సామెతలు 3:3-8

సామెతలు 3:3-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ప్రేమ, నమ్మకత్వం ఎన్నడు నిన్ను విడచిపోనివ్వకు; నీ మెడలో వాటిని ధరించుకో, నీ హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకో. అప్పుడు నీవు దేవుని దృష్టిలోను మనుష్యుల దృష్టిలోను దయపొంది మంచివాడవని అనిపించుకుంటావు. నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు; నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు, అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్నగా చేస్తారు. నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు; యెహోవా పట్ల భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టు. అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు బలం కలుగుతుంది.

సామెతలు 3:3-8 పవిత్ర బైబిల్ (TERV)

ప్రేమించటం ఎన్నటికీ చాలించకు. ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండు. ఈ విషయాలను నీ జీవితంలో ఒక భాగంగా ఎంచుకో. వాటిని నీ మెడ చుట్టూ కట్టుకో. వాటిని నీ హృదయం మీద వ్రాసుకో. అప్పుడు దేవుని దృష్టియందును, మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవనిపించుకొందువు. పూర్తిగా యెహోవాను నమ్ముకో! నీ స్వంత తెలివి మీద ఆధారపడవద్దు. నీవు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచు. అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ స్వంత జ్ఞానం మీద ఆధార పడవద్దు. కాని యెహోవాను గౌరవించి, దుర్మార్గానికి దూరంగా ఉండు. నీవు ఇలా చేస్తే, అప్పుడు నీ శరీరానికి మంచి ఆరోగ్యమునూ నీ ఎముకలకు సత్తువా కలుగుతుంది.

సామెతలు 3:3-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవునిదృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును.