ఫిలిప్పీయులకు 4:11-15

ఫిలిప్పీయులకు 4:11-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నేను అవసరంలో ఉన్నానని ఇలా చెప్పడం లేదు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. దీనస్థితిలో ఉండడం అంటే నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. ఏ స్థితిలోనైనా అన్ని పరిస్థితుల్లో అనగా, కడుపునిండా తిన్నా లేదా ఆకలితో ఉన్నా, సమృద్ధిగా ఉన్నా లేదా అవసరంలో ఉన్నా తృప్తి కలిగి ఉండడానికి రహస్యాన్ని నేను నేర్చుకున్నాను. నన్ను బలపరిచే ఆయనలోనే నేను ఇవన్నీ చేయగలను. అయినప్పటికీ మీరు నా శ్రమలలో భాగం పంచుకోవడం మంచి పని. అంతేకాక, ఫిలిప్పీయులారా, మీరు సువార్తను తెలుసుకున్న తొలి రోజుల్లో, నేను మాసిదోనియలో నుండి పంపబడినప్పుడు, ఇవ్వడంలో తీసుకోవడంలో కేవలం మీరు తప్ప మరి ఏ సంఘం నాతో పాలివారు కాలేదని మీకు తెలుసు.

ఫిలిప్పీయులకు 4:11-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను. నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను. అయినా నా కష్టాలు పంచుకోవడంలో మీరు మంచి పని చేశారు. ఫిలిప్పీయులారా, నేను సువార్త బోధించడం మొదలుపెట్టి మాసిదోనియ నుంచి బయలుదేరినప్పుడు మీ సంఘమొక్కటే నాకు సహాయం చేసి నన్ను ఆదుకున్నది. ఈ సంగతి మీకే తెలుసు.

ఫిలిప్పీయులకు 4:11-15 పవిత్ర బైబిల్ (TERV)

నాకు మీ అవసరముందని ఈ విధంగా మాట్లాడటం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా తృప్తిగా ఉండేందుకు నేను నేర్చుకొన్నాను. అవసరంలో ఉండటం అంటే ఏమిటో, అధికంగా కలిగి ఉండటం అంటే ఏమిటో నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు నిండి ఉన్నప్పుడును ఆకలితో ఉన్నప్పుడును, అవసరాలలో ఉన్నప్పుడును అధికంగా కలిగి ఉన్నప్పుడును సంతృప్తికరంగా ఎలా ఉండాలో, దాని రహస్యమేమిటో నేను తెలుసుకున్నాను. నాకు శక్తినిచ్చే క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను. అయినా మీరు నా కష్టాలు పంచుకొని మంచి పని చేసారు. పైగా దైవసందేశాన్ని గురించి మీరు క్రొత్తగా విన్నప్పుడు, ఫిలిప్పీలో ఉన్న మీరు తప్ప ఎవ్వరూ నాకు సహాయం చెయ్యలేదు. నేను మాసిదోనియ నుండి ప్రయాణం సాగించినప్పుడు ఒక్క సంఘం కూడా నాకు సహాయం చెయ్యలేదు. నాకు వాళ్ళు ఏమీ యివ్వలేదు. నానుండి ఏమీ పుచ్చుకోలేదు.

ఫిలిప్పీయులకు 4:11-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధికలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప నారంభించి మాసిదోనియలోనుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపువారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియును.