కీర్తనలు 119:14-20
కీర్తనలు 119:14-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒకడు గొప్ప ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించునట్లు నేను మీ శాసనాలను పాటించడంలో సంతోషిస్తాను. మీ శాసనాలను నేను ధ్యానిస్తాను మీ మార్గాలను పరిగణిస్తాను. మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను. నేను బ్రతికి ఉండి మీ వాక్యానికి లోబడేలా, మీ సేవకునిపట్ల దయగా ఉండండి. మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన వాటిని నేను చూడగలిగేలా నా కళ్లు తెరవండి. ఈ లోకంలో నేను అపరిచితున్ని; మీ ఆజ్ఞలను నా నుండి దాచిపెట్టకండి. అన్నివేళల్లో మీ న్యాయవిధుల కోసం తపిస్తూ నా ప్రాణం క్షీణించిపోతుంది.
కీర్తనలు 119:14-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సంపదలన్నిటి కంటే పైగా నీ నిబంధన శాసనాల దారిని బట్టి నేను ఉప్పొంగిపోతున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను. నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను. నీ సేవకుణ్ణి దయ చూడు. అప్పుడు నేను సజీవంగా ఉండి నీ వాక్కు పాటిస్తాను. నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు. నేను భూమి మీద పరదేశిని. నీ ఆజ్ఞలను నాకు కనిపించకుండా దాచకు. అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది.
కీర్తనలు 119:14-20 పవిత్ర బైబిల్ (TERV)
ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను. నీ నియమాలను నేను చర్చిస్తాను. నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను. నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను. నీ మాటలు నేను మరచిపోను. నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము. తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను. యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను. ఈ దేశంలో నేను పరాయివాణ్ణి. యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము. నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి చదవాలని కోరుతున్నాను.
కీర్తనలు 119:14-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ దయారసము చూపుము నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతు లను చూచునట్లు నా కన్నులు తెరువుము. నేను భూమిమీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము. నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది.