కీర్తనలు 25:5-17

కీర్తనలు 25:5-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మీ సత్యంలో నన్ను నడిపించి నాకు బోధించండి, మీరే నా రక్షకుడవైన నా దేవుడవు, మీ కోసమే రోజంతా నిరీక్షిస్తాను. యెహోవా, మీ కరుణ, మీ మారని ప్రేమ జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే, అవి అనాది కాలంనాటి నుండి ఉన్నాయి. యవ్వనంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను జ్జాపకముంచుకోండి. ఎందుకంటే యెహోవా మీరు మంచివారు. యెహోవా మంచివాడు యథార్థవంతుడు; కాబట్టి తన మార్గాలను పాపులకు బోధిస్తారు. న్యాయమైన మార్గాల్లో దీనులను నడిపిస్తారు, తన మార్గాలను వారికి బోధిస్తారు. తన నిబంధనలను శాసనాలను పాటించేవారి విషయంలో యెహోవా మార్గాలు, ఆయన మారని ప్రేమ నమ్మదగినవి. యెహోవా, నా దోషం ఘోరమైనది మీ నామం కోసం నా దోషాన్ని క్షమించండి. అప్పుడు యెహోవాకు భయపడేవారికి వారు కోరుకోవలసిన మార్గాలను ఆయన బోధిస్తారు. వారు క్షేమం కలిగి జీవిస్తారు, వారి వారసులు భూమిని వారసత్వంగా పొందుతారు. ఆయన పట్ల భయభక్తులు గలవారికి యెహోవా రహస్యాలు తెలుస్తాయి; ఆయన తన నిబంధనను వారికి తెలియపరుస్తారు. నా కళ్లు ఎప్పుడూ యెహోవా మీద ఉన్నాయి, ఎందుకంటే ఆయన మాత్రమే వలలో నుండి నా పాదాలు విడిపిస్తారు. నా వైపు తిరిగి నాపై దయ చూపండి, నేను ఒంటరి వాడను, బాధింపబడ్డాను. నా హృదయంలో ఉన్న ఇబ్బందులు తొలగించండి నా వేదన నుండి విడిపించండి.

కీర్తనలు 25:5-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నీ సత్యంలోకి నన్ను నడిపించి నాకు బోధించు, ఎందుకంటే నువ్వే నా రక్షణకర్తవైన దేవుడివి. రోజంతా నేను నీ కోసం కనిపెడతాను. యెహోవా, నీ కరుణతో, నిబంధన నమ్మకత్వంతో నువ్వు చేసిన పనులు గుర్తు చేసుకో. ఎందుకంటే అవి ఎప్పుడూ నిలిచి ఉన్నాయి. బాల్యంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనం గుర్తు చేసుకోవద్దు. యెహోవా, నీ మంచితనంతో, నీ నిబంధన నమ్మకత్వంతో నన్ను గుర్తు చేసుకో. యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు. దీనులను న్యాయంగా నడిపిస్తాడు, దీనులకు తన మార్గం బోధిస్తాడు. ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనాలు పాటించిన వాళ్లకు యెహోవా త్రోవలన్నీ నిబంధన నమ్మకత్వంతోనూ, విశ్వసనీయతతోనూ నిర్మాణం అయ్యాయి. యెహోవా, నీ నామాన్నిబట్టి నా పాపం క్షమించు. ఎందుకంటే అది చాలా ఘోరం. యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాడు ఎవరు? అతడు కోరుకోవలసిన మార్గం ఆయన అతనికి నిర్దేశిస్తాడు. అతని ప్రాణం సంతోషంగా ఉంటుంది. అతని సంతానం దేశానికి వారసులవుతారు. ఆయనపట్ల భయభక్తులు గల వారికి యెహోవా ఆలోచన తెలుస్తుంది, ఆయన తన నిబంధన వాళ్లకు తెలియజేస్తాడు. నా కళ్ళు ఎప్పుడూ యెహోవా మీదే ఉన్నాయి, ఎందుకంటే ఆయన నా పాదాలను వలలోనుంచి విడిపిస్తాడు. నా వైపు తిరిగి నన్ను కరుణించు, ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి, బాధ పొందినవాణ్ణి. నా హృదయవేదనలు అతి విస్తారం. అమితమైన బాధ నుంచి నన్ను బయటకు లాగు.

కీర్తనలు 25:5-17 పవిత్ర బైబిల్ (TERV)

నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము. నీవు నా దేవుడవు, నా రక్షకుడవు. రోజంతా నేను నిన్ను నమ్ముతాను. యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము. నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు. యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము. యెహోవా నిజంగా మంచివాడు. జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు. దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు. న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు. యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి. యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను. కాని, నీ మంచితనం చూపించుటకు గాను, నేను చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు. ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరుకొంటే అప్పుడు శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు. ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు. అతనికిస్తానని దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆ వ్యక్తి పిల్లలు వారసత్వంగా పొందుతారు. యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు. ఆయన తన అనుచరులకు తన ఒడంబడికను ఉపదేశిస్తాడు. నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి. ఆయన నన్ను ఎల్లప్పుడూ నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు. యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను. నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము. నా కష్టాలనుంచి నన్ను విడిపించుము. నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము.

కీర్తనలు 25:5-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసికొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వమునుండి యున్నవే గదా. నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము. యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగి యున్నది ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను నావైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.

కీర్తనలు 25:5-17

కీర్తనలు 25:5-17 TELUBSI