ఫిలిప్పీయులకు 1:27-30

ఫిలిప్పీయులకు 1:27-30 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఏమి జరిగినా, క్రీస్తు సువార్తకు తగినట్లు మీరు ప్రవర్తించండి. నేను వచ్చి మిమ్మల్ని చూసినా లేదా నేను లేనప్పుడు మీ గురించి వినినా, మిమ్మల్ని వ్యతిరేకించేవారికి మీరు ఏ విధంగాను భయపడక, మీరు ఒకే ఆత్మలో దృఢంగా నిలిచి, సువార్త విశ్వాసం కోసం మీరు ఒకటిగా పోరాడుతున్నారని నేను తెలుసుకుంటాను. వారు నాశనం అవుతారు కాని మీరు రక్షించబడతారు, అది వారికి దేవుడు ఇచ్చే ఒక సూచన. మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన కోసం శ్రమలు కూడా అనుభవించాలని ఆయన తరపున ఇది మీకు ఇవ్వబడింది, నేను ఏ శ్రమలు అనుభవించడం మీరు చూశారో ఇప్పుడు మీరు ఆ శ్రమల గుండానే వెళ్తున్నారు, అయితే నేను కూడా ఇంకా శ్రమలగుండా వెళ్లాల్సి ఉంది.

ఫిలిప్పీయులకు 1:27-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నేను మిమ్మల్ని చూడడానికి వచ్చినా, రాకపోయినా, అందరూ కలిసికట్టుగా సువార్త విశ్వాసం పక్షంగా పోరాడుతూ, ఏక భావంతో నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినేలా, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. మిమ్మల్ని ఎదిరించే వారికి ఏ విషయంలోనూ భయపడవద్దు. మీ ధైర్యం వారికి నాశనం, మీకు రక్షణ కలుగుతాయని తెలిపే సూచన. ఇది దేవుని వలన కలిగే విడుదల. గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి వింటున్నారు. మీరు కూడా అదే పోరాటంలో ఉన్నారు. కాబట్టి దేవుడు మీకు కేవలం క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం కూడా కలిగించాడు.

ఫిలిప్పీయులకు 1:27-30 పవిత్ర బైబిల్ (TERV)

ఏది ఏమైనా క్రీస్తు సువార్తకు తగిన విధంగా జీవించండి. అప్పుడు నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా, మీరు ఒక ఆత్మగా, ఒక మనిషిగా సువార్తవల్ల సంభవించే విశ్వాసంకోసం పని చేస్తున్నారని నేను వినాలి. మీ శత్రువులకు ఏ మాత్రం భయపడకండి. అన్ని వేళలా ధైర్యంగా ఉండండి. అప్పుడు మీరు గెలుస్తారని, తాము ఓడిపోతామని వాళ్ళకు తెలుస్తుంది. ఇది దేవుడు చేసాడు. ఎందుకంటే, క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం మీకు కూడా దేవుడు కలిగించాడు. గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి విన్నారు. మీరు కూడా ఆ పోరాటాన్ని సాగిస్తున్నారు.

ఫిలిప్పీయులకు 1:27-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మునుగూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై యున్నది. ఇది దేవునివలన కలుగునదే. ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీ రిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి యున్నందున క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమునశ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.