ఫిలిప్పీయులకు 2:12-30

ఫిలిప్పీయులకు 2:12-30 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీరు ఎప్పుడు లోబడి ఉన్నట్లుగానే నేను ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, నేను మీతో లేనప్పుడు మరి ఎక్కువ లోబడి భయంతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి. ఎందుకంటే దేవుని మంచి ఉద్దేశాలను నెరవేర్చడానికి మీరు ఇష్టపడడానికి, వాటిని చేయడానికి, మీలో కార్యాన్ని జరిగించేది దేవుడే. సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి. తద్వారా మీరు నిందలేనివారిగా, శుద్ధులుగా, “చెడిపోయిన వక్రమైన ఈ తరం మధ్యలో, మీరు దోషంలేని దేవుని బిడ్డలు” అవుతారు. మీరు జీవవాక్యాన్ని స్థిరంగా పట్టుకుని ఉన్నప్పుడు, మీరు ఆకాశంలోని నక్షత్రాల్లా వారి మధ్యలో ప్రకాశిస్తారు. అప్పుడు నేను వృధాగా పరుగు పెట్టలేదు లేదా శ్రమపడలేదని క్రీస్తు దినాన నేను అతిశయించగలను. మీ విశ్వాస యాగంలో దానికి సంబంధించిన సేవలో నేను పానార్పణంగా పోయబడినప్పటికి, మీతో కలిసి సంతోషించి ఆనందిస్తాను. కాబట్టి మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి. మీరు ఎలా ఉన్నారో నేను కూడా తెలుసుకుని సంతోషించాలని, ప్రభువైన యేసులో తిమోతిని త్వరలో మీ దగ్గరకు పంపాలని నేను అనుకుంటున్నాను. అతనిలా మీ క్షేమం గురించి నిజమైన ఆసక్తి కలిగినవారు నా దగ్గర ఎవరు లేరు. ప్రతి ఒక్కరు తమ సొంత పనులపైనే ఆసక్తి చూపిస్తున్నారు, కాని యేసు క్రీస్తు పనులపై కాదు. తిమోతి యోగ్యుడని మీకు తెలుసు, ఎందుకంటే ఒక కుమారుడు తన తండ్రికి సేవ చేసినట్లుగా సువార్త పనిలో అతడు నాతో కలిసి సేవ చేశాడు. కాబట్టి నాకు ఏమి జరుగబోతుందో నేను చూసిన వెంటనే, అతన్ని పంపాలని అనుకుంటున్నాను. నేనూ త్వరలోనే వస్తానని ప్రభువులో నాకు నమ్మకం ఉంది. నా సహోదరుడు, జతపనివాడు, నా తోటి యోధుడు, నా అవసరాలను చూసుకోవడాని మీరు పంపిన మీ దూతయైన ఎపఫ్రొదితును తిరిగి మీ దగ్గరకు పంపవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అతడు అనారోగ్యంగా ఉన్నాడని మీరు విన్నారు, కాబట్టి మీ అందరిని చూడాలని ఆశపడుతూ దుఃఖపడుతున్నాడు. అతడు అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్నాడు కాని దేవుడు అతన్ని కనికరించారు. అతన్నే కాదు నాకు దుఃఖం మీద దుఃఖం కలుగకుండా నన్ను కూడా కనికరించారు. మీరు అతన్ని మరలా చూసినప్పుడు మీరు సంతోషిస్తారు, అలాగే నా వేదన కొంత తగ్గుతుంది, కాబట్టి అతన్ని పంపాలని అందరికంటే నేనే ఎక్కువ ఆశపడుతున్నాను. గొప్ప సంతోషంతో ప్రభువులో అతన్ని ఆదరించండి, అతనిలాంటి వారిని గౌరవించండి. ఎందుకంటే క్రీస్తు పని కోసం అతడు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. మీరు నాకు చేయలేని సహాయాన్ని చేయడానికి అతడు తన ప్రాణాన్ని సైతం లెక్కచేయలేదు.

ఫిలిప్పీయులకు 2:12-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు. మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి. దానివలన మీరు కుటిలమైన వక్రమైన ఈ తరం ప్రజల మధ్య నిర్దోషులు, నిందారహితులు, నిష్కళంకులైన దేవుని కుమారులుగా, లోకంలో దీపాలుగా వెలుగుతుంటారు. జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను వ్యర్థంగా పరుగెత్తలేదనీ నా పని వృధా కాలేదనీ నాకు తెలుస్తుంది. గొప్పగా చెప్పుకోడానికి నాకొక కారణం ఉంటుంది. మీ విశ్వాస బలిదాన పరిచర్యలో నేను పానార్పణగా పోయబడినా, నేను సంతోషిస్తూ మీ అందరితో ఆనందిస్తాను. అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి. మీరెలా ఉన్నారో తెలుసుకుని నాకు ప్రోత్సాహం కలిగేలా, ప్రభు యేసు చిత్తమైతే త్వరలో తిమోతిని మీ దగ్గరికి పంపాలనుకుంటున్నాను. తిమోతి లాగా మీ గురించి అంతగా పట్టించుకొనే వాడు నాకెవరూ లేరు. మిగతా వారంతా తమ సొంత పనుల్నే చూసుకుంటున్నారు గాని, యేసు క్రీస్తు విషయాలు చూడడం లేదు. తిమోతి తనను తాను రుజువు చేసుకున్నాడు. ఎందుకంటే, తండ్రికి కొడుకు ఎలా సేవ చేస్తాడో అలాగే అతడు నాతో కూడ సువార్త ప్రచారంలో సేవ చేశాడని మీకు తెలుసు. అందుచేత నాకు ఏం జరగబోతున్నదో తెలిసిన వెంటనే అతన్ని పంపాలనుకుంటున్నాను. నేను త్వరలో వస్తానని ప్రభువునుబట్టి నమ్ముతున్నాను. నా సోదరుడు, జతపని వాడు, సాటి యోధుడు, మీ ప్రతినిధి, నాకు అవసరమైనప్పుడు సేవ చేసే వాడు అయిన ఎపఫ్రొదితును మీ దగ్గరికి పంపడం అవసరమనుకున్నాను. అతడు జబ్బు పడ్డాడని మీకు తెలిసింది కాబట్టి అతడు మీ అందరితో ఉండాలని చాలా బెంగగా ఉన్నాడు. అతడు చావుకు దగ్గరగా వెళ్ళాడు, కానీ దేవుడు అతని మీద జాలి చూపించాడు. అతని మీదే కాదు, దుఃఖం వెంట దుఃఖం కలగకుండా నా మీద కూడా జాలి చూపాడు. కాబట్టి మీరు అతన్ని మళ్ళీ చూసి సంతోషించేలా, నా విచారం తగ్గేలా అతన్ని త్వరపెట్టి పంపుతున్నాను. ఎపఫ్రొదితును పూర్ణానందంతో ప్రభువు పేరిట చేర్చుకోండి. అలాంటి వారిని గౌరవంగా చూడండి. ఎందుకంటే అతడు క్రీస్తు పనిలో దాదాపు చావును ఎదుర్కొన్నాడు. నాకు సేవ చేయడానికీ మీరు తీర్చలేకపోయిన నా అవసరాలను మీ బదులు తీర్చడానికి, అతడు తన ప్రాణం సైతం లెక్కచేయలేదు.

ఫిలిప్పీయులకు 2:12-30 పవిత్ర బైబిల్ (TERV)

నా ప్రియ మిత్రులారా! నేను మీతో ఉన్నప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించలేదు. ప్రస్తుతం నేను మీతో లేను కనుక యిప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని పాటించుచూ మీ స్వంత రక్షణను భయముతోను, వణకుతోనూ, కార్యసాధకము చేయండి. దేవుడు మీలో ఉండి తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవటానికి కావలసిన ఉత్సాహము, శక్తి మీకు యిస్తాడు. మీరు చేస్తున్న పని గొణగకుండా, వాదించకుండా చెయ్యండి. అప్పుడు మీరు నిష్కళంకులై మంచి వాళ్ళుగా ఉంటారు. దుర్మార్గులై, నీతి లేకుండా జీవిస్తున్న వీళ్ళ మధ్య ఏ అపరాధమూ చెయ్యని దేవుని బిడ్డల్లా ఉంటారు. మీరు వాళ్ళ మధ్య ఆకాశంలోని నక్షత్రాల్లా ప్రకాశిస్తారు. మీరు జీవంగల దైవసందేశాన్ని ప్రకటిస్తున్నారు. కనుక క్రీస్తు వచ్చిన రోజున మీ విషయంలో గర్వించటానికి నాకు ఆస్కారం ఉంటుంది. నా కృషి, సాధన వ్యర్థం కాలేదని రుజువౌతుంది. మీ విశ్వాసం వల్ల అర్పిస్తున్న బలికి తోడుగా నా రక్తాన్ని బలిగా ధార పోయవలసివస్తే నేను వెనుకాడను. చాలా ఆనందిస్తాను. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని నా కోరిక. అందువల్ల మీరు కూడా ఆనందించి, మీ ఆనందాన్ని నాతో పంచుకొండి. మిమ్మల్ని గురించి తెలిస్తే నాకు కూడా ఆనందం కలుగుతుంది. కనుక తిమోతిని మీ దగ్గరకు పంపే అవకాశం యేసు ప్రభువు త్వరలో కలిగిస్తాడని నిరీక్షిస్తాను. మీ క్షేమం విషయంలో నిజంగా శ్రద్ధ వహించే వ్యక్తి అతను తప్ప నా దగ్గర మరొకడు లేడు. ప్రతి ఒక్కడూ తన స్వార్థం కోసం ఆలోచిస్తాడే కాని యేసు క్రీస్తును గురించి ఆలోచించడు. సువార్త ప్రచారం చెయ్యటానికి అతడు నా కుమారునిలా పని చేసాడు. అలా చేసి తన యోగ్యతను రుజువు చేసుకొన్నాడని మీకు తెలుసు. నా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియగానే అతణ్ణి మీ దగ్గరకు పంపటానికి ఎదురు చూస్తున్నాను. నన్ను కూడా త్వరలో మీ దగ్గరకు పంపుతాడనే నమ్మకం నాకు ప్రభువుపట్ల ఉంది. నాకు సహాయం చెయ్యటానికి మీరు ఎపఫ్రొదితును పంపారు. అతడు మీరు పంపిన దూత. అతణ్ణి తిరిగి మీ దగ్గరకు పంపటం అవసరమని భావిస్తున్నాను. ఎపఫ్రొదితు నాతో కలిసి నా సోదరునివలే పోరాడి, పని చేసాడు. మిమ్మల్ని చూడాలని, మీ దగ్గరకు రావాలని అతడు ఎదురు చూస్తున్నాడు. అతడు జబ్బుతో ఉన్నాడన్న విషయం మీరు విన్నట్లు అతనికి తెలిసి అతడు చాలా చింతిస్తున్నాడు. అతనికి నిజంగా చనిపోయేటంత జబ్బు చేసింది. కాని దేవుని దయ అతనిపై ఉంది. కనుక అతను బ్రతికాడు. దేవుడు అతనికే కాకుండా, నాకు మరొకసారి దుఃఖం కలుగరాదని నాపై కూడా దయచూపాడు. అందువల్ల అతణ్ణి మీ దగ్గరకు పంపాలని ఎదురు చూస్తున్నాను. అతణ్ణి చూసి మీరు ఆనందించాలని నా ఉద్దేశ్యం. అప్పుడు నాకు నిశ్చింతగా ఉంటుంది. కనుక ప్రభువు పేరిట ఆనందంతో అతనికి స్వాగతం చెప్పండి. అలాంటి వాళ్ళను మీరు గౌరవించాలి. మీరు చేయలేని సహాయం తాను చేయాలని అతడు తన ప్రాణానికి తెగించాడు. క్రీస్తు అప్పగించిన పని పూర్తిచేయటం కొరకు మరణించటానికి కూడా అతడు సిద్ధమయ్యాడు.

ఫిలిప్పీయులకు 2:12-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులై యున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాల మందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖైమెన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. అట్టి జనముమధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్‌ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయకారణము కలుగును. మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనానందించి మీ యందరితోకూడ సంతోషింతును. ఇటు వలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చు కొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీయొద్దకు పంపు టకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు. అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసు క్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్తవ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనైయున్నదో చూచినవెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చెదనని ప్రభువునుబట్టి నమ్ము చున్నాను. మరియు నా సహోదరుడును, జతపనివాడును, నాతోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించినవాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగియాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్షగలవాడై విచారపడు చుండెను. నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమై యుండెను గాని దేవుడతనిని కనికరించెను; అతనిమాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించునిమిత్తమును నా కున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైయుండెను గనుక పూర్ణా నందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.

ఫిలిప్పీయులకు 2:12-30

ఫిలిప్పీయులకు 2:12-30 TELUBSIఫిలిప్పీయులకు 2:12-30 TELUBSIఫిలిప్పీయులకు 2:12-30 TELUBSIఫిలిప్పీయులకు 2:12-30 TELUBSIఫిలిప్పీయులకు 2:12-30 TELUBSIఫిలిప్పీయులకు 2:12-30 TELUBSIఫిలిప్పీయులకు 2:12-30 TELUBSI