కీర్తనలు 27:7-12

కీర్తనలు 27:7-12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా, నేను మొరపెట్టినప్పుడు నా స్వరాన్ని ఆలకించండి; నాపై కరుణ చూపించి నాకు జవాబివ్వండి. “ఆయన ముఖాన్ని వెదకు!” అని నా హృదయం మీ గురించి అంటుంది, యెహోవా, మీ ముఖాన్ని నేను వెదకుతాను. మీ ముఖాన్ని నా నుండి దాచకండి, కోపంతో మీ దాసున్ని త్రోసివేయకండి; మీరే నాకు సహాయము. దేవా నా రక్షకా, నన్ను త్రోసివేయకండి నన్ను విడిచిపెట్టకండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తారు. యెహోవా, మీ మార్గం నాకు బోధించండి; నాకు విరోధులు మాటున పొంచి ఉన్నారు, కాబట్టి మీరే నన్ను సరియైన దారిలో నడిపించాలి. నా శత్రువుల కోరికకు నన్ను అప్పగించకండి, ఎందుకంటే అబద్ధ సాక్షులు నామీదికి లేచి, హానికరమైన ఆరోపణలను చేస్తున్నారు.

కీర్తనలు 27:7-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా, నేను స్వరమెత్తి నిన్ను అడిగినప్పుడు నా మనవి ఆలకించు. నన్ను కరుణించి నాకు జవాబివ్వు. ఆయన ముఖాన్ని వెదుకు! అని నీ గురించి నా హృదయం అంటుంది, యెహోవా, నేను నీ ముఖం వెదుకుతాను. నా నుంచి నీ ముఖం దాచకు. కోపంతో నీ సేవకుణ్ణి దెబ్బ కొట్టకు! నా సహాయకుడిగా నువ్వే ఉన్నావు, రక్షణకర్తవైన నా దేవా, నన్ను విడువకు, నన్ను విడిచి వెళ్ళకు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తాడు. యెహోవా, నీ మార్గం నాకు బోధించు. నా శత్రువుల నిమిత్తం సమతలంగా ఉన్న దారిలో నన్ను నడిపించు. శత్రువులకు నా ప్రాణం అప్పగించకు. ఎందుకంటే అబద్ధ సాక్షులు నా మీదకి లేచారు, వాళ్ళు హింస వెళ్లగక్కుతున్నారు!

కీర్తనలు 27:7-12 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము. నా మీద దయ చూపించుము. యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది. వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను. యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము. కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు. నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు. నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు. అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు. యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము. సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము. నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు. నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు.

కీర్తనలు 27:7-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా, నేను కంఠధ్వని యెత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా –యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నాకొరకు పొంచియున్నవారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధసాక్షులును క్రూరత్వము వెళ్లగ్రక్కువారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకుము