కీర్తనలు 104:1-35

కీర్తనలు 104:1-35 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. యెహోవా నా దేవా, మీరు చాలా గొప్పవారు; ఘనత ప్రభావాన్ని ధరించుకున్నారు. యెహోవా వెలుగును వస్త్రంలా ధరిస్తారు; ఆయన ఒక గుడారంలా ఆకాశాన్ని విస్తరించి తన గదుల కిరణాలను వాటి నీటిపై వేస్తారు. ఆయన మేఘాలను తన రథంగా చేసుకుని వాయు రెక్కలపై స్వారీ చేస్తారు. ఆయన వాయువులను తనకు దూతలుగా, అగ్ని జ్వాలలను తనకు సేవకులుగా చేస్తారు. భూమిని దాని పునాదులపై నిలిపారు; అది ఎన్నటికి కదలదు. మీరు దానిని ఒక వస్త్రంలా నీటి అగాధాలతో కప్పారు; జలాలు పర్వతాలకు పైగా నిలిచాయి. మీ మందలింపుతో జలాలు పారిపోయాయి, మీ ఉరుముల ధ్వనికి పలాయనం చిత్తగించాయి; అవి పర్వతాలకు మీదుగా వెళ్లాయి, అవి లోయల్లోకి దిగిపోయాయి, వాటికి మీరు నిర్ణయించిన చోటుకు అవి చేరుకున్నాయి. అవి దాటలేని సరిహద్దును మీరు ఏర్పరిచారు; అవి ఎన్నటికి భూమిని ముంచివేయవు. ఆయన ఊటలను కనుమలలోకి నీటిని కుమ్మరింపజేస్తారు; అవి పర్వతాల మధ్య ప్రవహిస్తున్నాయి. అవి పొలాలలోని అడవి మృగాలకు నీరు అందిస్తాయి; అడవి గాడిదలు తమ దాహం తీర్చుకుంటాయి. ఆ జలాల ప్రక్కన ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి; కొమ్మల మధ్య అవి పాడతాయి. తన ఆకాశ గదుల్లో నుండి ఆయన పర్వతాలను తడుపుతారు; ఆయన క్రియా ఫలం చేత భూమి తృప్తి చెందుతుంది. ఆయన పశువుల కోసం గడ్డి పెరిగేలా చేస్తున్నారు, మనుష్యులు శ్రమించి సాగుచేయడానికి మొక్కలను మొలిపిస్తున్నారు, అలా భూమి నుండి ఆహారాన్ని పుట్టిస్తున్నారు: మానవ హృదయాలకు సంతోషం కలిగించడానికి ద్రాక్షరసాన్ని, వారి ముఖాలను ప్రకాశించేలా చేయడానికి నూనెను, వారి హృదయాలను బలపరిచే ఆహారాన్ని ఇస్తున్నారు. యెహోవా వృక్షాలు, లెబానోనులో దేవదారు చెట్లు చాలినంత నీరు కలిగి ఉన్నాయి. అక్కడ పక్షులు వాటిలో గూళ్ళు కట్టుకుంటాయి; కొంగలు సరళ వృక్షాలపై నివాసముంటాయి. అడవి మేకపోతులు ఎత్తైన పర్వతాలమీద మేస్తూ ఉంటాయి; కుందేళ్ళు బండ సందులను ఆశ్రయిస్తాయి. రుతువుల్ని సూచించడానికి ఆయన చంద్రుని చేశారు, ఎప్పుడు అస్తమించాలో సూర్యునికి తెలుసు. మీరు చీకటి కలుగజేస్తారు, అది రాత్రి అవుతుంది, అడవి మృగాలన్నీ వేట కోసం సంచరిస్తాయి. సింహాలు వాటి వేట కోసం గర్జిస్తాయి, అవి దేవుని నుండి ఆహారం వెదకుతాయి. సూర్యుడు ఉదయించగానే, అవి వెళ్లిపోతాయి; అవి గుహలకు వెళ్లి పడుకుంటాయి. అప్పుడు మనుష్యులు వారి పనులకు వెళ్లిపోతారు, సాయంకాలం వరకు వారు కష్టపడతారు. యెహోవా! మీ కార్యాలు ఎన్నో! మీ జ్ఞానంతో మీరు వాటన్నిటిని చేశారు; భూమి అంతా మీ సృష్టితో నిండి ఉంది. అదిగో విశాలమైన, మహా సముద్రం, అందులో లెక్కలేనన్ని జలచరాలు దానిలో జీవులు చిన్నవి పెద్దవి ఉన్నాయి. అందులో ఓడలు ఇటు అటు తిరుగుతాయి, సముద్రంలో ఆడుకోడానికి మీరు సృజించిన లెవియాథన్ అక్కడ ఉంది. సకాలంలో మీరు వాటికి వాటి ఆహారం పెడతారని, జీవులన్నీ మీ వైపే చూస్తున్నాయి. మీరు దానిని వారికి ఇచ్చినప్పుడు, అవి సమకూర్చుకుంటాయి; మీరు గుప్పిలి విప్పి పెడుతుంటే అవి తిని తృప్తి చెందుతాయి. మీ ముఖం మరుగైతే అవి కంగారు పడతాయి; మీరు వాటి ఊపిరిని ఆపివేసినప్పుడు, అవి చనిపోయి మట్టి పాలవుతాయి. మీరు మీ ఆత్మను పంపినప్పుడు, అవి సృజించబడ్డాయి, మీరే భూతలాన్ని నూతనపరుస్తారు. యెహోవా మహిమ నిరంతరం ఉండును గాక; యెహోవా తన క్రియలలో ఆనందించును గాక. ఆయన భూమిని చూస్తే, అది కంపిస్తుంది, ఆయన పర్వతాలను తాకితే, అవి పొగలు గ్రక్కుతాయి. నా జీవితకాలమంతా నేను యెహోవాకు పాడతాను; నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి నేను స్తుతిగానం చేస్తాను. నేను యెహోవాయందు ఆనందిస్తుండగా, నా ధ్యానము ఆయనకు ఇష్టమైనదిగా ఉండును గాక. అయితే పాపులు భూమి మీద నుండి పూర్తిగా తుడిచివేయబడుదురు గాక దుష్టులు ఇక ఉండక పోవుదురు గాక.

కీర్తనలు 104:1-35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవా, నా దేవా, నీవు మహా ఘనత వహించిన వాడివి. నీవు మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని ధరించుకున్నావు. ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు. జలాల్లో ఆయన తన గదుల దూలాలు వేశాడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కలమీద ప్రయాణిస్తున్నాడు. వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా యెహోవా చేసుకున్నాడు. భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు. దాని మీద అగాధ జలాలను నీవు వస్త్రం లాగా కప్పావు. కొండలకు పైగా నీళ్లు నిలిచాయి. నీవు గద్దించగానే అవి పారిపోయాయి. నీ ఉరుము ధ్వని విని అవి త్వరగా పారిపోయాయి. నీవు వాటికి నియమించిన చోటికి పోవడానికి అవి పర్వతాలెక్కాయి. పల్లాలకు దిగాయి. అవి మరలి వచ్చి భూమిని కప్పకుండేలా దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించావు. ఆయన కొండలోయల్లో నీటిఊటలు పుట్టిస్తాడు. అవి కొండల్లో ప్రవహిస్తాయి. అవి అడవి జంతువులన్నిటికీ దాహం తీరుస్తాయి. వాటివలన అడవి గాడిదలు సేదదీరుతాయి. వాటి ఒడ్డున ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి. కొమ్మల మధ్య అవి కిలకిలారావాలు చేస్తాయి. తన మేడ గదుల్లోనుండి ఆయన కొండలకు జలధారలనిస్తాడు. నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుతున్నది. పశువులకు గడ్డిని, మనుషుల వాడకానికి కాయగూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు అందువల్ల భూమిలోనుండి ఆహారాన్నీ మనుషుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసాన్నీ వారి ముఖాలకు మెరుపునిచ్చే తైలాన్నీ మనుషుల హృదయాన్ని బలపరిచే ఆహారాన్నీ ఆయన మొలకెత్తిస్తున్నాడు. యెహోవా వృక్షాలు ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు నీటి వసతి గలిగి ఉన్నాయి. అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి. అక్కడ సరళవృక్షాలపై కొంగలు నివాసముంటున్నాయి. ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు. బండరాళ్ళు కుందేళ్లకు ఆశ్రయస్థానాలు. ఋతువులను సూచించడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యుడికి అతడు అస్తమించవలసిన కాలం తెలుసు. నీవు చీకటి కమ్మ జేయగా రాత్రి అవుతున్నది. అప్పుడు అడవిజంతువులన్నీ సంచరిస్తున్నాయి. సింహం పిల్లలు వేట కోసం గర్జిస్తున్నాయి. తమ ఆహారాన్ని దేవుని చేతిలోనుండి తీసుకోడానికి చూస్తున్నాయి. సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి తమ గుహల్లో పడుకుంటాయి. సాయంకాలం దాకా పాటుపడి తమ పనులు జరుపుకోడానికి మనుషులు బయలుదేరుతారు. యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది. అదిగో విశాలమైన మహాసముద్రం. అందులో లెక్కలేనన్ని జలచరాలు, చిన్నవి పెద్దవి జీవరాసులు ఉన్నాయి. అందులో ఓడలు నడుస్తున్నాయి. నీవు సృష్టించిన మొసళ్ళు దానిలో జలకాలాడుతూ ఉన్నాయి. తగిన కాలంలో నీవు వాటికి ఆహారమిస్తావని ఇవన్నీ నీ దయకోసం కనిపెడుతున్నాయి. నీవు వాటికి అందిస్తే అవి కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పితే అవి మంచివాటిని తిని తృప్తి చెందుతాయి. నీవు ముఖం దాచుకుంటే అవి కలత చెందుతాయి. నీవు వాటి ఊపిరి ఉపసంహరిస్తే అవి ప్రాణం విడిచి మట్టిపాలవుతాయి. నీవు నీ ఊపిరి విడిస్తే అవి ఉనికిలోకి వస్తాయి. ఆ విధంగా నీవు మైదానాలను నూతనపరుస్తున్నావు. యెహోవా మహిమ నిత్యం ఉండుగాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించు గాక. ఆయన భూమిని చూడగా అది వణికి పోతుంది. ఆయన పర్వతాలను ముట్టగా అవి పొగరాజుకుంటాయి. నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను. ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను. పాపులు భూమిపై లేకుండా పోవాలి. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవాను స్తుతించండి.

కీర్తనలు 104:1-35 పవిత్ర బైబిల్ (TERV)

నా ప్రాణమా, యెహోవాను స్తుతించు! యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడవు. మహిమ, ఘనత నీవు వస్త్రాలుగా ధరించావు. ఒక వ్యక్తి నిలువుపాటి అంగీ ధరించినట్లుగా నీవు వెలుగును ధరిస్తావు. ఆకాశాలను నీవు తెరగా పరుస్తావు. దేవా, వాటికి పైగా నీవు నీ ఇంటిని నిర్మించావు. దట్టమైన మేఘాలను నీవు నీ రథంగా ఉపయోగిస్తావు. గాలి రెక్కల మీద నీవు ఆకాశంలో ప్రయాణం చేస్తావు. దేవా, నీ దూతలను నీవు గాలిలా చేశావు. నీ సేవకులను అగ్నిలా చేశావు. దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మించావు. కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు. దుప్పటి కప్పినట్టుగా నీవు భూమిని నీళ్లతో కప్పివేశావు. నీళ్లు పర్వతాలను కప్పివేశాయి. కాని నీవు ఆజ్ఞ ఇవ్వగానే, నీళ్లు వేగంగా వెళ్లిపోయాయి. దేవా, నీవు నీళ్లతో చెప్పగానే నీళ్లు వెంటనే వెళ్లిపోయాయి. పర్వతాలనుండి లోయల్లోనికి, ఆ తరువాత నీవు వాటికోసం చేసిన స్థలాల్లోకి నీళ్లు ప్రవహించాయి. సముద్రానికి నీవు హద్దులు నియమించావు. నీళ్లు భూమిని కప్పివేసేట్టుగా మరల ఎన్నటికీ ఉప్పొంగవు. దేవా, నీటి ఊటలనుండి నీటి కాలువలలోనికి నీవే నీళ్లను ప్రవహింప చేస్తావు. పర్వతాల జలధారల ద్వారా నీవు నీటిని క్రిందికి కాలువలా ప్రవహింపజేసావు. నీటి ప్రవాహాలు అడవి జంతువులన్నిటికీ నీళ్లను ఇస్తాయి. అక్కడ నీళ్లు త్రాగటానికి అడవి గాడిదలు కూడ వస్తాయి. నీటి మడుగుల చెంత నివసించుటకు అడవి పక్షులు వస్తాయి. సమీపంలో ఉన్న చెట్ల కొమ్మల మీద నుండి అవి పాడుతాయి. దేవుడు పర్వతాల మీదికి వర్షం పంపిస్తాడు. దేవుడు చేసిన పనులు భూమికి అవసరమైన ప్రతి దాన్నీ ఇస్తాయి. దేవా, పశువులకు ఆహారంగా గడ్డి ఎదిగేలా నీవు చేస్తావు. మేము పెంచుటకు ప్రయాసపడే మొక్కల్ని నీవు మాకిస్తావు. ఆ మొక్కలే ఈ భూమి మీద నుండి మాకు లభించే ఆహారం. దేవా, మమ్మల్ని సంతోషపెట్టే ద్రాక్షారసం నీవు మాకు ఇస్తావు. మా చర్మాన్ని నునుపు చేసే తైలాన్ని నీవు మాకిస్తావు. మమ్మల్ని బలంగలవారిగా చేయుటకు నీవు మాకు భోజనం ఇస్తావు. లెబానోను మహా దేవదారు వృక్షాలను దేవుడు నాటాడు. ఆ మహా వృక్షాలు ఎదుగుటకు వాటికి సమృద్ధిగా నీళ్లున్నాయి. పక్షులు ఆ వృక్షాలపై గూళ్లు పెడతాయి. పెద్ద కొంగలు దేవదారు వృక్షాలలో నివాసం చేస్తాయి. పెద్ద కొండలు అడవి మేకలకు నివాసం, పెద్ద బండలు కుందేళ్లు దాక్కొనే చోట్లు. దేవా, కాల సూచికగా ఉండుటకు నీవు మాకు చంద్రుణ్ణిచ్చావు. దాని మూలంగా పండుగ రోజులను తెలుసుకోగలుగుతాము. ఎక్కడ అస్తమించాలో సూర్యునికి ఎల్లప్పుడూ తెలుసు. చీకటిని నీవు రాత్రిగా చేశావు. ఆ సమయాన అడవి జంతువులు బయటికి వచ్చి చుట్టూరా సంచరిస్తాయి. సింహాలు దాడి చేసేటప్పుడు గర్జిస్తాయి. అవి దేవుడు వాటికిచ్చే ఆహారంకోసం ఆయనను అడుగుతున్నట్టు ఉంటుంది. మరల సూర్యుడు ఉదయించినప్పుడు ఆ జంతువులు తిరిగి వాటి నివాసాలకు వెళ్లి విశ్రమిస్తాయి. అప్పుడు ప్రజలు వారి పనుల కోసం బయటకు వెళ్తారు. సాయంత్రం వరకు వారు పని చేస్తారు. యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు. భూమి నీ కార్యాలతో నిండిపోయింది. నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు. మహా సముద్రాన్ని చూడు. అది ఎంతో పెద్దది. మహా సముద్రంలో రకరకాల ప్రాణులు నివసిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణులు పెద్దవి, కొన్ని చిన్నవి. మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కించుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి. మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి. నీవు చేసిన సముద్ర ప్రాణి మకరం ఆ సముద్రంలో ఆడుకుంటుంది. దేవా, ఆ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి. దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారం ఇస్తావు. దేవా, జీవించే ప్రాణులన్నీ తినే ఆహారం నీవే వాటికి ఇస్తావు. మంచి భోజనంతో నిండిన నీ గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు భోజనము చేస్తాయి. నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు అవి భయపడిపోతాయి. వాటి ప్రాణం వాటిని విడిచినప్పుడు అవి బలహీనమై చస్తాయి. మరియు అవి మరల మట్టి అయిపోతాయి. కాని యెహోవా, నీ ఆత్మను పంపినప్పుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి. భూమి మరల క్రొత్తదిగా అవుతుంది. యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక. యెహోవా చేసిన వాటిని చూచి ఆయన ఆనందించునుగాక. యెహోవా భూమివైపు చూసేటప్పుడు అది వణకుతుంది. ఆయన పర్వతాలను ముట్టేటప్పుడు వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది. నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను. నేను బ్రతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను. నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను. యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను. భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక. దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!

కీర్తనలు 104:1-35 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించిన వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు. వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనముచేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసికొనియున్నాడు. భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను. దానిమీద అగాధజలములను నీవు వస్త్రమువలె కప్పితివి. కొండలకుపైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును. అవి అడవిజంతువులన్నిటికి దాహమిచ్చును. వాటివలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలోనుండి ఆయన కొండలకు జలధారల నిచ్చును నీ క్రియల ఫలముచేత భూమి తృప్తిపొందుచున్నది. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు అందుమూలమున భూమిలోనుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తిపొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసముచేయుచున్నవి. గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియ మించెను సూర్యునికి తన అస్తమయకాలము తెలియును నీవు చీకటి కలుగచేయగా రాత్రియగుచున్నది అప్పుడు అడవిజంతువులన్నియు తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలోనుండి తీసికొన జూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలమువరకు పాటుపడి తమ పనులను జరుపు కొనుటకై మనుష్యులు బయలువెళ్లుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి ! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది. అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరము లున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి పరచబడును. నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగానుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను. పాపులు భూమిమీదనుండి లయమగుదురు గాక భక్తిహీనులు ఇక నుండకపోదురు గాక నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము యెహోవాను స్తుతించుడి.