ఫిలేమోనుకు 1:1-7

ఫిలేమోనుకు 1:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

క్రీస్తు యేసును బట్టి ఖైదీనైన, పౌలు అనే నేను, మన సహోదరుడైన తిమోతి కలిసి, మన ప్రియ స్నేహితుడు, తోటిపనివాడైన ఫిలేమోనుకు, మన సహోదరి అప్ఫియకు, తోటి సైనికుడైన అర్ఖిప్పుకు, మీ ఇంట్లో కూడుకొనే సంఘానికి వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక. ప్రభువైన యేసులో నీకున్న విశ్వాసం, దేవుని ప్రజల పట్ల నీవు చూపే ప్రేమ గురించి నేను విన్నప్పటి నుండి నా ప్రార్థనలలో నిన్ను జ్ఞాపకం చేసికొని, నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. క్రీస్తు కోసం మనం పంచుకున్న ప్రతి మంచి విషయం పట్ల నీ విశ్వాసం మరింత జ్ఞానంలో వృద్ధిపొంది ఉపయోగకరంగా, మాతో పాలివానిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. సహోదరుడా, నీవు పరిశుద్ధుల హృదయాలను సేదదీర్చినందుకు, నీ ప్రేమ నాకెంతో సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించింది.

ఫిలేమోనుకు 1:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మా ప్రియ సోదరుడు, జతపనివాడు అయిన ఫిలేమోనుకు, మన సోదరి అప్ఫియకు, మన సాటి సైనికుడు అర్ఖిప్పుకు, నీ ఇంట్లో సమావేశమయ్యే సంఘానికీ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక. ప్రభువైన యేసు పట్ల, పరిశుద్ధులందరి పట్ల నీకున్న ప్రేమను గూర్చి, విశ్వాసం గూర్చి నేను విని, నా ప్రార్థనల్లో మీ గురించి విజ్ఞాపన చేస్తూ, ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను. విశ్వాసంలో నీవు పాల్గొనడం క్రీస్తులో మనకు ఉన్న ప్రతి మంచినీ నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం లో మరింత చురుకుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. సోదరా, పరిశుద్ధుల హృదయాలకు నీవు సేద దీర్చావు కాబట్టి నీ ప్రేమ నాకెంతో ఆనందాన్నీ ఆదరణనూ తెచ్చింది.

ఫిలేమోనుకు 1:1-7 పవిత్ర బైబిల్ (TERV)

యేసు క్రీస్తు కోసం ఖైదీనైన పౌలును మరియు మన సోదరుడైన తిమోతియు, మా ప్రియ జతపనివాడైన ఫిలేమోనుకు, మరియు మన సోదరి అప్ఫియకు, మనతో సహా పోరాటం సాగిస్తున్న అర్ఖిప్పుకు, మీ యింట్లో సమావేశమయ్యే సంఘానికి వ్రాస్తున్న సంగతులు: మన తండ్రియైన దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని అనుగ్రహించి మీకు శాంతి ప్రసాదించు గాక! కాబట్టి నేను ప్రార్థనలను చేసినప్పుడెల్లా నిన్ను జ్ఞాపకం పెట్టుకొని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను. యేసు ప్రభువు పట్ల నీకున్న భక్తిని గురించి, భక్తులపట్ల నీకున్న ప్రేమను గురించి నేను విన్నాను. క్రీస్తు మనకు చేసిన మంచిని నీవు పూర్తిగా అర్థం చేసుకోవాలనీ, తద్వారా మన విశ్వాసాన్ని నీవు యితరులతో ఉత్సాహంగా పంచుకోగల్గాలనీ నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సోదరా! నీవు భక్తులకు సహాయం చేసి వాళ్ళను ఆనందపరిచావు. కనుక నీ ప్రేమ నాకు చాలా ఆనందమును, తృప్తిని కల్గించింది.

ఫిలేమోనుకు 1:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

క్రీస్తుయేసు ఖైదీయైన పౌలును, సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలే మోనుకును మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక. నీ ప్రేమనుగూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమునుగూర్చియు నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనముచేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు, క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేప్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను.