కీర్తనలు 44:1-26
కీర్తనలు 44:1-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఓ దేవా! మా పూర్వికుల రోజుల్లో పురాతన కాలంలో మీరు చేసినదంతా మా పితరులు మాకు చెప్పారు. మీ స్వహస్తంతో దేశాలను వెళ్లగొట్టారు మా పూర్వికులను అక్కడ నిలబెట్టారు; ఆయా జాతుల ప్రజలను నాశనం చేసి మా పూర్వికులను వర్ధిల్లేలా చేశారు. తమ ఖడ్గంతో ఈ దేశాన్ని వారు వశం చేసుకోలేదు, తమ భుజబలంతో విజయం సాధించలేదు; మీరు వారిని ప్రేమించారు కాబట్టి మీ కుడిచేయి మీ భుజబలం మీ ముఖకాంతియే వారికి విజయాన్ని ఇచ్చింది. మీరే మా రాజు, మీరే మా దేవుడు, యాకోబు ప్రజలకు విజయం కలగాలని ఆజ్ఞాపిస్తారు. మీ వలన విరోధులను పడగొట్టగలం; మా మీదికి ఎగబడే వారిని మీ పేరట అణచివేయగలము. మా ధనస్సు మీద మాకు నమ్మకం లేదు, మా ఖడ్గం మాకు విజయం ఇవ్వదు. మా విరోధులపై మాకు విజయమిచ్చేది మీరే, మీరే పగవారికి సిగ్గుపడేలా చేశారు. దేవుని యందు మేము దినమంతా అతిశయిస్తాం మీ నామాన్ని నిత్యం స్తుతిస్తాము. సెలా కాని ఇప్పుడైతే మీరు మమ్మల్ని త్రోసివేసి అవమానపరిచారు; మా సైన్యంతో మీరు రావడం లేదు. శత్రువుల ముందు పారిపోవలసి వచ్చింది, పగవారు మమ్మల్ని దోచుకున్నారు. గొర్రెలను ఆహారంగా ఇచ్చినట్లు మమ్మల్ని వారికిచ్చారు దేశాల మధ్యకు మమ్మల్ని చెదరగొట్టారు. లాభం చూసుకోకుండా నీ ప్రజలను, తక్కువ వెలకు అమ్మేశారు. పొరుగువారు మమ్మల్ని నిందించేలా చేశారు; మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని ఎగతాళి చేసేలా చేశారు. మమ్మల్ని జనాల నోట సామెతలా చేశారు; జనాంగాలు తలలూపుతూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. నిందిస్తూ హేళన చేసేవారి కారణంగా పగ తీర్చుకోవాలనుకునే శత్రువుల కారణంగా శత్రువులు మా ఎదుటకు వస్తే, దినమంతా మాకు అవమానమే; సిగ్గు మా ముఖాన్ని కమ్మివేసింది. ఇదంతా మా మీదికి వచ్చిపడినా, మేము మిమ్మల్ని మరవలేదు; మీ నిబంధన విషయం నమ్మకద్రోహులం కాలేదు. మా హృదయం వెనుదీయలేదు; మా పాదాలు మీ మార్గం నుండి తొలగిపోలేదు. నక్కలు తిరిగే చోట మీరు మమ్మల్ని నలగ్గొట్టి పడేశారు; చావు నీడ మమ్మల్ని ఆవరించి ఉన్నది. ఒకవేళ మేము మా దేవుని పేరు మరచినా, పరదేశి దేవుని వైపు చేతులు చాపినా, హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఆ విషయాన్ని తెలుసుకోకుండ ఉంటారా? అయినా రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు. ప్రభువా, లెండి! ఎందుకీ నిద్ర? లెండి మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టకండి. మీ ముఖాన్ని మా నుండి ఎందుకు దాచుకుంటున్నారు? నా బాధను నా హింసను మరచిపోయారా? మేము క్రుంగి నేలకు ఒరిగిపోయాము; మా దేహాలు నేలకు అంటుకుపోయాయి. లేచి మాకు సాయం చేయండి; మారని మీ ప్రేమతో మమ్మల్ని విడిపించండి.
కీర్తనలు 44:1-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, మా పూర్వీకుల రోజుల్లో, మా పితరుల కాలంలో నువ్వు చేసిన పనులన్నిటిని గూర్చి మా పితరులు మాకు చెప్పారు. మేము మా చెవులారా విన్నాం. నువ్వు నీ చేత్తో వివిధ జాతులను తోసివేశావు. మా ప్రజలను అక్కడ నాటావు. ప్రజలను బాధపెట్టావు. కానీ దేశంలో మా ప్రజలను విస్తరింపజేశావు. వాళ్ళు తమ చేతనున్న కత్తితో అక్కడి భూమిని తమ కోసం స్వాధీనం చేసుకోలేదు. వారి భుజబలం వారిని రక్షించలేదు. కానీ నీ కుడి చెయ్యి, నీ భుజబలం, నీ ముఖకాంతి వాళ్ళకి విజయం సాధించిపెట్టాయి. నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నావు. దేవా, నువ్వే నాకు రాజువి. యాకోబుకు విజయం కలగాలని ఆజ్ఞాపించు. నీ ద్వారా మేము మా శత్రువులను అణచి వేస్తాం. నీ నామాన్ని బట్టి మేము మాపై లేచే వాళ్ళను తొక్కి వేస్తాం. నేను నా విల్లుపై భరోసా ఉంచను. నా కత్తి నన్ను రక్షించలేదు. మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడింది నువ్వే. మమ్మల్ని ద్వేషించే వాళ్ళను సిగ్గుపరిచిందీ నువ్వే. మా దేవునిలోనే మేము రోజంతా గర్విస్తున్నాం. నీ నామానికి శాశ్వతంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. సెలా. అయితే ఇప్పుడు నువ్వు మమ్మల్ని తోసివేశావు. మా పైకి అవమానం పంపించావు. మా సైన్యాలతో కలసి నువ్వు బయలుదేరడం లేదు. శత్రువుల ఎదుట నిలబడలేక వెనక్కి తిరిగేలా చేస్తున్నావు. మమ్మల్ని ద్వేషించేవాళ్ళు తమ కోసం మమ్మల్ని దోచుకుంటున్నారు. వాళ్ళ కోసం ఆహారంగా తయారైన గొర్రెల్లాగా మమ్మల్ని చేశావు. అనేక దేశాల్లోకి మమ్మల్ని చెదరగొట్టావు. అతి తక్కువ వెలకు మమ్మల్ని అమ్మివేశావు. అలా చేయడం మూలంగా నీ సంపద ఏమీ అధికం కాలేదు. మా పొరుగు వాళ్ళ దృష్టిలో మమ్మల్ని నిందకూ ఎగతాళికీ పరిహాసానికీ కారణంగా చేశావు. మా చుట్టూ ఉన్న దేశాల్లో మమ్మల్ని ఒక అవమానంగా, ప్రజలు తల ఊపి హేళన చేయడానికి కారణంగా చేశావు. పరిహాసం, అవమానం చేసే వాళ్ళ కారణంగా, పగ తీర్చుకునే శత్రువు కారణంగా ఆ అవమానమే రోజంతా నా ఎదుట ఉంది. నా ముఖంలో కనిపించే అవమానం నన్ను నిలువెల్లా కప్పివేస్తున్నది. ఇదంతా మాకు జరిగినా మేము మాత్రం నిన్ను మర్చిపోలేదు. నీ నిబంధనను అతిక్రమించలేదు. మా హృదయం నిన్ను విడిచి వెనక్కి మళ్ళలేదు. మా అడుగులు నీ మార్గాన్ని విడువలేదు. కానీ నువ్వు నక్కలు తిరిగే చోట మమ్మల్ని తీవ్రంగా విరగ్గొట్టావు. చావునీడ కింద మమ్మల్ని కప్పి ఉంచావు. ఒకవేళ మేము మా దేవుడి నామాన్ని మర్చిపోయి అన్య దేవతల వైపు మా చెయ్యి చాపితే హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఇది తెలుసుకోకుండా ఉంటాడా? కచ్చితంగా మేము నీ కోసం రోజంతా వధకు గురౌతున్నాం. వధించడం కోసం ప్రత్యేకించిన గొర్రెల్లాగా ఉన్నాము. ప్రభూ, నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు? నిద్ర మేలుకో, మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టకు. నీ ముఖాన్ని మాకెందుకు చాటు చేసుకుంటున్నావు? మా వేదననూ మాకు కలిగే హింసనూ మర్చిపోయావెందుకు? మా ప్రాణం నేల వరకూ కుంగి పోయింది. మా శరీరం నేలకు కరచుకుని ఉంది. మాకు సహాయం చేయడానికి లే. నీ నిబంధన కృపను బట్టి మమ్మల్ని విమోచించు.
కీర్తనలు 44:1-26 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నిన్ను గూర్చి మేము విన్నాము. మా పూర్వీకుల కాలంలో నీవు చేసిన కార్యాలను గూర్చి మా తండ్రులు మాతో చెప్పారు. చాలా కాలం క్రిందట నీవు చేసిన వాటిని గూర్చి వారు మాతో చెప్పారు. దేవా, నీ మహా శక్తితో ఇతరుల నుండి ఈ దేశాన్ని నీవు తీసుకొన్నావు. మరియు మా తండ్రులను ఇక్కడ ఉంచావు. ఆ విదేశీ ప్రజలను నీవు చితుకగొట్టావు. వారు ఈ దేశం వదిలిపెట్టేలా బలవంతం చేశావు. నీవు మా తండ్రులను స్వతంత్రులుగా చేశావు. ఈ దేశాన్ని మా తండ్రుల ఖడ్గాలు స్వాధీనం చేసికోలేదు. వారిని విజేతలుగా చేసింది వారి బలమైన హస్తాలు కావు. నీవు మా తండ్రులకు తోడుగా ఉన్న కారణం చేతనే అది జరిగింది. దేవా, నీ మహా శక్తి మా తండ్రులను రక్షించింది. ఎందుకంటే వారిని నీవు ప్రేమించావు గనుకనే! నా దేవా, నీవు నా రాజువు. నీ ఆజ్ఞలే యాకోబు ప్రజలను విజయానికి నడిపించాయి. నా దేవా, నీ సహాయంతో మా శత్రువులను మేము వెనుకకు త్రోసివేసాము. నీ నామంతో, మా శత్రువుల మీదుగా మేము నడిచాము. నా విల్లును, బాణాలను నేను నమ్ముకోను. నా ఖడ్గం నన్ను రక్షించజాలదు. దేవా, మా విరోధుల నుండి నీవు మమ్మల్ని రక్షించావు. మా శత్రువుల్ని నీవు సిగ్గుపరచావు. మేము ప్రతిరోజూ దేవుని స్తుతిస్తాము! నీ నామాన్ని శాశ్వతంగా మేము స్తుతిస్తాము! కాని, దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టావు. నీవు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు. నీవు మాతో కూడ యుద్ధంలోనికి రాలేదు. మా శత్రువులు మమ్మల్ని వెనుకకు నెట్టివేయనిచ్చావు. మా శత్రువులు మా ఐశ్వర్యాన్ని దోచుకున్నారు. గొర్రెల్ని ఆహారంగా తినుటకు ఇచ్చినట్టు నీవు మమ్మల్నిచ్చి వేశావు. రాజ్యాల మధ్య నీవు మమ్మల్ని చెదరగొట్టావు. దేవా, నీ ప్రజలను నీవు విలువ లేకుండా అమ్మివేశావు. ధర విషయం నీవేమీ వాదించలేదు. మా యిరుగు పొరుగు వారికి నీవు మమ్మల్ని హాస్యాస్పదం చేశావు. మా యిరుగు పొరుగు వారు మమ్మల్ని చూచి నవ్వుతూ హేళన చేస్తారు. మేము ప్రజలు చెప్పుకొనే హాస్యాస్పద కథలలో పాత్రల్లా ఉన్నాము. ప్రజలు మమ్మల్ని చూచి నవ్వుతూ వారి తలలు ఊపుతారు. నేను సిగ్గుతో కప్పబడి ఉన్నాను. రోజంతా నా అవమానాన్ని నేను చూస్తున్నాను. నా శత్రువు నన్ను ఇబ్బంది పెట్టాడు. నా శత్రువు నన్ను హేళన చేయడం ద్వారా నా మీద కక్ష సాధిస్తున్నాడు. దేవా, మేము నిన్ను మరచిపోలేదు. అయినప్పటికీ వాటన్నిటినీ నీవు మాకు చేస్తున్నావు. మేము నీతో మా ఒడంబడికపై సంతకం చేసినప్పుడు మేము అబద్ధమాడలేదు! దేవా, మేము నీ నుండి తిరిగిపోలేదు. నిన్ను అనుసరించటం మేము మానుకోలేదు. కాని, దేవా, నక్కలు నివసించే ఈ స్థలంలో నీవు మమ్మల్ని చితుక గొట్టావు. మరణం అంత చీకటిగా ఉన్న ఈ స్థలంలో నీవు మమ్మల్ని కప్పివేశావు. మా దేవుని పేరు మేము మరచిపోయామా? అన్యదేవతలకు మేము ప్రార్థించామా? లేదు! నిజంగా ఈ విషయాలు దేవునికి తెలుసు. లోతైన రహస్యాలు సహితం ఆయనకు తెలుసు. దేవా, నీకోసం ప్రతి రోజూ చంపబడుతున్నాము! చంపటానికి నడిపించబడే గొర్రెల్లా ఉన్నాము మేము. నా ప్రభువా, లెమ్ము! నీవేల నిద్రపోతున్నావు? లెమ్ము! మమ్ముల్ని శాశ్వతంగా విడిచిపెట్టకుము! దేవా, మానుండి నీవేల దాక్కుంటున్నావు? మా బాధ, కష్టాలు నీవు ఎందుకు మరచిపోయావు? బురదలోకి మేము త్రోసివేయబడ్డాము. మేము దుమ్ములో బోర్లాపడి ఉన్నాము. దేవా, లేచి మాకు సహాయం చేయుము! నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని రక్షించుము.
కీర్తనలు 44:1-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసినపనినిగూర్చి మేము చెవులార విని యున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలముచేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచు కొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియేవారికి విజయము కలుగజేసెను. దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము. నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కి వేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించు వాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. (సెలా.) అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు. శత్రువులయెదుట నిలువకుండ మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టమువచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు. భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱెలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే నీవే నీ ప్రజలను అమ్మి యున్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పద ముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణ ముగాను మమ్మును ఉంచియున్నావు. అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు. నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులనుబట్టియు పగ తీర్చుకొనువారినిబట్టియు నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మా చేతులు చాపియున్నయెడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడు చున్నాము ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము. నీ ముఖమును నీ వేల మరుగుపరచియున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి యున్నావు? మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పెట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.