ప్రకటన 19:6-9 - Compare All Versions
ప్రకటన 19:6-9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు మహా గొప్ప జనసమూహం వంటి శబ్దాన్ని, పారే జలాల గర్జనను ఉరుముల ధ్వనిని పోలిన స్వరం ఇలా అన్నది, “హల్లెలూయా! సర్వశక్తిగల మన ప్రభువైన దేవుడు పరిపాలిస్తున్నారు. కాబట్టి మనం ఆనందించి ఉత్సాహ ధ్వనులతో ఆయనను కీర్తించుదాం! ఎందుకంటే ఇదిగో గొర్రెపిల్ల పెళ్ళి రోజు వచ్చేసింది ఆయన వధువు తనను తాను సిద్ధపరచుకుంది. ఆమె ధరించడానికి ప్రకాశమైన శుద్ధమైన, సున్నితమైన నార వస్త్రాలు ఆమెకు ఇవ్వబడ్డాయి.” సన్నని నారబట్టలు అనగా దేవుని పరిశుద్ధ ప్రజలు చేసిన నీతి క్రియలు అని అర్థము. ఆ తర్వాత దేవదూత నాతో, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం పొందినవారు ధన్యులు! ఇది వ్రాయి. ఇవి దేవుని సత్య వాక్కులు” అని చెప్పాడు.
ప్రకటన 19:6-9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది. “హల్లెలూయ! సర్వ శక్తిశాలి, మన ప్రభువు అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు.” “గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది. కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం. ఆయనకు మహిమ ఆపాదించుదాం.” ఆమె ధరించుకోడానికి మెరిసిపోయే, పరిశుభ్రమైన శ్రేష్ఠవస్త్రాలు ఇచ్చారు. ఈ శ్రేష్ఠవస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు. అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు.
ప్రకటన 19:6-9 TERV (పవిత్ర బైబిల్)
ఆ తర్వాత నాకు ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వని పెద్ద ప్రజాసమూహం చేసిన ధ్వనిలా, జలపాతం చేసే ధ్వనిలా, పెద్ద ఉరుముల ధ్వనిలా ఉంది. వాళ్ళు యిలా అన్నారు: “దేవుణ్ణి స్తుతించండి. సర్వశక్తిసంపన్నుడు, మన ప్రభువు అయిన దేవుడు మనల్ని పాలిస్తున్నాడు. మనం ఆనందించుదాం. సంతోషంతో ఆయన్ని ఘనపర్చుదాం. గొఱ్ఱెపిల్ల వివాహం కానున్నది. ఆయన పెళ్ళి కూతురు తనకు తానే సిద్ధం అయింది. సున్నితమైన నార బట్టలు ఆమె ధరించటానికి యివ్వబడ్డాయి. అవి స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి.” (సున్నితమైన నారబట్టలు పవిత్రులు చేసిన నీతి పనులను సూచిస్తున్నాయి.) ఆ తదుపరి దూత నాతో, “ఇది వ్రాయి. గొఱ్ఱెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానింపబడ్డ వాళ్ళు ధన్యులు.” అతడు యింకా ఇలా అన్నాడు, “ఇవి నిజంగా దేవుని మాటలు.”
ప్రకటన 19:6-9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము–సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలు చున్నాడు; ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను–గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను.