కీర్తనలు 105:1-45

కీర్తనలు 105:1-45 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి; ఆయన చేసిన వాటిని దేశాల్లో తెలియజేయండి. ఆయనకు పాడండి, ఆయనకు స్తుతి పాడండి; ఆయన అద్భుత కార్యాలన్నిటిని గురించి చెప్పండి. ఆయన పరిశుద్ధ నామం గురించి గొప్పగా చెప్పండి; యెహోవాను వెదికేవారి హృదయాలు ఆనందించును గాక యెహోవాను, ఆయన బలాన్ని చూడండి; ఆయన ముఖాన్ని ఎల్లప్పుడు వెదకండి. ఆయన సేవకులైన అబ్రాహాము సంతానమా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతానమా, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను, ఆయన అద్భుతాలను, ఆయన ప్రకటించిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన దేవుడైన యెహోవా; ఆయన తీర్పులు భూమి అంతటా ఉన్నాయి. ఆయన తన నిబంధనను, తాను చేసిన వాగ్దానాన్ని వెయ్యి తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటారు, అబ్రాహాముతో ఆయన చేసిన నిబంధనను, ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణాన్ని ఎప్పటికీ జ్ఞాపకముంచుకుంటారు. ఆయన దానిని యాకోబుకు శాసనంగా, ఇశ్రాయేలుకు శాశ్వతమైన నిబంధనగా స్థిరపరిచారు: “నేను మీకు కనాను దేశాన్ని ఇస్తాను మీరు వారసత్వంగా పొందుకునే భాగంగా ఇస్తాను.” వారు లెక్కకు కొద్దిమంది ఉన్నప్పుడు, ఆ కొద్దిమంది ఆ దేశంలో పరాయివారిగా ఉన్నప్పుడు, వారు దేశం నుండి దేశానికి, ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి తిరిగారు. ఆయన ఎవరినీ వారికి హాని చేయనివ్వలేదు; వారి కోసం ఆయన రాజులను మందలించారు: “నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు; నా ప్రవక్తలకు హాని చేయకూడదు.” ఆయన భూమిపై కరువును పిలిచారు వారి ఆహార సరఫరా అంతా నాశనం చేశారు; వారికి ముందుగా ఒక మనుష్యుని పంపారు, ఒక బానిసగా అమ్మబడిన యోసేపును, తాను చెప్పింది జరిగే వరకు, యెహోవా యోసేపు ప్రవర్తనను పరీక్షించారు, వారు అతని పాదాలను సంకెళ్ళతో గాయపరిచారు, అతని మెడ సంకెళ్ళలో ఉంచబడింది. రాజు కబురుపెట్టి, అతన్ని విడుదల చేశాడు, జనాంగాల పాలకుడు అతన్ని విడిపించాడు. అతడు యోసేపును తన ఇంటి యజమానిగా, తన స్వాస్థ్యమంతటి మీద పాలకునిగా చేశాడు, తనకు నచ్చిన విధంగా తన యువరాజులకు సూచించడానికి పెద్దలకు జ్ఞానాన్ని బోధించడానికి అధికారం ఇచ్చాడు. యాకోబు అనబడిన ఇశ్రాయేలు ఆ తర్వాత హాము దేశమైన ఈజిప్టుకు వెళ్లి, అక్కడే ప్రవాసం చేశాడు. యెహోవా తన ప్రజలకు అధిక సంతాన మిచ్చాడు; వారిని శత్రువుల కన్నా బలవంతులుగా చేశారు. తన ప్రజలను వారు ద్వేషించేలా ఆయన వారి హృదయాలు మార్చివేశారు, తన సేవకులకు వ్యతిరేకంగా కుట్ర చేసేలా వారిని పురికొల్పారు. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపారు. ఈజిప్టువారి మధ్య సూచక క్రియలు, హాము దేశంలో అద్భుతాలు జరిగించారు. యెహోవా చీకటిని పంపి చీకటి కమ్మేలా చేశారు; వారు ఆయన మాటలను వ్యతిరేకించలేదు. ఆయన వారి జలాలను రక్తంగా మార్చారు, వారి చేపలన్నిటిని చనిపోయేలా చేశారు. వారి దేశం కప్పలతో నిండిపోయింది, వారి రాజుల గదుల్లోకి కూడా వెళ్లాయి. ఆయన ఆజ్ఞ ఇవ్వగా, జోరీగలు వచ్చాయి, వారి దేశమంతటా దోమలు వచ్చాయి. దేశమంతటా ఆయన మెరుపులు మెరిపిస్తూ, వడగండ్ల వాన కురిపించారు. ఆయన వారి ద్రాక్షతీగెలను అంజూర చెట్లను పడగొట్టారు వారి దేశంలోని వృక్షాలను విరగ్గొట్టారు. ఆయన ఆజ్ఞ ఇవ్వగా మిడతలు, లెక్కలేనన్ని చీడ పురుగులు వచ్చి పడ్డాయి. ఆ దేశంలో కూరగాయల మొక్కలన్నిటినీ పురుగులు తినేశాయి, భూమి పంటలను తినేశాయి. వారి దేశంలో ఉన్న జ్యేష్ఠులందరిని వారి ప్రథమ సంతానమంతటిని ఆయన హతమార్చారు. ఇశ్రాయేలీయులను వెండి బంగారములతో దేవుడు బయిటకి రప్పించాడు. ఆయన ఇశ్రాయేలు గోత్రాల్లో ఎవరూ తొట్రుపడరు. వారంటే ఈజిప్టువారికి భయం పట్టుకుంది, వారు వెళ్లి పోతుంటే, వీరు సంతోషించారు. దేవుడు పరచిన మేఘపు దుప్పి వారిని కప్పింది, రాత్రివేళ వెలుగు కోసం అగ్ని నిచ్చాడు దేవుడు. వారు కోరుకున్నట్లే దేవుడు పూరేడుపిట్టలను పంపించాడు. ఆకాశం నుండి వచ్చే ఆహారంతో వారంతా తృప్తి చెందారు. దేవుడు బండను చీల్చాడు. అందులో నుండి నీరు ఉబికి బయటకు వచ్చింది. ఆ మీరు నదీ ప్రవాహంలా ఎడారి స్థలాల్లో పారింది. ఆయన తన సేవకుడైన అబ్రాహాముకు చేసిన పరిశుద్ధ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. తన ప్రజలను సంతోషంతో బయిటకి తెచ్చాడు. తాను ఎన్నుకున్న ప్రజలను ఆనంద ధ్వనులతో రప్పించాడు. ఆయన వారికి దేశాల భూములను ఇచ్చారు, ఇతరులు శ్రమించినదానికి వారు వారసులయ్యారు. వారు ఆయన కట్టడలను అనుసరించాలని ఆయన న్యాయవిధులను పాటించాలని.

కీర్తనలు 105:1-45 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి. ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక. యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి. ఆయన సేవకుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అంతటా అమలు అవుతున్నాయి. తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరాల వరకూ ఆయన గుర్తుంచుకుంటాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, ఆ కొద్ది మంది ఆ దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు, కొలిచిన వారసత్వంగా కనాను దేశం మీకిస్తానని ఆయన చెప్పాడు. ఆ మాట యాకోబుకు శాసనంగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరచాడు. వారు జనం నుండి జనానికి, రాజ్యం నుండి రాజ్యానికి తిరుగులాడుతుండగా వారిని హింసించడానికి ఆయన ఎవరినీ అనుమతించలేదు. ఆయన వారి కోసం రాజులను శిక్షించాడు. నేను అభిషేకించిన వారిని తాకవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దు అని ఆయన చెప్పాడు. దేశం మీదికి ఆయన కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమంతా ధ్వంసం చేశాడు. వారికంటే ముందుగా ఆయన ఒకణ్ణి పంపించాడు. వారు యోసేపును బానిసగా అమ్మేశారు. వారు సంకెళ్లతో అతని కాళ్లు నొప్పించారు. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. అతడు చెప్పిన సంగతి నెరవేరేదాకా యెహోవా వాక్కు అతణ్ణి పరీక్షించాడు. రాజు వర్తమానం పంపి అతణ్ణి విడిపించాడు. ప్రజల పాలకుడు అతణ్ణి విడుదల చేశాడు. ఇష్టప్రకారం అతడు తన అధిపతులపై పెత్తనం చెయ్యడానికి, తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి, తన ఇంటికి యజమానిగా, తన ఆస్తి అంతటిపై అధికారిగా అతణ్ణి నియమించాడు. ఇశ్రాయేలు ఈజిప్టులోకి వచ్చాడు. యాకోబు హాము దేశంలో పరదేశిగా ఉన్నాడు. ఆయన తన ప్రజల సంతానాన్ని వృద్ధి చేశాడు. వారి విరోధులకంటే వారికి అధికబలం దయచేశాడు. తన ప్రజలపై పగబట్టేలా తన సేవకుల పట్ల కుయుక్తిగా నడుచుకునేలా ఆయన వారి హృదయాలను మళ్ళించాడు. ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకున్న అహరోనును పంపించాడు. వారు ఐగుప్తీయుల మధ్య ఆయన సూచక క్రియలను, హాము దేశంలో మహత్కార్యాలను జరిగించారు. ఆయన అంధకారం పంపించి చీకటి కమ్మేలా చేశాడు. వారు ఆయన మాటను ఎదిరించలేదు. ఆయన వారి జలాలను రక్తంగా మార్చాడు. వారి చేపలను చంపాడు. వారి దేశంలో కప్పలు నిండిపోయాయి. అవి వారి రాజుల గదుల్లోకి వచ్చాయి. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టాయి. వారి ప్రాంతాలన్నిటిలోకీ దోమలు వచ్చాయి. ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించాడు. వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించాడు. వారి ద్రాక్షతీగెలను, వారి అంజూరు చెట్లను పడగొట్టాడు. వారి ప్రాంతాల్లో వృక్షాలను విరగగొట్టాడు. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు, లెక్కలేనన్ని చీడపురుగులు వచ్చాయి, అవి వారి దేశంలోని కూరగాయల చెట్లన్నిటిని, వారి భూమి పంటలను తినివేశాయి. వారి దేశంలోని జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానాన్ని ఆయన హతం చేశాడు. అక్కడనుండి తన ప్రజలను వెండి బంగారాలతో ఆయన రప్పించాడు. వారి గోత్రాల్లో నిస్సత్తువ చేత తొట్రిల్లేవాడొక్కడైనా లేడు. వారివలన ఐగుప్తీయులకు భయం వేసింది. వారు వెళ్లిపోయినప్పుడు ఐగుప్తీయులు సంతోషించారు. వారికి నీడగా ఆయన మేఘాన్ని కల్పించాడు. రాత్రి వెలుగివ్వడానికి అగ్నిని కలగజేశాడు. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించాడు. ఆకాశంలోనుండి ఆహారాన్నిచ్చి వారిని తృప్తి పరిచాడు. శిలను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాయి. ఎడారుల్లో అవి ఏరులై ప్రవహించాయి. ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ వాగ్దానాన్ని, తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని, తన ప్రజలను సంతోషంతోను, తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను బయటికి రప్పించాడు. అన్యజనుల భూములను ఆయన వారికప్పగించాడు. ఇతర జాతుల సౌభాగ్యాన్ని వారు స్వాధీనపరచుకున్నారు. వారు తన కట్టడలను గైకొనేలా, తన ధర్మశాస్త్రవిధులను ఆచరించేలా చేయడానికి ఆయనిలా చేశాడు. యెహోవాను స్తుతించండి.

కీర్తనలు 105:1-45 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము. ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు. యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము. ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు. యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశయించు. యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి. బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి. సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి. యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి. దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు. దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు. యెహోవా మన దేవుడు. యెహోవా సర్వలోకాన్ని పాలిస్తాడు. దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి. వెయ్యి తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు. ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు. యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు. “నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.” అని దేవుడు చెప్పాడు. అబ్రాహాము కుటుంబం చిన్నదిగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం చేశాడు. మరియు వారు కనానులో నివసిస్తున్న యాత్రికులు మాత్రమే. దేశం నుండి దేశానికి, రాజ్యం నుండి రాజ్యానికి వారు ప్రయాణం చేసారు. కాని యితర మనుష్యులు ఆ కుటుంబాన్ని బాధించనియ్యకుండా దేవుడు చేసాడు. వారిని బాధించవద్దని దేవుడు రాజులను హెచ్చరించాడు. “నేను ఏర్పాటు చేసుకొన్న నా ప్రజలను బాధించవద్దు. నా ప్రవక్తలకు ఎలాంటి కీడూ చేయవద్దు.” అని దేవుడు చెప్పాడు. దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు. ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు. అయితే దేవుడు వారికి ముందుగా వెళ్లుటకు యోసేపు అనే మనిషిని పంపించాడు. యోసేపు ఒక బానిసవలె అమ్మబడ్డాడు. యోసేపు కాళ్లను తాళ్లతో వారు కట్టివేశారు. అతని మెడకు వారు ఒక ఇనుప కంటె వేశారు. యోసేపు చెప్పిన సంగతులు నిజంగా జరిగేంతవరకు అతడు (యోసేపు) బానిసగా చెప్పింది సరియైనది అని యెహోవా సందేశం రుజువు చేసింది. కనుక యోసేపును విడుదల చేయమని ఈజిప్టు రాజు ఆదేశించాడు. అనేక మందికి అధికారిగా ఉన్న అతనిని కారాగారం నుండి వెళ్లనిచ్చాడు. అతడు యోసేపును తన ఇంటికి యజమానిగా నియమించాడు. రాజ్యంలో అన్ని విషయాలను గూర్చి యోసేపు జాగ్రత్త తీసుకొన్నాడు. యోసేపు యితర నాయకులకు హెచ్చరిక ఇచ్చాడు. పెద్ద మనుష్యులకు యోసేపు నేర్పించాడు. తరువాత ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చాడు. యాకోబు హాము దేశంలో నివసించాడు. యాకోబు కుటుంబం చాలా పెద్దది అయింది. వారు వారి శత్రువులకంటే శక్తిగలవారయ్యారు. కనుక ఈజిప్టు ప్రజలు యాకోబు వంశాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు. ఈజిప్టువారు బానిసలకు విరోధంగా పథకాలు వేయటం ప్రారంభించారు. కనుక దేవుడు తన సేవకుడైన మోషేను, తాను ఏర్పాటు చేసుకొన్న యాజకుడు అహరోనును పంపించాడు. హాము దేశంలో అనేక అద్భుతాలు చేయటానికి దేవుడు మోషే, అహరోనులను వాడుకొన్నాడు. దేవుడు కటిక చీకటిని పంపించాడు. కాని ఈజిప్టు వాళ్లు ఆయన మాట వినలేదు. కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు. వాళ్ల చేపలన్నీ చచ్చాయి. ఆ దేశం కప్పలతో నింపివేయబడింది. రాజు గదులలోకి కూడ కప్పలు వచ్చాయి. దేవుడు ఆజ్ఞ ఇవ్వగా జోరీగలు, దోమలు వచ్చాయి. అన్నిచోట్లా అవే ఉన్నాయి. దేవుడు వర్షాన్ని వడగండ్లుగా చేశాడు. ఈజిప్టువారి దేశంలో అన్ని చోట్లా అగ్ని మెరుపులు కలిగాయి. ఈజిప్టువారి ద్రాక్షా తోటలను, అంజూరపు చెట్లను దేవుడు నాశనం చేశాడు. వారి దేశంలో ప్రతి చెట్టునూ దేవుడు నాశనం చేసాడు. దేవుడు ఆజ్ఞ ఇవ్వగా మిడుతలు వచ్చాయి. అవి లెక్కింపజాలనంత విస్తారంగా ఉన్నాయి. మిడుతలు దేశంలోని మొక్కలన్నింటినీ తినివేశాయి. నేల మీద పంటలన్నింటినీ అవి తినివేశాయి. అప్పుడు ఈజిప్టు దేశంలో ప్రతి మొదటి సంతానాన్ని దేవుడు చంపేశాడు. వారి జ్యేష్ఠ కుమారులను దేవుడు చంపివేశాడు. అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు. వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు. దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు. దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది. ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు. దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు. రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు. ప్రజలు మాంసం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు. దేవుడు వారికి ఆకాశం నుండి సమృద్ధిగా ఆహారాన్ని యిచ్చాడు. దేవుడు బండను చీల్చగా నీళ్లు ఉబుకుతూ వచ్చాయి. ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది. దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు. దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు. దేవుడు తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. ప్రజలు వారి సంతోష గీతాలు పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు. అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు. దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు. వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు.

కీర్తనలు 105:1-45 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతో షించుదురుగాక. యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా ఆయన యేర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసికొనుడి ఆయన చేసిన సూచక క్రియలను ఆయననోటి తీర్పు లను జ్ఞాపకముచేసికొనుడి ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరములవరకు అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును– నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై యుండగను –కొలవబడిన స్వాస్థ్యముగా కనానుదేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి యున్నాడు. వారు జనమునుండి జనమునకును ఒక రాజ్యమునుండి మరియొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా –నేనభిషేకించినవారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడుచేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్య లేదు ఆయన వారికొరకు రాజులను గద్దించెను. దేశముమీదికి ఆయన కరవు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదలచేసెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధిచెప్పుటకును తన యింటికి యజమానునిగాను తన యావదాస్తిమీద అధికారిగాను అతని నియ మించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాముదేశమందు పరదేశిగా నుండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానవృద్ధి కలుగ జేసెను వారి విరోధులకంటె వారికి అధికబలము దయచేసెను. తన ప్రజలను పగజేయునట్లును తన సేవకులయెడల కుయుక్తిగా నడచునట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. వారు ఐగుప్తీయులమధ్యను ఆయన సూచక క్రియలను హాముదేశములో మహత్కార్యములను జరిగించిరి ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెనువారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి చేపలను చంపెను. వారి దేశములో కప్పలు నిండెను అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెనువారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించెను.వారి దేశములో అగ్నిజ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్షతీగెలను వారి అంజూరపు చెట్లను పడ గొట్టెను వారి ప్రాంతములయందలి వృక్షములను విరుగకొట్టెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలును లెక్కలేని చీడపురుగులును వచ్చెను, అవి వారిదేశపు కూరచెట్లన్నిటినివారి భూమి పంటలను తినివేసెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులనువారి ప్రథమసంతానమును ఆయన హతముచేసెను. అక్కడనుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను వారి గోత్రములలో నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్క డైనను లేకపోయెను. వారివలన ఐగుప్తీయులకు భయము పుట్టెనువారు బయలు వెళ్లినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములోనుండి ఆహారమునిచ్చి వారిని తృప్తి పరచెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను ఎడారులలో అవి యేరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తనసేవకుడైన అబ్రాహామును జ్ఞాపకము చేసికొని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనినవారిని ఉత్సాహధ్వనితోను వెలు పలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనునట్లును తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి. యెహోవాను స్తుతించుడి.

కీర్తనలు 105:1-45

కీర్తనలు 105:1-45 TELUBSIకీర్తనలు 105:1-45 TELUBSI