ఫిలిప్పీయులకు 1:1-30

ఫిలిప్పీయులకు 1:1-30 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

క్రీస్తు యేసు సేవకులైన పౌలు తిమోతి, క్రీస్తు యేసునందు ఫిలిప్పీలో ఉన్న దేవుని పరిశుద్ధులకు, సంఘ అధ్యక్షులకు, సంఘ పరిచారకులకు వ్రాయుట: మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. మీరు గుర్తుకొచ్చినప్పుడెల్లా నేను దేవునికి వందనాలు చెప్తున్నాను. మీ అందరి నిమిత్తం చేసే నా ప్రతి ప్రార్థనలో నేను ఎప్పుడు సంతోషిస్తూ ప్రార్థిస్తున్నాను. మొదటి నుండి ఇప్పటివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారిగా ఉండడం చూసి, మీలో ఈ మంచి కార్యాన్ని ఆరంభించినవాడు క్రీస్తు యేసు దినం వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. నేను సంకెళ్ళలో ఉన్నా లేదా సువార్త గురించి వాదించడంలో దానిని స్ధిరపరచడంలో మీరందరు నాతో కూడా ఈ కృపలో భాగస్థులుగా ఉన్నారు, కాబట్టి మీరు నా హృదయంలో ఉన్నారు. అందువల్ల మీ అందరి గురించి ఇలా భావించడం నాకు న్యాయమే. యేసు క్రీస్తు దయను బట్టి మీ అందరి గురించి నేనెంత ఆశ కలిగి ఉన్నానో దేవుడే సాక్ష్యం ఇస్తారు. దేవునికి మహిమ స్తోత్రం కలుగుటకు, మీరు ఏది ఉత్తమమైనదో గ్రహించ కలిగి క్రీస్తు దినాన మీరు స్వచ్ఛముగా, నిర్దోషులుగా ఉండేలా, మీ ప్రేమ, జ్ఞానంలో, లోతైన పరిజ్ఞానాన్ని కలిగి అంతకంతకు వృద్ధిచెందాలని, క్రీస్తు యేసు నుండి వచ్చే నీతిఫలంతో మీరు నింపబడాలని మీ కోసం ప్రార్థిస్తున్నాను. సహోదరీ సహోదరులారా, నాకు కలిగిన శ్రమల కారణంగా సువార్త మరి ఎక్కువగా విస్తరించిందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. దాని ఫలితంగా, క్రీస్తు కోసం నేను సంకెళ్ళలో ఉన్నానని, రాజమందిరాన్ని కాపలా కాసేవారందరికి, అందరికి స్పష్టంగా తెలిసింది. నా సంకెళ్ళ మూలంగా సహోదరీ సహోదరులలో చాలామంది ప్రభువులో స్ధిరమైన విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి మరి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు. కొందరు అసూయతో, విరోధంతో క్రీస్తును ప్రకటిస్తున్నారనేది నిజమే, కాని ఇతరులు మంచి ఉద్దేశంతోనే ప్రకటిస్తున్నారు. నేను సువార్త గురించి వాదించడానికి ఇక్కడ నియమించబడ్డానని తెలుసుకున్న తర్వాత, వారు ప్రేమతో ప్రకటిస్తున్నారు. గతంలో నేను సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు మరింత ఇబ్బంది కలిగించాలనే తలంపుతో, వారు మంచి ఉద్దేశంతో కాకుండా స్వార్థపూరిత ఉద్దేశంతో, క్రీస్తును గురించి ప్రకటించారు. అయితే ఏంటి? మంచి ఉద్దేశమైన లేదా చెడ్డ ఉద్దేశమైన ప్రతీ మార్గంలోనూ క్రీస్తు గురించి ప్రకటించబడుతుంది అనేదే ముఖ్యము. దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇకముందు కూడా నేను సంతోషిస్తాను. ఎందుకంటే, మీ ప్రార్థన వలన, యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా అనుగ్రహించబడుట వలన, నాకు ఏమి జరిగినా అది నాకు రక్షణగానే మారుతుందని నాకు తెలుసు. నేను ఏ విషయంలోను సిగ్గుపడకుండా ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా పూర్ణధైర్యంతో బోధించడం వలన నేను జీవించినా లేదా మరణించినా సరే, నా శరీరంలో ఎప్పుడూ క్రీస్తు ఘనపరచబడాలని నేను ఆసక్తితో ఆశించి నిరీక్షిస్తున్నాను. నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము. ఒకవేళ నేను శరీరంలోనే జీవించాల్సి ఉంటే, ఇది నాకు ఫలభరితమైన ప్రయాసం అవుతుంది. అయినా నేను ఏమి కోరుకోవాలి? నాకు తెలియదు! ఈ రెండింటికీ మధ్య నేను నలిగిపోతున్నాను. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో కూడా ఉండాలని నా ఆశ, అది నాకు చాలా మంచిది. అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము. మీరు విశ్వాసంలో వృద్ధి చెంది ఆనందించడానికి, నేను జీవిస్తూ, మీ అందరితో కలసి ఉంటానని నాకు తెలుసు. ఇలాంటి నమ్మకం కలిగి, నేను మరల మీతో కలిసి ఉండడం వల్ల నన్ను బట్టి క్రీస్తు యేసులో మీకున్న ఆనందం అధికమవుతుంది. ఏమి జరిగినా, క్రీస్తు సువార్తకు తగినట్లు మీరు ప్రవర్తించండి. నేను వచ్చి మిమ్మల్ని చూసినా లేదా నేను లేనప్పుడు మీ గురించి వినినా, మిమ్మల్ని వ్యతిరేకించేవారికి మీరు ఏ విధంగాను భయపడక, మీరు ఒకే ఆత్మలో దృఢంగా నిలిచి, సువార్త విశ్వాసం కోసం మీరు ఒకటిగా పోరాడుతున్నారని నేను తెలుసుకుంటాను. వారు నాశనం అవుతారు కాని మీరు రక్షించబడతారు, అది వారికి దేవుడు ఇచ్చే ఒక సూచన. మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన కోసం శ్రమలు కూడా అనుభవించాలని ఆయన తరపున ఇది మీకు ఇవ్వబడింది, నేను ఏ శ్రమలు అనుభవించడం మీరు చూశారో ఇప్పుడు మీరు ఆ శ్రమల గుండానే వెళ్తున్నారు, అయితే నేను కూడా ఇంకా శ్రమలగుండా వెళ్లాల్సి ఉంది.

ఫిలిప్పీయులకు 1:1-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఫిలిప్పీ పట్టణంలో క్రీస్తు యేసుకు చెందిన పరిశుద్ధులందరికీ సంఘ నాయకులకూ పరిచారకులకూ క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి రాస్తున్న సంగతులు. మన తండ్రి దేవుని నుండీ ప్రభువైన యేసు క్రీస్తు నుండీ మీకు కృపా, శాంతీ కలుగు గాక. నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా నా దేవునికి వందనాలు చెబుతాను. మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ అది ఆనందభరితమైన ప్రార్థనే. సువార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీ సహవాసానికి వందనాలు. మీలో ఈ మంచి పని మొదలు పెట్టినవాడు యేసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకూ ఆ పని కొనసాగించి పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం. మిమ్మల్ని గురించి నేనిలా భావించడం సబబే. ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు. నేను ఖైదులో ఉన్నప్పుడూ, నేను సువార్త పక్షంగా వాదిస్తూ నిరూపిస్తున్నపుడు మీరంతా ఈ కృపలో నాతో పాలివారుగా ఉన్నారు. క్రీస్తు యేసు ప్రేమ లోతుల్లో నుంచి, మీ కోసం నేనెంత తపిస్తున్నానో దేవుడే నాకు సాక్షి. మీ ప్రేమ జ్ఞానంతో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ, స్తుతి కలిగేలా మీరు శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి తెలుసుకుని, యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతిఫలాలతో నిండి, క్రీస్తు వచ్చే రోజు వరకూ యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన అంతేకాక దేవునికి మహిమ, స్తుతి కలిగేలా, మీరు యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతి ఫలాలతో నిండి ఉండాలి. సోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా వ్యాపించడానికే అని మీరు తెలుసుకోవాలని ఇప్పుడు కోరుతున్నాను. ఎలాగంటే, నా సంకెళ్ళు క్రీస్తు కోసమే కలిగాయని రాజ భవనం కావలి వారికీ తక్కిన వారందరికీ తెలిసిపోయింది. అంతేకాక, ప్రభువులోని సోదరుల్లో ఎక్కువమంది నా బంధకాలను బట్టి స్థిర విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్కు ప్రకటించడానికి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు. కొంతమంది అసూయతో కలహబుద్ధితో, మరి కొంతమంది మంచి ఉద్దేశంతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. ప్రేమతో క్రీస్తును ప్రకటించేవారికి నేను సువార్త పక్షాన వాదించడానికి నియామకం పొందానని తెలుసు. అయితే మిగతా వారు బంధకాల్లో ఉన్న నాకు మరింత బాధ కలిగించాలని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. అయితేనేం? కపటంతో గానీ సత్యంతో గాని, ఎలాగైనా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది. అందుకు నేను ఆనందిస్తున్నాను. ఇక ముందు కూడా ఆనందిస్తాను. మీ ప్రార్థనల వలన, యేసు క్రీస్తు ఆత్మసాయం వలన, నా విడుదల కోసం ఇదంతా జరుగుతూ ఉందని నాకు తెలుసు. నేను ఏ విషయంలోనైనా సిగ్గుపాలు కానని నాకు నిబ్బరమైన ఆశాభావం ఉంది. అయితే, ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా నా జీవితం వలన గానీ, చావు వలన గానీ క్రీస్తును నా శరీరంతో ఘనపరుస్తాను అనే ధైర్యం ఉంది. నావరకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే. అయినా శరీరంలో నేనింకా బతుకుతూ నా ప్రయాసకు ఫలితం ఉంటే, అప్పుడు నేనేం కోరుకోవాలో నాకు తెలియడం లేదు. ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయాను. నేను లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం. అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం. తద్వారా, నేను మీ దగ్గరికి తిరిగి రావడంవల్ల క్రీస్తు యేసులో నన్ను బట్టి మీరు గర్వ పడతారు. మీరు విశ్వాసంలో అభివృద్ధి, ఆనందం పొందడానికి నేను జీవిస్తూ మీ అందరితో ఉంటానని నాకు గట్టి నమ్మకం ఉంది. నేను మిమ్మల్ని చూడడానికి వచ్చినా, రాకపోయినా, అందరూ కలిసికట్టుగా సువార్త విశ్వాసం పక్షంగా పోరాడుతూ, ఏక భావంతో నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినేలా, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. మిమ్మల్ని ఎదిరించే వారికి ఏ విషయంలోనూ భయపడవద్దు. మీ ధైర్యం వారికి నాశనం, మీకు రక్షణ కలుగుతాయని తెలిపే సూచన. ఇది దేవుని వలన కలిగే విడుదల. గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి వింటున్నారు. మీరు కూడా అదే పోరాటంలో ఉన్నారు. కాబట్టి దేవుడు మీకు కేవలం క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం కూడా కలిగించాడు.

ఫిలిప్పీయులకు 1:1-30 పవిత్ర బైబిల్ (TERV)

యేసు క్రీస్తు సేవకులైన పౌలు మరియు తిమోతియు, యేసు క్రీస్తులో ఐక్యమై, ఫిలిప్పీ పట్టణంలో నివసిస్తున్న పవిత్రులకు, పెద్దలకు, పరిచారకులకు వ్రాయునది ఏమనగా: మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించును గాక! నేను మిమ్మల్ని తలచుకొన్నప్పుడెల్లా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను. కనుక మీకోసం ప్రార్థించినప్పుడెల్లా ఆనందంతో ప్రార్థిస్తాను. దైవసందేశం ప్రచారం చెయ్యటానికి మీరు మొదటి రోజు నుండి ఈ రోజుదాకా నాతో కలిసి పని చేసారు. ఈ మంచి కార్యాన్ని మీలో ప్రారంభించినవాడు అది పూర్తి అయ్యేదాకా, అంటే యేసు క్రీస్తు వచ్చేదాకా కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది. మీరు నా హృదయంలో ఉన్నారు. కనుక మీ అందర్ని గురించి నేనీవిధంగా ఆలోచించటం సమంజసమే. ఎందుకంటే నేను సంకెళ్ళలో ఉన్నా, లేక సువార్తను ప్రకటిస్తూ దానిలో ఉన్న నిజాన్ని నిరూపిస్తూ, స్వేచ్ఛగా పర్యటన చేస్తున్నా దైవానుగ్రహాన్ని మీరు నాతో కలిసి పంచుకొన్నారు. మీ పట్ల నాకున్న ప్రేమ యేసు క్రీస్తు నుండి వచ్చిందని నేను దైవసాక్షిగా చెపుతున్నాను. ఇదే నా ప్రార్థన: మీ ప్రేమ అవధులు లేకుండా పెరగాలి, దానితోబాటు మీకు నిజమైన జ్ఞానము, ఆ జ్ఞానంలోని లోతులు తెలుసుకొనే శక్తి కలగాలి. అప్పుడు మీకు మంచి, చెడు విడమరిచే శక్తి కలుగుతుంది. క్రీస్తు వచ్చే వరకు మీరు పవిత్రంగా ఎలాంటి అపవాదులు లేకుండా ఉండగలుగుతారు. మీరు నీతిగా జీవించటంవల్ల ఫలం పొందుతారు. ఆ ఫలం యేసు క్రీస్తు నుండి వచ్చి మీలో నిండిపోతుంది. తద్వారా దేవునికి కీర్తి, స్తుతి కలుగుతుంది. సోదరులారా! నాకు జరిగిన సంఘటనలు దైవసందేశాన్ని ప్రచారం చేయటానికి తోడ్పడతాయని మీరు గమనించాలి. ఈ సంఘటనలు సంభవించటం వల్ల క్రీస్తు కోసం సంకెళ్ళలో బంధింపబడ్డానని అందరికీ తెలిసిందే. ఇది రాజభవనంలో ఉన్న రక్షకభటులకు కూడా తెలిసిందే. ఈ సంకెళ్ళ మూలంగా, ప్రభువు కారణంగా నా సోదరులైన అనేకులకు దైవసందేశం బోధించటానికి ప్రోత్సాహం కలిగింది. వాళ్ళు ఇంకా ఎక్కువ ధైర్యంతో భయం లేకుండా మాట్లాడగలుగుతున్నారు. కొందరు నాపై అసూయవల్ల పగతో క్రీస్తును గురించి బోధిస్తున్నారు. కాని మరి కొందరు మంచి ఉద్దేశ్యంతో బోధిస్తున్నారు. వీళ్ళు, దైవసందేశాన్ని ప్రకటించటానికి నేనిక్కడ ఉంచబడ్డానని గమనించి ప్రేమతో బోధిస్తున్నారు. మొదట పేర్కొనబడ్డవాళ్ళు స్వార్థంతో, విశ్వాసహీనులై క్రీస్తును గురించి బోధిస్తున్నారు. ఎందుకంటే నేనిక్కడ సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ కష్టాలు కలిగించాలని వాళ్ళ ఉద్దేశ్యం. దాని వల్ల కలిగేది ఏమీలేదు. ముఖ్యమైన విషయమేమిటంటే సదుద్దేశాలతో అయితేనేమిటి, దురుద్దేశాలతో అయితేనేమిటి క్రీస్తును గురించి బోధింపబడుతోంది. కనుక నాకు ఆనందంగా ఉంది. ఔను, నేను యిదే విధంగా ఆనందిస్తూ ఉంటాను. ఎందుకంటే మీ ప్రార్థనవల్ల యేసు క్రీస్తు యొక్క ఆత్మ చేసిన సహాయం వల్ల నేను అనుభవిస్తున్న ఈ కష్టాలే నా విడుదలకు దారితీస్తాయని నాకు తెలుసు. నాకు ఎలాంటి అవమానం కలుగరాదని, నాకు ధైర్యం కలగాలని మనసారా కోరుకొంటున్నాను. ఎప్పటిలాగే యిప్పుడు కూడా క్రీస్తు, నా దేహంలో మహిమ పొందాలని ఆశిస్తున్నాను. ఇది నేను జీవించటంవల్ల సంభవించినా, లేక మరణంవల్ల సంభవించినా నాకు చింత లేదు. ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మరణిస్తే, అది కూడా లాభకరమే. నేను ఈ దేహంతో జీవిస్తే దానివల్ల నా శ్రమకు తగిన ఫలం లభిస్తుంది. అయినా నేను ఏది కోరుకోవాలో నాకే తెలియదు. ఈ రెంటి మధ్య నేను నలిగిపోతున్నాను. ఒక విధంగా చూస్తే ఈ దేహాన్ని వదిలి క్రీస్తు సమక్షంలో ఉండాలని అనిపిస్తోంది. ఇది అన్నిటికన్నా ఉత్తమం. కాని యింకొక విధంగా చూస్తే మీ కొరకు నేనీ దేహంతో ఉండటం చాలా అవసరం. ఇది నాకు బాగా తెలుసు. అందువల్ల నేను బ్రతికి ఉండి అందరితో కలిసి విశ్వాసం ద్వారా సంభవిస్తున్న మీ అభివృద్ధి కోసం, ఆనందం కోసం పని చేస్తాను. నేను మళ్ళీ మీతో కలిసి జీవించునప్పుడు మీకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత కారణంగా యింకా ఎక్కువ గర్విస్తాను. ఏది ఏమైనా క్రీస్తు సువార్తకు తగిన విధంగా జీవించండి. అప్పుడు నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా, మీరు ఒక ఆత్మగా, ఒక మనిషిగా సువార్తవల్ల సంభవించే విశ్వాసంకోసం పని చేస్తున్నారని నేను వినాలి. మీ శత్రువులకు ఏ మాత్రం భయపడకండి. అన్ని వేళలా ధైర్యంగా ఉండండి. అప్పుడు మీరు గెలుస్తారని, తాము ఓడిపోతామని వాళ్ళకు తెలుస్తుంది. ఇది దేవుడు చేసాడు. ఎందుకంటే, క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం మీకు కూడా దేవుడు కలిగించాడు. గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి విన్నారు. మీరు కూడా ఆ పోరాటాన్ని సాగిస్తున్నారు.

ఫిలిప్పీయులకు 1:1-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రియగు దేవునినుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మొదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి, మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేనుచేయు ప్రతి ప్రార్థ నలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకములయందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి, మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేప్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసుక్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను. ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేన లోని వారికందరికిని తక్కినవారికందరికిని స్పష్టమాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి. కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను, మరికొందరు మంచిబుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతోకూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని, శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు; వీరైతే నేను సువార్తపక్షమున వాదించుటకు నియమింపబడియున్నాననియెరిగి, ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనే గాని, యేవిధముచేతనైనను క్రీస్తు ప్రక టింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషింతును. మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనవలనను, యేసుక్రీస్తుయొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణ మించునని నేనెరుగుదును. నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైనయెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటిమధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరల మీతో కలిసి యుండుటచేత నన్నుగూర్చి క్రీస్తుయేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితోకూడ కలిసియుందునని నాకు తెలియును. నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మునుగూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై యున్నది. ఇది దేవునివలన కలుగునదే. ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీ రిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి యున్నందున క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమునశ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.