సామెతలు 31:1-9 - Compare All Versions
సామెతలు 31:1-9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజైన లెమూయేలు సూక్తులు; అతని తల్లి అతనికి బోధించిన ప్రేరేపిత మాటలు. నా కుమారుడా! ఆలకించు, నా గర్భంలో మోసిన నా కుమారుడా, ఆలకించు నా మ్రొక్కుబడులకు జవాబైన నా కుమారుడా, ఆలకించు! నీ బలమును ఆడవారి కోసం ఖర్చు చేయవద్దు, రాజులను పతనము చేసేవారి కోసం నీ శక్తిని ఖర్చు చేయవద్దు. లెమూయేలూ, ఇది రాజులకు తగినది కాదు, మద్యపానం సేవించుట రాజులకు తగినది కాదు, పాలకులు మద్యము కోసం ఆరాటపడకూడదు, ఎందుకంటే వారు త్రాగి, నిర్ణయించిన వాటిని మరచిపోతారు, అణగారిన వారందరి హక్కులను హరించివేస్తారు. నశిస్తున్న వారికి సారా, హృదయ వేదనగల వారికి మద్యము. వారు త్రాగి తమ పేదరికమును మరచిపోతారు తమ కష్టాన్ని ఇక తలంచరు. తమ గురించి తాము మాట్లాడలేని వారి కోసం, నిరాశ్రయులందరి హక్కుల కోసం మాట్లాడండి. మాట్లాడండి న్యాయంగా తీర్పు తీర్చండి; దీనుల, అవసరతలో ఉన్న వారి హక్కులను పరిరక్షించండి.
సామెతలు 31:1-9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, కుమారా, నేనేమంటాను? నేను కన్న కుమారా, నేనేమంటాను? నా మొక్కులు మొక్కి కనిన కుమారా, నేనే మంటాను? నీ బలాన్ని స్త్రీలకియ్యకు. రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసం చేయ వద్దు. ద్రాక్షారసం తాగడం రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. అధికారులు “ద్రాక్ష మద్యం ఏది?” అని అడగడం తగదు. తాగితే వారు చట్టాలను విస్మరిస్తారు. దీనులందరి హక్కులనూ కాలరాస్తారు. ప్రాణం పోతున్నవాడికి మద్యం ఇవ్వండి. మనోవేదన గలవారికి ద్రాక్షారసం ఇవ్వండి. వారు తాగి తమ పేదరికాన్ని మర్చిపోతారు. తమ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోరు. మూగవారి పక్షంగా మాట్లాడు. దిక్కులేని వారికి న్యాయం జరిగేలా నీ నోరు తెరువు. నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చు. దీనులకు బాధ పడేవారికి దరిద్రులకు న్యాయం చెయ్యి.
సామెతలు 31:1-9 TERV (పవిత్ర బైబిల్)
లెమూయేలు రాజు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి. ఈ విషయాలను అతని తల్లి అతనికి నేర్పించింది. నీవు నా కుమారుడవు. నేను ప్రేమించే నా కుమారుడివి. నాకు కావాలని నేను ప్రార్థించిన కుమారుడివి నీవు. స్త్రీలకోసం నీ బలం వ్యర్థం చేయవద్దు. స్త్రీలే రాజులను నాశనం చేసేవాళ్లు. వారికోసం నిన్ను నీవు వ్యర్థం చేసుకోవద్దు. లెమూయేలూ, రాజులు ద్రాక్షారసం త్రాగటం జ్ఞానముగల పనికాదు. మద్యము కోరుట పరిపాలకులకు జ్ఞానముగల పనికాదు. వారు విపరీతంగా తాగేసి న్యాయచట్టం చెప్పేదానిని మరచి పోవచ్చు. అప్పుడు వారు పేద ప్రజల హక్కులు అన్నీ తీసివేస్తారు. మద్యం పేద ప్రజలకు ఇమ్ము. ద్రాక్షారసం కష్టంలో ఉన్న ప్రజలకు ఇమ్ము. అప్పుడు వారు అది తాగి, వారు పేదవాళ్లు అనే మాట మరచిపోతారు. వాళ్లు తాగేసి వారి కష్టాలన్నీ మరచిపోతారు. ఒకడు తనకు తానే సహాయం చేసికోలేకపోతే అప్పుడు నీవు అతనికి సహాయం చేయాలి. కష్టంలో ఉన్న ప్రజలందరికీ నీవు సహాయం చేయాలి. సరైనవి అని నీకు తెలిసిన విషయాల కోసం నీవు నిలబడు. మనుష్యులందరికీ న్యాయంగా తీర్పు తీర్చు. పేద ప్రజల, నీ అవసరం ఉన్న ప్రజల హక్కులను కాపాడు.
సామెతలు 31:1-9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతని కుపదేశించిన దేవోక్తి, నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనే మందును? నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలూ, అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగినయెడల వారు కట్టడలను మరతురు దీనులకందరికి అన్యాయము చేయుదురు ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి. వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచకుందురు. మూగవారికిని దిక్కులేనివారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము.