ఫిలిప్పీయులకు 3:12-19

ఫిలిప్పీయులకు 3:12-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నేను ఇప్పటికే ఇవన్నీ పొందానని గాని, నా లక్ష్యాన్ని చేరుకున్నానని గాని నేను భావించడంలేదు, కాని దేనికోసం క్రీస్తు యేసు నన్ను పట్టుకున్నారో దానిని పట్టుకోవాలని పరుగెడుతున్నాను. సహోదరీ సహోదరులారా, నేను ఇంతకుముందే దానిని పట్టుకున్నానని భావించను, అయితే నేను చేస్తున్నది ఒకటే, వెనుక ఉన్నవాటిని మరచిపోయి ముందున్న వాటికోసం ప్రయాసపడుతున్నాను, క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు వలన కలిగే బహుమానాన్ని గెలవడానికి, లక్ష్యం వైపే పరుగెడుతున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరం ఇదే భావాన్ని కలిగి ఉందాము. అప్పుడు దేని గురించైనా మీరు వేరుగా ఆలోచిస్తే, దాన్ని కూడా దేవుడు మీకు స్పష్టం చేస్తారు. అయినా ఇప్పటివరకు మనం పొందుకున్న దానిని బట్టే క్రమంగా జీవిద్దాము. సహోదరీ సహోదరులారా, మీరు నా మాదిరిని అనుసరించండి. మేము మీకు మాదిరిగా ఉన్నట్లే, ఎవరైతే మాలా జీవిస్తారో వారిపై మీ దృష్టిని ఉంచండి. అనేకమంది క్రీస్తు సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు, గతంలో వీరిని గురించి మీతో అనేకసార్లు చెప్పినా, మరల ఇప్పుడు కన్నీటితో చెప్తున్నాను. వారి గమ్యం నాశనం, వారి కడుపే వారికి దేవుడు, తాము సిగ్గుపడవలసిన వాటిలో వారు గర్వపడుతున్నారు. భూసంబంధమైన వాటిపైనే తమ మనస్సు ఉంచుతున్నారు.

ఫిలిప్పీయులకు 3:12-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వీటన్నిటినీ ఇంకా నేను పొందలేదు కాబట్టి నేనింకా సంపూర్ణుణ్ణి కాదు. క్రీస్తు నన్ను దేనికోసమైతే పట్టుకున్నాడో దాన్ని నేను కూడా సొంతం చేసుకోవాలని నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. సోదరులారా, దాన్ని నేను ఇప్పటికే సాధించానని అనడం లేదు. అయితే ఒకటి మాత్రం చేస్తున్నాను. గతంలో జరిగిన దాన్ని మరచిపోయి, ముందున్న వాటి కోసం ప్రయాస పడుతున్నాను. క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు సంబంధించిన బహుమతి కోసం గురి దగ్గరకే పరుగెత్తుతూ ఉన్నాను. కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉన్న విశ్వాసులమైన మనం, అలానే ఆలోచించాలని ప్రోత్సహిస్తున్నాను. మరి ఏ విషయం గురించి అయినా, మీరు వేరొక విధంగా ఆలోచిస్తుంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు. ఏమైనా సరే, మనం ఇప్పటికే పొందిన అదే సత్యానికి అనుగుణంగా మనమంతా నడుచుకొందాము. సోదరులారా, మీరు నన్ను పోలి ప్రవర్తించండి. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నడుచుకునే వారిని జాగ్రత్తగా గమనించండి. చాలా మంది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా దుఃఖంతో చెబుతున్నాను. నాశనమే వారి అంతం. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన వాటినే గొప్పగా చెప్పుకుంటున్నారు. లౌకిక విషయాల మీదే వారు మనసు ఉంచుతారు.

ఫిలిప్పీయులకు 3:12-19 పవిత్ర బైబిల్ (TERV)

వీటన్నిటిని నేను యింకా సాధించలేదు. నాలో పరిపూర్ణత యింకా కలుగలేదు. కాని క్రీస్తు దేనికోసం నన్ను ఎన్నుకొన్నాడో దాన్ని నేను చేజిక్కించుకోవాలని పట్టుదలతో సాగిపోతున్నాను. సోదరులారా! అది నాకు చిక్కిందని నేను అనుకోవటం లేదు. కాని ఒకటి మాత్రం నేను చేస్తున్నాను. గతాన్ని మరచిపోయి భవిష్యత్తులో ఉన్న దానికోసం కష్టపడుతున్నాను. గమ్యాన్ని చేరుకొని బహుమతి పొందాలని ముందుకు పరుగెత్తుతున్నాను. దేవుడు నేను ఈ గమ్యాన్ని చేరుకోవాలని యేసు క్రీస్తు ద్వారా నన్ను పరలోకం కొరకు పిలిచాడు. ఆత్మీయంగా పరిపూర్ణత పొందిన మనమంతా అన్ని విషయాల్లో యిలాంటి దృక్పథం ఉంచుకోవాలి. ఒకవేళ మీలో ఎవరికైనా దేని మీదనన్నా వేరు అభిప్రాయం ఉంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు. మనం మాత్రం, మనమిదివరలో సాధించిన వాటికి అనుగుణంగా నడుచుకొందాము. సోదరులారా! నావలె జీవించండి. మేము బోధించిన విధానాన్ని అనుసరిస్తున్నవాళ్ళను గమనించండి. నేనిదివరకే ఎన్నో సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కన్నీళ్ళతో చెబుతున్నాను. క్రీస్తు సిలువ పట్ల శత్రుత్వంతో జీవిస్తున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వినాశనమే వాళ్ళ గమ్యం. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. అవమానమే వాళ్ళ కీర్తి. వాళ్ళ మనస్సులు ఐహికమైన వాటిపై ఉంటాయి.

ఫిలిప్పీయులకు 3:12-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇదివరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేనినిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును. అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పు చున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు.

ఫిలిప్పీయులకు 3:12-19

ఫిలిప్పీయులకు 3:12-19 TELUBSI