ఫిలిప్పీయులకు 1:15-23
ఫిలిప్పీయులకు 1:15-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కొందరు అసూయతో, విరోధంతో క్రీస్తును ప్రకటిస్తున్నారనేది నిజమే, కాని ఇతరులు మంచి ఉద్దేశంతోనే ప్రకటిస్తున్నారు. నేను సువార్త గురించి వాదించడానికి ఇక్కడ నియమించబడ్డానని తెలుసుకున్న తర్వాత, వారు ప్రేమతో ప్రకటిస్తున్నారు. గతంలో నేను సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు మరింత ఇబ్బంది కలిగించాలనే తలంపుతో, వారు మంచి ఉద్దేశంతో కాకుండా స్వార్థపూరిత ఉద్దేశంతో, క్రీస్తును గురించి ప్రకటించారు. అయితే ఏంటి? మంచి ఉద్దేశమైన లేదా చెడ్డ ఉద్దేశమైన ప్రతీ మార్గంలోనూ క్రీస్తు గురించి ప్రకటించబడుతుంది అనేదే ముఖ్యము. దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇకముందు కూడా నేను సంతోషిస్తాను. ఎందుకంటే, మీ ప్రార్థన వలన, యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా అనుగ్రహించబడుట వలన, నాకు ఏమి జరిగినా అది నాకు రక్షణగానే మారుతుందని నాకు తెలుసు. నేను ఏ విషయంలోను సిగ్గుపడకుండా ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా పూర్ణధైర్యంతో బోధించడం వలన నేను జీవించినా లేదా మరణించినా సరే, నా శరీరంలో ఎప్పుడూ క్రీస్తు ఘనపరచబడాలని నేను ఆసక్తితో ఆశించి నిరీక్షిస్తున్నాను. నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము. ఒకవేళ నేను శరీరంలోనే జీవించాల్సి ఉంటే, ఇది నాకు ఫలభరితమైన ప్రయాసం అవుతుంది. అయినా నేను ఏమి కోరుకోవాలి? నాకు తెలియదు! ఈ రెండింటికీ మధ్య నేను నలిగిపోతున్నాను. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో కూడా ఉండాలని నా ఆశ, అది నాకు చాలా మంచిది.
ఫిలిప్పీయులకు 1:15-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొంతమంది అసూయతో కలహబుద్ధితో, మరి కొంతమంది మంచి ఉద్దేశంతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. ప్రేమతో క్రీస్తును ప్రకటించేవారికి నేను సువార్త పక్షాన వాదించడానికి నియామకం పొందానని తెలుసు. అయితే మిగతా వారు బంధకాల్లో ఉన్న నాకు మరింత బాధ కలిగించాలని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. అయితేనేం? కపటంతో గానీ సత్యంతో గాని, ఎలాగైనా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది. అందుకు నేను ఆనందిస్తున్నాను. ఇక ముందు కూడా ఆనందిస్తాను. మీ ప్రార్థనల వలన, యేసు క్రీస్తు ఆత్మసాయం వలన, నా విడుదల కోసం ఇదంతా జరుగుతూ ఉందని నాకు తెలుసు. నేను ఏ విషయంలోనైనా సిగ్గుపాలు కానని నాకు నిబ్బరమైన ఆశాభావం ఉంది. అయితే, ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా నా జీవితం వలన గానీ, చావు వలన గానీ క్రీస్తును నా శరీరంతో ఘనపరుస్తాను అనే ధైర్యం ఉంది. నావరకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే. అయినా శరీరంలో నేనింకా బతుకుతూ నా ప్రయాసకు ఫలితం ఉంటే, అప్పుడు నేనేం కోరుకోవాలో నాకు తెలియడం లేదు. ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయాను. నేను లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం.
ఫిలిప్పీయులకు 1:15-23 పవిత్ర బైబిల్ (TERV)
కొందరు నాపై అసూయవల్ల పగతో క్రీస్తును గురించి బోధిస్తున్నారు. కాని మరి కొందరు మంచి ఉద్దేశ్యంతో బోధిస్తున్నారు. వీళ్ళు, దైవసందేశాన్ని ప్రకటించటానికి నేనిక్కడ ఉంచబడ్డానని గమనించి ప్రేమతో బోధిస్తున్నారు. మొదట పేర్కొనబడ్డవాళ్ళు స్వార్థంతో, విశ్వాసహీనులై క్రీస్తును గురించి బోధిస్తున్నారు. ఎందుకంటే నేనిక్కడ సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ కష్టాలు కలిగించాలని వాళ్ళ ఉద్దేశ్యం. దాని వల్ల కలిగేది ఏమీలేదు. ముఖ్యమైన విషయమేమిటంటే సదుద్దేశాలతో అయితేనేమిటి, దురుద్దేశాలతో అయితేనేమిటి క్రీస్తును గురించి బోధింపబడుతోంది. కనుక నాకు ఆనందంగా ఉంది. ఔను, నేను యిదే విధంగా ఆనందిస్తూ ఉంటాను. ఎందుకంటే మీ ప్రార్థనవల్ల యేసు క్రీస్తు యొక్క ఆత్మ చేసిన సహాయం వల్ల నేను అనుభవిస్తున్న ఈ కష్టాలే నా విడుదలకు దారితీస్తాయని నాకు తెలుసు. నాకు ఎలాంటి అవమానం కలుగరాదని, నాకు ధైర్యం కలగాలని మనసారా కోరుకొంటున్నాను. ఎప్పటిలాగే యిప్పుడు కూడా క్రీస్తు, నా దేహంలో మహిమ పొందాలని ఆశిస్తున్నాను. ఇది నేను జీవించటంవల్ల సంభవించినా, లేక మరణంవల్ల సంభవించినా నాకు చింత లేదు. ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మరణిస్తే, అది కూడా లాభకరమే. నేను ఈ దేహంతో జీవిస్తే దానివల్ల నా శ్రమకు తగిన ఫలం లభిస్తుంది. అయినా నేను ఏది కోరుకోవాలో నాకే తెలియదు. ఈ రెంటి మధ్య నేను నలిగిపోతున్నాను. ఒక విధంగా చూస్తే ఈ దేహాన్ని వదిలి క్రీస్తు సమక్షంలో ఉండాలని అనిపిస్తోంది. ఇది అన్నిటికన్నా ఉత్తమం.
ఫిలిప్పీయులకు 1:15-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను, మరికొందరు మంచిబుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతోకూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని, శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు; వీరైతే నేను సువార్తపక్షమున వాదించుటకు నియమింపబడియున్నాననియెరిగి, ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనే గాని, యేవిధముచేతనైనను క్రీస్తు ప్రక టింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషింతును. మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనవలనను, యేసుక్రీస్తుయొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణ మించునని నేనెరుగుదును. నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైనయెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటిమధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు.