ఓబద్యా 1:1-21

ఓబద్యా 1:1-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఓబద్యాకు వచ్చిన దర్శనం. ప్రభువైన యెహోవా ఎదోము గురించి ఇలా చెప్తున్నారు: మేము యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది, “లెండి! ఎదోము మీద యుద్ధానికి వెళ్దాం” అని చెప్పడానికి దేశాలకు ఒక దూత పంపబడ్డాడు. “చూడు, నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా చేస్తాను; నీవు పూర్తిగా తృణీకరించబడతావు. నీ హృదయ గర్వం నిన్ను మోసం చేసింది, బండ సందుల్లో నివసించేదానా, కొండ శిఖరాల మీద నివాసం ఏర్పరచుకున్నదానా, ‘నన్ను ఎవరు క్రిందకు పడవేయగలరు?’ అని నీలో నీవనుకుంటావు. నీవు గ్రద్దలా పైకి ఎగిరి, నక్షత్రాలలో నీ గూడు కట్టుకున్నా, అక్కడినుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను” అని యెహోవా చెప్తున్నారు. “ఒకవేళ నీ మీదికి దొంగలు వస్తే, రాత్రివేళ దొంగలు వస్తే ఎంతగా నాశనం చేస్తారో కదా! వారికి కావలసినంత వారు దోచుకుంటారు కదా? ద్రాక్షలు పోగుచేసుకునేవారు నీ దగ్గరకు వస్తే, వారు కొన్ని ద్రాక్షలు వదిలిపెడతారు కదా? ఏశావు సంతతివారిని పూర్తిగా దోచుకుంటారు, వారు దాచిన నిధులన్నిటిని దోచుకుంటారు! నీతో సంధి చేసుకున్న వారు నిన్ను తమ సరిహద్దు వరకు తరిమివేస్తారు; నీ స్నేహితులు నిన్ను మోసం చేసి నీ మీద గెలుస్తారు; నీ ఆహారం తిన్నవారు నీకోసం ఉచ్చు పెడతారు, నీవు దానిని తెలుసుకోలేవు. “ఆ రోజున, యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, నేను ఎదోము జ్ఞానులను, ఏశావు పర్వతాల్లో వివేకులను నాశనం చేయనా? తేమానూ! నీ వీరులు భయపడతారు, ఏశావు పర్వతాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరు, సంహరించబడి కూలిపోతారు. నీ సోదరుడైన యాకోబు మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి, నీకు అవమానం కలుగుతుంది; నీవు ఎప్పటికీ లేకుండా నాశనమవుతావు. అపరిచితులు అతని ఆస్తులను తీసుకెళ్లినప్పుడు, విదేశీయులు అతని గుమ్మాల్లోకి వచ్చి, యెరూషలేము మీద చీట్లు వేసేిన రోజున, నీవు దూరంగా నిలబడ్డావు, నీవు వారిలో ఒకనిగా ఉన్నావు. నీ సోదరునికి దురవస్థ కలిగిన రోజు, నీవు సంతోషించకూడదు, యూదా ప్రజల నాశన దినాన వారిని చూసి ఆనందించకూడదు, వారి శ్రమ దినాన, నీవు గొప్పలు చెప్పుకోవద్దు. నా ప్రజలకు ఆపద సంభవించిన రోజున వారి గుమ్మాల్లో చొరబడకూడదు, వారికి ఆపద కలిగిన రోజున, వారికి వచ్చిన విపత్తును బట్టి సంతోషించకూడదు, వారికి ఆపద వచ్చిన రోజున వారి ఆస్తులను దోచుకోకూడదు. వారిలో తప్పించుక పోయేవారిని చంపడానికి నీవు కూడలిలో ఎదురుచూస్తూ నిలబడకూడదు, వారి శ్రమ దినాన వారిలో మిగిలే వారిని శత్రువులకు అప్పగించకూడదు. “యెహోవా దినం ఆసన్నమైంది, అది అన్ని దేశాల మీదికి వస్తుంది. నీవు చేసినట్టే, నీకు చేయబడుతుంది, నీ క్రియలు నీ తల మీదికి వస్తాయి; మీరు నా పవిత్ర కొండమీద త్రాగినట్టే, ఇతర ప్రజలందరు నిత్యం త్రాగుతారు; వారు ముందెన్నడూ త్రాగలేదన్నట్లు త్రాగుతూనే ఉంటారు. అయితే సీయోను పర్వతం మీద విడుదల ఉంటుంది; అది పవిత్రంగా ఉంటుంది, యాకోబు వారు తన వారసత్వాన్ని స్వాధీనపరచుకుంటారు. యాకోబు అగ్నిలా, యోసేపు మంటలా ఉంటారు; ఏశావు కొయ్యకాలులా ఉంటాడు, వారు అతనికి నిప్పంటించి నాశనం చేస్తారు. ఏశావు వారిలో నుండి ఎవరూ తప్పించుకోలేరు” అని యెహోవా చెప్పారు. దక్షిణ ప్రాంత ప్రజలు ఏశావు పర్వతాలను స్వాధీనం చేసుకుంటారు, దిగువ కొండ ప్రాంత ప్రజలు, ఫిలిష్తీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. వారు ఎఫ్రాయిం, సమరయ భూములను స్వాధీనం చేసుకుంటారు, బెన్యామీను వారు గిలాదును స్వాధీనం చేసుకుంటారు. కనానులో బందీలుగా ఉన్న ఇశ్రాయేలీయులు సారెపతు వరకు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు; సెఫారాదులో ఉన్న యెరూషలేము ప్రవాసులు దక్షిణ ప్రాంత పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు. ఏశావు పర్వతాలను పరిపాలించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు, రాజ్యం యెహోవాది అవుతుంది.

ఓబద్యా 1:1-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఓబద్యా దర్శనం. ఎదోము గురించి యెహోవా ప్రభువు ఈ విషయం చెబుతున్నాడు. యెహోవా నుంచి మేము ఒక నివేదిక విన్నాం. “లెండి. ఎదోము మీద యుద్ధం చేయడానికి కదలండి” అని దేవుడు ఒక రాయబారిని రాజ్యాలకు పంపాడు. నేను ఇతర రాజ్యాల్లో నిన్ను తక్కువ చేస్తాను. వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. నీ హృదయ గర్వం నిన్ను మోసం చేసింది. కొండ సందుల్లో ఎత్తయిన ఇంట్లో నివసించే నువ్వు “నన్నెవడు కింద పడేస్తాడు?” అని నీ మనస్సులో అనుకుంటున్నావు. గద్దలా నువ్వు పై పైకి ఎగిరినా నక్షత్రాల్లో గూడు కట్టుకున్నా అక్కడనుంచి నిన్ను కింద పడేస్తాను, అని యెహోవా చెబుతున్నాడు. దొంగలు నీ దగ్గరికి వస్తే, వాళ్ళు రాత్రి పూట వచ్చి తమకు కావలసినంత వరకే దోచుకుంటారు గదా. ద్రాక్ష పండ్లు పోగు చేసే వాళ్ళు నీ దగ్గరికి వస్తే కొన్ని పళ్ళు విడిచి పెడతారు గదా. అయితే, అయ్యో! నువ్వు బొత్తిగా నాశనమైపోయావు. ఏశావు వంశం వారిని పూర్తిగా దోచుకోవడం జరుగుతుంది. వాళ్ళు దాచిపెట్టిన ధనమంతా దోపిడీ అవుతుంది. నీతో సంధి చేసినవారు నిన్ను తమ సరిహద్దు వరకూ పంపేస్తారు. నీతో సమాధానంగా ఉన్నవాళ్ళు నిన్ను మోసగించి ఓడిస్తారు. నీ అన్నం తిన్నవాళ్ళు నిన్ను పట్టుకోడానికి వల వేస్తారు. ఎదోము అర్థం చేసుకోలేడు. ఆ రోజు నేను ఏశావు పర్వతాల్లో తెలివి లేకుండా చేయనా? ఎదోములోని జ్ఞానులను నాశనం చేయనా? అని యెహోవా చెబుతున్నాడు. తేమానూ, నీ శక్తిమంతులకు భయం వేస్తుంది. అందుచేత ఏశావు పర్వతాల్లో నివసించేవారంతా హతమవుతారు. నీ సోదరుడు యాకోబుకు నువ్వు చేసిన దౌర్జన్యానికి నీకు అవమానం కలుగుతుంది. ఇక ఎప్పటికీ లేకుండా నువ్వు నిర్మూలమైపోతావు. నువ్వు దూరంగా నిల్చున్న రోజున, వేరే దేశం వాళ్ళు అతని ఆస్తిని తీసుకుపోయిన రోజున, విదేశీయులు అతని గుమ్మాల్లోకి వచ్చి యెరూషలేము మీద చీట్లు వేసిన రోజున నువ్వు కూడా వారిలో ఒకడిగా ఉన్నావు. నీ సోదరుని దినాన, అతని దురవస్థ దినాన నువ్వు ఆనందించవద్దు. యూదావారి నాశన దినాన వారి స్థితి చూసి సంతోషించ వద్దు. వారి ఆపద్దినాలో అతిశయించ వద్దు. నా ప్రజల విపత్తు రోజున వారి గుమ్మాల్లో ప్రవేశించ వద్దు. వారి ఆపద్దినాలో సంతోషిస్తూ వారి బాధ చూడ వద్దు. వారి విపత్తు రోజున వారి ఆస్తిని దోచుకోవద్దు. వారిలో తప్పించుకున్న వారిని చంపేయడానికి అడ్డదారుల్లో నిలబడ వద్దు. ఆపద్దినాలో వారిలో మిగిలే వారిని శత్రువుల చేతికి అప్పగించవద్దు. రాజ్యాలకూ యెహోవా దినం దగ్గర పడింది. అప్పుడు నువ్వు చేసినట్టే నీకూ చేస్తారు. నువ్వు చేసిన పనులు నీ తల మీదికి తిరిగి వస్తాయి. మీరు నా పవిత్ర పర్వతం పై తాగినట్టు రాజ్యాలన్నీ ఎప్పుడూ తాగుతూ ఉంటాయి. తాము ఎన్నడూ ఉనికిలో లేని వారి లాగా ఉండి తాగుతుంటారు. అయితే సీయోను కొండ మీద తప్పించుకున్న వారు నివసిస్తారు. అది పవిత్రంగా ఉంటుంది. యాకోబు వంశం వాళ్ళు తమ వారసత్వం పొందుతారు. యాకోబు వంశం వారు నిప్పులా, యోసేపు వంశం వారు మంటలా ఉంటారు. ఏశావు వంశం వారు ఎండు గడ్డిలా ఉంటారు. నిప్పు వారిని కాల్చేసి దహించేస్తుంది. ఏశావు వంశంలో ఎవరూ మిగలరు, అని యెహోవా చెప్పాడు. దక్షిణ దిక్కున నివసించేవారు ఏశావు పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు. మైదాన ప్రాంతాల్లో ఉండే వారు ఫిలిష్తీయుల దేశాన్నిస్వాధీనం చేసుకుంటారు. వాళ్ళు ఎఫ్రాయిం ప్రజల భూములనూ సమరయ ప్రజల భూములనూ స్వాధీనం చేసుకుంటారు. బెన్యామీను ప్రజలు గిలాదు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇశ్రాయేలీయుల్లో బందీలుగా దేశాంతరం పోయినవారు సారెపతు వరకూ కనాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెరూషలేము వారిలో బందీలుగా సెఫారాదుకు పోయిన వారు దక్షిణ ప్రాంత పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు. ఏశావు పర్వతాన్ని శిక్షించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు. అప్పుడు రాజ్యం యెహోవాది అవుతుంది.

ఓబద్యా 1:1-21 పవిత్ర బైబిల్ (TERV)

ఇది ఓబద్యాకు వచ్చిన దర్శనం. నా ప్రభువైన యెహోవా ఎదోమును గురించి ఈ విషయం చెప్పాడు: దేవుడైన యెహోవా నుండి ఒక సమాచారం మేము విన్నాము. వివిధ దేశాలకు ఒక దూత పంపబడ్డాడు. “మనం వెళ్లి ఎదోము మీద యుద్ధం చేద్దాం” అని అతడన్నాడు. “చూడు, సాటి దేశాలలో నిన్ను అల్పునిగా చేస్తాను. ప్రజలు నిన్ను మిక్కిలి అసహ్యించుకుంటారు. నీ గర్వం నిన్ను మోసపుచ్చింది. కొండశిఖరంమీద గుహలలో నీవు నివసిస్తున్నావు. నీ ఇల్లు కొండల్లో ఎత్తున ఉంది. అందువల్ల, ‘నన్నెవరూ కిందికి తేలేరు’ అని, నీకు నీవు మనస్సులో అనుకుంటున్నావు.” దేవుడైన యెహోవా ఇది చెప్పాడు: “నీవు గ్రద్దలా ఎత్తుగా ఎగిరినా, నీ గూటిని నీవు నక్షత్రాల్లో కట్టుకున్నా, అక్కడనుండి నిన్ను కిందికి దించుతాను నీవు నిశ్చయంగా నాశనమవుతావు! దొంగలు నీవద్దకు వస్తారు! రాత్రిపూట దోపిడిగాండ్రు వస్తారు! ఆ దొంగలు వారికి కావలసినవన్నీ ఎత్తుకు పోతారు! ద్రాక్షాపండ్లు ఏరటానికి పనివారు నీ పొలాలకు వచ్చినప్పుడు, వారు కొన్ని పండ్లు పరిగె ఏరుకొనేవారుకు వదిలిపెడతారు. ఏశావు రహస్య ధనసంపద కొరకు శత్రువులు వెదకుతారు. వాటిని వారు కనుగొంటారు! నీ స్నేహితులైన ప్రజలంతా నిన్ను దేశంనుండి పంపివేస్తారు. నీతో సంధి చేసుకొన్నవారు నిన్ను మోసగించి, ఓడిస్తారు. నీ వద్దనే రొట్టెలు తిన్న మనుష్యులు, నిన్ను పట్టటానికి వల పన్నుతున్నారు. వారు ఇలా అంటున్నారు: ‘ఇలా అవుతుందని అతడు అనుమానించడు’” యెహోవా ఇలా చెపుతున్నాడు: “ఆ రోజున ఎదోము జ్ఞానులను ఎదోము పర్వతాలలోనున్న వివేకులను నేను నాశనం చేయగోరుదును. తేమానూ, నీ యోధులు భయపడతారు. ఏశావు పర్వతంమీద ప్రతి ఒక్కడూ చంపబడతాడు. అనేక మంది చంపబడతారు. అవమానం నిన్ను ఆవరిస్తుంది. నీవు శాశ్వతంగా నాశనమవుతావు. ఎందుకంటే, నీవు నీ సోదరుడైన యాకోబుపట్ల చాలా క్రూరంగా ఉన్నావు. పరదేశీయులు ఇశ్రాయేలు ధనరాశులను ఎత్తుకుపోయినప్పుడు ఇశ్రాయేలు శత్రువులతో నీవు చేతులు కలిపావు. పరదేశీయులు ఇశ్రాయేలు నగర ద్వారంలోకి వచ్చి, యెరూషలేములో ఎవరు ఏ భాగాన్ని ఆక్రమించుకోవాలనే విషయంలో చీట్లు వేశారు. ఆ సమయంలో, ఆ వచ్చిన వారిలో ఒకనిమాదిరిగా నీవు ఉన్నావు. నీ సోదరుని కష్టకాలం చూసి నీవు నవ్వావు. నీవాపని చేసియుండకూడదు. ఆ జనులు యూదాను నాశనం చేసినప్పుడు నీవు సంతోషించావు. నీవలా చేసియుండకూడదు. యూదా ప్రజల కష్టకాలంలో నీవు గొప్పలు చెప్పుకున్నావు. నీవది చేసియుండకూడదు. నా ప్రజల నగరద్వారాన ప్రవేశం చేసి, నీవు వారి సమస్యలను చూసి నవ్వావు. నీవది చేసియుండకూడదు. వారికి కష్టకాలం వచ్చినప్పుడు. నీవు వారి ఆస్తిని దోచుకున్నావు. నీవాపని చేసియుండకూడదు. నీవు నాలుగు బాటలు కలిసిన స్థానంలో నిలబడి తప్పించుకొని పారిపోయే ప్రజలను చంపివేశావు. నీవాపని చేయకుండా ఉండవలసింది. తప్పించుకునేవారిలో కొందరిని సజీవంగా పట్టుకున్నావు. నీవాపని చేయకుండా ఉండవలసింది. అన్ని దేశాలపై యెహోవా తీర్పురోజు త్వరలో వస్తూ ఉంది. నీవు ఇతర ప్రజలకు కీడు చేశావు. అదే కీడు నీకూ జరుగుతుంది. అవే చెడ్డపనులు నీ తలమీదికి వచ్చి పడతాయి. ఎందుకంటే, నా పవిత్ర పర్వతంమీద నీవు రక్తాన్ని చిందించావు. అలాగే ఇతర జనులు నీ రక్తాన్ని చిందిస్తారు. నువ్వు అంతరిస్తావు నువ్వెప్పుడూ లేనట్లుగా ఉంటుంది. కాని సీయోను కొండమీద మాత్రం మిగిలినవారు ఉంటారు. వారు నా ప్రత్యేక ప్రజలుగా ఉంటారు. యాకోబు వంశం తనకు చెందిన వస్తువులను తిరిగి తీసుకొంటుంది. యాకోబు వంశం అగ్నిలా తయారవుతుంది. యోసేపు సంతతివారు మంటలా తయారవుతారు. కాని ఏశావు వంశం బూడిదలా ఉంటుంది. యూదా ప్రజలు ఎదోమీయులను కాల్చివేస్తారు. యూదా ప్రజలు ఎదోమీయులను నాశనం చేస్తారు. అప్పుడు ఏశావు సంతతివారిలో బ్రతికినవాడంటూ ఏ ఒక్కడూ ఉండడు.” దేవుడైన యెహోవా దాన్ని చెప్పాడు గనుక అది జరుగుతుంది. యూదాకు దక్షిణానగల ఎడారి ప్రాంత ప్రజలు ఏశావు కొండను ఆక్రమించుకుని నివసిస్తారు. కొండకింది (మైదాన) ప్రాంతంవారు ఫిలిష్తీయుల దేశాన్ని ఆక్రమిస్తారు. ఆ ప్రజలు ఎఫ్రాయిము, సమరయ (షోమ్రోను) భూములను ఆక్రమించి నివసిస్తారు. గిలాదు దేశం బెన్యామీనుకు చెంది ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు వారి ఇండ్లు వదిలిపోయేలా ఒత్తిడి చేయబడ్డారు. కాని ఆ ప్రజలే కనానీయుల దేశాన్ని సారెపతువరకు ఆక్రమిస్తారు. యెరూషలేమునుండి సెఫారాదుకు చెరపట్టబడ్డవారు దక్షిణ ప్రాంత పట్టణాలను ఆక్రమించుకొంటారు. జయించినవారు సీయోను కొండమీద ఉంటారు ఆ మనుష్యులు ఏశావు కొండమీద నివసిస్తున్న వారిని పరిపాలిస్తారు. అప్పుడు రాజ్యం యెహోవాకు చెంది ఉంటుంది.

ఓబద్యా 1:1-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చునది. యెహోవాయొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. –ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడియున్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పు నిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండసందులలో నివసించువాడా – నన్ను క్రిందికి పడ ద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు. చోరులేగాని రాత్రి కన్నము వేయువారేగాని నీ మీదికి వచ్చినయెడల తమకు కావలసినంతమట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీయొద్దకు వచ్చినయెడల పరిగె యేరు కొనువారికి కొంత యుండనిత్తురుగదా; నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి యున్నావు. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును; వారు దాచి పెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధిచేసినవారు నిన్ను తమ సరిహద్దువరకు పంపివేయుదురు; నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు; వారు నీ యన్నము తిని నీ కొరకు ఉరి యొడ్డుదురు; ఎదోమునకు వివేచన లేకపోయెను. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములోనుండి జ్ఞానులను నాశముచేతును; ఇదే యెహోవా వాక్కు. తేమానూ, నీ బలాఢ్యులు విస్మయ మొందుదురు, అందువలన ఏశావుయొక్క పర్వత నివాసులందరు హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమునుబట్టి నీవు అవమానము నొందుదువు, ఇక నెన్నటికినిలేకుండ నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేముమీద చీట్లువేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి గదా. నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు; యూదావారి నాశనదినమున వారి స్థితినిచూచి నీవు సంతోషింపతగదు; నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడ దగదు; వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు; వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు; వారిలో తప్పించుకొనినవారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువతగదు, శ్రమదినమందు అతనికి శేషించినవారిని శత్రువులచేతికి అప్పగింప తగదు. యెహోవాదినము అన్యజనులందరిమీదికి వచ్చు చున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును. మీరు నా పరిశుద్ధమైన కొండమీద త్రాగినట్లు అన్యజనులందరును నిత్యము త్రాగుదురు; తాము ఇక నెన్నడు నుండనివారైనట్లు వారేమియు మిగులకుండ త్రాగుదురు. అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనినవారు దానిమీద నివసింతురు, యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. మరియు యాకోబు సంతతివారు అగ్నియు, యోసేపు సంతతివారు మంటయు అగుదురు; ఏశావు సంతతివారు వారికి కొయ్యకాలుగా ఉందురు; ఏశావు సంతతివారిలో ఎవడును తప్పించుకొనకుండ యోసేపు సంతతివారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట యిచ్చియున్నాడు. దక్షిణ దిక్కున నివసించువారు ఏశావుయొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు; మైదానమందుండువారు ఫిలిష్తీయులదేశమును స్వతంత్రించుకొందురు; మరియు ఎఫ్రాయిమీయుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనీయులు గిలాదుదేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఇశ్రాయేలీయుల దండు, అనగా వారిలో చెరపట్టబడినవారు సారెపతువరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు; యెరూషలేమువారిలో చెరపట్ట బడి సెఫారాదునకు పోయినవారు దక్షిణదేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు. మరియు ఏశావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము యెహోవాది యగును.