సామెతలు 1:1-33
సామెతలు 1:1-33 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దావీదు కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజునైన, సొలొమోను యొక్క సామెతలు: జ్ఞానాన్ని ఉపదేశాన్ని పొందడం కోసం; అంతరార్థంతో కూడిన పదాలను గ్రహించడం కోసం; వివేకంతో కూడిన ప్రవర్తన కోసం, సరియైనది, న్యాయమైనది చేయడానికి ఉపదేశం పొందడం కోసం; సామాన్యులకు బుద్ధి కలిగించడం కోసం, యవ్వనస్థులకు తెలివి వివేకం కలిగించడం కోసం, జ్ఞానులు ఈ సామెతలు వింటారు, మరింత తెలివైనవారవుతారు, వివేకంగలవారు ఉపదేశం పొందుకుంటారు. వారు సామెతలు, నీతికథలు, జ్ఞానుల సూక్తులు, చిక్కుప్రశ్నలను గ్రహిస్తారు. యెహోవాయందు భయం తెలివికి మూలం, అయితే మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తృణీకరిస్తారు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని విను నీ తల్లి బోధను త్రోసివేయవద్దు. అవి నీ తలకు చుట్టిన అందమైన మాలగా నీ మెడను అలంకరించే హారంగా ఉంటాయి. నా కుమారుడా, పాపిష్ఠి మనుష్యులు నిన్ను ప్రలోభపెడితే, నీవు వారికి లొంగిపోవద్దు. ఒకవేళ వారు, “మాతో కూడా రా; నిర్దోషుల రక్తాన్ని చిందించడానికి దాగి ఉందాం; హాని చేయని ప్రాణం మీద ఆకస్మిక దాడి చేద్దాం; పాతాళం వలె మనుష్యులు జీవించి ఉండగానే వారిని పూర్తిగా మ్రింగివేద్దాం, సమాధిలోనికి దిగువారి వలె పూర్ణబలంతో ఉండగానే వారిని మ్రింగివేద్దాం; అన్ని రకాల విలువైన వస్తువులు మనం తెచ్చి మన ఇళ్ళను దోపుడు సొమ్ముతో నింపుకొందాం; మాతో చీట్లు వేయండి; మనం దొంగిలించిన దానిని మనమందరం పంచుకుందాము.” నా పిల్లలారా, వారితో కలిసి వెళ్లకండి, వారి దారుల్లో నీ పాదాలు పెట్టకు; కీడు చేయడానికి వారి పాదాలు పరుగెత్తుతాయి, మనుష్యులను చంపడానికి త్వరపడతారు. రెక్కలు గల పక్షులు చూస్తుండగా వల వేయడం నిష్ప్రయోజనం! అయితే ఈ మనుష్యులు తమ నాశనానికే పొంచి ఉంటారు; తమ ప్రాణాన్ని తామే తీసుకోవడానికి వారు దాక్కొని ఉంటారు! అక్రమ సంపాదన వెంటపడే వారందరి దారులు అలాంటివే; అది దానిని సొంతం చేసుకున్న వారి ప్రాణాలు తీస్తుంది. జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తున్నది, అది బహిరంగ స్థలాల్లో తన గొంతు గట్టిగా వినిపిస్తుంది; అధిక రద్దీ ఉండే వీధి చివర్లలో అది కేక వేస్తుంది, పట్టణ ద్వారాల దగ్గర ఆమె తన ప్రసంగం చేస్తుంది: “బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు బుద్ధిహీనుని మార్గాలను ప్రేమిస్తారు? ఎగతాళి చేసేవారు ఎన్నాళ్ళు ఎగతాళి చేస్తూ ఆనందిస్తారు? బుద్ధిహీనులు ఎన్నాళ్ళు తెలివిని అసహ్యించుకుంటారు? నా గద్దింపును విని పశ్చాత్తాపపడండి! అప్పుడు నా ఆత్మను మీమీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాలను మీకు తెలియజేస్తాను. కానీ నేను పిలిచినప్పుడు మీరు వినడానికి నిరాకరించినందున నేను నా చేయి చాచినప్పుడు ఎవరూ పట్టించుకోనందున, మీరు నా సలహాను లెక్కచేయనందున నా గద్దింపును అంగీకరించనందున, ఆపద మిమ్మల్ని తాకినప్పుడు నేను నవ్వుతాను; విపత్తు మిమ్మల్ని అధిగమించినప్పుడు నేను ఎగతాళి చేస్తాను, విపత్తు తుఫానులా మిమ్మల్ని అధిగమించినప్పుడు, ఆపద మిమ్మల్ని తుఫానులా ముంచినప్పుడు, మీకు బాధ ఇబ్బంది కలిగినప్పుడు నేను ఎగతాళి చేస్తాను. “అప్పుడు వారు నాకు మొరపెడతారు కాని నేను జవాబు ఇవ్వను; నా కోసం ఆతురతగా వెదకుతారు కాని నేను కనబడను, వారు జ్ఞానాన్ని అసహ్యించుకున్నారు, యెహోవాకు భయపడాలని వారు కోరలేదు కాబట్టి. వారు నా సలహాను అంగీకరించలేదు నా గద్దింపును కూడా త్రోసివేశారు కాబట్టి, వారు తమ క్రియలకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు వారి ఆలోచనల ఫలితాలకు వారే విసుగుచెందుతారు. మూర్ఖులు దారితప్పడం వల్ల నశిస్తారు, బుద్ధిహీనుల నిర్లక్ష్యం వారిని నాశనం చేస్తుంది; నా మాటలను వినేవారు క్షేమంగా నివసిస్తారు; కీడు కలుగుతుందనే భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు.”
సామెతలు 1:1-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు. జ్ఞానం, ఉపదేశం నేర్చుకోవడానికీ, వివేకం, జ్ఞానవాక్కులు బోధించడానికీ, నీతి, న్యాయం, యథార్థతల ప్రకారం నడుచుకుంటూ దిద్దుబాటు చేసుకోవడానికి, ఉపదేశం పొందని వారికి వివేకం ఇవ్వడానికి, యువతకు తెలివి, విచక్షణ కలిగేలా చేయడానికి ఉపకరిస్తాయి. తెలివి గలవాడు ఈ సామెతలు విని తన జ్ఞానం వృద్ధి చేసుకుంటాడు. వివేకం గలవాడు విని నీతి సూత్రాలు అలవర్చుకుంటాడు. వీటి మూలంగా సామెతలు, ఉపమానాలు, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన నిగూఢ సత్యాలు ప్రజలు గ్రహిస్తారు. యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలకారణం. మూర్ఖప్రజలు జ్ఞానాన్ని, నీతి వాక్యాలను వ్యతిరేకిస్తారు. కుమారా, నీ తండ్రి చెప్పే సద్బోధ విను. నీ తల్లి చెప్పే మాటలు నిర్ల్యక్ష్యం చెయ్యకు. అవి నీ తలపై అందమైన పుష్ప కిరీటంలా ఉంటాయి. నీ మెడలో హారాలుగా నిలబడతాయి. కుమారా, దుష్టులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు. దుష్టులు నీతో “మాతో చేతులు కలుపు. ఎవరినైనా చంపడానికి కాపు కాద్దాం. అమాయకుడైన ఒకణ్ణి పట్టుకుందాం. ఆరోగ్య వంతుణ్ణి పాతాళం అకస్మాత్తుగా తీసేసుకున్నట్టు వారిని సజీవంగా మింగేద్దాం. సమాధిలోకి దిగే వారిలా వారిని చేసేద్దాం. దోచుకున్న సొమ్ముతో మన ఇల్లు నింపుకుందాం, రకరకాల విలువైన వస్తువులు మనకు దొరుకుతాయి. నువ్వు మాతో కలసి ఉండు, మనమంతా ఒకే చోట సొమ్ము దాచుకుందాం” అని నీతో చెబితే వాళ్ళ మాటలు లక్ష్యపెట్టవద్దు. కుమారా, నువ్వు వాళ్ళు నడిచే దారిలో వెళ్ళ వద్దు. వాళ్ళ ఆలోచన ప్రకారం చేయకుండేలా నీ పాదాలు అదుపులో ఉంచుకో. మనుషులను చంపడానికి వాళ్ళు తొందరపడుతూ ఉంటారు. హాని కలిగించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక పక్షి చూస్తూ ఉండగా దానికి వల వేయడం అనవసరం. వాళ్ళు తమ స్వంత నాశనానికే మాటు వేస్తారు. తాము పట్టబడతామని దాక్కుని ఉంటారు. అక్రమ ఆర్జన ఆశించే వాళ్లకు ఇదే గతి పడుతుంది. ఆ మార్గంలో నడిచే వాళ్ళ ప్రాణాలు అదే తీస్తుంది. జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తూ ఉంది. వీధుల వెంబడి బిగ్గరగా మాట్లాడుతూ ఉంది. జ్ఞానం సందడిగా ఉన్న ప్రాంతాల్లో ప్రకటన చేస్తూ ఉంది. పట్టణ ప్రధాన ప్రవేశాల్లో ప్రచారం చేస్తూ ఇలా తెలియజేస్తూ ఉంది. “జ్ఞాన హీనులారా, జ్ఞానం తెచ్చుకోకుండా ఎంతకాలం ఉండాలని కోరుకుంటారు? అపహాసకులారా, మీరు ఎగతాళి చేస్తూ ఎన్నేళ్ళు ఆనందంగా కాలం గడుపుతారు? బుద్ధిహీనులారా, మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు? నా గద్దింపు మాటలు వినండి. నా వైపు తిరగండి. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. మంచి సంగతులు మీకు తెలియజేస్తాను. నేను పిలిచినప్పుడు నా మాట మీరు వినలేదు. నా చెయ్యి చాపినప్పుడు ఎవ్వరూ అందుకోలేదు. నేను మిమ్మల్ని గద్దించి మంచి మాటలు బోధించినప్పుడు నా మాటలు లక్ష్యపెట్టలేదు, లోబడలేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. మీరు భయంతో వణుకుతున్నప్పుడు నేను మిమ్మల్ని ఎగతాళి చేస్తాను. తుఫాను వచ్చినట్టు మీకు భయం కలుగుతుంది, సుడిగాలి రేగినట్టు ప్రమాదం వచ్చి పడుతుంది. మీకు కష్ట సమయాలు, దుఃఖ సమయాలు సంభవిస్తాయి. అప్పుడు నేను మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తాను. అప్పుడు వాళ్ళు నా కోసం మొరపెడతారు, కానీ నేను ఎలాంటి జవాబూ ఇవ్వను. నా కోసం ఆసక్తిగా వెతుకుతారు కానీ నేను వాళ్లకు కనబడను. జ్ఞానం అంటే వాళ్లకు అసహ్యం వేస్తుంది. యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం వాళ్లకు ఇష్టం లేకుండా పోయింది. వాళ్ళు నేను చెప్పిన నా మంచి ఆలోచనలు అంగీకరించలేదు. నా మందలింపును నిర్లక్ష్యం చేశారు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. విరక్తి కలిగే దాకా తమ స్వంత ఆలోచనలు అనుసరిస్తారు. ఉపదేశం పొందని వారు దేవుణ్ణి తిరస్కరించి నాశనమవుతారు. మూర్ఖుల నిర్లక్ష్యం వారిని నిర్మూలం చేస్తుంది. నా ఉపదేశం విని దాని ప్రకారం నడుచుకునేవాడు సురక్షితంగా నివసిస్తాడు. కీడు కలుగుతుందన్న భయం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు.”
సామెతలు 1:1-33 పవిత్ర బైబిల్ (TERV)
ఈ మాటలు దావీదు కుమారుడైన సొలొమోను చెప్పిన సామెతలు. సొలొమెను ఇశ్రాయేలీయుల రాజు. ప్రజలు జ్ఞానము కలిగి, సరైన వాటిని చేయటం తెలుసుకొనేందుకు ఈ సంగతులు వ్రాయబడ్డాయి. నిజమైన అవగాహన కలిగి ఉండేందుకు ప్రజలకు ఈ మాటలు సహాయం చేస్తాయి. ప్రజలు జీవించేందుకు శ్రేష్ఠమైన విధానాన్ని ఈ మాటలు నేర్పిస్తాయి. నీతి, నిజాయితీ, మంచితనం కలిగి ఉండేందుకు సరైన మార్గాన్ని ప్రజలు నేర్చుకుంటారు. జ్ఞానమును నేర్చుకోవాల్సిన సాధారణ మనుష్యులకు జ్ఞానముగల ఈ మాటలు నేర్చిస్తాయి. యువతీ యువకులు ఈ మాటల మూలంగా జ్ఞానము, దాని ప్రయోగాన్ని నేర్చుకొంటారు. ఈ మాటల్లోని ఉపదేశాలను జ్ఞానముగలవారు కూడ జాగ్రత్తగా అనుసరించాలి. అప్పుడు వాళ్లు ఇంకా ఎక్కువ నేర్చుకొని, ఇంకా జ్ఞానముగల వారు అవుతారు. మంచి చెడుల తారతమ్యం తెలుసుకోవటంలో నిపుణతగల వారు యింకా ఎక్కువ అవగాహన సంపాదిస్తారు. అప్పుడు జ్ఞానముగల కథలు, పొడుపు కథలు మనుష్యులు గ్రహించగలుగుతారు. జ్ఞానముగల వారు చెప్పే విషయాలను మనుష్యులు గ్రహించగలుగుతారు. ఒక వ్యక్తి యెహోవాను గౌరవించి, ఆయనకు విధేయత చూపించటమే, నిజమైన తెలివికి మూలము. కాని పాపాన్ని ప్రేమించే మనుష్యులు జ్ఞానాన్ని, సరైన ఉపదేశాన్ని ద్వేషిస్తారు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశానికి నీవు విధేయుడవు కావాలి. మరియు నీ తల్లి ఉపదేశాలు కూడ నీవు పాటించాలి. నీ తల్లిదండ్రుల మాటలు నీ తలను మరింత అందంగా తీర్చిదిద్దే పూల కిరీటంలా ఉంటాయి. ఆ ఉపదేశాలు నీ మెడకు అందమైన హారంలా ఉంటాయి. నా కుమారుడా, పాపాన్ని ప్రేమించే ప్రజలు తమతో కూడ పాపాన్ని చేయించటానికి పయత్నిస్తారు. నీవు వారిని అనుసరించకూడదు. ఆ పాపులు ఇలా చెప్పవచ్చు: “మాతో వచ్చేయి! మనం దాక్కొని, ఎవరినైనా అమాయకుణ్ణి చంపటానికి కనిపెడదాం. ఎవరైనా ఒక నిర్దోషిమీద మనం దాడి చేద్దాం. మనం అతణ్ణి చంపుదాం. ఆ మనిషిని పితృ లోకానికి మనం పంపిద్దాం. అతణ్ణి మనం నాశనం చేసి, సమాధికి పంపిద్దాం. చాలా ధనం, విలువ చేసే అన్ని రకాల వస్తువులు మనం దొంగిలిద్దాం. ఈ వస్తువులతో మనం మన గృహాలు నింపుకొందాం. కనుక మాతో వచ్చి, వీటిని చేయటానికి మాకు సహాయం చేయి. మనకు దొరికే వస్తువులన్నింటినీ మనం అందరం పంచుకొందాం.” నా కుమారుడా, పాపాన్ని ప్రేమించే మనుష్యులను వెంబడించవద్దు. వారు జీవించే విధానంలో మొదటి మెట్టు కూడా నీవు ఎక్కవద్దు. ఆ చెడ్డ మనుష్యులు కీడు చేయటానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. వారు ఎంతసేపూ మనుష్యులను చంపాలని ఆశిస్తూంటారు. ఒక పక్షి నిన్ను చూస్తూండగా ఆ పక్షిని పట్టాలని వల వేయటం నిష్ప్రయోజనం. కనుక ఆ దుర్మార్గులను కనిపెట్టి ఉండు. జాగ్రత్తగా ఉండు. ఆ దుర్మార్గులు ఇతరులను చంపాలని ఉచ్చు వేస్తున్నారు. కాని నిజానికి వారికి వారే ఉచ్చు వేసుకొంటారు. వారి స్వంత ఉచ్చుతో వారే నాశనం చేయబడుతారు. ఇవి దురాశపరుల పద్ధతులు అలాంటి దురాశ అది కలిగివున్నవారికి ప్రాణాంతక మవుతుంది. ఇలా విను! జ్ఞానము ప్రజలకు ఉపదేశించటానికి ప్రయత్నిస్తుంది. ఆమె (జ్ఞానము) వీధుల్లో, సంతల్లో అరుస్తుంది. రద్దీగల వీధి మూలల్లో ఆమె (జ్ఞానము) పిలుస్తోంది. ఆమె (జ్ఞానము) తన మాటలు వినేందుకు ప్రజలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తూ పట్టణ ద్వారాల దగ్గర ఉంటూ (జ్ఞానము) చెపుతుంది: “మీరు వెర్రివాళ్లు. ఇంకెన్నాళ్లు మీరు ఇలా వెర్రి పనులు చేస్తూనే ఉంటారు? ఎన్నాళ్లు మీరు తెలివిని ద్వేషీస్తూ ఉంటారు? మీరు పశ్చాత్తాపపడి నా సలహా, నా ఉపదేశం విని ఉంటే, నాకు తెలిసింది అంతా నేను మీతో చెప్పి ఉండేదాన్ని. నాకు ఉన్న తెలివి అంతా మీకు ఇచ్చి ఉండేదాన్ని. “కాని మీరు నా మాట వినేందుకు తిరస్కరించారు. సహాయం చేయటానికి నేను ప్రయత్నించాను. నేను నా చేయి అందించాను. కాని నా సహాయం స్వీకరించటానికి మీరు నిరాకరించారు. నా సలహా అంతటినీ మీరు నిర్లక్ష్యం చేసి, తిప్పికొట్టారు. నా మాటలు స్వీకరించటానికి మీరు నిరాకరించారు. అందుచేత నేను మీ కష్టం చూచి నవ్వుతాను. మీకు కష్టం కలగటం చూచి నేను సరదా పడతాను. గొప్ప కష్టం తుఫానులా మీ మీదికి వస్తుంది. సమస్యలు ఒక బలమైన గాలిలా మీ మీద కొడతాయి. మీ కష్టాలు, మీ విచారం మీ మీద మహా గొప్ప భారంగా ఉంటాయి. “ఈ సంగతులన్నీ జరిగినప్పుడు మీరు నా సహాయం కోసం అడుగుతారు. కాని నేను మీకు సహాయం చేయను. మీరు నాకోసం వెదుకుతారు, కాని మీరు నన్ను కనుగొనలేరు. మీరు ఎన్నడూ నా తెలివిని కోరుకోలేదు, గనుక నేను మీకు సహాయం చేయను. మీరు యెహోవాకు భయపడి ఆయనను గౌరవించుటకు నిరాకరించారు. నా సలహా మాటలు వినేందుకు ప్రజలారా మీరు నిరాకరించారు. నేను సరైనదారి మీకు చూపించినప్పుడు మీరు నా మాట వినేందుకు నిరాకరించారు. కనుక మీరు మీ స్వంత విదానంలోనే పనులు చేసుకోవాలి. మీ స్వంత కీడు మార్గాల్లో జీవిస్తూ మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు. “అవివేకులు జ్ఞానాన్ని అనుసరించేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తారు. వారి బుద్ధిహీన పధ్ధతులలో కొనసాగటం వారికి సంతోషం, అదే వారిని చంపుతుంది. కాని, నాకు విధేయత చూపే వ్యక్తి క్షేమంగా జీవిస్తాడు. ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు. అతడు కీడుకు భయపడాల్సిన అవసరం ఉండదు.”
సామెతలు 1:1-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దావీదు కుమారుడును ఇశ్రాయేలురాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధికుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించుటకును యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలి వికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. –మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము పాతాళము మనుష్యులను మ్రింగివేయునట్లు వారిని జీవముతోనే మ్రింగివేయుదము సమాధిలోనికి దిగువారు మ్రింగబడునట్లువారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మ్రింగివేయు దము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. –పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము. కీడుచేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది –ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు? నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను. అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగానుండును.