ఫిలిప్పీయులకు 3:1-4

ఫిలిప్పీయులకు 3:1-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

చివరిగా, నా సహోదరీ సహోదరులారా, ప్రభువులో ఆనందించండి! మరల అవే సంగతులను మీకు వ్రాయడం నాకు కష్టం కలిగించదు, అది మీకు రక్షణ కవచము. ఆ కుక్కల గురించి, ఆ కీడుచేసేవారు, శరీరాన్ని ముక్కలు చేసేవారి గురించి జాగ్రత్త. ఎందుకంటే, మనం సున్నతి పొందినవారం, దేవుని ఆత్మ చేత ఆయనను ఆరాధిస్తాం, క్రీస్తు యేసులో అతిశయపడతాం, శరీరంపై నమ్మకం ఉంచండి. కావాలంటే నేను శరీరంపై అలాంటి నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు. ఎవరైనా శరీరంపై నమ్మకం ఉంచడానికి తమ దగ్గర కారణాలు ఉన్నాయని అనుకుంటే, వారికంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి.

ఫిలిప్పీయులకు 3:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

చివరిగా, నా సోదరులారా, ప్రభువులో ఆనందించండి. ఈ విషయాలనే మీకు మరలా రాయడం నాకేమీ సమస్య కాదు. మీకది క్షేమకరం. కుక్కల విషయం జాగ్రత్త. చెడు పనులు చేసే వారి విషయం జాగ్రత్త. ఛేదించే ఆచారం పాటించే వారి విషయం జాగ్రత్త. ఎందుకంటే, మనం దేవుని ఆత్మతో ఆరాధిస్తూ శరీరం మీద నమ్మకం పెట్టుకోకుండా క్రీస్తు యేసులో అతిశయిస్తున్నాము. మనమే అసలైన సున్నతి పొందిన వాళ్ళం. చెప్పాలంటే, వాస్తవంగా నేనే శరీరాన్ని ఆధారం చేసుకోగలను. ఎవరైనా శరీరాన్ని ఆధారం చేసుకోవాలనుకుంటే నేను మరి ఎక్కువగా చేసుకోగలను.

ఫిలిప్పీయులకు 3:1-4 పవిత్ర బైబిల్ (TERV)

సోదరులారా! చివరి మాట, ప్రభువు మీకు కావలసినంత ఆనందం ప్రసాదించుగాక! వ్రాసిన విషయాలే మళ్ళీ వ్రాయటానికి నేను వెనుకాడను. దాని వల్ల మీకు యింకా ఎక్కువ లాభం కలుగుతుంది. దుర్మార్గులైన ఆ కుక్కల విషయంలో శరీరాన్ని ముక్కలు చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనం దేవుణ్ణి ఆయన ఆత్మ ద్వారా ఆరాధిస్తున్నాము. ఇది నిజమైన సున్నతి. వాళ్ళు పొందిన సున్నతిలాంటిది కాదు. మనము యేసు క్రీస్తులో ఉన్నందుకు గర్విస్తున్నాము. కనుక బాహ్యంగా కనిపించే ఈ ఆచారాలను మనము విశ్వసించము. కాని అలాంటి ఆచారాలను విశ్వసించటానికి నాకు కారణాలు ఉన్నాయి. బాహ్యమైన ఈ ఆచారాలను నమ్మటం ముఖ్యమని యితరులు అనుకొంటున్నట్లయితే వాటిని నమ్మటానికి వాళ్ళకన్నా నాకు ఎక్కువ కారణాలు ఉన్నాయి.

ఫిలిప్పీయులకు 3:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదేసంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసికొనవచ్చును; మరి ఎవ డైనను శరీరమును ఆస్పదము చేసికొనదలచినయెడల నేను మరి యెక్కువగా చేసికొనవచ్చును.