ఫిలిప్పీయులకు 3:9-15 - Compare All Versions
ఫిలిప్పీయులకు 3:9-15 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
క్రీస్తును సంపాదించుకుని, ధర్మశాస్త్రం వలన కలిగే నా నీతిని కాకుండా, క్రీస్తులోని విశ్వాసాన్నిబట్టి దేవుడు దయ చేసిన నీతిని కలిగి ఆయనలో కనబడాలని, నేను క్రీస్తును తెలుసుకోవాలని కోరుతున్నాను, అవును, ఆయన పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలని, ఆయన శ్రమలలో పాలుపంచుకోవడం, ఆయన మరణంలో ఆయనలా కావడం, అలా, ఏదో ఒక విధంగా, మృతులలో నుండి పునరుత్థానం పొందడము. నేను ఇప్పటికే ఇవన్నీ పొందానని గాని, నా లక్ష్యాన్ని చేరుకున్నానని గాని నేను భావించడంలేదు, కాని దేనికోసం క్రీస్తు యేసు నన్ను పట్టుకున్నారో దానిని పట్టుకోవాలని పరుగెడుతున్నాను. సహోదరీ సహోదరులారా, నేను ఇంతకుముందే దానిని పట్టుకున్నానని భావించను, అయితే నేను చేస్తున్నది ఒకటే, వెనుక ఉన్నవాటిని మరచిపోయి ముందున్న వాటికోసం ప్రయాసపడుతున్నాను, క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు వలన కలిగే బహుమానాన్ని గెలవడానికి, లక్ష్యం వైపే పరుగెడుతున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరం ఇదే భావాన్ని కలిగి ఉందాము. అప్పుడు దేని గురించైనా మీరు వేరుగా ఆలోచిస్తే, దాన్ని కూడా దేవుడు మీకు స్పష్టం చేస్తారు.
ఫిలిప్పీయులకు 3:9-15 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ధర్మశాస్త్రమూలమైన నా స్వనీతిగాక, క్రీస్తులోని విశ్వాసమూలమైన నీతికి బదులుగా, అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే నీతిగలవాడనై ఆయనలో కనపడేలా అలా చేశాను. ఆయనను ఎరగడం అనే నీతిన్యాయాలు, ఆయన పునరుత్థాన శక్తి, ఆయన పొందిన హింసల్లో సహానుభవం, క్రీస్తు మూలంగా ఆయన మరణం పోలికలోకి మార్పు చెందడం కోసం, ఏ విధంగానైనా చనిపోయిన వారిలో నుండి నాకు పునరుత్థానం కలగాలని, కోరుతున్నాను. వీటన్నిటినీ ఇంకా నేను పొందలేదు కాబట్టి నేనింకా సంపూర్ణుణ్ణి కాదు. క్రీస్తు నన్ను దేనికోసమైతే పట్టుకున్నాడో దాన్ని నేను కూడా సొంతం చేసుకోవాలని నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. సోదరులారా, దాన్ని నేను ఇప్పటికే సాధించానని అనడం లేదు. అయితే ఒకటి మాత్రం చేస్తున్నాను. గతంలో జరిగిన దాన్ని మరచిపోయి, ముందున్న వాటి కోసం ప్రయాస పడుతున్నాను. క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు సంబంధించిన బహుమతి కోసం గురి దగ్గరకే పరుగెత్తుతూ ఉన్నాను. కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉన్న విశ్వాసులమైన మనం, అలానే ఆలోచించాలని ప్రోత్సహిస్తున్నాను. మరి ఏ విషయం గురించి అయినా, మీరు వేరొక విధంగా ఆలోచిస్తుంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు.
ఫిలిప్పీయులకు 3:9-15 TERV (పవిత్ర బైబిల్)
ఆయనలో ఐక్యత పొంది ఉండటమే నా ఉద్దేశ్యము. ధర్మశాస్త్రాన్ని అనుసరించి పొందే నీతి నాకు అనవసరం. క్రీస్తులో విశ్వాసం ఉండటంవల్ల లభించే నీతి నాకు కావాలి. నాకు క్రీస్తును తెలుసుకోవాలని ఉంది. చావునుండి బ్రతికి రాగల శక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన పొందిన కష్టాల్లో పాలుపంచుకొని ఆయనతో స్నేహం పొందాలని ఉంది. ఆయనతో మరణించి ఆయనలా అయిపోవాలని ఉంది. ఇవన్నీ చేసి తిరిగి బ్రతికి రావాలని ఉంది. దీన్ని ఏదో ఒక విధంగా సాధించాలని ఉంది. వీటన్నిటిని నేను యింకా సాధించలేదు. నాలో పరిపూర్ణత యింకా కలుగలేదు. కాని క్రీస్తు దేనికోసం నన్ను ఎన్నుకొన్నాడో దాన్ని నేను చేజిక్కించుకోవాలని పట్టుదలతో సాగిపోతున్నాను. సోదరులారా! అది నాకు చిక్కిందని నేను అనుకోవటం లేదు. కాని ఒకటి మాత్రం నేను చేస్తున్నాను. గతాన్ని మరచిపోయి భవిష్యత్తులో ఉన్న దానికోసం కష్టపడుతున్నాను. గమ్యాన్ని చేరుకొని బహుమతి పొందాలని ముందుకు పరుగెత్తుతున్నాను. దేవుడు నేను ఈ గమ్యాన్ని చేరుకోవాలని యేసు క్రీస్తు ద్వారా నన్ను పరలోకం కొరకు పిలిచాడు. ఆత్మీయంగా పరిపూర్ణత పొందిన మనమంతా అన్ని విషయాల్లో యిలాంటి దృక్పథం ఉంచుకోవాలి. ఒకవేళ మీలో ఎవరికైనా దేని మీదనన్నా వేరు అభిప్రాయం ఉంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు.
ఫిలిప్పీయులకు 3:9-15 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును, ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేనినిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును.