కీర్తనలు 22:1-31

కీర్తనలు 22:1-31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నా దేవా, నా దేవా! నన్ను ఎందుకు విడిచిపెట్టారు? నన్ను రక్షించకుండ ఎందుకంత దూరంగా ఉన్నారు, వేదనతో కూడిన నా మొరలకు ఎందుకు దూరంగా ఉన్నారు? నా దేవా, పగలు నేను మొరపెడుతున్నాను, కాని మీరు జవాబివ్వడం లేదు, రాత్రి నేను మౌనంగా ఉండడం లేదు. మీరు పరిశుద్ధులు; ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనులై ఉన్నారు. మా పూర్వికులు మిమ్మల్ని విశ్వసించారు; వారి నమ్మకాన్ని బట్టి మీరు వారిని విడిపించారు. వారు మీకు మొరపెట్టి విడుదల పొందారు; మీపట్ల వారు నమ్మకముంచి సిగ్గుపడలేదు. నేను మనిషిని కాను ఒక పురుగును, మనుష్యుల చేత తిరస్కరించబడి, ప్రజలచే అవమానించబడ్డాను. నన్ను చూసినవారందరు నన్ను ఎగతాళి చేస్తారు; వారు వెక్కిరిస్తూ, తలలు ఊపుతూ ఎగతాళి చేస్తారు. “వాడు యెహోవాను నమ్మాడు, యెహోవా వాన్ని విడిపించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తాడు కాబట్టి, ఆయనే వాన్ని విడిపించనివ్వండి” అని వారంటున్నారు. నా తల్లి గర్భం నుండి మీరే నన్ను బయటకు తెచ్చారు; నా తల్లి రొమ్మున ఉన్నప్పుడే మీపై నమ్మకం పుట్టించారు. నేను పుట్టినప్పుడే మీమీద ఆధారపడ్డాను; నా తల్లి గర్భంలో ఉన్నప్పటినుండే మీరే నా దేవుడు. శ్రమ నాకు సమీపంగా ఉంది, నాకు సహాయం చేయడానికి ఒక్కరు లేరు, నాకు దూరంగా ఉండవద్దు. ఎన్నో ఎద్దులు నన్ను చుట్టుముట్టాయి; బాషాను బలమైన ఎద్దులు నన్ను చుట్టూ మూగాయి. గర్జిస్తూ ఎరను చీల్చే సింహాల్లా వారు తమ నోరు పెద్దగా తెరిచారు. నేను నీటిలా పారబోయబడ్డాను, నా ఎముకలు కీళ్ళ నుండి తప్పాయి. నా హృదయం మైనంలా; నాలో కరిగిపోయింది. నా బలం ఎండిన కుండపెంకులా అయింది, నా నాలుక నా అంగిలికి అంటుకుపోయింది; మీరు నన్ను మరణ ధూళిలో పడవేశారు. కుక్కలు నా చుట్టూ గుమికూడాయి, దుష్టుల మూక నా చుట్టూ మూగింది; వారు నా చేతుల్లో నా పాదాల్లో పొడిచారు. నా ఎముకలన్నీ బయటకు కనబడుతున్నాయి; ప్రజలు నన్ను చూస్తూ ఎగతాళిగా నవ్వుతున్నారు. నా వస్త్రాలు పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేస్తారు. అయితే, యెహోవా మీరు నాకు దూరంగా ఉండకండి. మీరే నాకు బలం; నాకు సాయం చేయడానికి త్వరగా రండి. ఖడ్గం నుండి నన్ను విడిపించండి, కుక్కల బలం నుండి నా విలువైన ప్రాణాన్ని కాపాడండి. సింహాల నోటి నుండి నన్ను కాపాడండి; అడవి దున్నల కొమ్ముల నుండి నన్ను విడిపించండి. నేను మీ నామాన్ని నా ప్రజలకు ప్రకటిస్తాను; సమాజంలో మిమ్మల్ని స్తుతిస్తాను. యెహోవాకు భయపడేవారలారా, ఆయనను స్తుతించండి. యాకోబు సర్వ వంశస్థులారా, ఆయనను ఘనపరచండి! ఇశ్రాయేలు సర్వ వంశస్థులారా, ఆయనను పూజించండి. బాధితుల శ్రమను ఆయన తృణీకరించలేదు వారిని చూసి అసహ్యపడలేదు; ఆయన ముఖం వారి నుండి దాచలేదు. ఆయన వారి మొర ఆలకించారు. మహా సమాజంలో మీకే నేను స్తుతి చెల్లిస్తాను; మీకు భయపడు వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెలిస్తాను. దీనులు తృప్తిగా భోజనం చేస్తారు; యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతిస్తారు, మీ హృదయాలు నిత్యం ఆనందిస్తాయి. భూనివాసులందరూ యెహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరుగుతారు, దేశాల్లోని కుటుంబాలన్నీ ఆయనకు నమస్కారం చేస్తాయి. రాజ్యాధికారం యెహోవాదే ఆయనే దేశాలను పరిపాలిస్తారు. లోకంలోని ధనికులంతా విందు చేస్తూ ఆరాధిస్తారు; తమ ప్రాణాలు కాపాడుకోలేక మట్టిలో కలిసిపోయే వారంతా ఆయన ఎదుట మోకరిస్తారు. ఒక తరం వారు ఆయనను సేవిస్తారు; రాబోయే తరాలకు ప్రభువు గురించి చెబుతారు. వారు వచ్చి ఆయన చేసిన కార్యాల గురించి, ఇంకా పుట్టని ప్రజలకు చెప్పి ఆయన నీతిని తెలియజేస్తారు!

కీర్తనలు 22:1-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నా దేవా, నా దేవా, నువ్వు నన్నెందుకు విడిచిపెట్టేశావు? నన్ను రక్షించడానికీ, నా వేదన వాక్కులు వినడానికీ, నువ్వు దూరంగా ఎందుకున్నావు? నా దేవా, పగలు నేను మొరపెడతాను, కాని నువ్వు జవాబివ్వవు. రాత్రివేళ నేను మౌనంగా ఉండను! నువ్వు పవిత్రుడవు. ఇశ్రాయేలు చేసే స్తుతులతో రాజుగా సింహాసనం మీద కూర్చుని ఉంటావు. మా పితరులు నీలో నమ్మకం ఉంచారు. నువ్వు వాళ్ళను రక్షించావు. వాళ్ళు నీకు మొరపెట్టినప్పుడు విడుదల పొందారు. వాళ్ళు నీలో నమ్మకం ఉంచి నిరుత్సాహపడలేదు. కాని నేను మనిషిని కాదు. పురుగును. మనుషుల ద్వేషం అనుభవించాను, మానవాళికి అవమానంగా ఉన్నాను. నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను ఆక్షేపిస్తున్నారు. నన్ను వెక్కిరిస్తూ, నన్ను చూసి తలలు ఆడిస్తున్నారు. అతడు యెహోవాలో నమ్మకం పెట్టుకున్నాడు, యెహోవా అతన్ని రక్షించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తున్నాడు గనక యెహోవా అతన్ని రక్షించనివ్వండి, అని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే గర్భంలోనుంచి నన్ను తీసిన వాడివి నువ్వే. నేను నా తల్లి రొమ్ములపై ఉన్నప్పుడే నీపై నమ్మకం పుట్టించావు. గర్భంలో ఉండగానే నేను నీ మీద ఆధారపడ్డాను. నేను నా తల్లి కడుపులో ఉన్నప్పటినుంచి నువ్వే నా దేవుడివి. ఆపద ముంచుకు వచ్చింది. నాకు దూరంగా ఉండకు. నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. చాలా ఎద్దులు, బలమైన బాషాను దేశపు వృషభాలు నన్ను చుట్టుముట్టాయి. వేటను చీలుస్తూ, గర్జిస్తూ ఉన్న సింహంలాగా వాళ్ళు తమ నోళ్లు పెద్దగా తెరిచారు. నన్ను నీళ్ళలా పారబోస్తున్నారు. నా ఎముకలన్నీ స్థానం తప్పాయి. నా హృదయం మైనంలా ఉంది. నా అంతర్భాగాల్లో అది కరిగిపోతూ ఉంది. నా బలం చిల్లపెంకులా ఎండిపోయింది. నా నాలుక నా దవడకు అంటుకుంటూ ఉంది. మరణ ధూళిలో నువ్వు నన్ను పడుకోబెట్టావు. కుక్కలు నన్ను చుట్టుముట్టాయి, దుష్టులు గుంపుగూడి నన్ను ఆవరించారు. వాళ్ళు నా చేతులను నా పాదాలను పొడిచారు. నా ఎముకలన్నీ నేను లెక్కపెట్టగలను. వాళ్ళు నా వైపు తేరి చూస్తున్నారు. నా వస్త్రాలు పంచుకుంటున్నారు. నా అంగీ కోసం చీట్లు వేస్తున్నారు. యెహోవా, దూరంగా ఉండకు. నా బలమా, త్వరపడి నాకు సహాయం చెయ్యి. ఖడ్గం నుంచి నా ప్రాణాన్ని, కుక్కల పంజాలనుంచి నా విలువైన ప్రాణాన్ని రక్షించు. సింహం నోటి నుండి నన్ను రక్షించు. అడవిదున్న కొమ్ములనుంచి నన్ను రక్షించు. నీ నామం నా సోదరులకు ప్రచారం చేస్తాను. సమాజం మధ్య నిన్ను స్తుతిస్తాను. యెహోవా పట్ల భయం ఉన్నవారలారా, ఆయన్ని స్తుతించండి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని ఘనపరచండి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని చూసి విస్మయం చెందండి. ఆయన బాధపడే వాళ్ళ బాధను తృణీకరించలేదు, వాళ్ళను చూసి ఆయన అసహ్యపడలేదు. అతనినుంచి తన ముఖం దాచుకోలేదు. బాధలో ఉన్నవాడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించాడు. మహా సమాజంలో నీ నుండి నా స్తుతి వస్తుంది. ఆయనపట్ల భయభక్తులు కలిగిన వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లిస్తాను. బాధితులు భోజనం చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదికేవాళ్ళు ఆయనను స్తుతిస్తారు. వారి హృదయాలు శాశ్వతకాలం జీవిస్తాయి గాక. భూనివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా వైపు తిరుగుతారు. జాతుల కుటుంబాలన్నీ ఆయన ఎదుట వంగి నమస్కారం చేస్తాయి. ఎందుకంటే రాజ్యం యెహోవాదే. జాతులను పాలించేవాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుతున్న వాళ్ళందరూ ఆరాధిస్తారు. తమ సొంత ప్రాణాలు కాపాడుకోలేని వాళ్ళు, మట్టిలోకి దిగిపోతున్న వాళ్ళందరూ ఆయన ఎదుట వంగి నమస్కరిస్తారు. రానున్న ఒక తరం వాళ్ళు ఆయన్ని సేవిస్తారు. తమ తరవాతి తరానికి ప్రభువును గురించి చెబుతారు. వాళ్ళు వచ్చి ఆయన న్యాయ విధానం గురించి చెబుతారు. ఆయన క్రియలను ఇంకా పుట్టని వారికి చెబుతారు!

కీర్తనలు 22:1-31 పవిత్ర బైబిల్ (TERV)

నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు. సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు. నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను. కాని నీవు నాకు జవాబు ఇవ్వలేదు. మరియు నేను రాత్రిపూట నీకు మొరపెడుతూనే ఉన్నాను. దేవా, నీవు పవిత్రుడవు. నీవు రాజుగా కూర్చున్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహాసనం. మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు. అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు. మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువుల నుంచి వారు తప్పించుకొన్నారు. వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు. కాని, నేను మనిషిని కానా, పురుగునా? మనుష్యులు నన్ను దూషిస్తారు. ప్రజలు నన్ను ద్వేషిస్తారు. నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు. నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, నన్ను వెక్కిరిస్తారు. వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి. ఒకవేళ ఆయన నిన్ను రక్షిస్తాడేమో! నీవంటే ఆయనకు అంత ఇష్టమైతే అప్పుడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు.” దేవా, నిజంగా నేను నీ మీద ఆధారపడియున్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగినవాడవు నీవే. నేను యింకా నా తల్లి పాలు త్రాగుతూ ఉన్నప్పుడే నీవు నాకు అభయం ఇచ్చావు, ఆదరించావు. నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా ఉన్నావు. నేను నా తల్లి గర్భంలోనుండి వచ్చినప్పటినుండి నేను నీ జాగ్రత్తలోనే ఉంచబడ్డాను. కనుక దేవా, నన్ను విడువకు. కష్టం దగ్గర్లో ఉంది. పైగా నాకు సహాయం చేసేవారు. ఎవ్వరూ లేరు. మనుష్యులు రంకెవేసే ఆబోతుల్లాగా నా చుట్టూ వున్నారు. వారు బలిసిన బాషాను ఆబోతుల వలె నన్ను చుట్టుముట్టియున్నారు. (బాషాను అనగా యొర్దాను నది తూర్పు ప్రాంతం. అది పశువులకు ప్రసిద్ధికెక్కిన ప్రాంతం.) ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారు వారు. వారి నోళ్లు పెద్దగా తెరచుకొని ఉన్నాయి. నేలమీద పోయబడ్డ నీళ్లలా నా బలం పోయినది. నా ఎముకలు విడిపోయాయి. నా ధైర్యం పోయినది. నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా ఉన్నది. నా నాలుక నా అంగిటికి అతుక్కొని పోతోంది. “మరణ ధూళిలో” నీవు నన్ను ఉంచావు. “కుక్కలు” నా చుట్టూరా ఉన్నాయి. ఆ దుష్టుల దండు నన్ను చుట్టు ముట్టింది. సింహంలాగా వారు నా చేతుల్ని, నా పాదాలను గాయపర్చారు. నేను నా ఎముకల్ని చూడగలను. ఆ ప్రజలు నా వైపు తేరి చూస్తున్నారు. వారు నన్ను అలా చూస్తూనే ఉంటారు! ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు. నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు. యెహోవా, నన్ను విడువకుము! నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము! యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము. ప్రశస్తమైన నా ప్రాణాన్ని ఆ కుక్కల నుండి రక్షించుము. సింహం నోటినుండి నన్ను రక్షించుము. ఆబోతు కొమ్ములనుండి నన్ను కాపాడుము. యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను. ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను. యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి. ఇశ్రాయేలు వంశస్థులారా! యెహోవాను ఘనపర్చండి. ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి. ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు. ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు. యెహోవా వారిని ద్వేషించడు. ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు. యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది. నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను. పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు. యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి. మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక! దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని ఆయన వద్దకు తిరిగి వస్తారు. ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే. ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు. నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు. సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తల వంచుతారు. మరియు వారి ప్రాణాలను కాపాడుకొనలేనివారు కూడా తల వంచుతారు. చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తల వంచాలి. భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు. యెహోవా విషయమై వారు నిత్యం చెప్పుతారు. ఇంకా పుట్టని మనుష్యులకు దేవుని మంచితనం గూర్చి చెబుతారు. దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.

కీర్తనలు 22:1-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు? నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలుచేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు. మా పితరులు నీయందు నమ్మిక యుంచిరివారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీక రింపబడిన వాడను. నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు. –యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు నేమో అందురు. గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా నేను నా తల్లియొద్ద స్తన్యపానముచేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందుమైనమువలె కరగియున్నది. నా బలము యెండిపోయి చిల్లపెంకు వలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నది నీవు నన్ను ప్రేతల భూమిలోపడవేసి యున్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నా యెముకలన్నియు నేను లెక్కింపగలనువారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములువారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చియున్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ నను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను. మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడె దను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును. భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమిమీద వర్ధిల్లుచున్నవారందరు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరు ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవుతరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు. వారు వచ్చి–ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరతురు.

కీర్తనలు 22:1-31

కీర్తనలు 22:1-31 TELUBSI