ప్రకటన 7:1-17

ప్రకటన 7:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఈ సంగతుల తర్వాత నలుగురు దూతలు భూమి నాలుగు మూలల్లో నిలబడి భూమిమీద గాని సముద్రం మీద గాని ఏ చెట్టు మీద గాని గాలి వీచకుండా నలుదిక్కుల నుండి గాలులను అడ్డగిస్తున్నారు. అప్పుడు నేను మరొక దేవదూత జీవంగల దేవుని ముద్రను కలిగి తూర్పుదిక్కు నుండి పైకి రావడం చూశాను. ఆ దేవదూత భూమికి సముద్రానికి హాని కలిగించడానికి అనుమతిని పొందిన ఆ నలుగురు దూతలతో బిగ్గరగా, “మేము మన దేవుని సేవకుల నుదుటి మీద దేవుని ముద్రను వేసే వరకు భూమికి కాని, సముద్రానికి కాని చెట్లకు కాని హాని చేయవద్దు” అని చెప్పడం నేను విన్నాను. ఆ తర్వాత నేను వారి సంఖ్య చెప్తుంటే విన్నాను. ఇశ్రాయేలు ప్రజల గోత్రాలు అన్నిటిలో ముద్రింపబడినవారు 1,44,000: యూదా గోత్రంలో 12,000; రూబేను గోత్రంలో 12,000; గాదు గోత్రంలో 12,000; ఆషేరు గోత్రంలో 12,000; నఫ్తాలి గోత్రంలో 12,000; మనష్షే గోత్రంలో 12,000; షిమ్యోను గోత్రంలో 12,000; లేవీ గోత్రంలో 12,000; ఇశ్శాఖారు గోత్రంలో 12,000; జెబూలూను గోత్రంలో 12,000; యోసేపు గోత్రంలో 12,000; బెన్యామీను గోత్రంలో 12,000 ముద్రించబడ్డారు. ఈ సంగతుల తర్వాత ఒక గొప్ప జనసమూహం లెక్కపెట్టడానికి అసాధ్యమైనంత మంది ప్రజలు ప్రతి దేశం నుండి, ప్రతి గోత్రం నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి వచ్చారు. వారు తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూర మట్టలు చేతపట్టుకుని సింహాసనం ముందు వధించబడిన గొర్రెపిల్ల ముందు నిలబడి ఉండడం నేను చూశాను. వారు తమ స్వరాలను ఎత్తి బిగ్గరగా ఇలా అన్నారు: “సింహాసనం మీద ఆసీనుడైన మా దేవునికి, వధించబడిన గొర్రెపిల్లకే, రక్షణ చెందుతుంది.” అప్పుడు దేవదూతలు అందరు సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడ్డారు; వారు సింహాసనం ముందు తమ ముఖాలను నేలకు ఆనిస్తూ సాగిలపడి దేవుని ఆరాధిస్తూ, ఇలా అన్నారు: “ఆమేన్! మా దేవునికి స్తుతి, మహిమ, జ్ఞానం, కృతజ్ఞతాస్తుతులు, ఘనత, శక్తి, ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.” అప్పుడు పెద్దలలో ఒకడు, “తెల్లని వస్త్రాలను ధరించుకొన్న వీరు ఎవరు? వీరు ఎక్కడ నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు. అప్పుడు నేను, “అయ్యా, అది మీకే తెలుసు కదా” అని చెప్పాను. అతడు నాతో ఇలా అన్నాడు, “వీరు మహా హింసలలో నుండి వచ్చినవారు. వీరు వధించబడిన గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కుని తెల్లగా చేసుకున్నారు. అందుకే, “వీరు దేవుని సింహాసనం ముందు ఉండి, ఆయన మందిరంలో రాత్రింబగళ్ళు ఆయనను ఆరాధిస్తున్నారు, కాబట్టి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు. ‘మరి ఎన్నడు వారికి ఆకలి ఉండదు దాహం ఉండదు; సూర్యుని తీవ్రమైన వేడి కూడా వారికి తగలదు’ ఏ వేడి వారిని కాల్చదు. ఎందుకంటే, సింహాసనం మధ్యలో ఉన్న వధించబడిన గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉండి ‘జీవజలాల ఊటల దగ్గరకు వారిని నడిపిస్తాడు.’ ‘దేవుడు వారి కళ్లలో నుండి కారే ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తారు.’”

ప్రకటన 7:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఈ సంగతులు జరిగిన తరువాత భూమి నాలుగు దిక్కుల్లో నలుగురు దేవదూతలు నిలబడి ఉండడం నేను చూశాను. వారు భూమి మీద నాలుగు వైపుల నుంచి వీయాల్సిన గాలి వీయకుండా బలంగా అడ్డుకున్నారు. దాంతో భూమిమీద గానీ, సముద్రంమీద గానీ, ఏ చెట్టుమీద గానీ గాలి వీయడం లేదు. మరొక దూత తూర్పు దిక్కు నుండి పైకి లేవడం నేను చూశాను. అతనికి సజీవ దేవుని సీలు ఉంది. భూమికీ సముద్రానికీ హని చేయడానికి అనుమతి ఉన్న మొదటి నలుగురు దూతలతో అతడు బిగ్గరగా “మేము మా దేవుని దాసుల నుదిటిపై ముద్ర వేసేంత వరకూ భూమికీ, సముద్రానికీ, చెట్లకూ ఎలాంటి హని చేయవద్దు” అన్నాడు. సీలు పొందిన వారి సంఖ్య చెబుతుంటే నేను విన్నాను. ఇశ్రాయేలు వారి గోత్రాలన్నిటిలో సీలు పొందినవారి సంఖ్య 1, 44,000. గోత్రాల వారీగా ముద్ర పొందిన వారి సంఖ్య. యూదా గోత్రంలో 12,000. రూబేను గోత్రంలో 12,000. గాదు గోత్రంలో 12,000. ఆషేరు గోత్రంలో 12,000. నఫ్తాలి గోత్రంలో 12,000. మనష్షే గోత్రంలో 12,000. షిమ్యోను గోత్రంలో 12,000. లేవి గోత్రంలో 12,000. ఇశ్శాఖారు గోత్రంలో 12,000. జెబూలూను గోత్రంలో 12,000. యోసేపు గోత్రంలో 12,000. బెన్యామీను గోత్రంలో 12,000. ఆ తరువాత సింహాసనం ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా ఒక మహా జనసమూహం నిలబడి ఉండడం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వారిలో ప్రతి జాతినుండీ, ప్రతి వంశం నుండీ, ప్రతి గోత్రం నుండీ, భూమి మీద ఉన్న అన్ని భాషల్లో మాట్లాడే వారి నుండీ ప్రజలు ఉన్నారు. వారు తెల్లని బట్టలు ధరించి చేతుల్లో ఖర్జూరం మట్టలు పట్టుకుని ఉన్నారు. వీరంతా కలసి, “రక్షణ సింహాసనంపై కూర్చున్న మా దేవునిది, గొర్రెపిల్లది” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు. దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ఎదుట సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి, “ఆమేన్! మా దేవుడికి కీర్తీ, యశస్సూ, జ్ఞానమూ, కృతజ్ఞతలు, ఘనత, శక్తి, మహా బలం కలకాలం కలుగు గాక” అని చెబుతూ దేవుణ్ణి పూజించారు. అప్పుడు ఆ పెద్దల్లో ఒకతను “తెల్లటి వస్త్రాలు వేసుకున్న వీళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు. అందుకు నేను “అయ్యా, నీకే తెలుసు” అని జవాబిచ్చాను. అప్పుడు అతడు నాతో ఇలా చెప్పాడు, “వీరంతా మహా బాధల్లో నుండి వచ్చినవారే. వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ బట్టలు ఉతుక్కున్నారు. వాటిని తెల్లగా చేసుకున్నారు. అందుకే వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి పగలూ రాత్రీ తేడా లేకుండా ఆయన ఆలయంలో ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు. సింహాసనంపై కూర్చున్న ఆయన తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు. వారికి ఇకముందు ఆకలి గానీ దాహం గానీ వేయదు. ఎండ గానీ తీవ్రమైన వేడిమిగానీ వారికి తగలదు. ఎందుకంటే సింహాసనం మధ్యలో కూర్చున్న గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉంటాడు. జీవమిచ్చే నీటి ఊటల దగ్గరికి వారిని నడిపిస్తాడు. వారి కళ్ళలో నుండి కారే కన్నీటిని ఆయనే తుడిచివేస్తాడు.”

ప్రకటన 7:1-17 పవిత్ర బైబిల్ (TERV)

ఇది జరిగిన తర్వాత భూమి నాలుగు మూలలా నలుగురు దేవదూతలు నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు భూమ్మీద, సముద్రం మీద, చెట్ల మీద గాలి వీయకుండా భూమి యొక్క నలుదిశలనుండి వీచే గాలిని పట్టుకొన్నారు. అతడు వారిని పిలిచాడు. ఈ నలుగురి దూతలకు భూమికి, సముద్రానికి హాని చేయగల శక్తి ఉంది. మరొక దూత తూర్పునుండి రావటం చూసాను. అతని దగ్గర చిరంజీవి అయిన దేవుని ముద్ర ఉంది. అతడు బిగ్గరగా ఆ నలుగురి దూతలతో, “దేవుని సేవకుల నొసళ్ళపై ముద్ర వేసే వరకు, భూమికి గాని, సముద్రానికి గాని, చెట్లకు గాని హాని కలిగించకండి” అని అన్నాడు. ఆ తర్వాత ముద్రలు వేయబడ్డవారి సంఖ్య నాకు వినబడింది. వాళ్ళ సంఖ్య మొత్తం ఒక లక్ష నలభై నాలుగు వేలు. వీళ్ళందరు ఇశ్రాయేలు జనాంగం, అన్ని గోత్రాలకు చెందిన వాళ్ళు. యూదా గోత్రం నుండి పన్నెండు వేలమందికి, రూబేను గోత్రం నుండి పన్నెండు వేలమందికి, గాదు గోత్రం నుండి పన్నెండు వేలమందికి, ఆషేరు గోత్రం నుండి పన్నెండు వేలమందికి, నఫ్తాలి గోత్రం నుండి పన్నెండు వేలమందికి, మనష్షే గోత్రం నుండి పన్నెండు వేలమందికి, షిమ్యోను గోత్రం నుండి పన్నెండు వేలమందికి, లేవి గోత్రం నుండి పన్నెండు వేలమందికి, ఇశ్శాఖారు గోత్రం నుండి పన్నెండు వేలమందికి, జెబూలూను గోత్రం నుండి పన్నెండు వేలమందికి, యోసేపు గోత్రం నుండి పన్నెండు వేలమందికి, బెన్యామీను గోత్రం నుండి పన్నెండు వేలమందికి ముద్ర వేయబడింది. దీని తర్వాత ఎవ్వరూ లెక్క వెయ్యలేని ఒక పెద్ద ప్రజల గుంపు నా ముందు కనిపించింది. వాళ్ళలో ప్రతి దేశానికి చెందినవాళ్ళు ఉన్నారు. ప్రతి భాషకు చెందినవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెల్లటి దుస్తులు వేసుకొని, చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు, గొఱ్ఱెపిల్ల ముందు నిలబడి ఉండటం నాకు కనిపించింది. వాళ్ళందరు, “సింహాసనంపై కూర్చున్న మన దేవునికి, గొఱ్ఱెపిల్లకు రక్షణ చెందుగాక!” అని బిగ్గరగా అన్నారు. సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ దేవదూతలు నిలబడి ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు సాష్టాంగపడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. “ఆమేన్! మన దేవుణ్ణి స్తుతించుదాం! ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొందాం. ఆయనలో తేజస్సు, జ్ఞానము, గౌరవము, అధికారము, శక్తి చిరకాలం ఉండుగాక! ఆమేన్!” పెద్దల్లో ఒకడు నాతో, “తెల్లటి దుస్తులు వేసుకొన్న వాళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు. “అయ్యా! మీకే తెలియాలి!” అని నేను సమాధానం చెప్పాను. “మహా శ్రమలనుండి వచ్చినవాళ్ళు వీళ్ళే. తమ దుస్తుల్ని గొఱ్ఱెపిల్ల రక్తంలో ఉతికి శుభ్రం చేసుకొన్నారు. అందువల్ల వాళ్ళు దేవుని సింహాసనం ముందున్నారు. రాత్రింబగళ్ళు ఆయన మందిరంలో ఉండి ఆయన సేవ చేస్తారు. ఆ సింహాసనంపై కూర్చొన్నవాడు వాళ్ళందరిపై తన గుడారం కప్పుతాడు. వాళ్ళకిక మీదట ఆకలి కలుగదు. దాహం కలుగదు. సూర్యుడు తన ఎండతో వాళ్ళను మాడ్చడు. వాళ్ళకు ఏ వేడీ తగులదు. సింహాసనంపై కూర్చొన్న గొఱ్ఱెపిల్ల వాళ్ళ కాపరిగా ఉంటాడు. ఆయన సజీవమైన నీటి ఊటల దగ్గరకు వాళ్ళను పిలుచుకు వెళతాడు. దేవుడు వాళ్ళ కళ్ళనుండి కారే ప్రతి కన్నీటి బొట్టును తుడిచి వేస్తాడు.”

ప్రకటన 7:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అటుతరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచకుండునట్లు భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారముపొందిన ఆ నలు గురు దూతలతో ఈ దూత–మేము మా దేవుని దాసు లను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది. యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండువేలమంది. రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో పండ్రెండు వేలమంది, ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, నఫ్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది, మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది, షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, లేవి గోత్రములో పండ్రెండు వేలమంది, ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది, జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి –సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్ర మని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి–ఆమేన్; యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్. పెద్దలలో ఒకడు–తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను–అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను–వీరు మహాశ్రమలనుండి వచ్చినవారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకు కొని వాటిని తెలుపుచేసికొనిరి. అందువలనవారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైనవాడు తానే తన గుడారము వారిమీద కప్పును; వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.