సంఖ్యాకాండము 18:1-32

సంఖ్యాకాండము 18:1-32 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా అహరోనుతో, “పరిశుద్ధాలయానికి సంబంధించిన అపరాధాలకు నీవూ నీ కుమారులు నీ కుటుంబం బాధ్యులు, యాజక ధర్మానికి సంబంధించిన అపరాధాలకు నీవూ నీ కుమారులు బాధ్యులు. మీతో చేరి నీవు, మీ కుమారులు నిబంధన గుడారం ముందు పరిచర్య చేస్తున్నప్పుడు మీకు సహాయపడడానికి మీ పూర్వికుల గోత్రానికి చెందిన మీ తోటి లేవీయులను తీసుకురండి. వారు నీకు బాధ్యత వహించాలి, గుడారం యొక్క అన్ని విధులను నిర్వర్తించాలి, అయితే వారు పరిశుద్ధాలయం యొక్క సామాగ్రి దగ్గరకు గాని బలిపీఠం దగ్గరకు గాని వెళ్లకూడదు. లేదంటే వారు మీరు చస్తారు. వారు మీతో కలిసి సమావేశ గుడారంలోని అన్ని పనులు జరిగేలా బాధ్యత వహించాలి; మీకు సహాయం చేయడానికి ఇతరులెవ్వరు రాకూడదు. “పరిశుద్ధాలయం, బలిపీఠం పట్ల శ్రద్ధ వహించే విషయంలో మీరు బాధ్యత వహించాలి. తద్వారా ఇశ్రాయేలీయుల మీదికి యెహోవా కోపం రాదు. నేను నేనే ఇశ్రాయేలీయుల నుండి మీ తోటి లేవీయులను మీకు బహుమానంగా, సమావేశ గుడారంలో సేవ చేయడానికి యెహోవాకు ప్రతిష్ఠించాను. అయితే నీవు, నీ కుమారులు మాత్రమే బలిపీఠం దగ్గర, తెర వెనుక ఉన్న ప్రతిదానికీ సంబంధించి యాజకులుగా పని చేయవచ్చు. యాజక ధర్మాన్ని మీకు ప్రత్యేకమైన వరంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే, వారికి మరణశిక్ష విధించబడుతుంది.” అప్పుడు యెహోవా అహరోనుతో ఇలా అన్నాడు: “నాకు అర్పించిన అర్పణలకు నేనే నీకు బాధ్యత అప్పగించాను; ఇశ్రాయేలీయులు నాకు ఇచ్చే పరిశుద్ధ అర్పణలన్నీ నేను నీకు, నీ కుమారులకు మీ భాగంగా, మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను. బలిపీఠం మీది నిప్పులో కాల్చివేయబడని అతి పవిత్ర అర్పణలలో కొంత భాగం మీరు తీసుకోవాలి. నాకు వారు తెచ్చే అతి పవిత్రమైన భోజనార్పణలు పాపపరిహారబలులు అపరాధబలులు నీకు, నీ కుమారులకు చెందినవి. అవి అతి పవిత్రంగా ఎంచి తినాలి. ప్రతి మగవాడు అది తినాలి. వాటిని పవిత్రమైనవిగా పరిగణించాలి. “ఇది కూడా మీదే: ఇశ్రాయేలీయులు అర్పించే అర్పణలన్నిటిలో నుండి ప్రక్కన పెట్టబడినది. నేను నీకు, నీ కుమారులు కుమార్తెలకు మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను. మీ ఇంట్లో ఆచార ప్రకారంగా శుభ్రంగా ఉన్న ప్రతి ఒక్కరూ దానిని తినవచ్చు. “యెహోవాకు ఇశ్రాయేలీయులు వారి కోతలో నుండి ప్రథమ ఫలంగా అర్పించే ధాన్యము, ద్రాక్షరసము, నూనె అంతటిని మీకు ఇస్తున్నాను. దేశం పంటలన్నిటిలో యెహోవాకు అర్పించే ప్రథమ ఫలాలు మీకు చెందుతాయి. నీ కుటుంబంలో ఆచార ప్రకారం పవిత్రులందరు వాటిని తినవచ్చు. “ఇశ్రాయేలీయులు యెహోవా కోసం ప్రతిష్ఠించిన ప్రతిదీ నీకు చెందుతుంది. ప్రతి గర్భం నుండి వచ్చిన యెహోవాకు అర్పించబడ్డ జ్యేష్ఠ సంతానం, మనుష్యులైన, జంతువులైన, మీకు చెందుతాయి. కానీ మీరు ప్రతి పెద్ద కుమారున్ని, అపవిత్ర జంతువుల తొలిచూలును విడిపించాలి. ఒక నెల వయస్సున్నప్పుడు పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం అయిదు షెకెళ్ళ వెండితో విడిపించాలి, అంటే ఇరవై గెరాలు. “ఆవులలో, గొర్రెలలో, మేకలలో తొలిచూలును విడిపించకూడదు. అవి పవిత్రమైనవి. వాటి రక్తం బలిపీఠం చుట్టూ ప్రోక్షించి యెహోవాకు సువాసనగా ఉండే హోమంగా వాటి క్రొవ్వును కాల్చివేయాలి. ప్రత్యేక అర్పణలోని బోర, కుడి తొడ ఎలాగో, వాటి మాంసం కూడా మీకు చెందుతుంది. ఇశ్రాయేలీయులు యెహోవాకు తెచ్చే పవిత్రార్పణలను ప్రక్కకు పెట్టినవి నీకు, నీ కుమారులకు, కుమార్తెలకు శాశ్వత వాటాగా ఇస్తున్నాను. ఇది యెహోవా ఎదుట నీతో పాటు నీ సంతానానికి నిత్య ఉప్పు ఒడంబడికగా ఉంటుంది.” యెహోవా అహరోనుతో ఇలా చెప్పారు, “వారి దేశంలో నీకు స్వాస్థ్యం కానీ వాటా కానీ ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్య నేనే నీ వాటాను నేనే నీ స్వాస్థ్యాన్ని. “సమావేశ గుడారం దగ్గర సేవ చేస్తున్న లేవీయులకు పారితోషికంగా ఇశ్రాయేలీయులు ఇచ్చే దశమ భాగాలను స్వాస్థ్యంగా ఇస్తున్నాను. ఇప్పటినుండి యాజకులు, లేవీయులు తప్ప ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం దగ్గరకు రాకూడదు లేదా వారి పాపానికి ప్రతిఫలం భరించి చస్తారు. లేవీయులు మాత్రమే సమావేశ గుడారంలో సేవ చేస్తారు వారు చేసే అపరాధాలకు వారే బాధ్యులు. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. ఇశ్రాయేలీయుల మధ్య వారికి వారసత్వం ఉండదు. దానికి బదులు, ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణగా ప్రతిష్ఠించే దశమ భాగాలను నేను లేవీ వంశస్థులకు వారసత్వంగా ఇస్తున్నాను. అందుకే, వారిని ఉద్దేశించి ఇలా చెప్పాను: ‘ఇశ్రాయేలీయుల మధ్య వారికి వారసత్వం ఉండదు.’ ” యెహోవా మోషేతో ఇలా అన్నారు: “లేవీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు ఇశ్రాయేలీయుల నుండి వారసత్వంగా దశమభాగం తీసుకున్నప్పుడు, ఆ దశమభాగంలో పదవ వంతు మీరు యెహోవాకు అర్పణగా సమర్పించాలి. అలా ప్రత్యేకించిన అర్పణలు నూర్పిడి కళ్ళంలోని ధాన్యంలా, గానుగ నుండి వచ్చిన ద్రాక్షరసంలా లెక్కకు వస్తాయి. ఇశ్రాయేలీయుల నుండి పుచ్చుకొనే దశమ భాగాలన్నిటి నుండి యెహోవాకు మీరు కూడా అర్పణలు ఇస్తారు. ఈ దశమ భాగాల నుండి యెహోవా భాగమును యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి. మీకు ఇవ్వబడిన ప్రతి దానిలో ఉత్తమమైన పవిత్రమైన భాగాన్ని మీరు యెహోవా యొక్క భాగంగా సమర్పించాలి.’ “లేవీయులకు చెప్పు: ‘శ్రేష్ఠమైనవి అర్పించినప్పుడు, అవి మీ నూర్పిడి కళ్ళంలా, ద్రాక్ష గానుగలా లెక్కకు వస్తాయి. మిగితా వాటిని మీరు, మీ ఇంటివారు ఎక్కడైనా తినవచ్చు అది సమావేశ గుడారంలో మీరు చేస్తున్న సేవకు మీ జీతము. మీరు దానిలో ఉత్తమమైన వాటిని అర్పించినప్పుడు మీరు దాని గురించి ఎటువంటి పాపశిక్షను భరించరు; అయితే ఇశ్రాయేలీయుల పరిశుద్ధ అర్పణలను అపవిత్రపరచవద్దు. అప్పుడు మీరు చావరు.’ ”

సంఖ్యాకాండము 18:1-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా అహరోనుతో “పవిత్ర స్థలంలో సేవలో జరిగే పాపాలకు నువ్వూ, నీ కొడుకులూ, నీ వంశం జవాబుదారులు. నువ్వూ, నీ కొడుకులూ మీ యాజకత్వపు పాపాలకు జవాబుదారులు. ఇంకా, నీ తండ్రి గోత్రం, అంటే లేవీ వంశస్తులైన నీ సహోదరులను నువ్వు దగ్గరికి తీసుకు రావాలి. నువ్వూ నీ కొడుకులూ నిబంధన శాసనాల గుడారం ఎదుట పరిచర్య చేస్తున్నప్పుడు వారు నీతో కలిసి నీకు సాయం చేస్తారు. వారు నీకూ, గుడారం అంతటికీ సేవ చెయ్యాలి. కాని వారూ, మీరూ చనిపోకుండా ఉండాలంటే వారు పవిత్ర స్థలపు ఉపకరణాల దగ్గరకైనా, బలిపీఠం దగ్గరకైనా రాకూడదు. వారు నీతో కలిసి సన్నిధి గుడారంలోని సేవంతటి విషయంలో శ్రద్ధ వహించాలి. ఒక బయటి వాడు మీ దగ్గరికి రాకూడదు. ఇకముందు ఇశ్రాయేలీయుల మీదకి నా కోపం రాకుండా ఉండాలంటే మీరు పవిత్రస్థలం పట్ల, బలిపీఠం పట్ల బాధ్యత వహించాలి. చూడండి, ఇశ్రాయేలీయుల మధ్య నుంచి లేవీయులైన మీ సహోదరులను నేనే ఎంపిక చేసుకున్నాను. సన్నిధి గుడారపు సేవ చెయ్యడానికి వారిని యెహోవా కోసం మీకు ఒక బహుమానంగా ఇచ్చాను. కాని నువ్వూ, నీ కొడుకులు మాత్రమే బలిపీఠానికీ, అడ్డతెర లోపల ఉన్న వాటికీ సంబంధించిన పనులన్నిటి విషయంలో యాజకత్వం జరుపుతూ సేవ చెయ్యగలరు. కేవలం మీరు మాత్రమే ఈ బాధ్యతలు చేపట్టగలరు. ఈ యాజకత్వాన్ని మీకు ఒక బహుమానంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా దాన్ని సమీపిస్తే అతనికి మరణ శిక్ష విధించాలి” అన్నాడు. ఇంకా యెహోవా అహరోనుతో “చూడు, ఇశ్రాయేలీయులు నాకు తెచ్చే కానుకలు, పవిత్ర అర్పణల బాధ్యత నీకిచ్చాను. ఈ అర్పణల్లో నీకూ, నీ కొడుకులకూ శాశ్వతంగా భాగం దక్కుతుంది. అతి పవిత్రమైన వాటిలో అగ్నిలో పూర్తిగా కాలనివి నీకు చెందుతాయి. వారి నైవేద్యాలన్నిట్లో, వారి పాప పరిహారార్థ బలులన్నిట్లో, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిట్లో, వారు నాకు చెల్లించే పవిత్ర అర్పణలన్నీ నీకు, నీ కొడుకులకూ చెందుతాయి. మీరు వాటిని అతి పవిత్రమైనవిగా ఎంచి తినాలి. మీలో ప్రతి మగవాడు ఈ అర్పణలు తినాలి. అవి నాకు ప్రత్యేకించిన అర్పణలుగా మీరు పరిగణించాలి. ఇంకా వారి దానాల్లో ప్రతిష్టించిందీ, ఇశ్రాయేలీయులు అల్లాడించే అర్పణలన్నీ నీకు చెందుతాయి. నీకూ, నీ కొడుకులకూ, నీ కూతుళ్ళకూ శాశ్వతమైన భాగంగా నేను మీకిచ్చాను. నీ ఇంట్లో ఆచారరీతిగా శుచిగా ఉన్నవారు ఈ అర్పణల్లో దేనినైనా తినొచ్చు. వారు యెహోవాకు అర్పించే మొదటి ఫలాలు, అంటే, నూనెలో ప్రశస్తమైనది, ద్రాక్షారసం, ధాన్యాల్లో ప్రశస్తమైనవన్నీ నీకిచ్చాను. వారు తమ దేశపు పంటలన్నిట్లో యెహోవాకు తెచ్చే మొదటి ఫలాలు నీకు చెందుతాయి. నీ ఇంట్లో ఆచారరీతిగా శుచిగా ఉన్నవారు ఈ అర్పణల్లో దేనినైనా తినొచ్చు. ఇశ్రాయేలీయులు ప్రతిష్ట చేసిన ప్రతిదీ నీకు చెందుతుంది. మనుష్యుల్లోగాని, పశువుల్లోగాని, వారు యెహోవాకు అర్పించే ప్రాణులన్నిట్లో ప్రతి తొలిచూలు నీకు చెందుతుంది. అయితే, ప్రజలు తొలిచూలు మగబిడ్డను వెల చెల్లించి తిరిగి సంపాదించుకోవాలి. అపవిత్ర పశువుల తొలిచూలు మగపిల్లను వెల చెల్లించి మళ్ళీ కొనుక్కోవాలి. వెల చెల్లించి మళ్ళీ కొనుక్కోవాల్సిన వాటిని పుట్టిన నెల రోజులకు నువ్వు నియమించిన వెల ప్రకారం పవిత్ర మందిరపు తూకంతో ఐదు తులాల వెండి ఇచ్చి వాటిని తిరిగి కొనుక్కోవాలి. అంటే 55 గ్రాములు. కాని ఆవు తొలి చూలుని, గొర్రె తొలి చూలుని, మేక తొలి చూలుని విడిపించకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తం నువ్వు బలిపీఠం మీద పోసి, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగేలా వాటి కొవ్వును కాల్చాలి. కాని వాటి మాంసం నీకు చెందుతుంది. అల్లాడించే అర్పణగా ఉన్న బోర, కుడి జబ్బ, నీదైనట్టు అది కూడా నీకు చెందుతుంది. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్రమైన ప్రతిష్ఠార్పణలన్నీ నేను నీకూ, నీ కొడుకులకూ, నీ కూతుళ్ళకూ శాశ్వతమైన భాగంగా ఇచ్చాను. అది నీకూ, నీతో పాటు నీ సంతానానికీ యెహోవా సన్నిధిలో స్థిరమైన శాశ్వత నిబంధన” అన్నాడు. ఇంకా యెహోవా అహరోనుతో “ప్రజల భూమిలో నీకు స్వాస్థ్యం ఉండకూడదు. వారి మధ్య నీకు ఆస్తిగాని భాగం గాని ఉండకూడదు. ఇశ్రాయేలీయుల మధ్య నీ భాగం, నీ స్వాస్థ్యం నేనే. చూడు, లేవీయులు చేసే సేవకు, అంటే, సన్నిధి గుడారపు సేవకు ప్రతిగా నేను ఇశ్రాయేలీయుల పదోవంతును వాళ్లకు వారసత్వంగా ఇచ్చాను. ఇశ్రాయేలీయులు ఇకముందు సన్నిధి గుడారం దగ్గరికి రాకూడదు. అలా చేస్తే ఆ పాపం కారణంగా చనిపోతారు. అయితే లేవీయులు సన్నిధి గుడారం సేవ చేసి, వారి సేవలో పాపాలకు వారే జవాబుదారులుగా ఉంటారు. మీ ప్రజల తరతరాలకు ఇది శాశ్వతమైన శాసనం. ఇశ్రాయేలీయుల మధ్య వాళ్లకు ఏ స్వాస్థ్యం ఉండకూడదు. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణగా అర్పించే పదోవంతు భాగాలు నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చాను. అందుచేత వారు ఇశ్రాయేలీయుల మధ్య స్వాస్థ్యం సంపాదించకూడదని వారితో చెప్పాను” అన్నాడు. ఇంకా యెహోవా మోషేతో, “నువ్వు లేవీయులతో ఇలా చెప్పు, ‘నేను ఇశ్రాయేలీయుల ద్వారా మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన పదోవంతు భాగాలు మీరు వారి దగ్గర తీసుకున్నప్పుడు మీరు దానిలో, అంటే ఆ పదోవంతు భాగంలో పదోవంతు భాగం యెహోవాకు ప్రతిష్ఠార్పణగా చెల్లించాలి. మీకు వచ్చే ప్రతిష్ఠార్పణను కళ్లపు పంటలా, ద్రాక్షల తొట్టి ఫలంలా ఎంచాలి. ఆ విధంగా మీరు ఇశ్రాయేలీయుల దగ్గర పొందిన మీ పదోవంతు భాగాలు అన్నిట్లోనుంచి మీరు ప్రతిష్ఠార్పణ యెహోవాకు చెల్లించాలి. దానిలోనుంచి మీరు యెహోవాకు ప్రతిష్ఠించే అర్పణ యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి. మీరు పొందిన బహుమానాల్లో ప్రశస్తమైన వాటిలోనుంచి యెహోవాకు శ్రేష్ఠమైన అర్పణ ఇవ్వాలి.’ ఇంకా నువ్వు వారితో, మీరు పొందిన వాటిలో నుంచి ప్రశస్తభాగం అర్పించినప్పుడు, లేవీయులు దాన్ని కళ్ళం నుంచీ, ద్రాక్షగానుగ నుంచీ వచ్చిన ఫలంలా పరిగణించాలి. మీరూ, మీ కుటుంబాలూ ఏ స్థలంలోనైనా వాటిని తినొచ్చు. ఎందుకంటే సన్నిధి గుడారంలో మీరు చేసే సేవకు అది మీకు జీతం. మీరు పొందిన వాటిలోనుంచి ప్రశస్తమైనవి యెహోవాకు అర్పించి ఉంటే, దాన్ని తిని, తాగినందుకు మీకు ఏ పాపశిక్ష ఉండదు. మీరు చనిపోకుండా ఉండాలంటే ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రం చెయ్యకూడదని చెప్పు” అన్నాడు.

సంఖ్యాకాండము 18:1-32 పవిత్ర బైబిల్ (TERV)

అహరోనుతో యెహోవా ఇలా చెప్పాడు: “పవిత్ర స్థలానికి వ్యతిరేకంగా ఎలాంటి అపచారాలు జరిగినా ఇక మీదట నీవు, నీ కుమారులు, నీ తండ్రి కుటుంబం బాధ్యులు. యాజకులకు వ్యతిరేకంగా జరిగే అపచారాలకు నీవు, నీ కుమారులు బాధ్యులు. నీ వంశంలో మిగిలిన లేవీ మనుష్యులను కూడ నీతో చేర్చుకో. ఒడంబడిక, పవిత్ర గుడారంలో నీవు, నీ కుమారులు చేయాల్సిన పనిలో వారు మీకు సహాయం చేస్తారు. లేవీ వంశంలోని ఆ మనుష్యులు నీ స్వాధీనంలో ఉంటారు. గుడారంలో జరగాల్సిన పని అంతా వారు చేస్తారు. అయితే పవిత్ర స్థలంలోగాని, బలిపీఠం దగ్గరగాని ఉన్న వస్తువులను వారు సమీపించకూడదు. ఒకవేళ వారు వెళ్తే, వారూ, నీవు కూడా చనిపోతావు. వారు నీతో కలిసి పనిచేస్తారు. సన్నిధి గుడారం విషయమై జాగ్రత్త తీసుకోవటం వారి బాధ్యత. గుడారంలో జరగాల్సిన పని అంతా వాళ్లు చేస్తారు. నీవు ఉన్న చోటికి ఇంకెవ్వరూ రాకూడదు. “పవిత్ర స్థలాన్ని, బలిపీఠాన్ని జాగ్రత్తగా చూసుకోవటం నీ బాధ్యత, ఇశ్రాయేలు ప్రజల మీద నేను మళ్లీ కోపగించుకోవటం నాకు ఇష్టం లేదు. ఇశ్రాయేలు ప్రజలందరిలోనుండి లేవీ ప్రజలను అంటే నీ ప్రజలను నేనే ఏర్పాటు చేసుకొన్నాను. వారు నీకు ఒక కానుక వంటివారు. యెహోవాను సేవించటం, సన్నిధి గుడారం పని చేయటం ఒక్కటే వారి ఉద్దేశ్యం. అయితే నీవు, నీ కుమారులు మాత్రమే యాజకులుగా పని చేయవచ్చు. బలిపీఠం దగ్గరకు వెళ్లగలిగేది మీరు మాత్రమే. మీరు మాత్రమే తెర లోపలకు వెళ్లగలవారు. యాజకునిగా మీ సేవ అనేది నేను మీకు కానుకగా ఇస్తున్నాను. అతి పవిత్ర స్థలాన్ని ఇంకెవరు సమీపించినా వారిని చంపెయ్యాలి.” అప్పుడు యెహోవా అహరోనుతో ఇలా చెప్పాడు: “నాకు అర్పించబడిన అర్పణలన్నింటిమీద నేనే నీకు బాధ్యత ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు నాకు అర్పించే పవిత్ర అర్పణలన్నీ నేను నీకు ఇస్తాను. ఈ కానుకలను నీవూ, నీ కుమారులూ పంచుకోవచ్చు. ఎప్పుడూ అవి మీకే చెందుతాయి. దహించబడని పవిత్ర అర్పణలన్నింటిలో మీకు వంతు ఉంటుంది. ప్రజలు తమ కానుకులను అతి పవిత్ర అర్పణలుగా నా దగ్గరకు తీసుకుస్తారు. ఇవి ధాన్యార్పణలు, పాప పరిహారార్థ అర్పణలు, అపరాధ పరిహారార్థ అర్పణలు. అయితే ఇవన్నీ నీవి, నీ కుమారులవి. అవి అత్యంత పవిత్రమైనవిగా వాటిని తినాలి. నీ కుటుంబంలో మగవారు ప్రతి ఒక్కరూ దానిని తినాలి. అది పవిత్రం అని నీవు చెప్పాలి. “ఇశ్రాయేలు ప్రజలు నైవేద్యంగా ఇచ్చు అర్పణలు అన్నీ నీవే. ఇది నీకూ, నీ కుమారులకు, కుమార్తెలకు నేను ఇస్తున్నాను. ఇది నీ వంతు. నీ కుటుంబంలో పవిత్రంగా ఉన్న ప్రతి వ్యక్తీ దీనిని తినగలుగుతాడు. “శ్రేష్ఠమైన ఒలీవ నూనె అంతయు, శ్రేష్ఠమైన కొత్త ద్రాక్షారసం అంతయు, ధాన్యం అంతయు నేను నీకిస్తున్నాను. ఇవన్నీ యెహోవానైన నాకు ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చేవి. ఇవన్నీ వారి పంట కోతలో ప్రథమ ఫలాలు. ప్రజలు పంటకోత కూర్చినప్పుడు, మొదటివి అన్నీ వారు యెహోవాకు ఇస్తారు. కనుక వీటిని నేను నీకు ఇస్తాను. నీ కుటుంబంలో పవిత్రంగా ఉన్న ప్రతి వ్యక్తీ అవి తినవచ్చును. “ఇశ్రాయేలులో యెహోవాకు అర్పించబడిన ప్రతిదీ నీదే. “ఒక కుటుంబంలో, మనిషికి గాని జంతువుకు గాని పుట్టిన మొట్టమొదటిది యెహోవాకు అర్పించబడుతుంది. అది నీదే అవుతుంది. అయితే అపవిత్రంగా పుట్టిన ప్రతి మొదటి శిశువుకు, ప్రతి మొదటి మగ జంతువుకు నీవు వెల చెల్లించాలి. అప్పుడు ఆ మొదటి శిశువు తిరిగి తన కుటుంబానికే చెందుతుంది. వారు ఒక నెల వయసులో ఉన్నప్పుడు వారికోసం నీవు వెల చెల్లించాలి. ఆ వెల అయిదు తులాల వెండి. “అయితే ఆవులలో, గొర్రెలలో మేకలలో మొదట పుట్టిన దానికి నీవు వెల చెల్లింపకూడదు. ఆ జంతువులు పవిత్రం – పరిశుభ్రం. వాటి రక్తం బలిపీఠం మీద చిలకరించి వాటి కొవ్వును దహించాలి. ఇది హోమంగా అర్పించబడిన అర్పణ. దీని వాసన యెహోవానగు నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. అయితే ఆ జంతువుల మాంసం నీదే అవుతుంది. మరియు నైవేద్యంలోని బోర నీదే. మిగిలిన అర్పణల్లోకుడి తొడ నీదే. పవిత్ర కానుకలుగా ప్రజలు అర్పించేవి ఏవైనా సరే, యెహోవానగు నేను నీకు ఇస్తాను. ఇది నీ వంతు. నీకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు నేను ఇస్తాను, ఇది శాశ్వతంగా కొనసాగే వాగ్ధానం. నీకూ, నీ సంతతికీ నేను ఈ వాగ్దానం చేస్తున్నాను.” అహరోనుతో యెహోవా ఇంకా ఇలా చెప్పాడు: “దేశంలో నీకేమీ స్వాస్థ్యం ఉండదు. ఇతరులు స్వంతంగా కలిగి ఉన్నవి ఏవి నీకు స్వంతంగా ఉండవు. నేను, యెహోవాను నీ స్వంతం. నేను వాగ్దానం చేసిన దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు పొందుతారు. అయితే నీకు మాత్రం నేనే నీ కానుకగా ఉంటాను. “ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోను పదోవంతు నాకు ఇస్తారు. కనుక ఆ పదోవంతును నేను లేవీ ప్రజలకు ఇస్తాను. వారు సన్నిధి గుడారంలో సేవించేటప్పుడు చేసే పనికి ఇది వారికి జీతం. అయితే ఇశ్రాయేలీయుల్లో ఇతరులు ఎన్నడూ సన్నిధి గుడారం సమీపించకూడదు. వారు అలా వెళ్తే, వారి పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చెల్లించి మరీచస్తారు. సన్నిధి గుడారంలో పనిచేసే లేవీ ప్రజలే, దానికి వ్యతిరేకంగా జరిగే పాపాలకు బాధ్యులు. ఈ ఆజ్ఞ భవిష్యత్ కాలంలో కూడ కొనసాగుతుంది. ఇతర ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని లేవీ ప్రజలు మాత్రం పొందరు. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోనుండి పదోవంతునాకు ఇస్తారు. కనుక ఆ పదో వంతును నేను లేవీ ప్రజలకు ఇస్తాను. అందుకే లేవీ వాళ్లను గూర్చి నేను ఈ మాటలు చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని ఆ లేవీ ప్రజలు పొందరు.” మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “లేవీ ప్రజలతో మాట్లాడి వారికి ఇలా చెప్పు: ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోనుండి పదోవంతు యెహోవాకు ఇవ్వాలి. ఆ పదోవంతు లేవీ ప్రజలకు చెందుతుంది. అయితే అందులో పదోవంతు యెహోవా అర్పణగా మీరు ఆయనకు ఇవ్వాలి. పంట కోసిన తర్వాత ధాన్యం, ద్రాక్ష గానుగ నుండి రసం మీకు ఇవ్వబడుతాయి. అప్పుడు అవి కూడ యెహోవాకు మీ అర్పణలు. ఈ విధంగా ఇతర ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు, మీరు కూడ యెహోవాకు అర్పణ ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఇచ్చే పదోవంతు మీకు ఇవ్వ బడుతుంది. దానిలో పదోవంతును మీరు యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్నదానంతటిలో నుండి పదోవంతు మీకు ఇచ్చినప్పుడు, వాటిలో శ్రేష్ఠమైనవి, అత్యంత పవిత్రమైనవి మీరు ప్రత్యేకించాలి. అది మీరు యెహోవాకు ఇచ్చే పదోవంతు. “మోషే! లేవీ ప్రజలకు ఇది చెప్పు: ఇశ్రాయేలు ప్రజలు వారి పంటలో నుండి, ద్రాక్షారసంలో నుండి పదోవంతు మీకు ఇస్తారు. అప్పుడు అందులో శ్రేష్ఠమైన భాగం మీరు యెహోవాకు ఇవ్వాలి. మిగిలి పోయినదంతా మీరు, మీ కుటుంబాలు తినవచ్చు. సన్నిధి గుడారంలో మీరు చేసే పనికి ఇది మీకు జీతం. మరియు ఎల్లప్పుడూ దానిలోని శ్రేష్ఠ భాగాన్నే మీరు యెహోవాకు ఇస్తే, మీరు ఎన్నటికీ అపరాధులు కారు. ఇశ్రాయేలు ప్రజల నుండి అనేకుల పవిత్ర అర్పణలని మీరు ఎన్నటికీ గుర్తుంచుకుంటారు. మీరు చావరు.”

సంఖ్యాకాండము 18:1-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా అహరోనుతో ఇట్లనెను–నీవును నీ కుమారులును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధస్థలపు సేవ లోని దోషములకు ఉత్తరవాదులు; నీవును నీ కుమారులును మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును, అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొని రావలెను; వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట సేవచేయవలెను వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లువారు పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములయొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవవిషయములో దాని కాపాడవలెను. అన్యుడు మీయొద్దకు సమీపింపకూడదు; ఇకమీదట మీరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడవలెను; అప్పుడు ఇశ్రాయేలీయులమీదికి కోపము రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలీయులమధ్యనుండి లేవీయులైన మీ సహోదరులను తీసికొని యున్నాను; ప్రత్యక్షపు గుడారముయొక్క సేవచేయుటకు వారు యెహోవావలన మీ కప్పగింపబడియున్నారు. కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను–ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతి ష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను; అభిషేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్ని టిలోను, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరిశుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను. ప్రతి మగవాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటి నిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని. వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును; నీ యింటిలోని పవిత్రులందరు వాటిని తినవచ్చును. ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుష్యులలోనిదేమి జంతువులలోనిదేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువుల తొలిచూలిపిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెలచొప్పున, పరిశుద్ధమందిరముయొక్క తులపు పరిమాణమునుబట్టి అయిదు తులముల వెండియిచ్చి వాటిని విడిపింపవలెను. తులము ఇరువది చిన్నములు. అయితే ఆవుయొక్క తొలిచూలిని గొఱ్ఱెయొక్క తొలిచూలిని మేకయొక్క తొలిచూలిని విడిపింపకూడదు; అవి ప్రతిష్ఠితమైనవి; వాటి రక్తమును నీవు బలిపీఠముమీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెనుగాని వాటి మాంసము నీదగును. అల్లాడింపబడు బోరయు కుడిజబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడనుబట్టి యిచ్చితిని. అది నీకును నీతోపాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను–వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారిమధ్యను నీకు పాలు ఉండదు; ఇశ్రాయేలీయులమధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇదిగో లేవీయులుచేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులయొక్క దశమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లువారు ఇకమీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారముయొక్క సేవ చేసి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులైయుందురు. ఇశ్రాయేలీయులమధ్యను వారికి స్వాస్థ్య మేమియు ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయులమధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు లేవీయులతో ఇట్లనుము–నేను ఇశ్రాయేలీయులచేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారియొద్ద పుచ్చుకొనునప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమభాగములో దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షల తొట్టి ఫలమువలెను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలీయులయొద్ద పుచ్చుకొను మీ దశమభాగములన్నిటిలోనుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలోనుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలోనుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును, అనగా దాని ప్రతిష్ఠితభాగమును దానిలోనుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపువచ్చుబడివలెను ద్రాక్షతొట్టి వచ్చుబడివలెను లేవీయులదని యెంచవలెను. మీరును మీ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును; ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరుచేయు సేవకు అది మీకు జీతము. మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత దానినిబట్టి పాపశిక్షను భరింపకుందురు; మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైనవాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.