సామెతలు 9:1-18
సామెతలు 9:1-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
జ్ఞానము తన ఇంటిని నిర్మించుకొని; దానికి ఏడు స్తంభాలు చెక్కుకొనినది. ఆమె మాంసాహారం తయారుచేసి తన ద్రాక్షరసాన్ని కలిపింది; తన భోజనబల్లను సిద్ధము చేసి ఉన్నది. ఆమె తన దాసులను బయటకు పంపి, పట్టణంలోని ఎత్తైన స్థలము మీద నిలువబడి, “సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది! బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది: “రండి, నేను సిద్ధం చేసిన ఆహారం తినండి. నేను కలిపిన ద్రాక్షరసం త్రాగండి. ఇకపై తెలివి లేనివారిగా ఉండకుండా బ్రతుకండి; తెలివిని కలిగించు దారిలో చక్కగా నడపండి.” వెక్కిరించు వానికి బుద్ధి చెప్పు వాడు తనకు అవమానాన్ని తెచ్చుకుంటాడు; దుష్టులు వానిని గద్దించు వారు నిందను తెచ్చుకుంటారు. హేళనగా మాట్లాడు వానిని గద్దించకు లేకపోతే వాడు నిన్ను ద్వేషిస్తాడు; తెలివిగల వానిని గద్దిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు. జ్ఞానం గలవానికి బోధించగా వాడు మరింత జ్ఞానంగలవానిగా ఉంటారు; మంచివానికి బోధ చేయగా వాడు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం, పవిత్రమైన దేవుని గురించిన తెలివియే మంచి చెడులను గురించి తెలుసుకొనుటకు ఆధారం. జ్ఞానం వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే ఎక్కువవుతాయి. నీవు తెలివి కలిగిన వానివైతే నీ తెలివి వలన నీకే లాభము; జ్ఞానమును ఎగతాళి చేసిన ఎడల దానిని నీవే భరించవలెను. బుద్ధిహీనత అనే స్త్రీ గగ్గోలు పెట్టేది; ఆమె తెలివితక్కువది దానికి ఏమీ తెలియదు. ఆ స్త్రీ తన ఇంటి వాకిటిలో కూర్చుండును, ఊరి ప్రధాన వీధుల్లో కుర్చీమీద అది కూర్చుండును, ఆ దారిలో వెళ్లు వారిని చూసి, తమ మార్గములో చక్కగా వెళ్లు వారిని చూసి, “సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది! బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది: “దొంగతనం చేసిన నీళ్లు తీపి, రహస్యంగా చేసిన భోజనం రుచి!” అయితే అక్కడ మృతులు ఉన్నారని, దాని అతిథులు పాతాళంలో ఉన్నారని వారికి కొంతవరకే తెలుసు.
సామెతలు 9:1-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జ్ఞానం ఏడు స్తంభాలు చెక్కుకుని దానిపై తన నివాసం కట్టుకున్నది. పశువులను వధించి మాంసం, ద్రాక్షారసం, భోజన పదార్థాలు సిద్ధం చేసింది. తన దాసీల చేత మనుషులకు కబురంపింది. పట్టణంలోని ఉన్నత స్థలంపై నిలబడింది. “జ్ఞానం లేని వాళ్ళంతా ఇక్కడికి రండి” అని పిలుస్తున్నది. తెలివితక్కువ వాళ్ళతో ఇలా చెబుతుంది “రండి, వచ్చి నేను సిద్దం చేసిన ఆహారం తినండి. నేను కలిపి ఉంచిన ద్రాక్షారసం తాగండి. ఇకనుంచి జ్ఞానం కలిగి జీవించండి. తెలివి కలిగించే బాటలో సవ్యంగా నడవండి.” ఎగతాళి చేసేవాళ్ళకు బుద్ధి చెప్పేవాడు తన మీదకే నింద తెచ్చుకుంటాడు. దుష్టులను గద్దించే వాడికి అవమానం కలుగుతుంది. ఎగతాళి చేసేవాణ్ణి గద్దించవద్దు. వాణ్ణి గద్దిస్తే ఒకవేళ వాడు నీపై ద్వేషం పెంచుకుంటాడేమో. జ్ఞానం గలవాడికి హితవాక్కులు బోధిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు. జ్ఞానం గలవాడికి బుద్ధి చెప్పినప్పుడు మరింత జ్ఞానం పొందుతాడు. న్యాయం జరిగించే వాడికి నీతి వాక్కులు బోధిస్తే వాడు తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. జ్ఞానం కలిగి ఉండడానికి మూలాధారం యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడమే. వివేకానికి ఆధారం పరిశుద్ధుడైన దేవుణ్ణి గూర్చిన తెలివి కలిగి ఉండడమే. నా మూలంగానే నువ్వు జీవించే కాలం పెరుగుతుంది. నువ్వు బతికే సంవత్సరాలు ఎక్కువ అవుతాయి. నువ్వు జ్ఞానం గలవాడివైతే నీ జ్ఞానం నీకే ఉపయోగపడుతుంది. నువ్వు అపహాసకుడివైతే దానివల్ల కలిగే ఫలితాలు నువ్వే భరించాలి. బుద్ధిహీనత అనే స్త్రీ గావుకేకలు పెట్టేది. ఆమె తెలివితక్కువది, చదువు లేనిది. ఆమె తన ఇంటి వాకిట్లో కూర్చుంటుంది. పట్టణ ప్రముఖ వీధుల్లో కుర్చీ వేసుకుని కూర్చుంటుంది. ఆ దారిలో వెళ్ళేవాళ్ళను, తమ దారిన తాము తిన్నగా వెళ్ళేవారిని చూసి, “జ్ఞానం లేనివాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి రండి” అని వాళ్ళను పిలుస్తుంది. తెలివి లేని ఒకడు వచ్చినప్పుడు వాణ్ణి చూసి “దొంగిలించిన నీళ్లు తియ్యగా ఉంటాయి. దొంగచాటుగా తిన్న తిండి రుచిగా ఉంటుంది” అని చెబుతుంది. అయితే చనిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారనీ, ఆమె ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళంతా నరక కూపంలో పడిపోతారనీ వాళ్ళు తెలుసుకోలేరు.
సామెతలు 9:1-18 పవిత్ర బైబిల్ (TERV)
జ్ఞానము తన నివాసమును కట్టుకొనెను. దానికి ఏడు స్తంభములను ఆమె నిలబెట్టెను. ఆమె (జ్ఞానము) భోజనం సిద్ధం చేసి, ద్రాక్షారసమును కలిపి, భోజనమును బల్లపైఉంచెను. అప్పుడు ఆమె (జ్ఞానము) తన సేవకులను, ప్రజలను నగరములోని ఎత్తయిన స్థలమునకు తనతో పాటు తినుటకు ఆహ్వానించెను. కొండ మీదికి వచ్చి, ఆమెతో కూడ భోజనం చేసేందుకు మనుష్యులను ఆహ్వానించుటకు తన సేవకులను ఊళ్లోనికి పంపింది. “నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న మనుష్యులారా, మీరు రండి” అని ఆమె చెప్పింది. బుద్దిహీనులను కూడా ఆమె పిలిచింది. “నా జ్ఞాన భోజనం ఆరగించండి, రండి. నేను చేసిన ద్రాక్షారసం తాగండి. మీ పాత బుద్ధిహీన పద్ధతులు విడిచి పెట్టండి. మీకు జీవం ఉంటుంది. తెలివిగల మార్గాన్ని అనుసరించండి” అని ఆమె చెప్పింది. ఒక గర్విష్ఠికి, అతడు చేసింది తప్పు అని చూపించటానికి నువ్వు ప్రయత్నిస్తే అతడు నిన్నే విమర్శిస్తాడు. ఆ మనిషి దేవుని జ్ఞానము గూర్చి హేళన చేస్తాడు. ఒక దుర్మార్గుడిదే తప్పని నీవు చెబితే అతడు నిన్ను హేళన చేస్తాడు. కనుక ఒకడు ఇతరుల కంటే తాను మంచి వాడినని తలిస్తే అతనిది తప్పు అని అతనికి చెప్పవద్దు. దానివల్ల అతడు నిన్ను ద్వేషిస్తాడు. కాని జ్ఞానముగల ఒక మనిషికి సహాయం చేయటానికి నీవు ప్రయత్నిస్తే అతడు నిన్ను గౌరవిస్తాడు. జ్ఞానముగల ఒక మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా జ్ఞానము గలవాడవుతాడు. ఒకవేళ మంచి మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు. యెహోవా యెడల భయము కలిగి యుండుట జ్ఞానము సంపాదించుటకు మొదటి మెట్టు. యెహోవాను గూర్చిన జ్ఞానము తెలివి సంపాదించుటకు మొదటి మెట్టు. నీకు జ్ఞానము ఉంటే అప్పుడు నీ జీవితం ఎక్కువ కాలం ఉంటుంది. నీవు జ్ఞానివి అయితే నీ మంచి కోసమే నీవు జ్ఞానముగలవాడవు అవుతావు. కాని నీవు గర్వంగలవాడవై, యితరులను హేళన చేస్తే అప్పుడు నీ కష్టానికి నిన్ను నీవే నిందించుకోవాలి. బుద్ధిహీనుడు గట్టిగా అరిచే చెడు స్త్రీలాంటివాడు. ఆమెకు తెలివి లేదు. ఆమె తన ఇంటి గుమ్మంలో కూర్చుంటుంది. పట్టణంలో కొండ మీద తన కుర్చీలో ఆమె కూర్చుంటుంది. ప్రజలు ఆ ప్రక్కగా నడిచినప్పుడు ఆమె వారిని పిలుస్తుంది. ఆ మనుష్యులకు ఆమెయందు ఆసక్తి లేదు. కాని “నేర్చుకోవాల్సిన ప్రజలారా, రండి” అని ఆమె అంటుంది. బుద్ధిహీనులను కూడ ఆమె ఆహ్వానించింది. “మీరు నీళ్లు దొంగిలిస్తే అవి మీ స్వంత నీళ్లకంటే ఎక్కువ రుచిగా ఉంటాయి. మీరు రొట్టెను దొంగిలిస్తే మీరు స్వయంగా తయారు చేసుకొనే రొట్టెకంటె అది ఎక్కువ రుచిగా ఉంటుంది” అని ఆమె చెబుతుంది. ఆమె ఇల్లు దయ్యాలతో మాత్రమే నిండి వుందని ఆ బుద్ధిహీనులకు తెలియదు. మరణస్థానపు లోతుల్లోకి వారిని ఆహ్వానించింది!
సామెతలు 9:1-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజనపదార్థములను సిద్ధపరచియున్నది తన పనికత్తెలచేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టలమీద అది నిలిచి – జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివిలేనివారితో అది ఇట్లనుచున్నది – వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానముచేయుడి ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమియు తెలివిలేదు. అది తన ఇంటివాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్లువారిని చూచి – జ్ఞానములేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచి–దొంగి లించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్లువారు పాతాళకూపములో ఉన్నారనియువారి ఎంతమాత్రమును తెలియలేదు. సొలొమోను చెప్పిన సామెతలు.