నెహెమ్యా 10:28-33
నెహెమ్యా 10:28-33 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మిగిలిన ప్రజలు అనగా, యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, సంగీతకారులు, ఆలయ సేవకులు దేవుని ధర్మశాస్త్రం బట్టి తమను ఆ దేశ ప్రజల నుండి వేరు చేసుకున్న వారందరు గ్రహించగలిగిన తమ భార్యలు కుమారులు కుమార్తెలతో పాటు, తమ బంధువులైన అధిపతులతో కలిసివచ్చి దేవుని సేవకుడైన మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తామని, మా ప్రభువైన యెహోవా ఆజ్ఞలకు నిబంధనలకు శాసనాలకు లోబడతామని శపథం చేసి ప్రమాణం చేశారు. “పొరుగు దేశ ప్రజలతో మా కుమార్తెలకు పెళ్ళి చేయము, వారి కుమార్తెలతో మా కుమారులకు పెళ్ళి చేయము. “పొరుగు దేశ ప్రజలు విశ్రాంతి దినాన వారి వస్తువులు గాని ధాన్యం గాని అమ్మడానికి తెస్తే విశ్రాంతి దినాన కాని పరిశుద్ధ దినాన గాని మేము వాటిని కొనము. ప్రతి ఏడవ సంవత్సరం భూమిని దున్నకుండా వదిలివేస్తాము, అన్ని అప్పులు రద్దు చేస్తాము. “మన దేవుని ఆలయ సేవ కోసం ప్రతి సంవత్సరం ఒక షెకెలు వెండిలో మూడవ వంతు ఇస్తామని నిబంధన చేసుకున్నాము. ఈ డబ్బును బల్ల మీద పెట్టే రొట్టెలకు; నిత్యం అర్పించే ధాన్యార్పణలకు దహనబలులకు; విశ్రాంతి దినాల్లో, అమావాస్య పండుగ నియమించబడిన పండుగల్లో అర్పణలకు; పరిశుద్ధ అర్పణలకు; ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తం కలగడానికి పాపపరిహార బలులకు; మన దేవుని ఆలయ పనులకు ఖర్చు చేస్తాము.
నెహెమ్యా 10:28-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని సేవకుడైన మోషే నియమించిన దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకొంటూ, ప్రభువైన యెహోవా నిబంధనలు, కట్టడలు ఆచరిస్తామని శపథం చేసి ఒట్టు పెట్టుకోవడానికి సమకూడారు. వారితోపాటు వారి భార్యలు, కొడుకులు, కూతుళ్ళు, తెలివితేటలున్న వారంతా తమ బంధువులతో ఏకమయ్యారు. మేము అన్య దేశాల ప్రజలకు మా కూతుళ్ళను, వాళ్ళ కూతుళ్ళను మా కొడుకులకు ఇచ్చి పుచ్చుకోమని ప్రమాణం చేశాం. అన్య దేశాల ప్రజలు విశ్రాంతి దినానగానీ, పరిశుద్ధ దినానగానీ అమ్మే వస్తువులను, భోజన పదార్ధాలను కొనుక్కోమనీ, ఏడవ సంవత్సరంలో భూమిని సేద్యం చేయకుండా విడిచిపెడతామనీ ఆ సంవత్సరంలో మాకు రుణ పడి ఉన్నవారి బాకీలు మాఫీ చేస్తామనీ నిర్ణయించుకొన్నాం. ఇంకా మన దేవుని మందిరపు సేవ కోసం ప్రతి ఏడూ తులం వెండిలో మూడవ వంతు ఇస్తామని తీర్మానం చేసుకొన్నాం. బల్లమీద పెట్టే రొట్టె విషయంలో, నిత్యమూ కొనసాగే నైవేద్యం విషయంలో, దహన బలి విషయంలో, విశ్రాంతి దినం ఆచరించే విషయంలో, అమావాస్యల విషయంలో, నియామక పండగల విషయంలో, ప్రతిష్ట అయిన వస్తువుల విషయంలో, ఇశ్రాయేలీయుల ప్రాయశ్చిత్త పాప పరిహారార్థ బలుల విషయంలో, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలో ఆ విధంగా నడుచుకొంటామని నిర్ణయం తీసుకున్నాం.
నెహెమ్యా 10:28-33 పవిత్ర బైబిల్ (TERV)
ఈ విధంగా, ఇప్పుడు వీళ్లందరూ దేవునికి ఈ ప్రత్యేక ప్రమాణం చేస్తున్నారు. తమ ఈ ప్రమాణాన్ని నిలుపుకోకపోతే, తామందరికీ చెడు, కీడు జరపమని వీళ్లంతా అర్థించారు. వీళ్లందరూ దేవుని ధర్మశాస్త్ర నియమాలను అనుసరిస్తామని ప్రమాణం చేస్తున్నారు ధర్మశాస్త్రం దేవుని సేవకుడైన మోషే ద్వారా మాకు ప్రసాదించబడింది. మన దేవుడైన యెహోవా ఆదేశాలను, నియమ నిబంధనలను, ఉపదేశాలను అన్నింటినీ విధేయతతో పాటిస్తామని వీళ్లందరూ ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణం చేస్తున్నది ఈ మనుష్యులే: మిగిలిన వాళ్లు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, ఆలయ సేవకులు, తమచుట్టూ నివసిస్తున్నవారినుంచి తమని తాము వేరు చేసుకున్న ఇశ్రాయేలీయులందరూ తాము దేవుని ధర్మశాస్త్రాన్ని విదేయతతో పాటించేందుకుగాను వాళ్లు తమని తాము వేరు చేసుకున్నారు. అంతేకాదు, వాళ్లందరి భార్యలు, విని అర్థం చేసుకోగల వాళ్లందరి కొడకులు, కూతుళ్లు కూడా తమని తాము వేరు చేసుకున్నారు. వీళ్లందరూ దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని ప్రమాణం చేసేందుకుగాను తమ సోదరులతోనూ, పెద్దలతోనూ జతకూడారు. తాము దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే, తమకి కీడు కలిగించే శాపాన్ని తలదాల్చేందుకు కూడా సిద్ధపడ్డారు. “మా చుట్టు ప్రక్కల వున్న ఇతర ప్రజలను మా కూతుళ్లు పెళ్లి చేసుకోకుండా, అలాగే మా కొడుకులు ఇతర ప్రజల కూతుళ్లను పెళ్లి చేసుకోకుండానూ చూస్తామని మేము ప్రమాణం చేస్తున్నాము. “మేము సబ్బాతు (విశ్రాంతి) రోజున పని చేయమని ప్రమాణం చేస్తున్నాము. మా చుట్టూ ఉన్న ఇతర ప్రజలు సబ్బాతు రోజున తిండి గింజలో, ఇతర వస్తువులో అమ్మకానికి తెస్తే ఆ ప్రత్యేక దినానగాని, మరే ఇతర పండగ దినాల్లోగాని మేము వాటిని కొనము. ప్రతి ఏడేళ్లకీ ఒకసారి ఇతరులు మాకియ్యవలసిన బాకీ మొత్తాలను రద్దు చేస్తాము. “దేవుని ఆలయం విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్న ఆదేశాల మేరకు మేమా బాధ్యతను స్వీకరిస్తాము. దేవునికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేందుకోసం మేము ప్రతియేటా తులము వెండిలో మూడోవంతు ఇస్తాము. ఆలయంలో వారు బల్లమీద పెట్టే ప్రత్యేక రొట్టెలకోసం, ప్రతి రోజూ అర్పించే ధాన్యార్పణలు దహనబలుల కోసం ఈ సొమ్ము యాజకులచేత వినియోగించబడుతుంది. అలాగే, ఈ సొమ్ము ధాన్యాలు కొనేందుకు, ధూప దీపాలు పెట్టేందుకు ఉపయోగింపబడుతుంది. సబ్బాతు రోజుల్లో, అమావాస్య దినాల్లో నైవేద్యం నిమిత్తం ఈ సొమ్ము వినియుక్తమవుతుంది. అది పవిత్ర బలులకోసం, ఇశ్రాయేలీయులను పరిశుద్ధులను చేసే పాపపరిహారార్థ బలులకోసం వినియోగింపబడుతుంది.
నెహెమ్యా 10:27-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే జనులలో మిగిలినవారు, అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషేద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవా రెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు–మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు దేశపు జనులు విశ్రాంతిదినమందు అమ్మకపు వస్తువులనేగాని భోజన పదార్థములనేగాని అమ్ముటకు తెచ్చినయెడల విశ్రాంతిదినమునగాని పరిశుద్ధ దినములలోగాని వాటిని కొనకుందుమనియు, ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరపు సేవనిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి. సవరింపబడిన రొట్టెవిషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహనబలి విషయములోను, విశ్రాంతిదినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థబలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.