కీర్తనలు 8:1-9

కీర్తనలు 8:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా, మా ప్రభువా, భూలోకమంతట మీ నామం ఎంతో ప్రభావవంతమైనది! మీరు ఆకాశాల్లో మీ మహిమను ఉంచారు. చిన్నపిల్లల చంటిబిడ్డల స్తుతుల ద్వారా, మీ శత్రువుల పగవారి నోరు మూయించడానికి మీ శత్రువులకు వ్యతిరేకంగా మీరు బలమైన కోటను స్థాపించారు. మీ చేతి పనియైన మీ ఆకాశాలను, మీరు వాటి వాటి స్థానాల్లో ఉంచిన చంద్ర నక్షత్రాలను నేను చూసినప్పుడు, మీరు మానవులను జ్ఞాపకం చేసుకోడానికి వారు ఏపాటివారు? మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు? మీరు వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశారు, మహిమ ఘనతను వారికి కిరీటంగా పెట్టారు. మీ చేతిపనుల మీద వారికి అధికారం ఇచ్చారు; మీరు సమస్తాన్ని అనగా: గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి జంతువులను, ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను, సముద్ర మార్గంలో తిరిగే ప్రాణులను వారి పాదాల క్రింద ఉంచారు. యెహోవా, మా ప్రభువా, భూమి అంతట మీ నామం ఎంతో ఘనమైనది!

కీర్తనలు 8:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా మా ప్రభూ, పై ఆకాశాలలో నీ మహిమను చూపించేవాడా, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది! శత్రువునూ, ప్రతీకారం చేసేవాణ్ణీ నోరు మూయించడానికీ, నీ విరోధుల కారణంగా, పసికందుల, చంటి పిల్లల నోటిలో నువ్వు స్తుతిని సృష్టించావు. నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు, నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు? అయినా, నువ్వు వాళ్ళను స్వర్గలోక ప్రాణులకన్నా కొంచెం మాత్రమే తక్కువగా చేశావు. వాళ్లకు మహిమా ప్రభావాల కిరీటం పెట్టావు. నీ చేతిపనుల మీద అతనికి పరిపాలన ఇచ్చావు. అతడి పాదాల కింద సమస్తమును ఉంచావు. గొర్రెలను, ఎడ్లను, అడవి మృగాలను సైతం, ఆకాశ పక్షులను, సముద్ర ప్రాణులను, సముద్ర ప్రవాహాల్లో తిరిగే వాటిని నువ్వు అతని పాదాల కింద ఉంచావు. యెహోవా మా ప్రభూ, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!

కీర్తనలు 8:1-9 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది. పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది. నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు. యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను. నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను. మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు? నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు? మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం? నీవు వానిని గమనించటం ఎందుకు? అయితే మానవుడు నీకు ముఖ్యం. వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు. మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు. నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు. ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు. గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు. ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే చేపల మీద వారు ఏలుబడి చేస్తారు. మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!

కీర్తనలు 8:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహి మను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై నీ విరోధులనుబట్టి బాలురయొక్కయు చంటి పిల్లలయొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు. నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసి యున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చియున్నావు. గొఱ్ఱెలనన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్రమార్గములలో సంచరించువాటినన్నిటిని వాని పాదములక్రింద నీవు ఉంచియున్నావు. యెహోవా మా ప్రభువా భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది!