నెహెమ్యా 4:6-20

నెహెమ్యా 4:6-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ప్రజలు హృదయపూర్వకంగా పనిచేశారు కాబట్టి సగం ఎత్తు వరకు గోడలు కట్టగలిగాము. సన్బల్లటు, టోబీయా, అరబీయులు, అమ్మోనీయులు, అష్డోదీయులు యెరూషలేము గోడలు బాగుచేసే పని కొనసాగుతుందని, బీటలన్నిటిని మూసివేస్తున్నారని విన్నప్పుడు వారు చాలా కోప్పడ్డారు. యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి పనిని అడ్డుకోవాలని వారంతా కలిసి కుట్రపన్నారు. అయితే మేము మా దేవునికి ప్రార్థించి వారి నుండి కాపాడుకోడానికి రాత్రింబగళ్ళు కాపలా ఉంచాము. అప్పుడు యూదా వారు, “పనివారి బలం తగ్గిపోతుంది. చెత్త చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక మేము గోడ కట్టలేం” అన్నారు. మా శత్రువులు, “వారికి తెలిసేలోపు మనలను చూడకముందే, మనం వారి మధ్యకు వెళ్లి వారిని చంపి పని ఆపివేద్దాం” అని ఆలోచన చేశారు. మా శత్రువులకు దగ్గరలో నివసించే యూదులు వచ్చి, “మీరు ఎటు తిరిగినా వారు మాపై దాడి చేస్తారు” అని పది కన్న ఎక్కువసార్లు చెప్పారు. అందువల్ల గోడ వెనుక దిగువ ప్రాంతాల్లో పైనున్న స్థలాల్లో కుటుంబాల ప్రకారం వారికి కత్తులు ఈటెలు విల్లులు ఇచ్చి కాపలా కాయడానికి నియమించాను. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత నేను లేచి సంస్థానాధిపతులతో, అధికారులతో మిగిలిన ప్రజలందరితో, “మీరు భయపడకండి. గొప్పవాడు, అద్భుతమైన వాడైన ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాల కోసం మీ కుమారులు కుమార్తెల కోసం, మీ భార్యల కోసం మీ ఇళ్ళ కోసం పోరాడండి” అని చెప్పాను. తమ కుట్ర గురించి మాకు తెలిసిందని దేవుడు వారి కుట్ర భంగం చేశారని మా శత్రువులు వినగానే, మాలో ప్రతి ఒక్కరు తమ పని చేయడానికి గోడ దగ్గరకు వచ్చారు. ఆ రోజు నుండి నా పనివారిలో సగం మంది పని చేస్తుండగా మిగతా సగం మంది ఈటెలు డాళ్లు విండ్లు కవచాలు ధరించి వచ్చారు. గోడ కట్టే యూదా కుటుంబాలన్నిటి వెనుక అధికారులు నిలబడి ఉన్నారు. బరువులు మోసేవారు ఒక చేతితో తమ పని చేస్తూ మరో చేతితో ఆయుధం పట్టుకున్నారు. కట్టే ప్రతి ఒక్కరు కడుతున్నప్పుడు తన కత్తి నడుముకు బిగించుకుని ఉన్నారు. బూర ఊదేవాడు నా దగ్గరే నిలబడ్డాడు. అప్పుడు నేను సంస్థానాధిపతులతో, అధికారులతో, మిగిలిన వారితో, “మనం చేస్తున్న పని చాలా విస్తారమైనది. గోడ మీద పని చేస్తూ మనం ఒకరికి ఒకరం చాలా దూరంగా ఉన్నాము. కాబట్టి మీకు ఎక్కడ నుండి బూరధ్వని వినబడుతుందో అక్కడికి మీరందరు వచ్చి మాతో కలవాలి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తారు” అన్నాను.

నెహెమ్యా 4:6-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అయినప్పటికీ పని కొనసాగించడానికి ప్రజలు ఇష్టపడి సిద్ధమయ్యారు. మేము గోడ కడుతూ ఉన్నాం. గోడ నిర్మాణం సగం ఎత్తు వరకూ పూర్తి అయింది. యెరూషలేం గోడల నిర్మాణం జరుగుతూ ఉందని, కూలిన గోడలను సరిగా కడుతున్నారని, సన్బల్లటు, టోబీయా, అరబ్బులు, అమ్మోను వారు, అష్డోదు వారు తెలుసుకుని మండిపడ్డారు. జరుగుతున్న పనిని ఆటంకపరచాలని యెరూషలేం మీదికి దొమ్మీగా వచ్చి మమ్మల్ని కలవరానికి గురి చేశారు. మేము మా దేవునికి ప్రార్థన చేసి, వాళ్ళ బెదిరింపుల వల్ల రాత్రింబగళ్లు కాపలా ఉంచాము. అప్పుడు యూదా వాళ్ళు “బరువులు మోసేవారి శక్తి తగ్గిపోయింది, శిథిలాల కుప్పలు ఎక్కువై పోయాయి. గోడ కట్టడం కుదరదు” అన్నారు. మా విరోధులు “వాళ్ళకు తెలియకుండా, వాళ్ళు చూడకుండా మనం వారి మధ్యలోకి చొరబడి వారిని చంపేసి, పని జరగకుండా చేద్దాం” అనుకున్నారు. మా శత్రువులు ఉండే ప్రాంతాల్లో ఉంటున్న యూదులు, నాలుగు దిక్కుల నుండి వచ్చి మాకు సహాయం చేయాలని పదే పదే అడిగారు. అందువల్ల గోడ వెనక ఉన్న పల్లంలో, గోడ పైనా మనుషులకు కత్తులు, ఈటెలు, విల్లు, బాణాలు ఇచ్చి వారి వారి వంశాల ప్రకారం వరసలో నిలబెట్టాను. నేను లేచి, ప్రధానులను, అధికారులను సమకూర్చి “మీరు వాళ్లకు భయపడకండి. అత్యంత ప్రభావశాలి, భీకరుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనండి. మీ సహోదరులు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ భార్యలు, మీ నివాసాలు శత్రువుల వశం కాకుండా వారితో పోరాడండి” అన్నాను. వాళ్ళు చేస్తున్న పన్నాగం మాకు తెలిసిందనీ, దేవుడు దాన్ని వమ్ము చేశాడనీ మా శత్రువులు గ్రహించారు. మేమంతా ఎవరి పని కోసం వారు గోడ దగ్గరికి చేరుకొన్నాం. అప్పటినుండి పనివాళ్ళలో సగం మంది పనిచేస్తుండగా, మరో సగం మంది ఈటెలు, శూలాలు, విల్లంబులు, కవచాలు ధరించుకుని నిలబడ్డారు. గోడ కట్టే యూదు ప్రజల వెనుక అధికారులు వంశాల క్రమంలో నిలబడ్డారు. గోడ కట్టేవారు, బరువులు మోసేవారు, ఎత్తేవారు ప్రతి ఒక్కరూ ఒక చేత్తో ఆయుధం పట్టుకుని మరో చేత్తో పని చేస్తున్నారు. కట్టే పనిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కడూ తమ కత్తులు నడుముకు కట్టుకుని పని చేస్తున్నారు. బాకా ఊదేవాడు నా పక్కనే నిలబడి ఉన్నాడు. అప్పుడు నేను ప్రధానులతో, అధికారులతో, మిగిలిన వారితో ఇలా అన్నాను. “మనం చేస్తున్న పని చాలా విలువైనది. గోడ మీద పని చేస్తూ మనం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నాం. కాబట్టి ఎక్కడైతే మీకు బూర శబ్దం వినిపిస్తుందో అక్కడ ఉన్న మా దగ్గరికి రండి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు.”

నెహెమ్యా 4:6-20 పవిత్ర బైబిల్ (TERV)

మేము యెరూషలేము ప్రాకారాన్ని నిర్మించాము, మేము నగరం చుట్టూ గోడకట్టాము. అయితే, అది ఉండాల్సిన దానికి సగం ఎత్తు మాత్రమే ఉంది. జనం హృదయపూర్వకంగా పనిచేశారు. అందుకే మేము ఇంత మాత్రమైనా కట్టగలిగాము. కాని, సన్బల్లటు, టోబియా, అరబ్బీయులు, అమ్మోనీయులు, అష్డోదువాసులు, కోపంతో నిండు కొనియున్నారు. జనం యెరూషలేము ప్రాకారాలు బాగుచేసే పని కొనసాగిస్తున్నట్లు, గోడల మధ్య కంతలను పూడుస్తున్నట్లు వాళ్లు విన్నారు. ఈ విషయమై వాళ్లు అధికముగా కోపగించుకొని ఒకచోట కూడి యెరూషలేముకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. వాళ్లు యెరూషలేముకు వ్యతిరేకంగా కల్లోలం లేవగొట్టాలనీ, వాళ్లు వచ్చి నగరం మీద పోరాటం జరపాలనీ పథకం పన్నారు. అయితే, మేము మా దేపుణ్ణి ప్రార్థించాము. అంతేకాదు, వాళ్లు వస్తే, వాళ్లని ఎదిరించి పోరాడగలిగేందుకుగాను గోడలమీద రాత్రింబగళ్లు కాపలా కోసం కాపలావారిని పెట్టాం. అప్పుడు యూదా వాసులు తమ నిరుత్సాహాన్ని ఇలా వెలిబుచ్చారు: “పనివాళ్లు అలసిపోతున్నారు. దోవలో బోలెడు దుమ్మూ, రద్దూ పేరుకు పోయాయి. మనం గోడ కట్టడాన్ని కొనసాగించలేము. పోతే, మన శత్రువులేమో ఇలా అంటున్నారు: ‘యూదులపై మనము అకస్మాత్తుగా దాడిచేద్దాము. వాళ్లు మనలను చూడకముందే, మనం ఎవరమో తెలిసికోకముందే మనం వాళ్ల మధ్య ఉంటాము, వాళ్లని చంపేస్తాము. దానితో వాళ్ల పని నిలిచిపోతుంది.’” తర్వాత మన శత్రువుల మధ్య నివసించే మన యూదులు మా దగ్గరికి వచ్చి, “మన శత్రువులు మనచుట్టూ వున్నారు. మేము ఎటు తిరిగితే అటు వాళ్లు ప్రత్యక్షమౌతున్నారు” అంటూ పదే పదే చెప్పారు. అందుకని, నేను కొందర్ని గోడ బాగా పోట్టిగా వున్న చోట్ల గోడ వెనక కాపలా పెట్టాను. నేను వాళ్లని గోడకి కంతలున్న స్థలాల్లో నిలిపాను. నేను ఆయా కుటుంబాలను ఒక చోట చేర్చి, కత్తులు, శూలాలు, విల్లమ్ములతో నిలిపాను. అప్పుడు నేను ముఖ్యమైన కుటుంబాలతో, ఉద్యోగులతో, మిగిలిన జనంతో ఇల చెప్పాను: “మన శత్రువులంటే భయపడకండి. మన ప్రభువును తలుచుకోండి. యెహోవా గొప్పవాడు, శక్తిశాలి! మీరు మీ సోదరుల కోసం, మీ కుమారుల కోసం, మీ కుమార్తెల కోసం పోరాడాలి! మీరు మీ భార్యల కోసము, మీ గృహాల కోసం పోరాడాలి!” తమ పథకాలు మాకు తెలిసిపోయాయన్న విషయం మా శత్రువులు విన్నారు. తమ పథకాలను దేవుడు భగ్నం చేశాడని వాళ్లు గ్రహించారు. తర్వాత మేమందరం తిరిగి పని ప్రారంభించాము. ప్రతి ఒక్కడూ తను వదిలిన పని భాగానికి తిరిగి వెళ్లాడు. ఆనాటి నుంచి నా మనుషుల్లో సగం మంది గోడ కట్టడంలో నిమగ్నులు కాగా, మిగిలిన సగం మంది ఈటెలు, బల్లెములు, విల్లమ్ములు, కవచాలతో కాపలా పనిలో నిమగ్నులయ్యారు. సేనాధిపతులు ప్రాకార నిర్మాణంలో నిమగ్నులైన యూదా ప్రజలందరి వెనుక నిలిచారు. గోడ కట్టేవాళ్లు, వాళ్ల సహాయకులు ఒక చేత్తో పనిముట్లను, మరో చేత్తో ఆయుధాలను పట్టుకున్నారు. పని చేస్తున్న ప్రతి ఒక్క తాపీవాడూ తన ప్రక్కనే ఒక కత్తిని పెట్టుకున్నాడు. శత్రువుల రాకను గురించి హెచ్చరించేందుకు బూర ఊదేవాడు నా ప్రక్కన నిలబడ్డాడు. అప్పుడు నేను ఆయా ప్రముఖ కుటుంబాల వాళ్లను, ఉద్యోగులను, మిగిలిన జనాన్ని ఉద్దేశించి ఇలా చెప్పాను, “ఇది చాలా పెద్ద పని. మనం గోడ పొడుగునా విస్తరించివున్నాము. మనం ఒకరికొకరం దూరంగా వున్నాము. అందుకని, మీకు బూర శబ్దం వినిపించినప్పుడు, అక్కడికి మీరంతా పరుగున రండి. మనమంతా అక్కడ కలుద్దాము. మన దేవుడు మన పక్షాన పోరాడుతాడు!”

నెహెమ్యా 4:6-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగియుండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి యుండెను. సన్బల్లటును టోబీయాయును అరబీయులును అమ్మోనీయులును అష్డోదీయులును, యెరూషలేముయొక్క గోడలు కట్టబడెననియు, బీటలన్నియు కప్పబడెననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి, పని ఆటంకపరచవలెనని వారందరు కట్టుకట్టి మమ్మును కలతపరచగా, మేము మా దేవునికి ప్రార్థనచేసి, వారి భయముచేత రాత్రింబగళ్లు కావలియుంచితిమి. అప్పుడు యూదావారు – బరువులు మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా, మా విరోధులును – వారు తెలిసికొనకుండను చూడకుండను మనము వారిమధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి. మా శత్రువులయొద్ద నివాసులైయున్న యూదులు వచ్చి–నలు దిక్కులనుండి మీరు మా సహాయమునకు రావలెనని మాటి మాటికి మాతో చెప్పగా అందునిమిత్తము గోడవెనుక నున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోను వారి యీటెలతోను వారి విండ్లతోను నిలిపితిని. అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను–వారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి యోచన మాకు తెలియబడెననియు, దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా, మాలో ప్రతివాడును తన పనికి గోడదగ్గరకు వచ్చెను. అయితే అప్పటినుండి నా పనివారిలో సగము మంది పనిచేయుచు వచ్చిరి, సగముమంది యీటెలును బల్లెములును విండ్లును కవచములును ధరించినవారై వచ్చిరి; అధికారులు యూదులలో ఆయా యింటివారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి. మరియు కట్టువారిలో ఒక్కొకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను, బాకా ఊదువాడు నాయొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోను అధికారులతోను మిగిలినవారితోను ఇట్లంటిని–పని మిక్కిలి గొప్పది, మనము గోడమీద ఒకరొకరికి చాల యెడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును.