ఫిలిప్పీయులకు 4:14-23
ఫిలిప్పీయులకు 4:14-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయినప్పటికీ మీరు నా శ్రమలలో భాగం పంచుకోవడం మంచి పని. అంతేకాక, ఫిలిప్పీయులారా, మీరు సువార్తను తెలుసుకున్న తొలి రోజుల్లో, నేను మాసిదోనియలో నుండి పంపబడినప్పుడు, ఇవ్వడంలో తీసుకోవడంలో కేవలం మీరు తప్ప మరి ఏ సంఘం నాతో పాలివారు కాలేదని మీకు తెలుసు. నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా, నేను అవసరంలో ఉన్నప్పుడు అనేకసార్లు మీరు సహాయాన్ని పంపించారు. నేను మీ కానుకలను కోరుకోవడంలేదు; మీరు ఇంకా అధికంగా పొందుకోవాలని కోరుకుంటున్నాను. నేను సమృద్ధిగా పూర్తిగా పొందాను. మీరు పంపిన కానుకలు ఎపఫ్రొదితు నుండి అందుకున్నాను. అవి దేవునికి ఇష్టమైన పరిమళ అర్పణ, అంగీకారమైన త్యాగము. నా దేవుడు తన మహిమైశ్వర్యం ఆధారంగా క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు. మన తండ్రియైన దేవునికి మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్. క్రీస్తు యేసులో దేవుని ప్రజలందరికి వందనాలు చెప్పండి. నాతోకూడ ఉన్న సహోదరీ సహోదరులందరు మీకు వందనాలు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న దేవుని ప్రజలందరు ముఖ్యంగా కైసరు కుటుంబానికి చెందినవారు మీకు వందనాలు చెప్తున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక ఆమేన్.
ఫిలిప్పీయులకు 4:14-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయినా నా కష్టాలు పంచుకోవడంలో మీరు మంచి పని చేశారు. ఫిలిప్పీయులారా, నేను సువార్త బోధించడం మొదలుపెట్టి మాసిదోనియ నుంచి బయలుదేరినప్పుడు మీ సంఘమొక్కటే నాకు సహాయం చేసి నన్ను ఆదుకున్నది. ఈ సంగతి మీకే తెలుసు. ఎందుకంటే తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికీ నా అవసరం తీర్చడానికి సహాయం చేశారు. నేను బహుమానాన్ని ఆశించి ఇలా చెప్పడం లేదు, మీకు ప్రతిఫలం అధికం కావాలని ఆశిస్తూ చెబుతున్నాను. నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు ద్వారా అందాయి. నాకు ఏమీ కొదువ లేదు. అవి ఇంపైన సువాసనగా, దేవునికి ఇష్టమైన అర్పణగా ఉన్నాయి. కాగా నా దేవుడు తన ఐశ్వర్యంతో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవునికి ఎప్పటికీ మహిమ కలుగు గాక. ఆమేన్. పవిత్రులందరికీ క్రీస్తు యేసులో అభివందనాలు చెప్పండి. నాతో పాటు ఉన్న సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రులంతా, ముఖ్యంగా సీజర్ చక్రవర్తి ఇంట్లో ఉన్న పవిత్రులు మీకు అభివందనాలు చెబుతున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండు గాక.
ఫిలిప్పీయులకు 4:14-23 పవిత్ర బైబిల్ (TERV)
అయినా మీరు నా కష్టాలు పంచుకొని మంచి పని చేసారు. పైగా దైవసందేశాన్ని గురించి మీరు క్రొత్తగా విన్నప్పుడు, ఫిలిప్పీలో ఉన్న మీరు తప్ప ఎవ్వరూ నాకు సహాయం చెయ్యలేదు. నేను మాసిదోనియ నుండి ప్రయాణం సాగించినప్పుడు ఒక్క సంఘం కూడా నాకు సహాయం చెయ్యలేదు. నాకు వాళ్ళు ఏమీ యివ్వలేదు. నానుండి ఏమీ పుచ్చుకోలేదు. నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా నా అవసరాన్ని బట్టి మీరు నాకు ఎన్నోసార్లు సహాయం చేసారు. నేను మీ నుండి విరాళాలు పొందాలని యిలా మాట్లాడటం లేదు. మీ జీవితం యొక్క లెక్కలకు కొంత లాభం చేకూర్చాలని నా అభిప్రాయం. నాకు కావలసినదానికన్నా ఎక్కవే చెల్లించారు. మీరు ఎపఫ్రొదితు ద్వారా నాకు పంపిన విరాళాలు నాకు ముట్టాయి. దానితో నా అవసరాలు పూర్తిగా తీరిపోయాయి. సుగంధ పరిమళాల వలే ఉన్న మీ విరాళాలను దేవుడు ఆనందంగా అంగీకరిస్తాడు. నా దేవుడు యేసు క్రీస్తులో ఉన్న గొప్ప ఐశ్వర్యంతో మీ అవసరాలన్నీ తీరుస్తాడు. మన తండ్రియైన దేవునికి చిరకాలపు కీర్తి కలుగుగాక! ఆమేన్. యేసు క్రీస్తులో ఐక్యత పొందిన ప్రతి పవిత్రునికి నా వందనాలు తెలుపండి. నాతోవున్న సోదరులందరూ మీకు వందనాలు తెలుపుతున్నారు. పవిత్రులందరు, ముఖ్యంగా చక్రవర్తి భవనంలో నివసించేవాళ్ళు, మీకు వందనాలు తెలుపుతున్నారు. యేసు క్రీస్తు ప్రభువుయొక్క అనుగ్రహము మీ ఆత్మకు తోడుగా ఉండుగాక!
ఫిలిప్పీయులకు 4:14-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప నారంభించి మాసిదోనియలోనుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపువారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియును. ఏలయనగా థెస్సలొనీకలో కూడ మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పు చున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగ మునై యున్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవ సరమును తీర్చును. మన తండ్రియైన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి. నాతోకూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక.