ఫిలిప్పీయులకు 1:15-18

ఫిలిప్పీయులకు 1:15-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

కొందరు అసూయతో, విరోధంతో క్రీస్తును ప్రకటిస్తున్నారనేది నిజమే, కాని ఇతరులు మంచి ఉద్దేశంతోనే ప్రకటిస్తున్నారు. నేను సువార్త గురించి వాదించడానికి ఇక్కడ నియమించబడ్డానని తెలుసుకున్న తర్వాత, వారు ప్రేమతో ప్రకటిస్తున్నారు. గతంలో నేను సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు మరింత ఇబ్బంది కలిగించాలనే తలంపుతో, వారు మంచి ఉద్దేశంతో కాకుండా స్వార్థపూరిత ఉద్దేశంతో, క్రీస్తును గురించి ప్రకటించారు. అయితే ఏంటి? మంచి ఉద్దేశమైన లేదా చెడ్డ ఉద్దేశమైన ప్రతీ మార్గంలోనూ క్రీస్తు గురించి ప్రకటించబడుతుంది అనేదే ముఖ్యము. దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇకముందు కూడా నేను సంతోషిస్తాను.

ఫిలిప్పీయులకు 1:15-18 పవిత్ర బైబిల్ (TERV)

కొందరు నాపై అసూయవల్ల పగతో క్రీస్తును గురించి బోధిస్తున్నారు. కాని మరి కొందరు మంచి ఉద్దేశ్యంతో బోధిస్తున్నారు. వీళ్ళు, దైవసందేశాన్ని ప్రకటించటానికి నేనిక్కడ ఉంచబడ్డానని గమనించి ప్రేమతో బోధిస్తున్నారు. మొదట పేర్కొనబడ్డవాళ్ళు స్వార్థంతో, విశ్వాసహీనులై క్రీస్తును గురించి బోధిస్తున్నారు. ఎందుకంటే నేనిక్కడ సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ కష్టాలు కలిగించాలని వాళ్ళ ఉద్దేశ్యం. దాని వల్ల కలిగేది ఏమీలేదు. ముఖ్యమైన విషయమేమిటంటే సదుద్దేశాలతో అయితేనేమిటి, దురుద్దేశాలతో అయితేనేమిటి క్రీస్తును గురించి బోధింపబడుతోంది. కనుక నాకు ఆనందంగా ఉంది. ఔను, నేను యిదే విధంగా ఆనందిస్తూ ఉంటాను.