ప్రకటన 5:1-6

ప్రకటన 5:1-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నవాని కుడిచేతిలో ఇరువైపుల వ్రాయబడి ఏడు ముద్రలతో ముద్రించబడి ఉన్న ఒక గ్రంథపుచుట్టను నేను చూశాను. అప్పుడు శక్తిగల ఒక దేవదూత బిగ్గరగా, “చుట్టబడి ఉన్న ఈ ముద్రలను విప్పి గ్రంథపుచుట్టను తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” అని ప్రకటన చేస్తుంటే నేను చూశాను. అయితే పరలోకంలో కాని, భూమి మీద కాని, భూమి క్రింద కాని ఉన్నవారిలో కాని ఎవరూ ఆ గ్రంథపుచుట్టను విప్పలేకపోయారు, కనీసం దానిలోనికి చూడలేకపోయారు. ఆ గ్రంథపుచుట్టను తెరవడానికి కాని దాని లోపలకి చూడడానికి కాని సామర్థ్యం కలవారు ఎవరూ లేరని నేను చాలా ఏడుస్తూ ఉన్నప్పుడు, పెద్దలలో ఒకరు నాతో, “ఏడవకు, ఇదిగో, దావీదు వేరు నుండి వచ్చిన యూదా గోత్రపు సింహం జయాన్ని పొందాడు. ఆయనే ఆ ఏడు ముద్రలను విప్పి ఆ గ్రంథపుచుట్టను తెరవగలరు” అన్నాడు. అప్పుడు సింహాసనం మధ్య, ఆ నాలుగు ప్రాణులు, పెద్దల మధ్య వధించబడినట్లు ఉన్న ఒక గొర్రెపిల్లను చూశాను. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ల ఉన్నాయి, అవి దేవుడు భూలోకమంతటి మీదికి పంపిన దేవుని ఏడు ఆత్మలు.

ప్రకటన 5:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన చేతిలో ఏడు సీలులతో గట్టిగా మూసి ఉన్న ఒక గ్రంథాన్ని చూశాను. ఆ గ్రంథం వెనకా లోపలా రాసి ఉంది. బలిష్టుడైన ఒక దేవదూత, “ఆ గ్రంథం సీలులు తీసి దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” అని బిగ్గరగా ప్రకటన చేస్తుంటే చూశాను. కానీ ఆ గ్రంథాన్ని తెరవడానికైనా, చూడడానికైనా పరలోకంలో భూమి మీదా భూమి కిందా ఎవరికీ సామర్థ్యం లేకపోయింది. ఆ గ్రంథాన్ని తెరవడానికైనా చూడటానికైనా సామర్థ్యం కలవారు ఎవరూ కనబడక పోవడంతో నేను వెక్కి వెక్కి ఏడ్చాను. అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “ఏడవకు. చూడు, ఏడు సీలులను తీసి ఆ గ్రంథాన్ని తెరవడానికి యూదా గోత్ర సింహమూ, దావీదు వేరూ అయిన వ్యక్తి జయించాడు” అన్నాడు. సింహాసనానికీ ఆ నాలుగు ప్రాణులకూ పెద్దలకూ మధ్యలో గొర్రెపిల్ల నిలబడి ఉండడం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల వధ అయినట్టుగా కనిపించింది. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములూ ఏడు కళ్ళూ ఉన్నాయి. ఆ కళ్ళు భూమి అంతటికీ వెళ్ళిన దేవుని ఏడు ఆత్మలు.

ప్రకటన 5:1-6 పవిత్ర బైబిల్ (TERV)

ఆ తర్వాత, సింహాసనంపై కూర్చొన్నవాని కుడి చేతిలో చుట్టబడియున్న ఒక గ్రంథాన్ని చూసాను. దాని యిరువైపులా ఏదో వ్రాయబడి ఉంది. దానిపై ఏడు ముద్రలు ఉన్నాయి. శక్తివంతమైన ఒక దేవదూత నాకు కనిపించాడు. అతడు పెద్ద స్వరంతో, “ఆ ముద్రలను విప్పి ఆ గ్రంథాన్ని తెరువగల యోగ్యుడెవరు?” అని ప్రకటించటం నేను చూసాను. పరలోకంలోగాని, భూమ్మీదగాని, పాతాళంలోగాని ఆ గ్రంథాన్ని తెరువగలవాడు, దాని లోపలవున్నది చూడగలవాడు ఎవ్వడూ నాకు కనిపించలేదు. ఆ గ్రంథాన్ని తెరువగలవాడు దాని లోపల ఏముందో చూడగల యోగ్యుడు కనిపించనందుకు నేను చాలా విలపించాను. అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “విలపించవద్దు. యూదాతెగకు చెందిన సింహము, దావీదు వంశాంకురము విజయం పొందాడు చూడు. ఆ గ్రంథాన్ని, దాని ఏడు ముద్రల్ని తెరువగలవాడు ఆయనే!” అని అన్నాడు. అప్పుడు నాకొక గొఱ్ఱెపిల్ల కనిపించింది. అది సింహాసనం మధ్య ఉంది. అది వధింపబడినదానిలా నాకు కనిపించింది. దాని చుట్టూ ఆ నాలుగు ప్రాణులు ఉన్నాయి. పెద్దలు ఉన్నారు. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ళు ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. దేవుడు ప్రపంచమంతా వ్యాపింపచేసింది ఈ ఆత్మలనే.

ప్రకటన 5:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీసుడైయుండువాని కుడిచేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గ రగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు–ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.