ప్రకటన 16:16-21
ప్రకటన 16:16-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ అపవిత్రాత్మలు రాజులనందరిని హెబ్రీ భాషలో “హర్మగిద్దోను” అని పిలువబడే స్థలంలో పోగుచేశాయి. ఏడవ దేవదూత గాలిలో తన పాత్రను కుమ్మరించినప్పుడు, దేవాలయంలోని సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక సమాప్తం అయింది!” అని చెప్పింది. అప్పుడు మెరుపుల వెలుగులు, ధ్వనులు, ఉరుములు, భయంకరమైన భూకంపం వచ్చాయి. మానవులు భూమి మీద జీవిస్తున్నప్పటి నుండి ఇలాంటి భూకంపం కలుగలేదు. అది చాలా భయంకరమైన భూకంపము. ప్రసిద్ధిగాంచిన ఆ గొప్ప పట్టణం మూడు భాగాలుగా చీలిపోయింది, దేశాల పట్టణాలు కుప్పకూలాయి. దేవుడు బబులోను మహాపట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని తన ఉగ్రత అనే మద్యంతో నిండిన పాత్రను ఆమెకు ఇచ్చారు. అప్పుడు ప్రతి ద్వీపం పారిపోయింది, పర్వతాలు కనబడలేదు. ఆకాశం నుండి మనుష్యుల మీద భారీ వడగండ్లు పడ్డాయి. ఆ వడగండ్లు ఒక్కొక్కటి సుమారు నలభై అయిదు కిలోల బరువు ఉన్నాయి. ఆ వడగండ్ల తెగులు చాలా భయంకరంగా ఉండడంతో ఆ దెబ్బలకు తట్టుకోలేక ప్రజలు దేవుని దూషించారు.
ప్రకటన 16:16-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
హీబ్రూ భాషలో ‘హర్ మెగిద్దోన్’ అనే పేరున్న స్థలానికి ఆ రాజులందర్నీ పోగు చేశారు. ఏడవ దూత తన పాత్రను గాలిలో కుమ్మరించాడు. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం నుండీ సింహాసనం నుండీ, “ఇక అయిపోయింది” అని ఒక పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడు వివిధ శబ్దాలూ, మెరుపులూ, భారీ ఉరుములూ కలిగాయి. భయంకరమైన భూకంపం వచ్చింది. మనుషుల సృష్టి జరిగిన దగ్గర్నుండీ అలాంటి భూకంపం కలగలేదు. అంత పెద్ద భూకంపం అది. ప్రసిద్ధమైన ఆ మహా నగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లోని నగరాలన్నీ నాశనమయ్యాయి. అప్పుడు దేవుడు మహా బబులోను నగరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తీవ్ర ఆగ్రహం అనే మద్యంతో నిండిన పాత్రను ఆ నగరానికిచ్చాడు. ప్రతి ద్వీపమూ అదృశ్యమైపోయింది. ప్రతి పర్వతం కనిపించకుండా పోయింది. ఆకాశం నుండి మనుషుల మీద సుమారు నలభై ఐదు కిలోల బరువున్న భీకరమైన వడగళ్ళు పడ్డాయి. ఆ వడగళ్ళ దెబ్బ భయంకరంగా ఉంది కాబట్టి మనుషులు దేవుణ్ణి దూషించారు.
ప్రకటన 16:16-21 పవిత్ర బైబిల్ (TERV)
ఆ భూతాత్మలు హీబ్రూ భాషలో “హార్‌మెగిద్దోను” అనే ప్రదేశంలో రాజుల్ని సమావేశ పరిచాయి. ఏడవ దూత తన పాత్రను గాలిలో క్రుమ్మరించాడు. మందిరంలో ఉన్న సింహాసనం మీదినుండి ఒక స్వరం బిగ్గరగా “సమాప్తం” అని అన్నది. వెంటనే మెరుపులు మెరిసాయి. ఉరుములు, గర్జనలు వినిపించాయి. తీవ్రమైన భూకంపం వచ్చింది. మానవుడు భూమ్మీద పుట్టిననాటి నుండి అటువంటి భూకంపం ఎన్నడూ జరుగలేదు. ఆ భూకంపం అంత తీవ్రంగా ఉంది. మహానగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లో ఉన్న పట్టణాలు కూలిపోయాయి. దేవుడు బాబిలోను మహానగరాన్ని శిక్షించటం మరచిపోలేదు. దాని పాత్రలో “తీవ్రమైన ఉగ్రత” అనబడే మద్యాన్ని పోసాడు. ద్వీపాలు, పర్వతాలు మాయమైపోయాయి. ఆకాశం నుండి పెద్ద వడగండ్లు వచ్చి ప్రజలమీద పడ్డాయి. అవి ఒక్కొక్కటి అయిదేసి మణుగుల బరువు ఉన్నాయి. ఈ వడగండ్ల వాన కలిగించినందుకు ప్రజలు దేవుణ్ణి దూషించారు. ఈ వడగండ్ల వల్ల ప్రజలకు చాలా బాధ కలిగింది.
ప్రకటన 16:15-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
హెబ్రీభాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతు రేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు. ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగా–సమాప్తమైనదని చెప్పుచున్న యొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహా పట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను. అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.