సంఖ్యాకాండము 19:1-22

సంఖ్యాకాండము 19:1-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు: యెహోవా ఆజ్ఞాపించిన నియమానికి ఇది అవసరం: ఇశ్రాయేలీయులు లోపం లేని లేదా మచ్చలేని కాడి మోయని ఎర్రని పెయ్యను మీ దగ్గరకు తేవాలని చెప్పండి. దానిని యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి; అతని ఎదుట శిబిరం బయట దానిని వధించాలి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంత వ్రేలితో తీసుకుని సమావేశ గుడారం ముందు భాగం వైపు ఆ రక్తాన్ని ఏడుసార్లు చిలకరించాలి. అతడు చూస్తుండగా ఆ పెయ్య కాల్చివేయబడాలి. దాని చర్మం, మాంసం, రక్తం, పేడ అంతా కాల్చివేయబడాలి. అప్పుడు యాజకుడు కొంత దేవదారు కర్రను, హిస్సోపు చెట్టురెమ్మను ఎర్ర దారాన్ని తీసుకుని పెయ్యను కాల్చి నిప్పులో వెయ్యాలి. తర్వాత యాజకుడు తన బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి. తర్వాత అతడు శిబిరంలో ప్రవేశించవచ్చు గాని సాయంత్రం వరకు ఆచారరీత్య అపవిత్రుడే. ఆ పెయ్యను దహించు వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు అతడు అపవిత్రుడే. పవిత్రుడైనవాడు ఆవు పెయ్య బూడిదను పోగు చేసి శిబిరం బయట ఆచార ప్రకారం శుభ్రమైన చోట ఉంచాలి. అది శుద్ధి జలంలో వాడబడడానికి ఇశ్రాయేలు సమాజం ద్వారా పెట్టబడాలి; అది పాపపరిహారబలి. పెయ్య బూడిదను పోగుచేసిన వ్యక్తి కూడా తన బట్టలు ఉతుక్కోవాలి, అతడు సాయంత్రం వరకు అపవిత్రునిగా ఉంటాడు. ఇది ఇశ్రాయేలీయులకు, వారి మధ్య నివసిస్తున్న విదేశీయులకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. “మానవ శవాన్ని ఎవరైనా తాకితే వారు ఏడు రోజులు అపవిత్రులై ఉంటారు. వారు మూడవ రోజు, ఏడవ రోజు తమను తాము శుద్ధి చేసుకోవాలి; అప్పుడు వారు శుద్ధులవుతారు. అయితే వారు మూడవ రోజు, ఏడవ రోజు శుద్ధి చేసుకోకపోతే అపవిత్రంగానే ఉంటారు. ఒక మనుష్యుని మృతదేహాన్ని తాకిన తర్వాత తమను తాము శుద్ధి చేసుకోకపోతే, యెహోవా సమావేశ గుడారాన్ని అపవిత్రం చేసినవారవుతారు. అలాంటి వారిని ఇశ్రాయేలు నుండి బహిష్కరించాలి. ఎందుకంటే, శుద్ధి జలం వారి మీద చిలకరింపబడలేదు, వారు అపవిత్రులుగా ఉన్నారు. వారి అపవిత్రత వారి మీద ఉంటుంది. “ఇదీ గుడారంలో మనుష్యులెవరైనా చనిపోతే దానికి సంబంధించిన నియమం: ఎవరైనా డేరాలో ప్రవేశిస్తే, దానిలో ఉంటే, వారు ఏడు రోజులపాటు అపవిత్రులుగా ఉంటారు. మూత పెట్టి ఉంచని ప్రతి పాత్ర అపవిత్రమే. “ఎవరైనా బయట ఉన్నప్పుడు ఖడ్గం చేత చంపబడిన వారిని లేదా సహజ మరణం పొందినవారిని, లేదా మానవుల ఎముకలు కానీ, సమాధి కానీ ముట్టుకుంటే, వారు ఏడు రోజులు అపవిత్రులుగా ఉంటారు. “ఎందుకంటే అపవిత్రమైన వ్యక్తి కోసం, కాల్చబడిన పాపపరిహారబలి యొక్క బూడిద కొంత పాత్రలో వేసి, వాటి మీద పారే తాజా నీరు పొయ్యాలి. అప్పుడు ఆచార ప్రకారం పవిత్రంగా ఉన్న వ్యక్తి కొంత హిస్సోపు తీసుకుని, నీటిలో ముంచి గుడారం అన్ని అలంకరణలు అక్కడ ఉన్న ప్రజలను చిలకరించాలి. అతడు మానవ ఎముక లేదా సమాధిని తాకిన వారి మీద లేదా చంపబడిన ఎవరైనా లేదా సహజ మరణం పొందినవారి మీద కూడా చిలకరించాలి. పవిత్రుడైన పురుషుడు అపవిత్రుల మీద మూడవ రోజు, ఏడవ రోజు చిలకరించాలి, ఏడవ రోజు వారిని పవిత్రపరచాలి. పవిత్రపరచబడే వారు వారి బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి, ఆ సాయంత్రం వారు శుద్ధులవుతారు. కానీ అపవిత్రులైనవారు తమను తాము శుద్ధి చేసుకోకపోతే, వారు సమాజం నుండి బహిష్కరించబడాలి, వారు యెహోవా పరిశుద్ధాలయాన్ని అపవిత్ర పరిచిన వారు. శుద్ధి జలం వారి మీద చిలకరింపబడలేదు కాబట్టి వారు అపవిత్రులు. ఇది వారికి నిత్య కట్టుబాటుగా ఉంటుంది. “శుద్ధి జలం చిలకరించు పురుషుడు కూడా తన బట్టలు ఉతుక్కోవాలి. ఎవరైనా శుద్ధి జలం తాకితే సాయంత్రం వరకు వారు అపవిత్రులు. అపవిత్రమైనవారు ఏది ముట్టిన అది అపవిత్రమే, ఎవరైనా దానిని ముట్టుకుంటే సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.”

సంఖ్యాకాండము 19:1-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా మోషే అహరోనులతో, “యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదంటే, ఇశ్రాయేలీయులు కళంకం లేనిదీ, మచ్చ లేనిదీ, ఎప్పుడూ కాడి మోయ్యని ఎర్ర ఆవును నీ దగ్గరికి తీసుకురావాలని వారితో చెప్పు. మీరు యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగించాలి. ఒకడు పాళెం బయటికి దాన్ని తోలుకెళ్ళి అతని ఎదుట దాన్ని వధించాలి. యాజకుడైన ఎలియాజరు దాని రక్తం కొంచెం వేలితో తీసి, సన్నిధి గుడారం ఎదుట ఆ రక్తాన్ని ఏడుసార్లు చిమ్మాలి. అతని కళ్ళ ఎదుట ఒకడు ఆ ఆవును కాల్చాలి. దాని చర్మం, మాంసం, రక్తం, పేడతో సహా కాల్చెయ్యాలి. ఇంకా ఆ యాజకుడు దేవదారు కర్ర, హిస్సోపు, ఎర్రరంగు నూలు తీసుకుని, ఆ ఆవును కాలుస్తున్న మంటల్లో వాటిని వెయ్యాలి. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుకుకుని, నీళ్లతో తలస్నానం చేసిన తరువాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. దాన్ని కాల్చినవాడు నీళ్లతో తన బట్టలు ఉతుకుకుని నీళ్లతో తలస్నానం చేసి సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఇంకా శుద్ధుడైనవాడు ఒకడు ఆ ఆవు బూడిదను పోగు చేసి పాలెం బయట ఒక శుద్ధమైన స్థలంలో పెట్టాలి. ఆ బూడిదను ఇశ్రాయేలీయుల సమాజం కోసం భద్రం చెయ్యాలి. ఆ బూడిద పాపపరిహారార్ధ అర్పణ నుంచి వచ్చింది గనక, పాపం నుంచి శుద్ధీకరణ కోసం వారు ఆ బూడిదను నీళ్ళతో కలుపుతారు. ఆ ఆవు బూడిదను పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కుని, సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఇది ఇశ్రాయేలీయులకూ, వారిల్లో నివాసం ఉంటున్న పరదేశులకూ శాశ్వతమైన శాసనం. మానవ శవాన్ని ముట్టుకున్నవాడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు. అతడు మూడో రోజు ఆ నీళ్ళతో పాపశుద్ధి చేసుకుని, ఏడో రోజు శుద్ధుడౌతాడు. అయితే అతడు మూడో రోజు పాపశుద్ధి చేసుకోకపోతే ఏడో రోజు శుద్ధుడు కాడు. మనిషి శవాన్ని ముట్టుకున్నవాడు ఆ విధంగా పాపశుద్ధి చేసుకోకపోతే అతడు యెహోవా మందిరాన్ని అపవిత్రం చేసినవాడౌతాడు. పాపపరిహార జలం అతని మీద చల్ల లేదు గనక ఆ వ్యక్తిని ఇశ్రాయేలీయుల్లో లేకుండా చెయ్యాలి. అతడు అశుద్ధుడుగానే ఉండిపోతాడు. అతని అశుద్ధత అతని మీద ఉంటుంది. ఎవరైనా ఒక గుడారంలో చనిపోతే, దాని గురించిన చట్టం ఇది. ఆ గుడారంలో ప్రవేశించే ప్రతివాడూ, ఆ గుడారంలో ఉన్నవారూ ఏడు రోజులు అశుద్ధంగా ఉంటారు. మూత వేయకుండా తెరచి ఉన్న పాత్రలన్నీ అశుద్ధం ఔతాయి. గుడారం బయట కత్తితో నరికిన వాడినైనా, శవాన్నైనా, మనిషి ఎముకనైనా, సమాధినైనా ముట్టుకున్నవాడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు. అశుద్ధుడైన వ్యక్తి కోసం, పాప పరిహారార్థమైన కాలిన బూడిద కొంచెం తీసుకుని ఒక కూజాలో ఉన్న మంచినీళ్ళతో కలపాలి. తరువాత ఒక శుద్ధుడు హిస్సోపు తీసుకుని ఆ నీళ్ళల్లో ముంచి, ఆ గుడారం మీద, దానిలోని ఉపకరణాలు అన్నిటి మీదా, అక్కడున్న మనుషుల మీదా చల్లాలి. ఎముకనుగాని, కత్తితో నరికిన వాణ్ణి గాని, శవాన్నిగాని, సమాధినిగాని ముట్టుకున్న వాడి మీద కూడా దాన్ని చల్లాలి. మూడో రోజు, ఏడో రోజూ, శుద్ధుడు అశుద్ధుని మీద దాన్ని చల్లాలి. ఏడో రోజు అతడు పాపశుద్ధి చేసుకుని, తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేసి, సాయంకాలానికి శుద్ధుడౌతాడు. ఎవరైనా అశుద్ధుడుగానే ఉండి పాపశుద్ధి చేసుకోడానికి నిరాకరిస్తే, అతడు యెహోవా పరిశుద్ధ స్థలాన్ని అశుద్ధం చేశాడు గనక అలాంటి వాణ్ణి సమాజంలో లేకుండా చేయాలి. పాపపరిహార జలం అతని మీద చల్ల లేదు గనక అతడు అశుద్ధుడుగానే ఉంటాడు. ఈ పరిస్థితులకు సంబంధించిన శాశ్వతమైన శాసనం ఏదంటే-పాపపరిహార జలం చల్లేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. పాపపరిహార జలం ముట్టుకున్నవాడు సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. అశుద్ధుడు ముట్టుకున్నదంతా అశుద్ధం దాన్ని ముట్టుకున్న వారిందరూ సాయంకాలం వరకూ అశుద్ధులుగా ఉంటారు.”

సంఖ్యాకాండము 19:1-22 పవిత్ర బైబిల్ (TERV)

మోషేతో, అహరోనుతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చే ఆజ్ఞలు, ప్రబోధాలు ఇవే. వారు బలంగా ఉన్న ఒక ఎర్ర ఆవును నీ దగ్గరకు తీసుకుని రావాలి. ఆ ఆవుకు ఎలాంటి గాయాలు ఉండకూడదు. ఆ ఆవు ఎన్నడూ కాడి మోసి ఉండకూడదు. ఆ ఆవును యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి. ఎలియాజరు ఆవును నివాసం యొక్క వెలుపలికి తీసుకునిపోయి, అక్కడ దాన్ని వధించాలి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంత తన వేలిమీద వేసుకొవాలి. తర్వాత అతడు ఆ రక్తంలో కొంత పవిత్ర గుడారం వైపు చల్లాలి. అతడు ఇలా ఏడు సార్లు చేయాలి. అప్పుడు మొత్తం ఆవు అతని ఎదుట దహించబడాలి. దాని చర్మం, మాంసం, రక్తం, ప్రేగులు అన్నీ దహించాలి. అప్పుడు యాజకుడు ఒక దేవదారు కర్రను, హిస్సోపు కొమ్మను, ఎర్ర నూలును తీసుకుని, ఆవు దహించబడుతున్న అగ్నిలో వేయాలి. అప్పుడు యాజకుడు స్నానం చేసి, నీళ్లతో తన బట్టలు ఉదుక్కోవాలి. అతడు తిరిగి నివాసానికి రావాలి. యాజకుడు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు. ఆ ఆవును దహించే వ్యక్తి స్నానం చేసి, నీళ్లతో తన బట్టలు ఉదుక్కోవాలి. సాయంత్రం వరకు అతడు అపవిత్రంగానే ఉంటాడు. “అప్పుడు పవిత్రుడైనవాడు ఒకడు ఆ ఆవు బూడిదను పోగు చేయాలి. అతడు నివాసానికి బయట పరిశుభ్రమైన స్థలంలో ఆ బూడిదను ఉంచుతాడు ప్రజలు పవిత్రులయ్యేందు కోసం ఒక ప్రత్యేక ఆచారాన్ని పాటించేటప్పుడు ఈ బూడిద ఉపయోగించబడుతుంది. ఒక వ్యక్తి పాపాలను తొలగించేందుకు కూడా ఈ బూడిద ఉపయోగించబడుతుంది. “ఆవు బూడిదను పోగుచేసే వ్యక్తి తన బట్టలు ఉదుక్కోవాలి. అతను సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు. “ఈ నియమం శాశ్వతంగా కొనసాగుతుంది. ఇశ్రాయేలు పౌరులకు, మీతో కలసి నివసిస్తున్న విధేశీయులకు ఈ నియమం వర్తిస్తుంది. ఎవరైనా ఒకరు ఒక శవాన్ని తాకితే, అప్పుడు అతడు ఏడు రోజులు అపవిత్రంగా ఉంటాడు. ప్రత్యేక జలంతో మూడోరోజున, మళ్లీ ఏడో రోజున అతడు తనను తాను కడుక్కోవాలి. అతడు ఇలా చేయకపోతే అపవిత్రంగానే ఉంటాడు. ఒకడు ఒక శవాన్ని తాకితే అతడు అపవిత్రుడు. అతడు అపవిత్రుడుగానే ఉండి, పవిత్ర గుడారానికి వెళ్తే, అప్పుడు ఆ పవిత్ర గుడారం అపవిత్రం అవుతుంది. కనుక అతనిని ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి తొలగించి వేయాలి. ఒక అపవిత్రునిమీద ప్రత్యేకజలం చల్లకపోతే అతడు అపవిత్రంగానే ఉండిపోతాడు. “తమ గుడారాల్లోనే మరణించే వారిని గూర్చిన నియమం ఇది. ఒకడు తన గుడారంలో మరణిస్తే, ఆ గుడారంలో ఉన్న ప్రతి ఒక్కరూ అపవిత్రులే. ఏడు రోజులపాటు వారు అపవిత్రం అవుతారు. మూతలేని ప్రతి పాత్ర అపవిత్రం అవుతుంది. ఏ మనిషిగాని శవాన్నిగాని ముట్టుకొంటే, ఆ మనిషి అపవిత్రుడుగా ఏడు రోజులు ఉంటాడు. శవం బయట పొలంలో ఉన్నా, లేక యుద్ధంలో చచ్చిన వానిదైనా సరే ఇదే వర్తిస్తుంది. మరియు చచ్చిన మనిషి ఎముకను ఒక దాన్ని ఎవరైనా ముట్టుకుంటే అప్పుడు అతడు అపవిత్రుడౌతాడు. “కనుక అతనిని మరల పవిత్రం చేయటానికి దహించబడ్డ ఆవు బూడిదను నీవు ప్రయోగించాలి. పాత్రలో బూడిద మీద స్వచ్ఛమైన నీళ్లు పోయాలి. పవిత్రుడు ఒకడు హిస్సోపు కొమ్మను తీసుకుని, దానిని ఆ నీళ్లలో ముంచాలి. అప్పుడు అతడు గుడారంమీదా, గిన్నెలమీదా, గుడారంలోని మనుష్యులందరి మీదా దానిని చల్లాలి. శవాన్ని ముట్టు కొన్న ఎవరికైనా నీవు ఇలాగే చేయాలి. యుద్ధంలో చంపబడిన ఒకరి శవాన్ని ముట్టుకొనిన ఎవరికైనా సరే, చచ్చిన మనిషి ఎముకను తాకిన ఎవరికైనా సరే నీవు ఇలాగే చేయాలి. “అప్పుడు పవిత్రంగా ఉన్న ఒక మనిషి అపవిత్రంగా ఉన్న వానిమీద మూడో రోజున, మరల ఏడో రోజున ఈ నీళ్లు చల్లాలి. ఏడో రోజున అతడు పవిత్రం అవుతాడు. అతడు తన వస్త్రాలను నీళ్లలో ఉతుక్కోవాలి. ఆ సాయంకాలం అతడు పవిత్రుడవుతాడు. “ఒక వ్యక్తి అపవిత్రుడై, పవిత్రుడుగా చేయబడకపోతే, అతడు ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి వేరు చేయబడాలి. అతనిమీద ప్రత్యేక జలం చల్లబడలేదు. అతడు పవిత్రుడు కాలేదు. కనుక అతడు పవిత్ర గుడారాన్ని అపవిత్రం చేస్తాడేమో. ఇది మీకు శాశ్వత నియమం. ఒక వ్యక్తిమీద ప్రత్యేక జలం చల్లబడితే అతడు తన బట్టలను కూడ ఉదుక్కోవాలి. ఆ ప్రత్యేకజలాన్ని ముట్టినవాడు ఆ సాయంకాలంవరకు మాత్రం అపవిత్రంగానే ఉంటాడు. అపవిత్రుడు ఒకడు ఇంకో వ్యక్తిని ముట్టుకుంటే అతడుకూడా అపవిత్రుడవుతాడు. అతడు ఆ సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు.”

సంఖ్యాకాండము 19:1-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి యేదనగా, ఇశ్రాయేలీయులు కళంకములేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన యెఱ్ఱని పెయ్యను నీయొద్దకు తీసికొని రావలెనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలుకొనిపోయి అతని యెదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను; అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను. మరియు ఆయాజకుడు దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపునూలును తీసికొని, ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆయాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. దాని దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థబలి. ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నరశవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అప విత్రుడైయుండును. అతడు మూడవదినమున ఆ జలముతో పాపశుద్ధి చేసికొని యేడవదినమున పవిత్రుడగును. అయితేవాడు మూడవదినమున పాపశుద్ధి చేసికొనని యెడల ఏడవదినమున పవిత్రుడుకాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొననియెడలవాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు గనుకవాడు అపవిత్రుడు, వాని అపవిత్రత యింక వానికుండును. ఒకడు ఒక గుడారములో చచ్చినయెడల దానిగూర్చిన విధి యిది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములోనున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును. మూత వేయబడక తెరచియున్న ప్రతిపాత్రయు అపవిత్రమగును. బయట పొలములో ఖడ్గముతో నరకబడినవానినైనను, శవమునైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడైయుండును. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమభస్మము లోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన ఆ భస్మముమీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసికొని ఆ నీళ్లలో ముంచి, ఆ గుడారముమీదను దానిలోని సమస్తమైన ఉపకరణములమీదను అక్కడనున్న మనుష్యులమీదను, ఎముకనేగాని నరకబడిన వానినేగాని శవమునేగాని సమాధినేగాని ముట్టినవాని మీదను దానిని ప్రోక్షింపవలెను. మూడవదినమున ఏడవదినమున పవిత్రుడు అపవిత్రునిమీద దానిని ప్రోక్షింపవలెను. ఏడవ దినమునవాడు పాపశుద్ధి చేసికొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధిచేసికొనని యెడల అట్టి మనుష్యుడు సమాజములోనుండి కొట్టివేయబడును;వాడు యెహోవా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచెను; పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు;వాడు అపవిత్రుడు. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా, పాపపరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను; పాపపరి హార జలమును ముట్టువాడు సాయంకాలమువరకు అప విత్రుడైయుండును; అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము. దాని ముట్టు మనుష్యులందరు సాయంకాలమువరకు అపవిత్రులైయుందురు.