కీర్తనలు 42:9-11
కీర్తనలు 42:9-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా కొండ అయిన దేవునితో, “మీరు నన్నెందుకు మరచిపోయారు? శత్రువులు నన్ను అణగద్రొక్కుతుంటే శోకంతో నేనెందుకిలా వెళ్లాలి?” అని మొరపెట్టాను. రోజుంతా అదే పనిగా నా విరోధులు, “మీ దేవుడెక్కడ?” అని అంటూ నన్ను గేలి చేస్తూ ఉంటే నా ఎముకలు మరణ బాధ అనుభవిస్తున్నాయి. నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.
కీర్తనలు 42:9-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా ఆశ్రయశిల అయిన దేవునితో ఇలా అంటాను. నువ్వు నన్నెందుకు మర్చిపోయావు? శత్రువు నన్ను అణగదొక్కుతూ ఉంటే నేను రోదిస్తూ ఎందుకు తిరగాలి? నీ దేవుడు ఏమయ్యాడని నా శత్రువులు నన్ను ప్రశ్నిస్తూ ఉంటే అది నా ఎముకల్లో బాకులాగా గుచ్చుకుంటుంది. నా ప్రాణమా, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? అంతరంగంలో నువ్వు ఎందుకు ఆందోళనపడుతున్నావు? దేవునిలో నమ్మకం ఉంచు. ఆయన సన్నిధి సహాయం కోసం నేను ఆయన్ని స్తుతిస్తాను.
కీర్తనలు 42:9-11 పవిత్ర బైబిల్ (TERV)
ఆశ్రయ బండ అయిన నా దేవునితో, “యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు? నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను. నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు. “నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు. నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను? నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను? దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి. నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది. నా సహాయమా! నా దేవా!
కీర్తనలు 42:9-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కావున–నీవేల నన్ను మరచియున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. –నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు.వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.