కీర్తనలు 119:137-144
కీర్తనలు 119:137-144 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా, మీరు నీతిమంతులు, మీ న్యాయవిధులు యథార్థమైనవి. మీరు విధించిన శాసనాలు నీతియుక్తమైనవి; అవి పూర్తిగా నమ్మదగినవి. నా శత్రువులు మీ మాటలను విస్మరిస్తారు కాబట్టి, నా ఆసక్తి నన్ను తినేస్తుంది. మీ వాగ్దానాలు పూర్తిగా పరీక్షించబడ్డాయి, మీ సేవకుడు వాటిని ప్రేమిస్తాడు. నేను అల్పుడనైనా, తృణీకరించబడినా, నేను మీ కట్టడలు మరచిపోను. మీ నీతి శాశ్వతమైనది మీ ధర్మశాస్త్రం సత్యమైనది. ఇబ్బంది, బాధ నా మీదికి వచ్చాయి, కాని మీ ఆజ్ఞలు నాకు ఆనందాన్ని ఇస్తాయి. మీ శాసనాలు ఎల్లప్పుడు నీతియుక్తమైనవి; నేను బ్రతికేలా నాకు గ్రహింపు ఇవ్వండి.
కీర్తనలు 119:137-144 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నీవు నీతిమంతుడివి. నీ న్యాయవిధులు యథార్థం. నీతినిబట్టి, పూర్ణ విశ్వాస్యతనుబట్టి, నీ శాసనాలను నీవు నియమించావు. నా విరోధులు నీ వాక్కులు మరచిపోతారు. అందువలన నా ఆసక్తి నన్ను తినేస్తున్నది. నీ మాట ఎంతో స్వచ్ఛమైనది. అది నీ సేవకుడికి ప్రియమైనది. నేను అల్పుణ్ణి. నిరాకరణకు గురి అయిన వాణ్ణి. అయినా నీ ఉపదేశాలను నేను మరువను. నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం. బాధ, వేదన నన్ను పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నీ శాసనాలు శాశ్వత నీతిగలవి. నేను బ్రతికేలా నాకు తెలివి దయచెయ్యి.
కీర్తనలు 119:137-144 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నీవు మంచివాడవు. నీ చట్టాలు న్యాయమైనవి. ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి. యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము. నా ఉత్సాహం నాలో కృంగిపోయినది. ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు. యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది. అదంటే నాకు ప్రేమ. నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు. కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను. యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది. నీ ఉపదేశాలు నమ్మదగినవి. నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి. కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము. నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది. నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
కీర్తనలు 119:137-144 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పెట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.