కీర్తనలు 40:1-17

కీర్తనలు 40:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా కోసం ఓర్పుతో ఎదురుచూశాను; ఆయన నా వైపు తిరిగి నా మొరను ఆలకించారు. నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకి లేపారు, బురద ఊబిలో నుండి లేపి నా పాదాలను బండ మీద నిలిపారు. నిలబడడానికి నాకు స్థిరమైన స్థలాన్ని ఇచ్చారు. మన దేవునికి ఒక స్తుతి పాటను, ఆయన నా నోట ఒక క్రొత్త పాట ఉంచారు. అనేకులు ఆయన చేసింది చూసి ఆయనకు భయపడతారు. వారు యెహోవాలో నమ్మకం ఉంచుతారు. గర్విష్ఠుల వైపు చూడక అబద్ధ దేవుళ్ళ వైపు తిరుగక, యెహోవాలో నమ్మకముంచినవారు ధన్యులు. యెహోవా నా దేవా, మీరు మాకోసం ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ప్రణాళికలు వేశారు. మీతో పోల్చదగిన వారు లేరు; మీ క్రియల గురించి నేను చెప్పాలనుకుంటే అవి లెక్కకు మించినవి. బలిని అర్పణను మీరు కోరలేదు, కాని మీరు నా చెవులు తెరిచారు, హోమాలు పాపపరిహార బలులు మీరు కోరలేదు. అప్పుడు నేను ఇలా అన్నాను, “ఇదిగో నేను ఉన్నాను. గ్రంథపుచుట్టలో నా గురించి వ్రాసి ఉంది. నా దేవా, మీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం; మీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది.” యెహోవా! మీకు తెలిసినట్టుగా, నేను నా పెదవులు మూసుకోకుండ మహా సమాజంలో మీ నీతిని గురించిన సువార్త ప్రకటించాను. మీ నీతిని నా హృదయంలో నేనేమి దాచుకోను; మీ విశ్వసనీయతను మీ రక్షణ సహాయాన్ని గురించి నేను మాట్లాడతాను. మీ మారని ప్రేమను, మీ నమ్మకత్వాన్ని గురించి మహా సమాజానికి చెప్పకుండ దాచిపెట్టను. యెహోవా, మీ కరుణను నాకు దూరం చేయకండి; మీ మారని ప్రేమ మీ విశ్వాస్యత నిత్యం నన్ను కాపాడును గాక. లెక్కలేనన్ని ఆపదలు నన్ను చుట్టి ఉన్నాయి; నా పాపాలు నన్ను పట్టుకున్నాయి, నేనేమి చూడలేని స్థితిలో ఉన్నాను. అవి నా తలవెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి, నా గుండె చెదిరిపోతుంది. యెహోవా, సంతోషంగా నన్ను రక్షించడానికి, యెహోవా నాకు సాయం చేయడానికి త్వరగా రండి. నా ప్రాణం తీయాలని కోరేవారందరు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి. నన్ను చూసి, “ఆహా! ఆహా!” అనేవారు వారికి కలిగే అవమానానికి ఆశ్చర్యానికి గురి కావాలి. అయితే మిమ్మల్ని వెదికేవారంతా మీలో ఆనందించి సంతోషించాలి; మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, “యెహోవా గొప్పవాడు!” అని అనాలి. కాని నా మట్టుకైతే, నేను దీనుడను, అవసరతలో ఉన్నవాడను; ప్రభువు నా గురించి ఆలోచించుదురు గాక. మీరే నా సహాయం, నా విమోచకుడు; మీరే నా దేవుడు, ఆలస్యం చేయకండి.

కీర్తనలు 40:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా కోసం నేను సహనంతో వేచి ఉన్నాను. ఆయన నా మాటలు విన్నాడు. నా మొర ఆలకించాడు. భీకరమైన గుంటలో నుండి, జారుడు మట్టితో నిండి ఉన్న ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. నా పాదాలను రాయిపై నిలబెట్టాడు. నా అడుగులు స్థిరం చేశాడు. తనకు స్తుతులు చెల్లించే ఒక కొత్త పాటను మన దేవుడు నా నోట్లో ఉంచాడు. అనేకమంది దాన్ని చూసి ఆయన్ని కీర్తిస్తారు. యెహోవాలో నమ్మకముంచుతారు. యెహోవాను నమ్ముకోకుండా అబద్దాలను నమ్మేవాళ్ళనూ అహంకారులనూ పట్టించుకోకుండా యెహోవానే తన ఆధారంగా చేసుకున్న వాడు ధన్యజీవి. యెహోవా నా దేవా, నువ్వు చేసిన ఆశ్చర్యకరమైన పనులు అసంఖ్యాకంగా ఉన్నాయి. మా కోసం నీకున్న ఆలోచనలు లెక్కించడానికి వీల్లేనంత ఉన్నాయి. ఒకవేళ నేను వాటి గురించి చెప్పాలనుకుంటే అవి లెక్కకు అందనంత ఎక్కువ ఉన్నాయి. నీకు బలులన్నా, నైవేద్యాలన్నా సంతోషం ఉండదు. అయితే నువ్వు నా చెవులు తెరిచావు. దహన బలులుగానీ పాపం కోసం చేసే బలులు గానీ నీకు అక్కర లేదు. అప్పుడు నేను ఇలా చెప్పాను. ఇదిగో, నేను వచ్చాను. గ్రంథం చుట్టలో నా గురించి రాసిన దాని ప్రకారం నేను వచ్చాను. నా దేవా, నీ సంకల్పాన్ని నెరవేర్చడం నాకు సంతోషం. నేను నీతిని గూర్చిన శుభవార్తను మహా సమాజంలో ప్రకటించాను. యెహోవా, అది నీకు తెలుసు. నీ నీతిని నా హృదయంలో దాచుకుని ఉండలేదు. నీ విశ్వసనీయతనూ, నీ ముక్తినీ నేను ప్రకటించాను. నీ నిబంధన కృపనూ, నీ విశ్వసనీయతనూ మహా సమాజానికి ప్రకటించకుండా నేను దాచలేదు. యెహోవా, నా కోసం నువ్వు కనికరంతో చేసే పనులను నా నుండి దూరం చేయకు. నీ నిబంధన కృప, నీ విశ్వసనీయత ఎప్పుడూ నన్ను కాపాడనీ. అసంఖ్యాకమైన ఆపదలు నన్ను చుట్టుముట్టాయి. నా దోషాలు నన్ను తరిమి పట్టుకున్నాయి. దాంతో నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను. అవి నా తల వెంట్రుకలకంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. నా గుండె జారిపోయింది. యెహోవా, దయచేసి నన్ను కాపాడు. నాకు సహాయం చేయడానికి వేగిరపడు. నా ప్రాణం తీయాలని నా వెంటపడే వాళ్ళు సిగ్గుపడేలా, అయోమయానికి గురయ్యేలా చెయ్యి. నన్ను గాయపరచాలని చూసేవాళ్ళు వెనక్కి మళ్లేలా, అవమానానికి గురయ్యేలా చెయ్యి. నన్ను చూసి ఆహా, ఆహా అనే వాళ్ళు తమకు కలిగిన అవమానం చూసి విభ్రాంతి చెందాలి. నీ కోసం చూసే వాళ్ళంతా నీలో సంతోషించి, ఆనందిస్తారు గాక! నీ రక్షణను ప్రేమించే వాళ్ళంతా “యెహోవాకు స్తుతి” అని చెబుతారు గాక! నేను పేదవాణ్ణి. అవసరాల్లో ఉన్నాను. అయినా ప్రభువు నా గురించి ఆలోచిస్తున్నాడు. నా సహాయం నువ్వే. నన్ను కాపాడటానికి నువ్వు వస్తావు. నా దేవా, ఆలస్యం చేయకు.

కీర్తనలు 40:1-17 పవిత్ర బైబిల్ (TERV)

నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను. నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు. నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు. ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు. ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు. ఆయన నా పాదాలను స్థిరపరచాడు. ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను యెహోవా నా నోట ఉంచాడు. నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు. వారు యెహోవాను నమ్ముకొంటారు. ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు. ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు. యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు. మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు. నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను. నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి. యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు. బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు. దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు. అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను. నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది. నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను. నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.” మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను. యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు. యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను. ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను. యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను. నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను. కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు. నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము. దుష్టులు నన్ను చుట్టుముట్టారు. లెక్కించాలంటే వారు చాలా మంది ఉన్నారు. నా పాపాలు నన్ను పట్టుకొన్నాయి. నేను వాటిని తప్పించుకోలేను. నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కువగా ఉన్నాయి. నేను ధైర్యాన్ని కోల్పోయాను. యెహోవా, నా దగ్గరకు వేగంగా వచ్చి నన్ను రక్షించుము. త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము. ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు. యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము. ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము. ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు. వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడనిమ్ము. కాని నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము. “యెహోవాను స్తుతించుము.” అని ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం. ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని. యెహోవా, నన్ను గూర్చి ఆలోచించుము. నాకు సహాయం చేయుము. నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.

కీర్తనలు 40:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను. నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగఊబిలోనుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను. తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహనబలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు–పుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊర కుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగుచేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల యెత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తలవెండ్రుకలను మించియున్నవి నా హృదయము అధైర్యపడి యున్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక నాకు కీడుచేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక. నన్ను చూచి–ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయ మొందుదురు గాక. నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక నీ రక్షణ ప్రేమించువారు–యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము.

కీర్తనలు 40:1-17

కీర్తనలు 40:1-17 TELUBSIకీర్తనలు 40:1-17 TELUBSI