ఫిలిప్పీయులకు 4:8-13

ఫిలిప్పీయులకు 4:8-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

చివరిగా, సహోదరీ సహోదరులారా, ఏదైనా యోగ్యమైనదిగా లేదా మంచిగా ఉంటే, సత్యమైన వాటి మీద, గొప్పవాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, సుందరమైన వాటి మీద, ఘనమైన వాటి మీద మీ మనస్సులను పెట్టండి. మీరు నా నుండి ఏవి నేర్చుకున్నారో, పొందారో లేదా విన్నారో లేదా నాలో ఏమి చూశారు వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు సమాధానకర్తయైన దేవుడు మీతో ఉంటారు. నా గురించి మీరు తిరిగి మరల ఆలోచిస్తున్నారని ప్రభువులో ఎంతో సంతోషించాను. మీరు నా గురించి ఆలోచిస్తున్నారు, గాని దానిని చూపించడానికి తగిన అవకాశం మీకు దొరకలేదు. నేను అవసరంలో ఉన్నానని ఇలా చెప్పడం లేదు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. దీనస్థితిలో ఉండడం అంటే నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. ఏ స్థితిలోనైనా అన్ని పరిస్థితుల్లో అనగా, కడుపునిండా తిన్నా లేదా ఆకలితో ఉన్నా, సమృద్ధిగా ఉన్నా లేదా అవసరంలో ఉన్నా తృప్తి కలిగి ఉండడానికి రహస్యాన్ని నేను నేర్చుకున్నాను. నన్ను బలపరిచే ఆయనలోనే నేను ఇవన్నీ చేయగలను.

ఫిలిప్పీయులకు 4:8-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నా గురించి మీరు ఇప్పటికైనా మళ్ళీ శ్రద్ధ వహించారని ప్రభువులో చాలా సంతోషించాను. గతంలో మీరు నా గురించి ఆలోచించారు గానీ మీకు సరైన అవకాశం దొరకలేదు. నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను. నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

ఫిలిప్పీయులకు 4:8-13 పవిత్ర బైబిల్ (TERV)

కనుక సోదరులారా! నేను చివరకు చెప్పేదేమిటంటే, సత్యమైనవాటిని, మంచివాటిని, ధర్మమైనవాటిని, పవిత్రమైనవాటిని, ఆనందమైనవాటిని, మెచ్చుకోతగ్గవాటిని, అంటే ఉత్తమంగా ఉన్నవాటిని గురించి, ప్రశాంతమైనవాటిని గురించి మీ మనస్సులో ఆలోచించండి. మీరు నా ద్వారా నేర్చుకొన్నవాటిని, నా నుండి పొందినవాటిని, నా నుండి విన్నవాటిని, నాలో చూసినవాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు శాంతిని కలిగించే దేవుడు మీతో ఉంటాడు. మీకు నా పట్ల ఉన్న అభిమానం మళ్ళీ మొలకెత్తినందుకు నేను ప్రభువు పేరిట చాలా ఆనందిస్తున్నాను. ఔను, మీకు నా పట్ల అభిమానం ఉంది కాని, దాన్ని చూపించుకొనే అవకాశం మీకు చిక్కలేదు. నాకు మీ అవసరముందని ఈ విధంగా మాట్లాడటం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా తృప్తిగా ఉండేందుకు నేను నేర్చుకొన్నాను. అవసరంలో ఉండటం అంటే ఏమిటో, అధికంగా కలిగి ఉండటం అంటే ఏమిటో నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు నిండి ఉన్నప్పుడును ఆకలితో ఉన్నప్పుడును, అవసరాలలో ఉన్నప్పుడును అధికంగా కలిగి ఉన్నప్పుడును సంతృప్తికరంగా ఎలా ఉండాలో, దాని రహస్యమేమిటో నేను తెలుసుకున్నాను. నాకు శక్తినిచ్చే క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను.

ఫిలిప్పీయులకు 4:8-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి. మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడై యుండును. నన్నుగూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయ సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచనచేసియుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధికలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.

ఫిలిప్పీయులకు 4:8-13

ఫిలిప్పీయులకు 4:8-13 TELUBSIఫిలిప్పీయులకు 4:8-13 TELUBSIఫిలిప్పీయులకు 4:8-13 TELUBSIఫిలిప్పీయులకు 4:8-13 TELUBSIఫిలిప్పీయులకు 4:8-13 TELUBSI