కీర్తనలు 26:1-12 - Compare All Versions

కీర్తనలు 26:1-12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించు చున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను నమ్మిక యుంచియున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షిం చుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశో ధించుము. నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను పనికిమాలినవారితో నేను సాంగత్యముచేయను వేషధారులతో పొందుచేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యముచేయను నిర్దోషినని నా చేతులు కడుగుకొందును యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్యకార్యములను వివరింతును. యెహోవా, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించు చున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవువారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యెహోవాను స్తుతించెదను.

షేర్ చేయి
కీర్తనలు 26 TELUBSI

కీర్తనలు 26:1-12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా, నేను నిజాయితీగా నడుచుకున్నాను. నాకు న్యాయం తీర్చు. ఊగిసలాడకుండా యెహోవాలో నా నమ్మకం ఉంచాను. యెహోవా, నన్ను పరిశీలించు. నన్ను పరీక్షించు. నా అంతరంగంలో, నా హృదయంలో ఉన్న స్వచ్ఛతను పరీక్షించు. నీ నిబంధన నమ్మకత్వం నా కళ్ళెదుట ఉంది. నీ సత్యంలో నేను నడుచుకుంటున్నాను. మోసగాళ్లతో నేను సాంగత్యం చెయ్యను. నిజాయితీ లేని వాళ్ళతో నేను కలిసి ఉండను. దుష్టుల గుంపు నాకు అసహ్యం, దుర్మార్గులతో నేను సహవాసం చెయ్యను. నేను నిర్దోషిగా నా చేతులు కడుక్కుంటాను. యెహోవా, నేను నీ బలిపీఠం వైపు తిరుగుతాను. అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తాను. నీ మహిమ నిలిచే స్థలం, యెహోవా, నువ్వు నివాసం ఉంటున్న నీ ఇల్లు నాకెంతో ఇష్టం. పాపులతో పాటు నా ప్రాణం, క్రూరులతో పాటు నా జీవం ఊడ్చి వేయకు. వాళ్ళ చేతుల్లో ఒక కుట్ర ఉంది. వాళ్ళ కుడిచెయ్యి లంచాలతో నిండి ఉంది. కాని నా వరకైతే నేను నిజాయితీగా నడుచుకుంటాను. నన్ను విమోచించి నన్ను కరుణించు. చదునైన చోట నా పాదం నిలిపాను. సభలలో నేను యెహోవాను స్తుతిస్తాను.

షేర్ చేయి
కీర్తనలు 26 IRVTEL

కీర్తనలు 26:1-12 TERV (పవిత్ర బైబిల్)

యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము. యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు. యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి. నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశితంగా చూడుము. నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను. నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను. పనికిమాలిన ఆ మనుష్యుల్లో నేను ఒకడ్ని కాను. ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం. ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను. యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను. నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను. యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను. నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను. యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ. మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను. యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము. ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము. ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి. చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచం తీసుకొంటారు. కాని నేను నిర్దోషిని. కనుక దేవా, నన్ను కరుణించి, రక్షించుము. నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను. యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.

షేర్ చేయి
కీర్తనలు 26 TERV

కీర్తనలు 26:1-12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యెహోవా, నేను నిందారహితునిగా జీవించాను, నాకు న్యాయం తీర్చండి; నేను ఏ సందేహం లేకుండ యెహోవాను నమ్మాను. యెహోవా, నన్ను పరిశీలించండి, నన్ను పరీక్షించండి, నా హృదయాన్ని నా మనస్సును పరీక్షించండి; నేను నిరంతరం మీ మారని ప్రేమను జ్ఞాపకముంచుకుంటాను మీ సత్యానికి అనుగుణంగా నడుచుకుంటాను. నేను మోసగాళ్ళతో కూర్చోను, వేషధారులతో నేను సహవాసం చేయను. కీడుచేసేవారి గుంపు నాకు అసహ్యం దుష్టులతో నేను కూర్చోను. యెహోవా, నిర్దోషినని నా చేతులు కడుక్కుని, బిగ్గరగా మీ స్తుతిని ప్రకటిస్తూ మీ అద్భుత క్రియలన్నిటిని గురించి చెబుతూ మీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను. యెహోవా, మీరు నివసించే ఆవరణం, మీ మహిమ నివసించే స్థలం అంటే నాకు ఇష్టము. పాపులతో పాటు నా ప్రాణాన్ని నరహంతకులతో పాటు నా బ్రతుకును తుడిచివేయకండి. వారి చేతుల్లో దుష్ట పన్నాగాలు ఉన్నాయి, వారి కుడి చేతులు లంచాలతో నిండి ఉన్నాయి. నేను నిందారహితంగా బ్రతుకుతాను; నన్ను విమోచించండి నన్ను కరుణించండి. నా పాదాలను సమతలమైన నేల మీద నిలిపాను; గొప్ప సమాజాలలో నేను యెహోవాను స్తుతిస్తాను.

షేర్ చేయి
కీర్తనలు 26 TSA