కీర్తనలు 139:7-12
కీర్తనలు 139:7-12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్లగలను? మీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను? ఒకవేళ నేను ఆకాశానికి ఎక్కి వెళ్తే, అక్కడా మీరు ఉన్నారు; నేను పాతాళంలో నా పడకను సిద్ధం చేసుకుంటే, అక్కడా మీరు ఉన్నారు. ఒకవేళ నేను ఉదయపు రెక్కలపై ఎగిరిపోయి, నేను సముద్రం యొక్క సుదూరాన స్థిరపడితే, అక్కడ కూడా మీ చేయి నన్ను నడిపిస్తుంది, మీ కుడిచేయి నన్ను గట్టిగా పట్టుకుంటుంది. “చీకటి నన్ను దాచివేస్తుంది, నా చుట్టూ ఉన్న వెలుగు రాత్రిగా మారుతుంది” అని నేననుకుంటే, చీకటి కూడ మీకు చీకటి కాదు; రాత్రి పగటివలె మెరుస్తుంది, ఎందుకంటే చీకటి మీకు వెలుగు లాంటిది.
కీర్తనలు 139:7-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ ఆత్మ నుండి నేనెక్కడికి వెళ్ళగలను? నీ సమక్షంలో నుండి నేనెక్కడికి పారిపోగలను? ఆకాశానికి ఎక్కి వెళ్దామంటే నువ్వు అక్కడ ఉన్నావు. మృత్యులోకంలో దాక్కుందామనుకుంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు. నేను ఉదయకాలం రెక్కలు కట్టుకుని ఎగిరివెళ్ళి సముద్రపు లోతుల్లో దాక్కుంటాను. అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. నీ కుడిచెయ్యి నన్ను పట్టుకుంటుంది. నేనిలా అనుకుంటాను, చీకటి నన్ను దాచిపెడుతుంది. నా చుట్టూ ఉన్న వెలుగు రాత్రిలాగా అవుతుంది. అప్పుడు చీకటి కూడా నీకు చీకటి కాదు. రాత్రి నీకు పగటి వెలుగుగా ఉంటుంది. చీకటీ, వెలుగూ ఈ రెండూ నీకు ఒకే విధంగా ఉన్నాయి.
కీర్తనలు 139:7-12 పవిత్ర బైబిల్ (TERV)
నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది. యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను. నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు. పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు. యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు. పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు. అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి, ఆ చేతితో నన్ను నడిపిస్తావు. యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే, “పగలు రాత్రిగా మారిపోయింది. తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు. రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది.
కీర్తనలు 139:7-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును –అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనినయెడల చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి