సంఖ్యాకాండము 20:14-29
సంఖ్యాకాండము 20:14-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మోషే కాదేషు నుండి ఎదోము రాజు దగ్గరకు ఈ వర్తమానంతో దూతలను పంపాడు: “నీ సహోదరుడైన ఇశ్రాయేలు ఇలా చెప్తున్నాడు: మా మీదికి వచ్చిన కష్టాలన్నిటి గురించి నీకు తెలుసు. మా పూర్వికులు ఈజిప్టుకు వెళ్లారు. చాలా కాలం మేమక్కడ ఉన్నాము. ఈజిప్టువారు మా పట్ల, మా పూర్వికుల పట్ల దారుణంగా ప్రవర్తించారు, అయితే మేము యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన మా మొర ఆలకించాడు దేవదూతను పంపి, ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చాడు. “ఇప్పుడు మేము కాదేషులో ఉన్నాము, ఈ పట్టణం మీ సరిహద్దుల చివర ఉంది. దయచేసి మమ్మల్ని మీ దేశం మార్గం ద్వారా వెళ్లనివ్వండి. మేము మీ పొలాలు, ద్రాక్షతోటల్లో నుండి వెళ్లము, మీ బావులలోని నీళ్లు త్రాగము. రాజమార్గంలోనే సాగిపోతాము. ఈ దేశం పొలిమేర దాటే వరకు కుడికి గాని, ఎడమకు గాని తిరగకుండా వెళ్తాము.” కానీ ఎదోము రాజు ఇలా ఆజ్ఞాపించారు: “మీరు ఇక్కడినుండి వెళ్లకూడదు. వెళ్లడానికి ప్రయత్నిస్తే ఖడ్గంతో మీపై దాడి చేస్తాము.” ఇశ్రాయేలు ప్రజలు తిరిగి కబురు పంపారు: “మేము రాజమార్గంలోనే సాగిపోతాము. మేము మా పశువులు నీళ్లు త్రాగితే దానికి వెల చెల్లిస్తాము. మేము కేవలం కాలినడకతో దాటి వెళ్తాం అంతే ఇంకేమి లేదు.” వారు తిరిగి జవాబిచ్చారు: “మీరు దాటి వెళ్లకూడదు.” ఎదోము వారు వారిని ఎదుర్కోడానికి, శక్తిగల పెద్దబలగంతో వచ్చారు. ఎదోము వారు ఇశ్రాయేలీయులను తమ సరిహద్దులు దాటనివ్వలేదు కాబట్టి ఇశ్రాయేలీయులు అక్కడినుండి తిరిగిపోయారు. ఇశ్రాయేలు సమాజమంత కాదేషు నుండి ప్రయాణమై హోరు పర్వతానికి చేరారు. ఎదోము సరిహద్దు దగ్గర ఉన్న హోరు పర్వతం దగ్గర, యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు, “అహరోను తన పూర్వికుల దగ్గర చేర్చబడతాడు. మీరిద్దరు మెరీబా నీళ్ల దగ్గర నా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి అతడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించడు. నీవు అహరోనును, అతని కుమారుడైన ఎలియాజరును హోరు పర్వతం పైకి తీసుకెళ్లు. అహరోను వస్త్రాలు తీసి, అతని కుమారుడైనా ఎలియాజరుకు తొడిగించు. అక్కడే అహరోను చనిపోయి తన పూర్వికుల దగ్గర చేర్చబడతాడు.” యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉండగా వారు హోరు పర్వతం ఎక్కారు. మోషే అహరోను వస్త్రాలు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను ఆ పర్వత శిఖరం మీదనే చనిపోయాడు. మోషే ఎలియాజరు పర్వతం దిగి వచ్చారు, సమాజమంతా అహరోను చనిపోయాడని ఎప్పుడైతే తెలుసుకుందో, ఇశ్రాయేలీయులంతా ముప్పై రోజులు అహరోను కోసం సంతాపం పాటించారు.
సంఖ్యాకాండము 20:14-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మోషే కాదేషు నుంచి ఎదోము రాజు దగ్గరికి రాయబారులను పంపించి “నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగుతున్నది ఏమంటే, మాకొచ్చిన కష్టమంతా నీకు తెలుసు. మా పితరులు ఐగుప్తుకు వెళ్ళారు. మేము చాలా రోజులు ఐగుప్తులో ఉన్నాం. ఐగుప్తీయులు మమ్మల్ని, మా పితరులను బాధల పాలు చేశారు. మేము యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మా మొర విని, ఒక దూతను పంపించి ఐగుప్తులోనుంచి మమ్మల్ని రప్పించాడు. చూడు, మేము నీ సరిహద్దుల చివర ఉన్న కాదేషు పట్టణంలో ఉన్నాం. మమ్మల్ని నీ దేశం గుండా దాటి వెళ్లనివ్వు. పొలాల్లోనుంచైనా, ద్రాక్షతోటల్లోనుంచైనా మేము వెళ్ళం. బావుల్లో నీళ్లు తాగం. రాజ మార్గంలో నడిచి వెళ్ళిపోతాం. నీ సరిహద్దులు దాటే వరకూ కుడివైపుకైనా. ఎడమవైపుకైనా తిరుగకుండా వెళ్ళిపోతాం” అని చెప్పించాడు. కాని ఎదోము రాజు “నువ్వు నా దేశంలోగుండా వెళ్లకూడదు. అలా వెళ్తే, నేను ఖడ్గంతో నీ మీద దాడి చేస్తాను” అని జవాబిచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితో “మేము రాజమార్గంలోనే వెళ్తాం. మేము గాని, మా పశువులుగాని నీ నీళ్లు తాగితే, దాని ఖర్చు చెల్లిస్తాం. కేవలం మమ్మల్ని కాలినడకతో వెళ్లనివ్వు అంతే” అన్నారు. అప్పుడు అతడు “నువ్వు రాకూడదు” అన్నాడు. అప్పుడు ఎదోము రాజు అనేకమంది సైన్యంతో, మహా బలంతో బయలుదేరి, వారి మీదకు వచ్చాడు. ఎదోము రాజు ఇశ్రాయేలును తన సరిహద్దుల్లో గుండా దాటి వెళ్ళడానికి అనుమతించలేదు గనక ఇశ్రాయేలీయులు అతని దగ్గరనుంచి తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజమంతా కాదేషులోనుంచి ప్రయాణం చేసి హోరు కొండకు వచ్చారు. యెహోవా ఎదోము పొలిమేరల దగ్గరున్న హోరు కొండ దగ్గర మోషే అహరోనులతో మాట్లాడుతూ, “మీరిద్దరూ మెరీబా నీళ్ళ దగ్గర నా మాటలకు ఎదురు తిరిగారు గనక నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేశంలో అహరోను ప్రవేశించకుండా, తన పితరులతో చేరిపోతాడు. నువ్వు అహరోను, అతని కొడుకు ఎలియాజరును తీసుకుని హోరు కొండెక్కి, అహరోను వస్త్రాలు తీసి అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించు. అహరోను తన పితరులతో చేరి అక్కడ చనిపోతాడు” అన్నాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉన్నప్పుడు వారు హోరు కొండ ఎక్కారు. మోషే అహరోను వస్త్రాలు తీసి, అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను కొండశిఖరం మీద చనిపోయాడు. తరువాత మోషే, ఎలియాజరు ఆ కొండ దిగి వచ్చారు. అహరోను చనిపోయాడని సమాజమంతా గ్రహించినప్పుడు, ఇశ్రాయేలీయుల కుటుంబాలన్నీ అహరోను కోసం ముప్ఫై రోజులు శోకించారు.
సంఖ్యాకాండము 20:14-29 పవిత్ర బైబిల్ (TERV)
మోషే కాదేషులో ఉన్నప్పుడు, కొందరు మనుష్యులను ఎదోము రాజు దగ్గరకి పంపి ఈలాగు చెప్పమన్నాడు. ఆ సందేశం ఇది: “మీ సోదరులైన ఇశ్రాయేలీయులు మీతో చెప్పేది ఏమంటే: మాకు కలిగిన కష్టాలన్నీ నీకు తెలుసు. చాల సంవత్సరాల క్రిందట మా పూర్వీకులు ఈజిప్టు వెళ్లారు. చాల సంవత్సరాలు మేము అక్కడ జీవించాము. ఈజిప్టు ప్రజలు మా యెడల కృ-రంగా ఉండిరి. అయితే మేము యెహోవాను సహాయం అడిగాము. యెహోవా మా మొర విని, మాకు సహాయం చేసేందుకు ఒక దేవదూతను పంపించాడు. యెహోవా మమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. “ఇదిగో ఇప్పుడు మేము నీ దేశ సరిహద్దు అయిన కాదేషులో ఉన్నాము. దయచేసి నీ దేశంలో నుంచి మమ్మల్ని ప్రయాణం చేయనివ్వు. పొలాల్లోనుంచి, ద్రాక్షా తోటల్లోనుంచి మేము నడువము. మీ బావుల్లో దేనినుండి మేము నీళ్లు తాగము. రాజమార్గంలో మాత్రమే మేము ప్రయాణం చేస్తాము. ఆ మార్గంనుండి కుడికి గాని ఎడమకు గాని మేము తొలగము. మీ దేశం దాటిపోయేంత వరకు మేము రాజ మార్గాననే వెళ్తాము.” అయితే ఎదోము రాజు, “మీరు మా దేశంలోనుండి ప్రయాణం చేయగూడదు. మా దేశంలోనుండి ప్రయాణం చేయటానికి మీరు ప్రయత్నిస్తే, మేము వచ్చి కత్తులతో మీతో పోరాడుతాము” అని జవాబిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు, “మేము రహదారి వెంబడే ప్రయాణం చేస్తాము. మా పశువులు మీ నీళ్లు ఏమైనా తాగితే, దానికి మేము వెల చెల్లిస్తాము. మేము మీ దేశంలోనుంచి నడుస్తాము, అంతే. అంతేగాని, దాన్ని మేము తీసుకోము” అని జవాబిచ్చారు. అయితే, “మేము మిమ్మల్ని మా దేశంలోంచి పోనియ్యము” అని ఎదోము జవాబిచ్చాడు. అప్పుడు ఎదోము రాజు బలంగల విస్తార సైన్యాన్ని సమకూర్చుకొని, ఇశ్రాయేలు ప్రజలతో పోరాడటానికి వారి మీదికి వెళ్లాడు. ఇశ్రాయేలు ప్రజలను తన దేశంగుండా వెళ్లనిచ్చేందుకు ఎదోము రాజు నిరాకరించాడు. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కు తిరిగి మరో మార్గంగుండా వెళ్లిపోయారు. ఇశ్రాయేలు ప్రజలంతా కాదేషు నుండి హోరు కొండకు ప్రయాణం చేసారు. హోరు కొండ ఎదోము సరిహద్దుకు దగ్గర్లో ఉంది. మోషే, అహరోనులతో యెహోవా చెప్పాడు, “అహరోను తన పూర్వీకుల దగ్గరకు వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశంలో అతడు ప్రవేశించడు. మోషే, అహరోనూ, మీరు మెరీబా జలాల దగ్గర నేను మీకు ఇచ్చిన ఆజ్ఞకు పూర్తిగా విధేయులు కాలేదుగనుక నేను మీతో ఇలా చెబుతున్నాను: “అహరోనును, అతని కుమారుడైన ఎలియాజరును హోరు కొండమీదికి తీసుకుని రా. అహరోను ప్రత్యేక దుస్తులు అతని దగ్గరనుండి తీసుకుని, అతని కుమారుడైన ఎలియాజరుకు వాటిని తొడిగించు. అహరోను కొండమీద మరణిస్తాడు. అతడు తన పూర్వీకుల దగ్గరకు వెళ్తాడు.” యెహోవా ఆజ్ఞకు మోషే విధేయుడయ్యాడు. మోషే, అహరోను, ఎలియాజరు హోరు కొండ శిఖరం మీదికు వెళ్లారు. వారు వెళ్లటం ఇశ్రాయేలు ప్రజలంతా చూసారు. అహరోను వస్త్రాలన్నీ తీసి అతని కుమారుడైన ఎలియాజరు మీద వేసాడు మోషే. అప్పుడు అహరోను ఆ కొండ శిఖరం మీద చనిపోయాడు. మోషే, ఎలియాజరు కొండ దిగి క్రిందికి వచ్చారు. అప్పుడు అహరోను చనిపోయినట్టు ప్రజలంతా తెలుసుకొన్నారు. కనుక ఇశ్రాయేలులో ప్రతి వ్యక్తి 30 రోజులపాటు సంతాపపడ్డాడు.
సంఖ్యాకాండము 20:14-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మోషే కాదేషునుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి–నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగున దేమనగా–మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది; మా పితరులు ఐగుప్తునకు వెళ్లిరి; మేము చాలాదినములు ఐగుప్తులో నివసించితిమి; ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి. మేము యెహోవాకు మొఱ పెట్టగా ఆయన మా మొఱను విని, దూతను పంపి ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము. మమ్మును నీ దేశమును దాటి పోనిమ్ము; పొలములలో బడియైనను ద్రాక్షతోటలలో బడియైనను వెళ్లము; బావుల నీళ్లు త్రాగము; రాజమార్గమున నడిచిపోయెదము. నీ పొలిమేరలను దాటువరకు కుడివైపునకైనను ఎడమవైపున కైనను తిరుగకుండ పోయెదమని చెప్పించెను. ఎదోమీయులు –నీవు నా దేశములోబడి వెళ్లకూడదు; నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చెదను సుమీ అని అతనితో చెప్పగా ఇశ్రాయేలీయులు–మేము రాజమార్గముననే వెళ్లెదము; నేనును నా పశువులును నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందును మరేమి లేదు, కాలినడకనే దాటిపోవుదును; అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు–నీవు రానేకూడదనెను. అంతట ఎదోము బహుజనముతోను మహా బలముతోను బయలుదేరి వారి కెదురుగా వచ్చెను. ఎదోము ఇశ్రాయేలు తన పొలి మేరలలోబడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతనియొద్దనుండి తొలగిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేషులోనుండి సాగి హోరు కొండకు వచ్చెను. యెహోవా ఎదోము పొలిమేరలయొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –అహరోను తన పితరులతో చేర్చబడును; ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండయెక్కి, అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండ నెక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండశిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగివచ్చిరి. అహరోను చనిపోయెనని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబికులందరును అహరోనుకొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి.