కీర్తనలు 22:16-31
కీర్తనలు 22:16-31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కుక్కలు నా చుట్టూ గుమికూడాయి, దుష్టుల మూక నా చుట్టూ మూగింది; వారు నా చేతుల్లో నా పాదాల్లో పొడిచారు. నా ఎముకలన్నీ బయటకు కనబడుతున్నాయి; ప్రజలు నన్ను చూస్తూ ఎగతాళిగా నవ్వుతున్నారు. నా వస్త్రాలు పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేస్తారు. అయితే, యెహోవా మీరు నాకు దూరంగా ఉండకండి. మీరే నాకు బలం; నాకు సాయం చేయడానికి త్వరగా రండి. ఖడ్గం నుండి నన్ను విడిపించండి, కుక్కల బలం నుండి నా విలువైన ప్రాణాన్ని కాపాడండి. సింహాల నోటి నుండి నన్ను కాపాడండి; అడవి దున్నల కొమ్ముల నుండి నన్ను విడిపించండి. నేను మీ నామాన్ని నా ప్రజలకు ప్రకటిస్తాను; సమాజంలో మిమ్మల్ని స్తుతిస్తాను. యెహోవాకు భయపడేవారలారా, ఆయనను స్తుతించండి. యాకోబు సర్వ వంశస్థులారా, ఆయనను ఘనపరచండి! ఇశ్రాయేలు సర్వ వంశస్థులారా, ఆయనను పూజించండి. బాధితుల శ్రమను ఆయన తృణీకరించలేదు వారిని చూసి అసహ్యపడలేదు; ఆయన ముఖం వారి నుండి దాచలేదు. ఆయన వారి మొర ఆలకించారు. మహా సమాజంలో మీకే నేను స్తుతి చెల్లిస్తాను; మీకు భయపడు వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెలిస్తాను. దీనులు తృప్తిగా భోజనం చేస్తారు; యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతిస్తారు, మీ హృదయాలు నిత్యం ఆనందిస్తాయి. భూనివాసులందరూ యెహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరుగుతారు, దేశాల్లోని కుటుంబాలన్నీ ఆయనకు నమస్కారం చేస్తాయి. రాజ్యాధికారం యెహోవాదే ఆయనే దేశాలను పరిపాలిస్తారు. లోకంలోని ధనికులంతా విందు చేస్తూ ఆరాధిస్తారు; తమ ప్రాణాలు కాపాడుకోలేక మట్టిలో కలిసిపోయే వారంతా ఆయన ఎదుట మోకరిస్తారు. ఒక తరం వారు ఆయనను సేవిస్తారు; రాబోయే తరాలకు ప్రభువు గురించి చెబుతారు. వారు వచ్చి ఆయన చేసిన కార్యాల గురించి, ఇంకా పుట్టని ప్రజలకు చెప్పి ఆయన నీతిని తెలియజేస్తారు!
కీర్తనలు 22:16-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కుక్కలు నన్ను చుట్టుముట్టాయి, దుష్టులు గుంపుగూడి నన్ను ఆవరించారు. వాళ్ళు నా చేతులను నా పాదాలను పొడిచారు. నా ఎముకలన్నీ నేను లెక్కపెట్టగలను. వాళ్ళు నా వైపు తేరి చూస్తున్నారు. నా వస్త్రాలు పంచుకుంటున్నారు. నా అంగీ కోసం చీట్లు వేస్తున్నారు. యెహోవా, దూరంగా ఉండకు. నా బలమా, త్వరపడి నాకు సహాయం చెయ్యి. ఖడ్గం నుంచి నా ప్రాణాన్ని, కుక్కల పంజాలనుంచి నా విలువైన ప్రాణాన్ని రక్షించు. సింహం నోటి నుండి నన్ను రక్షించు. అడవిదున్న కొమ్ములనుంచి నన్ను రక్షించు. నీ నామం నా సోదరులకు ప్రచారం చేస్తాను. సమాజం మధ్య నిన్ను స్తుతిస్తాను. యెహోవా పట్ల భయం ఉన్నవారలారా, ఆయన్ని స్తుతించండి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని ఘనపరచండి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని చూసి విస్మయం చెందండి. ఆయన బాధపడే వాళ్ళ బాధను తృణీకరించలేదు, వాళ్ళను చూసి ఆయన అసహ్యపడలేదు. అతనినుంచి తన ముఖం దాచుకోలేదు. బాధలో ఉన్నవాడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించాడు. మహా సమాజంలో నీ నుండి నా స్తుతి వస్తుంది. ఆయనపట్ల భయభక్తులు కలిగిన వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లిస్తాను. బాధితులు భోజనం చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదికేవాళ్ళు ఆయనను స్తుతిస్తారు. వారి హృదయాలు శాశ్వతకాలం జీవిస్తాయి గాక. భూనివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా వైపు తిరుగుతారు. జాతుల కుటుంబాలన్నీ ఆయన ఎదుట వంగి నమస్కారం చేస్తాయి. ఎందుకంటే రాజ్యం యెహోవాదే. జాతులను పాలించేవాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుతున్న వాళ్ళందరూ ఆరాధిస్తారు. తమ సొంత ప్రాణాలు కాపాడుకోలేని వాళ్ళు, మట్టిలోకి దిగిపోతున్న వాళ్ళందరూ ఆయన ఎదుట వంగి నమస్కరిస్తారు. రానున్న ఒక తరం వాళ్ళు ఆయన్ని సేవిస్తారు. తమ తరవాతి తరానికి ప్రభువును గురించి చెబుతారు. వాళ్ళు వచ్చి ఆయన న్యాయ విధానం గురించి చెబుతారు. ఆయన క్రియలను ఇంకా పుట్టని వారికి చెబుతారు!
కీర్తనలు 22:16-31 పవిత్ర బైబిల్ (TERV)
“కుక్కలు” నా చుట్టూరా ఉన్నాయి. ఆ దుష్టుల దండు నన్ను చుట్టు ముట్టింది. సింహంలాగా వారు నా చేతుల్ని, నా పాదాలను గాయపర్చారు. నేను నా ఎముకల్ని చూడగలను. ఆ ప్రజలు నా వైపు తేరి చూస్తున్నారు. వారు నన్ను అలా చూస్తూనే ఉంటారు! ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు. నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు. యెహోవా, నన్ను విడువకుము! నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము! యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము. ప్రశస్తమైన నా ప్రాణాన్ని ఆ కుక్కల నుండి రక్షించుము. సింహం నోటినుండి నన్ను రక్షించుము. ఆబోతు కొమ్ములనుండి నన్ను కాపాడుము. యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను. ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను. యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి. ఇశ్రాయేలు వంశస్థులారా! యెహోవాను ఘనపర్చండి. ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి. ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు. ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు. యెహోవా వారిని ద్వేషించడు. ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు. యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది. నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను. పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు. యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి. మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక! దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని ఆయన వద్దకు తిరిగి వస్తారు. ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే. ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు. నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు. సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తల వంచుతారు. మరియు వారి ప్రాణాలను కాపాడుకొనలేనివారు కూడా తల వంచుతారు. చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తల వంచాలి. భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు. యెహోవా విషయమై వారు నిత్యం చెప్పుతారు. ఇంకా పుట్టని మనుష్యులకు దేవుని మంచితనం గూర్చి చెబుతారు. దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.
కీర్తనలు 22:16-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నా యెముకలన్నియు నేను లెక్కింపగలనువారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములువారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చియున్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ నను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను. మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడె దను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును. భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమిమీద వర్ధిల్లుచున్నవారందరు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరు ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవుతరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు. వారు వచ్చి–ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరతురు.