కీర్తనలు 73:6-12 - Compare All Versions
కీర్తనలు 73:6-12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి గర్వం వారికి కంఠహారంగా ఉంది; హింసను వారు వస్త్రంగా ధరించారు. వారి కఠిన హృదయాల నుండి దోషం బయటికి వస్తుంది, వారి చెడు ఊహలకు హద్దులు లేవు. వారు ఎగతాళి చేస్తారు, దురుద్దేశంతో మాట్లాడతారు; అహంకారంతో అణచివేస్తామని బెదిరిస్తారు. వారి నోళ్ళు పరలోకంలో పాలిస్తున్నట్లు మాట్లాడుతాయి, వారి నాలుకలు భూమిపై ఆధిపత్యమున్నట్లు ప్రకటిస్తాయి. అందువల్ల వారి ప్రజలు వారివైపు తిరుగుతారు వారి మాటలను మంచినీరు త్రాగినట్లు త్రాగుతారు. “దేవునికి ఎలా తెలుస్తుంది? మహోన్నతునికి ఏదైనా తెలుసా?” అని వారనుకుంటారు. దుష్టులు ఇలా ఉంటారు. ఎప్పుడూ ఏ జాగ్రత్తలు లేకుండ సంపద కూడబెట్టుకుంటారు.
కీర్తనలు 73:6-12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి గర్వం వారి మెడ చుట్టూ కంఠహారం లాగా ఉంది. దుర్మార్గతను వారు వస్త్రంలాగా ధరిస్తారు. వారి కళ్ళు కొవ్వు పట్టి ఉబ్బి ఉన్నాయి. దురాలోచనలు వారి హృదయంలోనుండి బయటికి వస్తున్నాయి. వారు ఎగతాళి చేస్తారు. పొగరుబోతు మాటలు పలుకుతారు. గర్వంగా గొప్పలు చెప్పుకుంటారు. వారి మాటలు దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. వారి నాలుకతో భూమి అంతటినీ చుట్టి వస్తారు. కాబట్టి దేవుని ప్రజలు వారి పక్షం చేరతారు. వారి మాటలను మంచినీళ్ళు తాగినట్టు తాగుతారు. దేవునికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఏమి జరుగుతూ ఉందో ఆయనకి అవగాహన ఉందా? అని వారనుకుంటారు. గమనించండి. వారు దుర్మార్గులు. మరింత డబ్బు సంపాదిస్తూ విచ్చలవిడిగా ఉంటారు.
కీర్తనలు 73:6-12 TERV (పవిత్ర బైబిల్)
కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు. వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంత తేటగా ఉన్నాయో ఈ విషయం కూడ అంత తేటతెల్లం. ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు. వారు కోరుకొన్న పనులు వారు చేస్తారు. ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబుతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు. వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు. ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు. వారు భూమిని పాలించేవారని తలుస్తారు. కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి వారు చెప్పే సంగతులు నమ్ముతారు. “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు. సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెబుతారు.” ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు. మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు.
కీర్తనలు 73:6-12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు. క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవివారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు. ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురువారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారిపక్షము చేరునువారు జలపానము సమృద్ధిగా చేయుదురు. –దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను కొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.