కీర్తనలు 112:1-10

కీర్తనలు 112:1-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయపడేవారు ధన్యులు, వారు ఆయన ఆజ్ఞలలో అధిక ఆనందాన్ని పొందుతారు. వారి పిల్లలు భూమిపై బలవంతులుగా ఉంటారు; యథార్థవంతుల తరం దీవించబడుతుంది. వారి ఇళ్ళలో ధనం, ఐశ్వర్యం ఉన్నాయి, వారి నీతి నిత్యం నిలిచి ఉంటుంది. దయ కనికరం గలవారికి నీతిమంతులకు, యథార్థవంతులకు చీకట్లో కూడా వెలుగు ఉదయిస్తుంది. దయతో అప్పు ఇచ్చేవారికి, తమ వ్యాపారాన్ని న్యాయంగా నిర్వహించే వారికి మేలు కలుగుతుంది. నీతిమంతులు ఎప్పటికీ కదల్చబడరు; వారు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు. దుర్వార్తల వలన వారు భయపడరు; యెహోవా అందలి నమ్మకం చేత వారి హృదయం స్థిరంగా ఉంటుంది. వారి హృదయాలు భద్రంగా ఉన్నాయి, వారికి భయం ఉండదు; చివరికి వారు తమ శత్రువులపై విజయంతో చూస్తారు. వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు, వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది; వారి కొమ్ము ఘనత పొంది హెచ్చింపబడుతుంది. దుష్టులు చూసి విసుగుచెందుతారు, వారు పండ్లు కొరుకుతూ క్షీణించి పోతారు; దుష్టుల ఆశలు విఫలమవుతాయి.

కీర్తనలు 112:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవాను స్తుతించండి. యెహోవా పట్ల భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలనుబట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. అతని సంతానం భూమిమీద బలవంతులౌతారు. యథార్థవంతుల వంశం దీవెనలు పొందుతారు. కలిమి, సంపద అతని ఇంట్లో ఉంటాయి. అతని నీతి నిత్యం నిలకడగా ఉంటుంది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. వారు కృపాభరితులు, దయాపరులు, న్యాయవంతులు. జాలిపరులు, అప్పిచ్చే వారు, తమ వ్యవహారాలు యధార్థంగా నిర్వహించుకునే వారు క్షేమంగా ఉంటారు. అలాటి వారు ఎన్నటికీ స్థిరంగా ఉండిపోతారు. నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు. అతడు దుర్వార్తకు జడిసి పోడు. అతడు యెహోవాను నమ్ముకుని నిబ్బరంగా ఉంటాడు. అతని మనస్సు స్థిరంగా ఉంటుంది. తన శత్రువులపై గెలిచేదాకా అతడు భయపడడు. అతడు ఉదారంగా పేదలకు దానం చేస్తాడు. అతని నీతి నిత్యం నిలిచి ఉంటుంది. అతడు ఘనత పొందుతాడు. భక్తిహీనులు అది చూసి కోపం తెచ్చుకుంటారు. వారు పళ్ళు కొరుకుతూ క్షీణించి పోతారు. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది.

కీర్తనలు 112:1-10 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం. ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు. మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు. ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు. అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది. మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు. దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు. ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చే గుణం కలిగి ఉండటం, అతనికి మంచిది. తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది. ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు. ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడతాడు. మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు. ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు. ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు. అతడు తన శత్రువులను ఓడిస్తాడు. ఆ మనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు. అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి. దుష్టులు ఇది చూచి కోపగిస్తారు. వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు. దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు.

కీర్తనలు 112:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు కలిమియు సంపదయు వాని యింటనుండును వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునువారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు. దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగానుండును వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరువరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాని చూచి చింతపడుదురువారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును.