ సువార్తను పవిత్ర లేఖనాల్లో తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు. యేసు క్రీస్తు, శారీరికంగా చూస్తే దావీదు సంతానం. దేవుని పవిత్రమైన ఆత్మ సంబంధంగా చనిపోయి తిరిగి సజీవుడుగా లేవడం ద్వారా ఆయన దేవుని కుమారుడు అని బల ప్రభావాలతో ప్రకటించబడింది. ఈయన నామం నిమిత్తం అన్ని జాతుల ప్రజలు విశ్వాసానికి విధేయులయ్యేలా ఈయన ద్వారా మేము కృప, అపొస్తలత్వం పొందాము. వారితోబాటు మీరు కూడా యేసు క్రీస్తుకు చెందిన వారుగా ఉండడానికి పిలుపు పొందారు. మీ విశ్వాసం లోకమంతా ప్రచురం కావడం చూసి, మొదట మీ అందరి కోసం యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. ఏదో ఒక విధంగా చివరికి మీ దగ్గరికి రావడానికి దేవుని చిత్తం వలన నాకు వీలవుతుందేమో అని నా ప్రార్థనల్లో ఎప్పుడూ ఆయనను బతిమాలుకుంటున్నాను. మిమ్మల్ని ఎడతెగక ప్రస్తావిస్తున్నాను. ఆయన కుమారుడి సువార్త కోసం నేను నా ఆత్మలో సేవిస్తున్న దేవుడే ఇందుకు సాక్షి. మీరు స్థిరపడాలనీ, మీరూ నేనూ ఒకరి విశ్వాసం చేత ఒకరం ఆదరణ పొందడం కోసం మిమ్మల్ని చూడాలనీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఏదైనా కృపావరాన్ని మీకు అందించాలని నా ఆశ. సోదరులారా, ఇది మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను చాలా సార్లు మీ దగ్గరకి రావడానికి ప్రయత్నించాను గాని ప్రతిసారీ ఆటంకం వచ్చింది. యూదేతర ప్రజల మధ్య నేను పొందిన పరిచర్య ఫలాలు మీ మధ్య కూడా పొందాలని నా ఆకాంక్ష. గ్రీకులకూ, ఇతరులకూ, తెలివైన వారికీ, బుద్ధిహీనులకూ నేను రుణపడి ఉన్నాను. కాబట్టి రోమాలోని మీకు కూడా సువార్త ప్రకటించాలన్న ఆశతో నేను సిద్ధంగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే మొదట యూదుడికి, తరవాత గ్రీసు జాతి వాడికి నమ్మే ప్రతి ఒక్కరికీ అది దేవుని శక్తి. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు, అని రాసి ఉన్న ప్రకారం విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడి అవుతున్నది.
రోమా 1:1-17 పవిత్ర బైబిల్ (TERV)
యేసు క్రీస్తు సేవకుడైన పౌలు నుండి: దేవుడు తన అపొస్తలునిగా పని చేయటానికి రమ్మని నన్ను పిలిచినాడు. దేవుని సువార్తను ప్రకటించటానికి నన్ను ప్రత్యేకించినాడు. దేవుడు ఈ సువార్తను తన ప్రవక్తలతో వ్రాయించి పవిత్ర లేఖనముల ద్వారా ఇంతకు క్రితమే తెలియచేసాడు. ఈ సువార్త దేవుని కుమారుడును మన ప్రభువును అయిన యేసు క్రీస్తును గురించి. ఆయన దావీదు వంశంలో మానవునిగా జన్మించాడు. పవిత్రమైన దేవుని ఆత్మ ఆయన్ని తన శక్తితో బ్రతికించి, ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారుడని నిరూపించినాడు. ఆయన ద్వారా నేను దేవుని దయను పొంది ఆయన కోసం అపొస్తలుడనయ్యాను. ప్రజలందరు సువార్తను విశ్వసించి దాన్ని అనుసరించాలని దేవుని ఉద్దేశ్యం. యేసు క్రీస్తుకు చెందిన వారవుటకు పిలువబడినవాళ్ళలో మీరు కూడా ఉన్నారు. అందువల్ల రోము పట్టణంలో ఉన్న మీ అందరికీ వ్రాయుటమేమనగా మీరు దేవునికి ప్రియమైనవాళ్ళు. ఆయన మిమ్మల్ని తన ప్రజగా ఉండటానికి పిలిచాడు. మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహాన్ని ప్రసాదించి మీలో శాంతి కలుగుజేయునుగాక! మీ విశ్వాసాన్ని గురించి ప్రపంచానికంతా తెలిసింది. కనుక నన్ను ముందు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు అర్పించనివ్వండి. నేను దేవుని కుమారుని సువార్తను ప్రకటించి మనస్ఫూర్తిగా ఆయన సేవ చేస్తున్నాను. నేను ప్రార్థనలు చేసినప్పుడెల్లా విడువకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొంటున్నాను. దానికి ఆ దేవుడే సాక్షి. చివరకు ఇప్పుడైనా నేను మీ దగ్గరకు రావటానికి దైవేచ్ఛవల్ల మార్గం ఏర్పడాలని ప్రార్థిస్తున్నాను. మీకు ఆధ్యాత్మిక శక్తి కలిగేటట్లు ఆత్మీయవరాన్ని అందించాలని మీ దగ్గరకు రావాలనుకొంటున్నాను. అంటే మీరూ, నేనూ మనలోవున్న విశ్వాసం ద్వారా పరస్పరం ప్రోత్సాహపరచుకోవాలని ఆశిస్తున్నాను. సోదరులారా! నేను, మిగతా యూదులుకానివాళ్ళనుండి ఫలం పొందినట్లే మీనుండి కూడా ఫలం పొందాలని, మీ దగ్గరకు రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కాని ఇప్పటి వరకు ఆటంకాలు కలిగాయి. ఈ విషయం మీరు గ్రహించాలని నా కోరిక. గ్రీకులకు, గ్రీకులు కానివాళ్ళకు, జ్ఞానులకు, అజ్ఞానులకు బోధించవలసిన కర్తవ్యం నాది. అందుకే రోము నగరంలో ఉన్న మీకు కూడా సువార్త ప్రకటించాలని అనుకొంటున్నాను. సువార్త విషయంలో నేను సిగ్గుపడను. ఎందుకంటే, విశ్వాసమున్న ప్రతి ఒక్కరికీ, అంటే యూదులకే కాక ఇతరులకు కూడా రక్షణను కలిగించే దేవుని శక్తి అది. ఈ సువార్తలో దేవుడు మానవుల్ని నీతిమంతులుగా పరిగణించే విధానాన్ని గురించి చెప్పబడి ఉంది. అది విశ్వాసంతో మొదలై విశ్వాసంతో అంతమౌతుంది. దీన్ని గురించి లేఖనాల్లో, “విశ్వాసంవల్ల నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు” అని వ్రాయబడి ఉంది.
రోమా 1:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు క్రీస్తు దాసుడును, అపొస్తలుడుగా నుండు టకు పిలువబడినవాడును, దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది. మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను. యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయనద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడేలాగైనను ఆటంకములేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, మిమ్మునుగూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిదివరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను. కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. ఎందుకనిన–నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.