సంఖ్యాకాండము 21:1-9
సంఖ్యాకాండము 21:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇశ్రాయేలీయులు అతారీముకు వెళ్లే మార్గాన వస్తున్నారని దక్షిణ ప్రాంతంలో ఉన్న అరాదులో ఉన్న కనానీయ రాజు విని, ఇశ్రాయేలీయులపై దాడి చేసి, కొంతమందిని చెరగా తీసుకెళ్లాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు ఈ మ్రొక్కుబడి చేసుకున్నారు: “మీరు ఈ ప్రజలను మా చేతులకు అప్పగిస్తే, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేస్తాము.” యెహోవా ఇశ్రాయేలు మనవి విని కనానీయులను వారికి అప్పగించారు. వారు వారిని, వారి పట్టణాలను సర్వనాశనం చేశారు; కాబట్టి ఆ స్థలానికి హోర్మా అనే పేరు వచ్చింది. ఎదోము చుట్టూ తిరిగి రావాలని వారు హోరు పర్వతం నుండి ఎర్ర సముద్రం మార్గాన ప్రయాణం చేశారు. అయితే ప్రజలు ఈ ప్రయాణంలో ఓపిక కోల్పోయారు; దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడుతూ, “ఈ అరణ్యంలో మేము చావాలని ఈజిప్టు నుండి మమ్మల్ని ఎందుకు తెచ్చారు? ఇక్కడ తినడానికి తిండి లేదు! త్రాగడానికి నీళ్లు లేవు! ఈ పిచ్చి ఆహారమంటే మాకు అసహ్యం!” అని అన్నారు. అప్పుడు యెహోవా వారి మధ్యకు విషసర్పాలను పంపారు; అవి ప్రజలను కాటు వేశాయి, చాలామంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాము. యెహోవా మా మధ్య నుండి సర్పాలను తీసివేసేలా ప్రార్థన చేయండి” అన్నారు. కాబట్టి మోషే ప్రజల కోసం ప్రార్థన చేశాడు. యెహోవా మోషేతో, “ఒక సర్పం చేసి స్తంభం మీద పెట్టు; పాము కాటేసినప్పుడు ఎవరైనా దానిని చూస్తే, వారు బ్రతుకుతారు” అని చెప్పారు. కాబట్టి మోషే ఇత్తడి సర్పాన్ని చేసి, దాన్ని ఒక స్తంభం మీద పెట్టాడు. అప్పుడు ఎవరైనా పాము కాటేసినప్పుడు, ఇత్తడి సర్పాన్ని చూస్తే, వారు చావలేదు.
సంఖ్యాకాండము 21:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలీయులు అతారీం మార్గంలో వస్తున్నారని దక్షిణం వైపు నివాసం ఉన్న కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి వారిల్లో కొంతమందిని బందీలుగా పట్టుకున్నాడు. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకుని “నువ్వు మాకు ఈ జనం మీద జయం ఇస్తే, మేము నీ పేరట వారి పట్టణాలు పూర్తిగా నాశనం చేస్తాం” అన్నారు. యెహోవా ఇశ్రాయేలీయుల స్వరం విని, ఆ కనానీయుల మీద వాళ్లకు జయం ఇచ్చాడు. అప్పుడు వారు ఆ కనానీయులను, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేశారు. ఆ చోటికి “హోర్మా” అని పేరు. ఆ తరువాత వారు ఎదోము చుట్టూ తిరిగి వెళ్లాలని, హోరు కొండనుంచి ఎర్ర సముద్రం దారిలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో అలసటతో ప్రజలు సహనం కోల్పోయారు. అప్పుడు ప్రజలు దేవునికి, మోషేకి విరోధంగా మాట్లాడుతూ “ఈ నిర్జన బీడు ప్రాంతంలో చావడానికి ఐగుప్తులోనుంచి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, ఈ నికృష్టమైన భోజనం మాకు అసహ్యం” అన్నారు. అప్పుడు యెహోవా ప్రజల్లోకి విషసర్పాలు పంపించాడు. అవి ప్రజలను కాటువేసినప్పుడు ఇశ్రాయేలీయుల్లో చాలామంది చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే దగ్గరికి వచ్చి “మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాం. యెహోవా మా మధ్యనుంచి ఈ సర్పాలు తొలగించేలా ఆయనకు ప్రార్ధించండి” అన్నారు. మోషే ప్రజల కోసం ప్రార్థన చేసినప్పుడు యెహోవా “పాము ఆకారం చేయించి స్థంభం మీద పెట్టు. అప్పుడు పాము కాటేసిన ప్రతి వాడు దానివైపు చూసి బతుకుతాడు” అని మోషేకు చెప్పాడు. కాబట్టి మోషే, ఇత్తడి పాము ఒకటి చేయించి, స్థంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు పాము కాటు తిన్న ప్రతివాడూ ఆ ఇత్తడి పాము వైపు చూసినప్పుడు అతడు బతికాడు.
సంఖ్యాకాండము 21:1-9 పవిత్ర బైబిల్ (TERV)
కనానీ ప్రజల రాజు పేరు అరాదు. అతడు నెగెవు లోయలో నివసించాడు. ఇశ్రాయేలు ప్రజలు అతారీము దారిన వస్తున్నారని అరాదు రాజు విన్నాడు. కనుక రాజు బయలుదేరి వెళ్లి ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసాడు. వారిలో కొందరిని అతడు బంధించి, బందీలుగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాతో, “యెహోవా, దయచేసి ఈ ప్రజలను రక్షించు. వారిని మరల మా దగ్గరకు తీసుకునిరా. ఇది నీవు చేస్తే, మేము వారి పట్టణాలను సర్వనాశనం చేస్తాము” అని ప్రమాణం చేసారు. ఇశ్రాయేలు ప్రజల మాట యెహోవా ఆలకించాడు. ఇశ్రాయేలు ప్రజలు కనానీ ప్రజలను ఓడించటానికి యెహోవా సమ్మతించాడు. కనానీ ప్రజలను, వారి పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా నాశనంచేసారు. అందుచేత ఆ స్థలానికి హోర్మ అని పేరు పెట్టబడింది. ఇశ్రాయేలు ప్రజలు హోరు కొండ విడిచి ఎర్ర సముద్రానికి వెళ్లే మార్గంలో ప్రయాణం చేసారు. ఎదోము అనే ప్రాంతాన్ని చుట్టి వచ్చేందుకు వారు ఇలా చేసారు. కానీ ప్రజల్లో సహనం లేదు. ప్రయాణం చేస్తూ దూరాన్ని గూర్చి వారు సణిగారు. దేవునికి, మోషేకు ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడారు. “మమ్మల్ని ఈజిప్టునుండి నీవెందుకు తీసుకువచ్చావు? మేము ఇక్కడ అరణ్యంలోనే చస్తాము! రొట్టెలేదు, నీళ్లు లేవు. ఈ దారుణమైన ఆహారం మాకు అసహ్యము” అన్నారు ప్రజలు. కనుక విష సర్పాలను ఆ ప్రజల మధ్యకు యెహోవా పంపించాడు. ఆ పాములు ప్రజలను కరిచాయి. ఇశ్రాయేలు ప్రజలు చాల మంది చనిపోయారు. ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “యెహోవాకు, నీకు వ్యతిరేకంగా మాట్లాడి మేము పాపం చేసామని మాకు తెలుసు. యెహోవాకు ప్రార్థన చేసి ఈ పాములను తీసివేయమని అడుగు” అని చెప్పారు. కనుక ఆ ప్రజల కోసం మోషే ప్రార్థించాడు. “ఇత్తడి సర్పం ఒకటి చేసి దాన్ని ఒక స్తంభం మీద ఉంచు. పాము కరిచిన వ్యక్తి ఆ స్తంభం మీది ఇత్తడి సర్పాన్ని చూడాలి. అప్పుడు అతడు చావడు” అని యెహోవా మోషేతో చెప్పాడు. కనుక మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. అతడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి, ఒక స్తంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు ఎవర్నయినా పాము కరిస్తే, ఆ మనిషి స్తంభం మీది ఇత్తడి సర్పాన్ని చూచి బ్రతికాడు.
సంఖ్యాకాండము 21:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణదిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందిరిని చెరపట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని – నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినయెడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గా యాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి– ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి–మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి; యెహోవా మా మధ్యనుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజలకొరకు ప్రార్థనచేయగా యెహోవా–నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకు నని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్ప మొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.