ప్రకటన 19:1-16

ప్రకటన 19:1-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఈ సంగతుల తర్వాత పరలోకంలో ఒక గొప్ప జనసమూహం అరుస్తున్న శబ్దం వంటి శబ్దాన్ని నేను విన్నాను: “హల్లెలూయా! రక్షణ, మహిమ, బలం మన దేవునివే! ఎందుకంటే ఆయన తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి. భూమిని తన వ్యభిచారంతో చెడగొట్టిన, ఆ మహావేశ్యకు ఆయన శిక్ష విధించారు. తన సేవకుల రక్తాన్ని కార్చిన ఆమెపై ఆయన పగతీర్చుకున్నారు.” మరొకసారి వారు ఇలా బిగ్గరగా కేకలు వేశారు: “హల్లెలూయా! ఆమె నుండి వస్తున్న పొగ ఎల్లకాలం పైకి లేస్తూనే ఉంటుంది!” అప్పుడు ఆ ఇరవైనలుగురు పెద్దలు ఆ నాలుగు ప్రాణులు సింహాసనంపై కూర్చున్న దేవుని ముందు సాగిలపడి బిగ్గరగా ఇలా అన్నారు: “ఆమేన్! హల్లెలూయా!” అంటూ ఆరాధించారు. అప్పుడు సింహాసనం నుండి వచ్చిన ఒక స్వరం, “దేవునికి భయపడేవారలారా, ఓ దేవుని సేవకులారా! చిన్నవారైన పెద్దవారైన అందరు మన దేవుని స్తుతించండి” అని పలికింది. అప్పుడు మహా గొప్ప జనసమూహం వంటి శబ్దాన్ని, పారే జలాల గర్జనను ఉరుముల ధ్వనిని పోలిన స్వరం ఇలా అన్నది, “హల్లెలూయా! సర్వశక్తిగల మన ప్రభువైన దేవుడు పరిపాలిస్తున్నారు. కాబట్టి మనం ఆనందించి ఉత్సాహ ధ్వనులతో ఆయనను కీర్తించుదాం! ఎందుకంటే ఇదిగో గొర్రెపిల్ల పెళ్ళి రోజు వచ్చేసింది ఆయన వధువు తనను తాను సిద్ధపరచుకుంది. ఆమె ధరించడానికి ప్రకాశమైన శుద్ధమైన, సున్నితమైన నార వస్త్రాలు ఆమెకు ఇవ్వబడ్డాయి.” సన్నని నారబట్టలు అనగా దేవుని పరిశుద్ధ ప్రజలు చేసిన నీతి క్రియలు అని అర్థము. ఆ తర్వాత దేవదూత నాతో, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం పొందినవారు ధన్యులు! ఇది వ్రాయి. ఇవి దేవుని సత్య వాక్కులు” అని చెప్పాడు. అప్పుడు అతన్ని ఆరాధించడానికి నేను ఆ దేవదూత పాదాల ముందు సాగిలపడ్డాను. కాని అతడు నాతో, “వద్దు! ఇలా చేయకు! నేను ఇతర విశ్వాసుల వలె యేసు కోసం సాక్ష్యమిచ్చే నీలాంటి సేవకుడనే. దేవునినే పూజించు! ఎందుకంటే యేసును గురించిన సాక్ష్యం కలిగి ఉండడమే ప్రవచించే ఆత్మ” అని నాతో చెప్పాడు. అప్పుడు పరలోకం తెరవబడి నా ముందు ఒక తెల్లని గుర్రం కనిపించింది. దాని మీద స్వారీ చేసే వ్యక్తి నమ్మకమైన సత్యవంతుడు అని పిలువబడతాడు. ఆయన న్యాయమైన తీర్పును ఇస్తూ యుద్ధం చేస్తాడు. ఆయన కళ్లు అగ్నిజ్వాలల్లా ఉంటాయి. ఆయన తలమీద అనేక కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు వ్రాయబడి ఉంది, అది ఆయనకు తప్ప మరి ఎవరికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రాలను ఆయన ధరించి ఉన్నాడు. ఆయనకు దేవుని వాక్యమని పేరు. తెల్లని, పవిత్రమైన సన్నని నారబట్టలను ధరించి తెల్లని గుర్రాల మీద స్వారీ చేస్తున్న పరలోక సైన్యాలు ఆయనను వెంబడిస్తున్నాయి. దేశాలను నరకడానికి ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయటకు వస్తుంది. “ఆయన ఒక ఇనుపదండంతో వారిని పరిపాలిస్తారు.” ఆయన సర్వశక్తిగల దేవుని తీవ్రమైన ఉగ్రత అనే ద్రాక్ష గానుగ తొట్టిని త్రొక్కుతారు. ఆయన ధరించిన వస్త్రాల మీద ఆయన తొడ మీద ఈ పేరు వ్రాసి ఉంది: రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు.

ప్రకటన 19:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఈ విషయాలు జరిగిన తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు పరలోకంలో నుండి ఒక పెద్ద శబ్దం నేను విన్నాను. “హల్లెలూయ! రక్షణ, యశస్సు, బల ప్రభావాలు మన దేవునివే. ఆయన తీర్పులు సత్యంగా న్యాయంగా ఉన్నాయి. తన లైంగిక అవినీతితో భూలోకాన్ని భ్రష్టత్వంలోకి నెట్టిన మహా వేశ్యను ఆయన శిక్షించాడు. ఆమె ఒలికించిన తన సేవకుల రక్తానికి ఆయన ప్రతీకారం తీర్చాడు.” రెండోసారి వారంతా, “హల్లెలూయ! ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది” అన్నారు. అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి, “ఆమెన్, హల్లెలూయ!” అని చెబుతూ ఆయనను పూజించారు. అప్పుడు, “దేవుని దాసులు, ఆయనకు భయపడే వారు, గొప్పవారైనా అనామకులైనా అందరూ మన దేవుణ్ణి స్తుతించండి” అంటూ ఒక స్వరం సింహాసనం నుండి వినిపించింది. తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది. “హల్లెలూయ! సర్వ శక్తిశాలి, మన ప్రభువు అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు.” “గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది. కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం. ఆయనకు మహిమ ఆపాదించుదాం.” ఆమె ధరించుకోడానికి మెరిసిపోయే, పరిశుభ్రమైన శ్రేష్ఠవస్త్రాలు ఇచ్చారు. ఈ శ్రేష్ఠవస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు. అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు. అందుకు నేను అతణ్ణి పూజించడానికి అతని ముందు సాష్టాంగపడబోయాను. కానీ అతడు, “అలా చేయకు! యేసుకు సాక్షులుగా ఉన్న నీకూ నీ సోదరులకూ నేను తోటి దాసుణ్ణి మాత్రమే” అన్నాడు. తరువాత పరలోకం తెరుచుకుని ఉండడం చూశాను. అప్పుడు చూడండి! తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు ‘నమ్మకమైన వాడు, సత్యవంతుడు.’ ఆయన న్యాయంగా తీర్పు చెబుతూ యుద్ధం చేస్తాడు. ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. అది ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు. ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. ‘దేవుని వాక్కు’ అనే పేరు ఆయనకుంది. ఆయన వెనకే పరలోక సేనలు తెల్లని నార బట్టలు వేసుకుని తెల్ల గుర్రాలపై ఎక్కి వెళ్తున్నారు. వివిధ జాతి ప్రజలను కొట్టడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుప లాఠీతో వారిని పరిపాలిస్తాడు. సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఆగ్రహపు ద్రాక్ష గానుగ తొట్టిని ఆయనే తొక్కుతాడు. ఆయన బట్టల మీదా, తొడ మీదా ‘రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు’ అనే పేరు రాసి ఉంది.

ప్రకటన 19:1-16 పవిత్ర బైబిల్ (TERV)

ఇది జరిగిన తర్వాత పరలోకంలో ఒక పెద్ద ప్రజాసమూహం మాట్లాడుతున్నట్లు నాకు ఒక స్వరం వినిపించి యిలా అన్నది: “దేవుణ్ణి స్తుతించండి! రక్షణ, మహిమ, అధికారం మన దేవునిదే. ఆయన నీతిమంతుడు కనుక న్యాయంగా సత్యంగా తీర్పు చెబుతాడు. తన వ్యభిచారంతో ప్రపంచాన్ని పాడు చేసిన ఆ వేశ్యను ఆయన శిక్షించాడు. తన సేవకుల రక్తానికి దానిపై కక్ష తీర్చుకొన్నాడు.” వాళ్ళందరు మళ్ళీ, ఇలా అన్నారు: “దేవుణ్ణి స్తుతించండి! కాలిన ఆ మహానగరం నుండి పొగ ఆగకుండా మీదికి వెళ్తుంటుంది.” ఆ యిరవై నాలుగు మంది పెద్దలు సాష్టాంగ పడి సింహాసనంపై కూర్చొన్న దేవుణ్ణి ఆరాధించారు. అదే విధంగా ఆ నాలుగు ప్రాణులు కూడా ఆరాధించాయి. వాళ్ళు ఇలా అన్నారు: “ఆమేన్! దేవుణ్ణి స్తుతించండి!” అప్పుడు సింహాసనం నుండి ఒక స్వరం యిలా అన్నది: “ఆయన సేవకులైన మీరంతా, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా మన దేవుణ్ణి స్తుతించండి. ఆయనకు భయపడే మీరంతా మన దేవుణ్ణి స్తుతించండి.” ఆ తర్వాత నాకు ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వని పెద్ద ప్రజాసమూహం చేసిన ధ్వనిలా, జలపాతం చేసే ధ్వనిలా, పెద్ద ఉరుముల ధ్వనిలా ఉంది. వాళ్ళు యిలా అన్నారు: “దేవుణ్ణి స్తుతించండి. సర్వశక్తిసంపన్నుడు, మన ప్రభువు అయిన దేవుడు మనల్ని పాలిస్తున్నాడు. మనం ఆనందించుదాం. సంతోషంతో ఆయన్ని ఘనపర్చుదాం. గొఱ్ఱెపిల్ల వివాహం కానున్నది. ఆయన పెళ్ళి కూతురు తనకు తానే సిద్ధం అయింది. సున్నితమైన నార బట్టలు ఆమె ధరించటానికి యివ్వబడ్డాయి. అవి స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి.” (సున్నితమైన నారబట్టలు పవిత్రులు చేసిన నీతి పనులను సూచిస్తున్నాయి.) ఆ తదుపరి దూత నాతో, “ఇది వ్రాయి. గొఱ్ఱెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానింపబడ్డ వాళ్ళు ధన్యులు.” అతడు యింకా ఇలా అన్నాడు, “ఇవి నిజంగా దేవుని మాటలు.” ఇది విన్నాక అతన్ని ఆరాధించాలని నేను అతని కాళ్ళ మీద పడ్డాను. కాని అతడు నాతో, “అలా చేయవద్దు. నేను నీ తోటి సేవకుణ్ణి. యేసు చెప్పిన దాన్ని అనుసరించే సోదరుల సహచరుణ్ణి. దేవుణ్ణి ఆరాధించు. యేసు చెప్పిన విషయాలనే ప్రవక్తలు కూడా చెప్పారు” అని అన్నాడు. నేను తెరుచుకొని ఉన్న పరలోకాన్ని చూసాను. నా ముందు ఒక తెల్లటి గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు నమ్మకమైన వాడని, సత్యవంతుడని పేరున్న వాడు. అతడు నీతిగా తీర్పు చెబుతాడు. న్యాయంగా యుద్ధం చేస్తాడు. ఆయన కళ్ళు నిప్పులా మండుతూ ఉన్నాయి. ఆయన తలమీద ఎన్నో కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు వ్రాయబడి ఉంది. ఆయనకు తప్ప మరెవ్వరికీ ఆ పేరు తెలియదు. ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఆయన పేరు దేవుని వాక్యం. తెల్లగా పరిశుద్ధంగా ఉన్న సున్నితమైన దుస్తులు వేసుకొని పరలోకంలో ఉన్న సైనికులు తెల్లటి గుర్రాలపై స్వారీ చేస్తూ ఆయన్ని అనుసరించారు. దేశాలను ఓడించటానికి ఆయన నోటినుండి పదునైన కత్తి బయటకు వచ్చింది. ఆయన దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడైన దేవుని ఆగ్రహమనబడే ద్రాక్షా గానుగను త్రొక్కుతాడు. ఆ ఆగ్రహం తీవ్రమైనది. ఆయన వస్త్రంమీద, ఆయన తొడమీద

ప్రకటన 19:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అటుతరువాత బహుజనులశబ్దమువంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని– ప్రభువు ను స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును; ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పుతీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతి దండన చేసెను; మరి రెండవసారి వారు– ప్రభువు ను స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి–ఆమేన్, ప్రభువు ను స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు–మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము–సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలు చున్నాడు; ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను–గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడు–వద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము. యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను. మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శచేయుచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు; రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును. –రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది.