కీర్తనలు 144:2-8

కీర్తనలు 144:2-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఆయన నా ప్రేమగల దేవుడు, నా కోట, నా బలమైన కోట, నన్ను విడిపించేవారు. ఆయనే ప్రజలను నాకు లోబరచే, నా డాలు నా ఆశ్రయము. యెహోవా, మనుష్యులు ఏపాటివారని లక్ష్యపెడుతున్నారు? వారి గురించి ఆలోచించడానికి మనుష్యులు ఏపాటివారు? నరులు కేవలం ఊపిరిలాంటివారు; దాటిపోయే నీడలా వారి రోజులు ఉంటాయి. యెహోవా ఆకాశాలను చీల్చుకొని క్రిందికి దిగిరండి; పర్వతాలు పొగలు వదిలేలా, వాటిని ముట్టండి. మెరుపులు పంపించండి శత్రువులను చెదరగొట్టండి; బాణాలు వేసి వారిని ఓడించండి. పైనుండి మీ చేయి చాపండి; గొప్ప జలాల నుండి, విదేశీయుల చేతుల్లో నుండి, నన్ను విడిపించండి. వారి నోళ్ళ నిండ అబద్ధాలు, వారి కుడి చేతులు మోసకరమైనవి.

కీర్తనలు 144:2-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నీవే నా నిబంధన విశ్వసనీయుడివి, నా దుర్గానివి. ఆయనే నన్ను కాపాడే ఎత్తయిన నా గోపురం. నేను దాగి ఉండే నా డాలు ఆయనే. ఆయన పైనే నేను ఆధారపడతాను. జాతులు నాకు లోబడేలా అణిచేవాడు యెహోవానే. యెహోవా, నువ్వు మనుషులను లక్ష్యపెట్టడానికి వాళ్ళు ఎంతటి వాళ్ళు? వాళ్ళ గురించి ఆలోచించడానికి వాళ్ళకున్న అర్హత ఏమిటి? మనిషి కేవలం శ్వాస వంటివాడు. వాళ్ళ రోజులు కదిలిపోతున్న నీడలాగా ఉన్నాయి. యెహోవా, ఆకాశాలను కృంగజేసి కిందికి దిగిరా. పర్వతాలను తాకి అవి పొగలు వెళ్ళగక్కేలా చెయ్యి. మెరుపులు మెరిపించి శత్రువులను చెదరగొట్టు. నీ బాణాలు వేసి వాళ్ళను ఓడించు. ఆకాశం నుండి నీ చెయ్యి చాపి నన్ను తప్పించు. మహా జలప్రవాహాల నుండి, విదేశీయుల చేతిలోనుండి నన్ను విడిపించు. వాళ్ళు వంచన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కుడిచేతులు మోసంతో నిండి ఉన్నాయి.

కీర్తనలు 144:2-8 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. పర్వతం మీద ఎత్తయిన స్థలంలో యెహోవా నా క్షేమ స్థానం. యెహోవా నన్ను రక్షిస్తాడు, యెహోవా నా కేడెం. నేను ఆయనను నమ్ముతాను. నేను నా ప్రజలను పాలించుటకు యెహోవా నాకు సహాయం చేస్తాడు. యెహోవా, మనుష్యులు ఎందుకు నీకు ముఖ్యం? నీవు మనుష్యకుమారులను ఎందుకు గమనిస్తావు? మనిషి జీవితం గాలి బుడగలాంటిది. వాని జీవితం దాటిపోతున్న నీడలాంటిది. యెహోవా, ఆకాశం తెరచి దిగి రమ్ము. పర్వతాలను తాకు, వాటినుండి పొగ వస్తుంది. యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు పారిపోవునట్లు చేయుము. నీ బాణాలు వేసి, వారు పారిపోవులట్లు చేయుము. యెహోవా, ఆకాశంనుండి నీ చేయి చాపి నన్ను రక్షించుము. ఈ శత్రు సముద్రంలో నన్ను మునిగి పోనీయకుము. ఇతరుల నుండి నన్ను రక్షించుము. ఈ శత్రువులు అబద్ధీకులు. వారు అసత్య విషయాలు చెబుతారు.

కీర్తనలు 144:2-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నే నాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరచువాడైయున్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నికచేయుటకు మనష్యులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలియున్నారువారి దినములు దాటిపోవు నీడవలె నున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహా జలములలోనుండి అన్యులచేతిలోనుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది.