కీర్తనలు 118:1-9
కీర్తనలు 118:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని ఇశ్రాయేలీయులు చెప్పుదురు గాక. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అహరోను వంశం చెప్పుదురు గాక. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని యెహోవాకు భయపడేవారు చెప్పుదురు గాక. నేను ఇరుకులో ఉండి యెహోవాకు మొరపెట్టాను; ఆయన నాకు జవాబిచ్చి నన్ను విశాల స్థలంలోకి తెచ్చారు. యెహోవా నా పక్షాన ఉన్నారు; నేను భయపడను. నరమాత్రులు నన్నేమి చేయగలరు? యెహోవా నా పక్షాన ఉన్నారు; ఆయన నా సహాయకుడు. నా శత్రువుల వైపు నేను విజయం పొందినవానిగా చూస్తాను. మనుష్యులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది. రాజులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది.
కీర్తనలు 118:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని ఇశ్రాయేలీయులు అందురు గాక. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని అహరోను వంశస్థులు అందురు గాక. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని యెహోవాపై భయభక్తులు గలవారు అందురు గాక. ఇరుకైనచోట ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. విశాలస్థలంలో యెహోవా నాకు జవాబిచ్చాడు. యెహోవా నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను. మనుషులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షం వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేరడం నేను చూస్తాను. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
కీర్తనలు 118:1-9 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది. “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము. “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యాజకులారా, మీరు చెప్పండి. “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి. నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను, యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు. యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయపడను. నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు. యెహోవా నా సహాయకుడు; నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను. మనుష్యులను నమ్ముకొనుటకంటే యెహోవాను నమ్ముట మేలు. మీ నాయకులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు.
కీర్తనలు 118:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ స్థులు అందురు గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులుగలవారు అందురు గాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను యెహోవా నా పక్షముననున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.