నెహెమ్యా 12:1-47

నెహెమ్యా 12:1-47 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో యెషూవతో పాటు వచ్చిన యాజకులు లేవీయులు వీరే: శెరాయా, యిర్మీయా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరేమోతు, ఇద్దో, గిన్నెతోయి, అబీయా, మీయామిను, మయద్యా, బిల్గా, షెమయా, యోయారీబు, యెదాయా, సల్లు ఆమోకు హిల్కీయా యెదాయా. వీరందరు యెషూవ సమయంలో యాజకులకు వారి బంధువులకు సహాయకులు. లేవీయులలో యెషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా కృతజ్ఞత పాటలకు నాయకత్వం వహించే మత్తన్యా అతని సహాయకులు. పరిచర్యలలో బక్బుక్యా, ఉన్నీ, వారి సహాయకులు వారికి ఎదురు వరుసలో నిలబడేవారు. యోయాకీము తండ్రి యెషూవ, ఎల్యాషీబు తండ్రి యోయాకీము, యోయాదాను తండ్రి ఎల్యాషీబు, యోనాతాను తండ్రి యోయాదా, యద్దూవ తండ్రి యోనాతాను. యోయాకీము సమయంలో యాజకుల కుటుంబాలకు పెద్దలుగా ఉన్నవారు: శెరాయా కుటుంబానికి మెరాయా; యిర్మీయా కుటుంబానికి హనన్యా; ఎజ్రా కుటుంబానికి మెషుల్లాము; అమర్యా కుటుంబానికి యెహోహనాను; మెలీకూ కుటుంబానికి యోనాతాను, షెకన్యా కుటుంబానికి యోసేపు; హారీము కుటుంబానికి అద్నా; మెరాయోతు కుటుంబానికి హెల్కయి; ఇద్దో కుటుంబానికి జెకర్యా; గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాము; అబీయా కుటుంబానికి జిఖ్రీ; మిన్యామీను, మోవద్యా కుటుంబాలకు పిల్టయి; బిల్గా కుటుంబానికి షమ్మూయ; షెమయా కుటుంబానికి యెహోనాతాను; యోయారీబు కుటుంబానికి మత్తెనై; యెదాయా కుటుంబానికి ఉజ్జీ; సల్లు కుటుంబానికి కల్లయి; ఆమోకు కుటుంబానికి ఏబెరు; హిల్కీయా కుటుంబానికి హషబ్యా; యెదాయా కుటుంబానికి నెతనేలు. ఎల్యాషీబు సమయంలో లేవీయులలో కుటుంబ పెద్దలుగా ఉన్నవారు యోయాదా, యోహానాను, యద్దూవ. పర్షియా రాజైన దర్యావేషు పాలనలో వీరే యాజక కుటుంబాలలో పెద్దలుగా నమోదయ్యారు. ఎల్యాషీబు కుమారుడైన యోహానాను సమయం వరకు కుటుంబ పెద్దలుగా లేవీ వారసుల పేర్లు దినచర్య గ్రంథంలో నమోదు చేయబడ్డాయి. లేవీయుల నాయకులైన హషబ్యా, షేరేబ్యా, కద్మీయేలు కుమారుడైన యెషూవ, వారి బంధువులు దైవజనుడైన దావీదు నిర్దేశించిన ప్రకారం వంతులవారీగా ఎదురెదురుగా నిలబడి కృతజ్ఞతా స్తుతి గీతాలు పాడడానికి నియమించబడ్డారు. మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనేవారు గుమ్మాల దగ్గర ఉన్న గిడ్డంగులను కాపలా కాసే ద్వారపాలకులు. వీరంతా యోజాదాకు పుట్టిన యెషూవ కుమారుడైన యోయాకీము సమయంలో, అధిపతియైన నెహెమ్యా సమయంలో, ధర్మశాస్త్ర బోధకుడు యాజకుడైన ఎజ్రా సమయంలో సేవ చేశారు. యెరూషలేము గోడ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు కృతజ్ఞతా స్తుతి గీతాలతో తాళాలు, వీణలు సితారలు వాయిస్తూ సంతోషంగా చేసుకోవడానికి అన్ని ప్రాంతాల నుండి లేవీయులను యెరూషలేముకు తీసుకువచ్చే పని మొదలుపెట్టారు. సంగీతకారులను యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, నెటోపాతీయుల గ్రామాల నుండి తీసుకువచ్చారు. యెరూషలేము చుట్టూ సంగీతకారులు తమ కోసం గ్రామాలు నిర్మించుకున్నారు కాబట్టి బేత్-గిల్గాలు నుండి, గెబా అజ్మావెతు ప్రాంతాల నుండి వచ్చారు. యాజకులు, లేవీయులు తమను తాము పవిత్రపరచుకున్న తర్వాత ప్రజలను, గుమ్మాలను, గోడను పవిత్రపరిచారు. నేను యూదా నాయకులను గోడ మీదికి తీసుకువచ్చాను. కృతజ్ఞతలు చెల్లించడానికి రెండు పెద్ద గాయక బృందాలను నియమించాను. వాటిలో ఒక బృందం గోడ మీద కుడి వైపుగా పెంట ద్వారం వైపు నడిచారు. హోషయా, యూదా నాయకుల్లో సగం మంది వారితో పాటు వెళ్లారు. వారితో అజర్యా, ఎజ్రా, మెషుల్లాము, యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా అనేవారు వెళ్లారు. అలాగే బూరలు ఊదుతూ కొంతమంది యాజకులు వెళ్లారు. ఆసాపు కుమారుడైన జక్కూరుకు పుట్టిన మీకాయా కుమారుడైన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానుకు పుట్టిన జెకర్యా, అతని సహాయకులైన షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానీ అనేవారు దేవుని సేవకుడైన దావీదు నిర్దేశించిన సంగీత వాయిద్యాలు వాయిస్తూ వెళ్లారు. ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా వారిని నడిపించాడు. ఊట గుమ్మం దగ్గర వారు నేరుగా దావీదు పట్టణం గోడ మెట్ల మీదుగా దావీదు ఇంటిని దాటి తూర్పున ఉన్న నీటిగుమ్మం దగ్గరకు వెళ్లారు. కృతజ్ఞతాగీతాలు పాడే గాయకుల రెండవ బృందం వారికి ఎదురుగా వెళ్లారు. మిగిలిన సగం మంది ప్రజలతో పాటు కలిసి నేను అగ్ని గుండాల గోపురం అవతల నుండి వెడల్పు గోడ వరకు వెళ్లాము. వారు ఎఫ్రాయిం ద్వారం మీదగా వెళ్లి, యెషానా గుమ్మాన్ని, చేప గుమ్మాన్ని, హనానేలు గోపురాన్ని, వందవ గోపురాన్ని దాటి గొర్రెల గుమ్మం వరకు వెళ్లి కాపలా గుమ్మం దగ్గర ఆగారు. అప్పుడు కృతజ్ఞతాగీతాలు పాడే గాయకుల రెండు బృందాలు, నేను, నాతో పాటు ఉన్న అధికారులలో సగం మంది దేవుని మందిరంలో నిలబడ్డాము. అలాగే యాజకులైన ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యాలు తమ బూరలు పట్టుకుని ఉన్నారు. మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహనాను, మల్కీయా, ఏలాము, ఏజెరులు అక్కడే ఉన్నారు. ఇజ్రహయా సారథ్యంలో గాయకులు గట్టిగా పాటలు పాడారు. ఆ రోజు దేవుడు తమకు గొప్ప ఆనందాన్ని ఇచ్చినందుకు వారు గొప్ప బలులు అర్పించి సంతోషించారు. స్త్రీలు పిల్లలు కూడా సంతోషించారు. యెరూషలేములోని ఈ సంతోష ధ్వనులు చాలా దూరం వరకు వినిపించాయి. ఆ సమయంలో ప్రజలిచ్చే ప్రథమ ఫలాలు, పదవ భాగాలు కానుకలకు సంబంధించిన గిడ్డంగులకు అధికారులుగా కొంతమంది నియమించబడ్డారు. పరిచర్య చేస్తున్న యాజకులు లేవీయులను బట్టి యూదా ప్రజలు సంతోషించారు కాబట్టి యాజకులు లేవీయుల కోసం ధర్మశాస్త్రంలో నిర్దేశించబడిన వంతులను పట్టణాల చుట్టూ ఉన్న పొలాల నుండి గిడ్డంగులకు చేరవేయడానికి వారు నియమించబడ్డారు. దావీదు అతని కుమారుడైన సొలొమోను ఆజ్ఞల ప్రకారం వారంతా సంగీతకారులు ద్వారపాలకులతో కలిసి తమ దేవుని సేవ, శుద్ధీకరణ సేవ చేశారు. చాలా కాలం క్రితం దావీదు, ఆసాపు కాలంలో సంగీతకారులను దేవునికి కృతజ్ఞతా స్తుతి గీతాలను నడిపించేవారు ఉండేవారు. అయితే జెరుబ్బాబెలు, నెహెమ్యా సమయంలో ఇశ్రాయేలీయులందరు సంగీతకారులకు, ద్వారపాలకులకు ప్రతిరోజు ఆహారం ఇచ్చేవారు. అలాగే ఇతర లేవీయులకు కూడా ఒక భాగం ప్రత్యేకంగా ప్రక్కన ఉంచేవారు. లేవీయులు అహరోను వారసులకు ఒక భాగం ప్రత్యేకంగా ప్రక్కన ఉంచేవారు.

నెహెమ్యా 12:1-47 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలుతో వచ్చిన యాజకులు, లేవీయులు వీరే. యేషూవ, శెరాయా, యిర్మీయా, ఎజ్రా, అమర్యా, మళ్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరేమోతు, ఇద్దో, గిన్నెతోను, అబీయా, మీయామిను, మయద్యా, బిల్గా, షెమయా, యోయారీబు, యెదాయా, సల్లూ, ఆమోకు, హిల్కీయా, యెదాయా, అనేవాళ్ళు. వీళ్ళంతా యేషూవ రోజుల్లో యాజకుల్లో వారి బంధువుల్లో ప్రముఖులుగా ఉన్నారు. లేవీయులలో ఇంకా, యేషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా, కృతజ్ఞత పాటలు పాడే పరిచర్యలో ముఖ్యుడైన మత్తన్యా, అతని బంధువులు. బక్బుక్యా, ఉన్నీ, వారి బంధువులు, వారికి ముందు వరుసలో నిలబడి పాటలు పాడేవాళ్ళు. యేషూవ కొడుకు యోయాకీము, యోయాకీము కొడుకు ఎల్యాషీబు, ఎల్యాషీబు కొడుకు యోయాదాను. యోయాదా కొడుకు యోనాతాను, యోనాతాను కొడుకు యద్దూవ. యోయాకీము రోజుల్లో పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉన్న యాజకుల ఎవరంటే, శెరాయా కుటుంబానికి మెరాయా, యిర్మీయా కుటుంబానికి హనన్యా. ఎజ్రా కుటుంబానికి మెషుల్లాము, అమర్యా కుటుంబానికి యెహోహానా. మెలీకూ కుటుంబానికి యోనాతాను, షెబన్యా కుటుంబానికి యోసేపు. హారిము కుటుంబానికి అద్నా, మెరాయోతు కుటుంబానికి హెల్కయి. ఇద్దో కుటుంబానికి జెకర్యా, గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాము. అబీయా కుటుంబానికి జిఖ్రీ, మిన్యామీను, మోవద్యా కుటుంబాలకు పిల్టయి. బిల్గా కుటుంబానికి షమ్మూయ, షెమయా కుటుంబానికి యెహోనాతాను. యోయారీబు కుటుంబానికి మత్తెనై, యెదాయా కుటుంబానికి ఉజ్జీ. సల్లయి కుటుంబానికి కల్లయి, ఆమోకు కుటుంబానికి ఏబెరు. హిల్కీయా కుటుంబానికి హషబ్యా, యెదాయా కుటుంబానికి నెతనేలు. లేవీయులకు సంబంధించి ఎల్యాషీబు, యోయాదా, యోహానాను, యద్దూవ కుటుంబ యాజకులుగా నమోదయ్యారు. పారసీక రాజు దర్యావేషు పాలన కాలంలో కూడా వీరే కుటుంబ యాజకులుగా ఉన్నారు. ఎల్యాషీబు కొడుకు యోహానాను రోజుల వరకూ అనుదిన కార్యక్రమ వివరాలు రాసే గ్రంథంలో వారు లేవీయుల కుటుంబ యాజకులుగా నమోదయ్యారు. దేవుని సేవకుడైన దావీదు ఆజ్ఞ ప్రకారం స్తుతి గీతాలు పాడే వంతు లేవీయుల కుటుంబ యాజకులైన హషబ్యా, షేరేబ్యా, కద్మీయేలు కొడుకు యేషూవలకు, వారికి ఎదురుగా నిలబడి పాడే వంతు వారి బంధువులకు నియమించారు. మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనేవాళ్ళు ఆలయ ద్వారాల సమీపంలో పదార్థాలు నిల్వ చేసే గదులకు కాపలాదారులుగా ఉన్నారు. యోజాదాకు మనవడు, యేషూవ కొడుకు యోయాకీము రోజుల్లోనూ, అధికారియైన నెహెమ్యా రోజుల్లోనూ, యాజకుడు, శాస్త్రి అయిన ఎజ్రా రోజుల్లోనూ వీరు ఆ పని చేస్తూ వచ్చారు. యెరూషలేం సరిహద్దు గోడల ప్రతిష్ట సమయంలో వీళ్ళు ఆ కార్యక్రమం స్తుతి గీతాలతో, పాటలతో, తంతి వాయిద్యాలతో మేళతాళాలతో ఆర్భాటంగా జరిగించడానికి అన్ని పరిసర గ్రామాల నుండి లేవీయులను యెరూషలేంకు రప్పించే పని చేపట్టారు. అప్పుడు గాయకుల వంశాల సంతానం యెరూషలేం చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి, నెటోపాతీయుల గ్రామాల్లో నుండి సమకూడి వచ్చారు. యెరూషలేం చుట్టూ గాయకులు తమ గ్రామాలు కట్టుకుని ఉండడం వల్ల గిల్గాలు కుటుంబం నుండి, గెబ, అజ్మావెతు ప్రాంతాల నుండి ప్రజలు తరలి వచ్చారు. యాజకులు, లేవీయులు మొదటగా తమను తాము పవిత్రం చేసుకున్నారు. తరువాత ప్రజలను, ద్వారాలను, గోడలను శుద్ధి చేశారు. తరువాత నేను యూదుల ప్రముఖులను గోడ మీదికి ఎక్కించాను. స్తుతి గీతాలు పాడేవారిని రెండు పెద్ద గుంపులుగా విభజించాను. ఒక గుంపు చెత్త ద్వారం కుడివైపు గోడ మీద నిలబడ్డారు. వారితోపాటు హోషయా, యూదుల ప్రముఖుల్లో సగం మంది వెళ్ళారు. ఇంకా అజర్యా, ఎజ్రా, మెషుల్లాము, యూదా, బెన్యామీను, షెమయాయు, యిర్మీయా అనేవాళ్ళు కూడా గోడ ఎక్కారు. షెమయా మనవడు, యోనాతాను కొడుకు జెకర్యాతో కలసి కొందరు యాజకుల కొడుకులు బాకాలు ఊదుతూ వెళ్ళారు. ఆసాపు కొడుకు జక్కూరు, జక్కూరు కొడుకు మీకాయా, మీకాయా కొడుకు మత్తన్యా. మత్తన్యా కొడుకు షెమయా. షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానీ అనేవాళ్ళు అతని బంధువులు. వీళ్ళు దైవ సేవకుడు దావీదు నియమించిన వాయిద్యాలు మోగిస్తూ వెళ్ళారు. ఆచార్యుడైన ఎజ్రా వారికి ముందుగా నడిచాడు. వాళ్ళు తమకు ఎదురుగా ఉన్న ఊట ద్వారం దగ్గర దావీదు పట్టణం మెట్లపై నుండి ఆ పట్టణం దాటి గోడ వెంట తూర్పు దిశగా నీటి ద్వారం దాకా వెళ్ళారు. కృతజ్ఞతాస్తుతి గీతాలు పాడేవాళ్ళ రెండవ గుంపు వారికి ఎదురుగా బయలుదేరింది. గోడపై ఉన్న సగం మంది అగ్నిగుండాల గోపురం అవతల నుండి వెడల్పు గోడ దాకా వెళ్ళారు. వారితో కలసి నేను కూడా వెళ్లాను. ఆ గుంపు వాళ్ళు ఎఫ్రాయీం ద్వారం మీదగా వెళ్లి, పాత ద్వారాన్ని, మత్స్యపు ద్వారాన్ని, హనన్యేలు గోపురాన్ని, మేయా గోపురాన్ని దాటి వెళ్ళి, గొర్రెల ద్వారం వరకూ ఎక్కి బందీ గృహం ద్వారం దగ్గర నిలిచారు. ఆ విధంగా దేవుని ఆలయంలో కృతజ్ఞతా గీతాలు పాడేవాళ్ళ రెండు గుంపులు, నేనూ నాతోపాటు ఉన్న అధికారుల్లో సగం మంది నిలబడి ఉన్నాం. యాజకులు ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యా బాకాలు చేతబట్టుకుని ఉన్నారు. ఇజ్రహయా అనే వాడి ఆధ్వరంలో గాయకులు మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏజెరులు పెద్ద స్వరంతో పాటలు పాడారు. వాళ్ళు తమ భార్యా బిడ్డలతో కలసి దేవుడు తమకు అమితమైన సంతోషం కలిగించినందుకు ఆ రోజు విలువైన హోమాలు అర్పించి ఆనందించారు. యెరూషలేంలో వాళ్ళు చేసిన ఆనంద ధ్వనులు చాలా దూరం వినిపించాయి. ఆ కాలంలో పదార్థాలను, ప్రతిష్టిత వస్తువులను, ప్రథమ ఫలాలను, దశమ భాగాలను ఉంచే గిడ్డంగులను కాపలా కాయడానికి కొందర్ని నియమించారు. యాజకుల, లేవీయుల కోసం, ధర్మశాస్త్రం ప్రకారం నిర్ణయించిన భాగాలను పట్టణాల నుండి, పొలాల నుండి సమకూర్చడానికి వీరిని నియమించారు. పరిచర్య చేయడానికి యాజకులు, లేవీయులను నియమించగా యూదులు సంతోషించారు. దావీదు, అతని కొడుకు సొలొమోను ఆదేశించినట్టు గాయకులు, ద్వారపాలకులతోపాటు తమ దేవునికి సేవ పనులను చేస్తూ, శుద్ధి ఆచారాలు పాటిస్తూ వచ్చారు. పూర్వం దావీదు జీవించిన కాలంలో ఆసాపు పర్యవేక్షణలో గాయకుల నియామకం, స్తుతి గీతాల ఎంపిక, పాటలు పాడడం మొదలైన విషయాలు జరిగేవి. జెరుబ్బాబెలు కాలంలో, నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలీయులంతా తమ తమ వంతుల ప్రకారం గాయకులకు, ద్వారపాలకులకు ప్రతిరోజూ ఆహార పదార్థాలను ఇస్తూ వచ్చారు. లేవీయుల కోసం ఒక భాగం కేటాయించారు. లేవీయులు అహరోను వంశంవారి కోసం ఒక భాగం కేటాయించారు.

నెహెమ్యా 12:1-47 పవిత్ర బైబిల్ (TERV)

యూదా దేశానికి తిరిగి వచ్చిన యాజకులు, లేవీయులు వీళ్లు: వీళ్లు షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుతో, యేషూవతో కలిసి తిరిగి వచ్చిన వాళ్లు. వాళ్ల పేర్ల జాబితా ఇది: శెరాయా, యిర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరేమోతు, ఇద్దో, గిన్నెతోను, అబీయా, మియామీను, మయెద్యా, బిల్గా, షెమయా, యెయారీబు, యెదాయా, సల్లూ, ఆమోకు, హిల్కియా, యెదాయా, యేషూవ కాలంలో వీళ్లు యాజకుల నాయకులు, బంధువులు. లేవీయులు వీళ్లు: యేషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా, మత్తన్యా. మత్తన్యా బంధువులతోబాటు వీళ్లు దేవుని భజనల విషయంలో బాధ్యులు. బక్బుక్యా, ఉన్నీలు ఆ లేవీయుల బంధువులు. వీళ్లిద్దరూ వాళ్లకి ఎదురుగా నిలిచి ఆరాధన సభలో పాల్గానేవారు. యేషూవా యోయాకీము తండ్రి. యోయాకీము ఎలియాషీబు తండ్రి. ఎలియాషీబు యోయాదా తండ్రి. యోయాదా యోనాతాను తండ్రి. యోనాతాను యెద్దూవ తండ్రి. యోయాకీము కాలంలో యాజకుల కుటుంబాల నాయకులు వీళ్లే: శెరాయా కుటుంబ నాయకుడు మెరాయా. యిర్మీయా కుటుంబ నాయకుడు హనన్యా. ఎజ్రా కుటుంబ నాయకుడు మెషుల్లాము. అమర్యా కుటుంబ నాయకుడు యెహోహానాను. మల్లూకు కుటుంబ నాయకుడు యోనాతాను. షెకన్యా కుటుంబ నాయకుడు యోసేపు. హారీము కుటుంబ నాయకుడు అద్నా. మెరేమోతు కుటుంబ నాయకుడు హెల్కయి. ఇద్దో కుటుంబ నాయకుడు జెకర్యా. గిన్నేతోను కుటుంబ నాయకుడు మెషుల్లాము. అబీయా కుటుంబ నాయకుడు జిఖ్రీ, మిన్‌యామీను, మాదేయా కుటుంబాల నాయకుడు పిల్టయి. బిల్గా కుటుంబ నాయకుడు షమ్మూయి. షెమాయా కుటుంబ నాయకుడు యెహోనాతాను. యోయారీబు కుటుంబ నాయకుడు మత్తెనయి. యెదాయా కుటుంబ నాయకుడు ఉజ్జీ. సల్లయి కుటుంబ నాయకుడు కల్లయి. అమోకు కుటుంబ నాయకుడు ఏబెరు. హిల్కియా కుటుంబ నాయకుడు హషబ్యా. యెదాయా కుటుంబ నాయకుడు నెతనేలు. పారసీక రాజు దర్యావేషు పాలనకాలంలో ఎల్యాషీబు, యోదాయా, యోహానాను, యద్దూవ కాలపు లేవీ కుటుంబాల పెద్దల, యాజకుల పేర్లు నమోదు చేయబడ్డాయి. లేవీ కుటుంబ నాయకులు, ఎల్యాషిబు కొడుకైన యోహానాను పేర్లు చరిత్ర గ్రంథంలో లిఖించబడ్డాయి. లేవీయుల నాయకులు వీళ్లు: షేరేబ్యా, కద్మీయేలు కొడుకు యేషూవా, వాళ్ల సోదరులు. వాళ్ల సోదరులు వీళ్లకి ఎదురుగా నిలబడి దైవ స్తోత్రాలు, భజన పాటలు పాడేవారు. ఒక బృందం మరో బృందానికి సమాధానంగా పాడుతుంది. దేవుని ప్రతినిధి అయిన దావీదు ఆదేశించిన రీతిలో ఈ స్తుతిపాటలు సాగుతాయి. వెలుపలి ద్వారాల ప్రక్కన వున్న సామాన్ల గదులను కాసే ద్వారపాలకుల పేర్లు: మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు. ఈ ద్వారపాలకులు యెయాకీము కాలంలో కొలువు చేశారు. యోయాకీము యేషూవా కొడుకు. యేషూవా యోయాదాకు కొడుకు. ఆ ద్వారపాలకులు నెహెమ్యా పాలనాధికారిగా వున్న కాలంలో, యాజకుడు, ఉపదేశకుడు అయిన ఎజ్రా కాలంలో కూడా కొలువుచేశారు. ప్రజలు యెరూషలేము ప్రాకారాన్ని ప్రతిష్ఠించారు. వాళ్లు లేవీయులందర్నీ యెరూషలేముకి తీసుకువచ్చారు. ఆ లేవీయులు తాము నివసించే ఆయా పట్టణాలనుంచి వచ్చారు. వాళ్లు యెరూషలేముకి ప్రాకారం ప్రతిష్ఠించటం కోసం వచ్చారు. లేవీయులు దైవ స్తోత్రాలు పాడేందుకూ, కీర్తనలు పాడేందుకూ వచ్చారు. వాళ్లు స్వరమండల సితారలు, తాళాలు వాయించారు. తంబురలు మోగించారు. గాయకులందరూ కూడా యెరుషలేముకి వచ్చారు. ఆ గాయకులు యెరూషలేము చుట్టూవున్న పట్టణాల నుంచి వచ్చారు. వాళ్లు నెటోపా పట్టణం నుంచి, బేత్‌గిల్గాలు, గెబ, అజ్‌మావెతుల నుంచి వచ్చారు. ఆ గాయకులు యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తమకోసం చిన్న చిన్న పట్టణాలు నిర్మించుకున్నారు. యాజకులూ, లేవీయులూ తమని తాము పవిత్రం చేసుకున్నారు. తర్వాత వాళ్లు యెరూషలేము ప్రాకారాలన్నీ ఒక ఆచారములో పవిత్రీకరించారు. అప్పుడు నేను (నెహెమ్యాను) యూదా నాయకులకి పైకెక్కి ప్రాకారం మీద నిలబడమని చెప్పాను. దైవ స్తుతి, కృతజ్ఞత గీతాలు పాడేందుకు రెండు పెద్ద గాయక బృందాలను కూడా ఎంపిక చేశాను. వాటిలో ఒక బృందం కుడివైపున పెంట గుమ్మం దిశగా పోయి ప్రాకారం పైకి ఎక్కాలి. హోషెయా, యూదా నాయకుల్లో సగంమంది ఆ గాయకుల వెంట వెళ్లారు. అజర్యా, ఎజ్రా, మెషుల్లాము, యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా, మొదలైనవారు కూడా వాళ్లతో వెళ్లారు. యాజకుల్లో కొందరు కూడా బూరలు ఊదుతూ వాళ్లని ప్రాకారం దాకా అనుసరించారు, జెకర్యా కూడా వాళ్ల వెంట నడిచాడు (జెకర్యా యోనాతాను కొడుకు, యోనాతాను షెమయా కొడుకు, షెమయా మత్తనయా కొడుకు, మత్తనయా మీకాయా కొడుకు. మీకాయా జక్కూరు కొడుకు, జక్కూరు అసాఫు కొడుకు). అంతేకాక ఆసాపు సోదరులు కూడా వున్నారు. వాళ్లు: షెమయా, అజరేలు, మిలయి, గిలలయి, మాయి, నెతనేలు, యూదా, హానానీ. వాళ్ల దగ్గర దైవ జనుడయిన దావీదు తయారు చేసిన సంగీత వాద్యాలు వున్నాయి. ఉపదేశకుడైన ఎజ్రా ప్రాకారానికి ప్రతిష్ఠ చేసే బృందానికి అగ్రభాగాన నడిచాడు. వాళ్లు ఊట గుమ్మం దగ్గరికి వెళ్లారు. వాళ్లు మెట్లు ఎక్కి దావీదు నగరం చేరుకున్నారు. వాళ్లు ప్రహరీగోడపైన నిలబడ్డారు. వాళ్లు దావీదు భవనం దాటి, ఊట గుమ్మం దిశగా గోడమీద నడిచి వెళ్లారు. రెండవ గాయక బృందం రెండో దిశకి ఎడమ దిశకి బయల్దేరింది. వాళ్లు గోడపైకి వెళ్తున్నప్పుడు నేను వాళ్లని అనుసరించాను. జనంలో సగంమంది కూడా వాళ్లని అనుసరించారు. వాళ్లు అగ్ని గుండాల శిఖరాన్ని దాటి, వెడల్పు గోడను చేరుకున్నారు. తర్వాత వాళ్లు ఈ క్రింది ద్వారాలు దాటారు: ఎఫ్రాయిము గుమ్మము, పురాతన గుమ్మము, మత్స్య గుమ్మము హనాన్యేలు శిఖరము, శతశిఖరము, గొర్రెల ద్వారం దాటి చివరకు కావలి ద్వారం దగ్గర ఆగారు. అటు తర్వాత, ఆ గాయక బృందాలు రెండూ దేవుని ఆలయంలో తమ తమ స్థానాలకు చేరుకున్నాయి. నేను నా స్థానంలో నిలిచాను. అధికారుల్లో సగంమంది ఆలయంలో తమతమ స్థానాల్లో నిలబడ్డారు. తర్వాత ఈ క్రింది యాజకులు ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయ, ఎల్యోయెనై, జెకర్యా, హనన్యా బూరలు పట్టుకుని తమతమ స్థానాల్లో నిలిచారు. తర్వాత, మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏజెరు అనే యాజకులు ఆలయంలో తమతమ స్థానాల్లో నిలబడ్డారు. అప్పుడు రెండు గాయక బృందాలూ ఇజ్రహాయా నాయకత్వాన పాడనారంభించాయి. ఈ విధంగా, ఆ ప్రత్యేక దినాన యాజకులు చాలా బలులు అర్పించారు. ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా వున్నారు. దేవుడే వారందరినీ ఆనందపరవశుల్ని చేశాడు. చివరకు స్త్రీలు, పిల్లలు సైతం మహోత్సాహంతో, ఆనందంలో తేలియాడారు. దూర ప్రాంతాలవారు సైతం యెరూషలేము నుంచి వెలువడే ఆనంద కోలాహలాన్ని వినగలిగారు. ఆ రోజున వస్తుపులను భద్రపరచు గదులలో భద్రపరచు కొందరిని నియమించారు. జనం తమ తొలికాపు ఫలాలను, పదోవంతు పంటలను తీసుకు వచ్చారు. వస్తువులను భద్రపరచువారు వాటిని వస్తువులను భద్రపరచు గదులలో పదిలపరిచారు. బాధ్యులుగా వున్న యాజకుల, లేవీయుల విషయంలో యూదా జనసామాన్యం చాలా తృప్తి చెందారు. అందుకని, వాళ్లు గిడ్డంగుల్లో పెట్టేందుకు చాలా వస్తువులు తెచ్చారు. యాజకులూ, లేవీయులూ తమ దేవునిపట్ల భక్తిభావంతో ఈ పనులు చేశారు. వాళ్లు జనాన్ని పరిశుద్ధులను చేసే విధానాలు ఆచరించారు. గాయకులూ, ద్వారపాలకులూ తమ తమ విధులను నిర్వర్తించారు. దావీదూ, సొలొమోనూ ఆదేశించిన పనులన్నీ వాళ్లు చేశారు. (ఎన్నడో పూర్వం, దావీదు కాలంలో, ఆసాపు ప్రధానుడుగా వున్నాడు. అతనికి చాలా స్తోత్రాలూ, దైవసంకీర్తనలూ తెలుసును.) ఈ విధంగా, జెరుబ్బాబెలు, నెహెమ్యాల కాలంలో, ఇశ్రాయేలు ప్రజలందరూ గాయకుల, ద్వార పాలకుల సహాయార్థం ప్రతిరోజూ ఏదో ఒకటి ఇస్తూనే వుండేవారు. జనం కూడా తదితర లేవీయుల కోసం ఏదోఒకటి, ఎంతో కొంత కేటాయించేవారు. పోతే, లేవీయులు అహరోను వంశీకుల (యాజకుల) కోసం కొంత సొమ్ము కేటాయించేవారు.

నెహెమ్యా 12:1-47 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోకూడ వచ్చిన యాజకులును లేవీయులును వీరే. యేషూవ శెరాయా యిర్మీయా ఎజ్రా అమర్యా మళ్లూకు హట్టూషు షెకన్యా రెహూము మెరేమోతు ఇద్దో గిన్నెతోను అబీయా. మీయామిను మయద్యా బిల్గా షెమయా యోయారీబు యెదాయా సల్లూ ఆమోకు హిల్కీయా యెదాయా అనువారు. వారందరును యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీయులలో యేషూవ బిన్నూయి కద్మీయేలు షేరేబ్యా యూదా స్తోత్రాది సేవవిషయములో ప్రధానియైన మత్తన్యాయు అతని బంధువులును. మరియు బక్బుక్యాయు ఉన్నీయును వారి బంధువులును వారికి ఎదురు వరుసలోనుండి పాడువారు. యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయా దాను కనెను. యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను. యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైనవారు యాజకులై యుండిరి. వారెవరనగా, శెరాయా యింటివారికి మెరాయా, యిర్మీయా యింటివారికి హనన్యా ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహో హానాను మెలీకూ యింటివారికి యోనాతాను, షెబన్యా యింటివారికి యోసేపు హారిము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి ఇద్దో యింటివారికి జెకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము అబీయా యింటివారికి జిఖ్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా యింటివారికి పిల్టయి. బిల్గా యింటివారికి షమ్మూయ, షెమయా యింటివారికి యెహో నాతాను యోయారీబు ఇంటివారికి మత్తెనై యెదాయా యింటివారికి ఉజ్జీ సల్లయి యింటివారికి కల్లయి ఆమోకు ఇంటివారికి ఏబెరు హిల్కీయా యింటివారికి హషబ్యా, యెదాయా యింటివారికి నెతనేలు. ఎల్యాషీబు దినములలో లేవీయుల విషయములో యోయాదా యోహానాను యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడికాలములో వారే యాజకకుటుంబ ప్రధానులుగా దాఖలైరి. ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినములవరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందువారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు షేరేబ్యాయును కద్మీయేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతోకూడ దైవజనుడైవ దావీదుయొక్క ఆజ్ఞనుబట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. మత్తన్యా బక్బుక్యా ఓబద్యా మెషుల్లాము టల్మోను అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టులయొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి. వీరు యోజాదాకునకు పుట్టిన యేషూవ కుమారుడైన యోయాకీము దినములలోను అధికారియైన నెహెమ్యాదినములలోను యాజకుడును శాస్త్రి యునగు ఎజ్రా దినములలోను ఆ పని జరువుచువచ్చిరి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూను కొనిరి అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టునున్న మైదాన భూమిలోనుండియు నెటోపాతియొక్క గ్రామములలోనుండియు కూడుకొని వచ్చిరి. మరియు గిల్గాలుయొక్క యింటిలోనుండియు, గెబయొక్కయు అజ్మావెతుయొక్కయు పొలములలోనుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టును గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని యుండిరి. యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్రపరచిరి. అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను. వారివెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగముమందియును వెళ్లిరి. మరియు అజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును యూదాయు బెన్యామీనును షెమ యాయును యిర్మీయాయు అనువారు పోయిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచు పోయిరి; వారెవరనగా, ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జెకర్యాయు అతని బంధువులగు షెమయా అజరేలు మిలలై గిలలై మాయి నెతనేలు యూదా హనానీ అనువారు. వీరు దైవజనుడగు దావీదుయొక్క వాద్యములను వాయించుచు పోయిరి; వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మముదగ్గర దావీదుపురముయొక్క మెట్లమీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మమువరకు పోయిరి. స్తోత్రగీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను, వారివెంబడి నేనును వెళ్లితిని. ప్రాకారముమీదనున్న సగముమంది కొలుముల గోపురము అవతలనుండి వెడల్పు ప్రాకారమువరకు వెళ్లిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతలనుండియు, పాత గుమ్మము అవతలనుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురమునుండియు, మేయా గోపురమునుండియు, గొఱ్ఱెల గుమ్మమువరకు వెళ్లి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి. ఆప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి రెండు సమూహములును నేనును, నాతోకూడ ఉన్న అధికారులలో సగముమందియు నిలిచియుంటిమి. యాజకులగు ఎల్యాకీము మయశేయా మిన్యామీను మీకాయా ఎల్యోయేనై జెకర్యా హనన్యా బాకాలు పట్టుకొనిరి. ఇజ్రహయా అనువాడు నడిపింపగా మయశేయా షెమయా ఎలియాజరు ఉజ్జీ యెహోహానాను మల్కీయా ఏలాము ఏజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమునవారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడ సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను. ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్ఠార్పణలకును ప్రథమ ఫలములకును పదియవవంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదులమీద కొందరు నియమింపబడిరి, వారు యాజకుల కొరకును లేవీయులకొరకును ధర్మశాస్త్రాను సారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలములనుండి సమకూర్చుటకు నియమింపబడిరి; సేవచేయుటకు నియమింపబడిన యాజకులనుబట్టియు, లేవీయులనుబట్టియు యూదులు సంతోషించిరి. మరియు గాయకులును ద్వారపాలకులును దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవునిగూర్చిన పనులను తమ శుద్ధినిగూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రగీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు. జెరుబ్బాబెలు దినములలోనేమి నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీయులందరును వారి వంతులచొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజనపదార్థములను అనుదినము ఇచ్చుచు వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతి ష్ఠించుచు వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి.