నెహెమ్యా 5:14-16

నెహెమ్యా 5:14-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నేను యూదా దేశంలో వారికి అధిపతిగా నియమించబడినప్పటి నుండి అనగా అర్తహషస్త రాజు పాలనలో ఇరవయ్యవ సంవత్సరం నుండి ముప్పై రెండవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరాలు నేను గాని నా సోదరులు గాని అధిపతికి ఇచ్చే ఆహారాన్ని తీసుకోలేదు. నాకన్నా ముందు అధిపతులుగా ఉన్నవారు ప్రజలపై భారాన్ని మోపి వారి నుండి నలభై షెకెళ్ళ వెండిని, ఆహారాన్ని ద్రాక్షరసాన్ని తీసుకునేవారు. వారి సహాయకులు కూడా ప్రజల మీద భారం మోపారు. అయితే దేవుని భయం ఉన్న నేను అలా చేయలేదు. నేను శ్రద్ధగా గోడ పని చేశాను. నా పనివారు అంతా కలిసి అదే పని చేశారు. మేము భూమి సంపాదించుకోలేదు.

నెహెమ్యా 5:14-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నేను యూదా దేశంలో వారికి అధికారిగా వచ్చినప్పటినుండి, అంటే అర్తహషస్త రాజు పాలనలో 20 వ సంవత్సరం నుండి 32 వ సంవత్సరం దాకా ఈ 12 సంవత్సరాలు అధికారిగా నాకు రావలసిన ఆహార పదార్థాలను నేను గానీ, నా బంధువులు గానీ తీసుకోలేదు. అయితే నాకు ముందున్న అధికారులు ప్రజల నుండి ఆహారం, ద్రాక్షారసం, 40 తులాల వెండి చొప్పున తీసుకుంటూ వచ్చారు. వారి సేవకులు కూడా ప్రజలపై ఆధికారం చెలాయించేవారు. అయితే దేవుని పట్ల భయభక్తులు ఉన్న కారణంగా నేనలా చేయలేదు. నేను ఈ గోడ కట్టే పనిలో నిమగ్నమయ్యాను. నా పనివాళ్ళు కూడా నాతో కలసి పని చేస్తూ వచ్చారు. మేము భూములు ఏమీ సంపాదించుకోలేదు.

నెహెమ్యా 5:14-16 పవిత్ర బైబిల్ (TERV)

అంతే కాదు, యూదా ప్రాంతానికి నేను అధికారిగా వున్నంత కాలం, నేనుగాని, నా సోదరులుగాని పాలనాధికారికి అనుమతింపబడిన ఆహారం ఎన్నడూ తినలేదు. నా ఆహారం కొనే నిమిత్తం నేనెన్నడూ జనాన్ని పన్నులు చెల్లించేలా నిర్బంధించలేదు. నేను అర్తహషస్త రాజ్య పాలనలో ఇరవయ్యవ ఏడాది నుంచి ముప్పై రెండవ ఏడాది దాకా పాలనాధికారిగా వున్నాను. నేను యూదాకి పన్నెండేళ్లపాటు పాలనాధికారిగా వున్నాను. కాని, నా కంటె ముందు పాలించిన అధికార్లు జన జీవితాన్ని ఎక్కువ భారం చేశారు. వాళ్లు ప్రతి ఒక్కరినుంచీ నిర్బంధంగా నలభై తులాల వెండిని వసూలు చేశారు. అంతేకాదు, వాళ్లు జనం నుంచి తమ ఆహారాన్నీ, ద్రాక్షారసాన్నీ రాబట్టుకున్నారు. ఆ అధికార్ల కింది నాయకులు కూడా జనం మీద అధికారం చలాయించి, వాళ్ల జీవితాన్ని మరింత దుర్భరం చేశారు. కాని నేను అందుకు భిన్నంగా దేవునియందు భయభక్తులతో వ్యవహరించాను, అందుకే నేను వాళ్లు చేసిన పనులేవీ చేయలేదు. యెరూషలేము ప్రాకార నిర్మాణానికి నేను బాగా కష్టించి పనిచేశాను. నా మనుష్యులందరూ ప్రాకార నిర్మాణం కోసం అక్కడ చేరారు. మేము ఏ ఒక్కరి దగ్గరినుంచీ భూమి సంపాదించుకోలేదు!

నెహెమ్యా 5:14-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు నేను యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడినకాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరము మొదలుకొని ముప్పదిరెండవ సంవత్సరమువరకు పండ్రెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేనుగాని నా బంధువులుగాని తీసికొనలేదు. అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనులమీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయముచేత నేనాలాగున చేయలేదు. ఇదియుగాక నేను ఈ గోడపనిచేయగా నా పనివారును ఆ పనిచేయుచు వచ్చిరి.