కీర్తనలు 116:1-9
కీర్తనలు 116:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను యెహోవాను ప్రేమిస్తాను, ఎందుకంటే ఆయన నా స్వరం విన్నారు; కరుణ కోసం నేను పెట్టిన మొరను ఆయన విన్నారు. ఆయన తన చెవిని నా వైపు త్రిప్పారు కాబట్టి, నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఆయనకు మొరపెడుతుంటాను. మరణపాశాలు నన్ను చుట్టివేశాయి, సమాధి వేదన నా మీదికి వచ్చింది. బాధ దుఃఖం నన్ను అధిగమించాయి. అప్పుడు నేను యెహోవా నామమున మొరపెట్టాను: “యెహోవా, నన్ను రక్షించండి!” యెహోవా దయగలవాడు నీతిమంతుడు; మన దేవుడు కనికరం కలవాడు. యెహోవా సామాన్యులను కాపాడతారు; నేను దుర్దశలో ఉన్నప్పుడు, ఆయన నన్ను రక్షించారు. నా ప్రాణమా, నీ విశ్రాంతికి తిరిగి వెళ్లు, ఎందుకంటే యెహోవా నీ పట్ల గొప్పగా వ్యవహరించారు. యెహోవా, మీరు, మరణం నుండి నన్ను, కన్నీటి నుండి నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను విడిపించారు. నేను సజీవుల భూమిలో యెహోవా ఎదుట నడుస్తాను.
కీర్తనలు 116:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా నా మొర, నా విన్నపాలు ఆలకించాడు. నేనాయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన నా మాటలు శ్రద్ధగా విన్నాడు. కాబట్టి నా జీవితకాలమంతా నేనాయనకు మొర్ర పెడతాను. మరణబంధాలు నన్ను చుట్టుకున్నాయి. పాతాళ వేదనలు నన్ను పట్టుకున్నాయి. బాధ, దుఃఖం నాకు కలిగింది. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణాన్ని విడిపించమని యెహోవా నామాన్నిబట్టి నేను మొర్రపెట్టాను. యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు. యెహోవా సాధుజీవులను కాపాడేవాడు. నేను క్రుంగి ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేశాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు కార్చకుండా నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను నువ్వు తప్పించావు. సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను.
కీర్తనలు 116:1-9 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం. సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం. నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి. సమాధి నా చుట్టూరా మూసికొంటుంది. నేను భయపడి చింతపడ్డాను. అప్పుడు నేను యెహోవా నామం స్మరించి, “యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను. యెహోవా మంచివాడు, జాలిగలవాడు. యెహోవా దయగలవాడు. నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధ తీసుకొంటాడు. నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు. నా ఆత్మా, విశ్రమించు! యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు. దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు. నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు. నేను పడిపోకుండా నీవు నన్ను పట్టుకొన్నావు. సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.
కీర్తనలు 116:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు–యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని. యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యతగలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప జేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును.